నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, డిసెంబర్ 2014, గురువారం

భగ్నప్రేమ

మొన్నీ మధ్యన ఒక తెలిసినాయన ఫోన్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.

'సార్.మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను.'

'ఏమనుకుంటానో ముందే చెప్పలేనుగాని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి' అన్నాను.

'మీ పోస్ట్ లు చదివి మా ఆవిడ ఒక మాటన్నది.ఈయన భగ్నప్రేమికుడై ఉంటాడు.'-అన్నది సర్.

ఫకాల్న ఫోన్లోనే నవ్వేశాను.

'ఎందుకు నవ్వుతున్నారు?' అడిగాడాయన.

'ఎందుకలా అన్నారో మీ శ్రీమతి?' అన్నాను.

'అంటే మీరు వ్రాసే కవితలు,పాడే పాటలను బట్టి అలా అనిపించింది' అన్నాడు.

ఈ సారి ' హ హ్హ హ్హ' అంటూ వికటంగా పెద్దగా నవ్వాను.

'ఇప్పుడు మీరూ ఏమీ అనుకోకూడదు.నేనూ ఒక విషయం చెప్తాను.' అన్నాను.

ఆయన గొంతులో అనుమానం ధ్వనించింది.

'చెప్పండి.'

'అసలు మీ ఆవిడే ఒక భగ్నప్రేమికురాలేమో కనుక్కోండి.'

'అదేంటి అలా అన్నారు?'

'అవును.మన లోపల ఏముందో అదే బయట కనిపిస్తుంది. నా పోస్ట్ లలో భగ్నప్రేమ ఆమెకు కనిపించిందీ అంటే ఆమెకూడా ఒక భగ్నప్రేమికురాలే అయి ఉంటుంది.సైకాలజీ ఇంతే చెప్తుంది.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.ఫోన్ పెట్టేశాడు.

మొన్నీ మధ్యన ఒక స్నేహితురాలు కూడా ఇదే చెప్పింది.ఆమె ఫ్రెండ్ కి కూడా నా కవితలు చదివి ఇలాగే అనిపించిందిట.

ఆమెతో ఇంకా సూటిగా చెప్పాను.

"మేకకి దేనినైనా తినడమే తెలుసు.అంతకంటే దానికి ఇంకేం తెలుస్తుంది?" అన్నాను.

ఆమెకి అర్ధం కాలేదు.

'అదేంటి అలా అన్నారు?' అంది.

'ఒక గులాబీ పువ్వును తీసుకెళ్ళి మేక ముందు ఉంచామనుకో.దాని సౌందర్యాన్ని ఆస్వాదించడం దానికి రాదుకదా.అందుకని నోట్లో వేసుకుని పరపరా నమిలి పారేస్తుంది.దానికి తెలిసిన 'టేస్ట్' అంతే.మీ స్నేహితురాలు కూడా ఒక మేకలాంటిదే.' అన్నాను.

వింటున్న తనకు కోపం వచ్చి ఉండవచ్చు.కానీ నేను నిజం చెప్పక తప్పదు.

ఒక గులాబీ అందాన్నీ సౌందర్యాన్నీ ఆస్వాదించాలంటే ఆపని ఒక భావుకత ఉన్న హృదయం వల్లే అవుతుంది.మొరటు మనిషికి మొగలి పువ్వు ఇస్తే ఏం జరుగుతుందో సామెత ఊరకే పుట్టలేదు.ఇదీ అంతే.ఒక ఉదాత్తమైన భావనను అర్ధం చేసుకోవాలంటే ఉదాత్తమైన హృదయం ఉన్నపుడే అది కుదురుతుంది. అది లేనప్పుడు ఒక అతీతమైన భావాన్ని పొందుపరచిన కవిత కూడా భగ్నప్రేమ లాగే చీప్ గా కనిపిస్తుంది.ఎందుకంటే మనకు తెలిసిన దానినిబట్టే మనం దేనినైనా చూస్తాం.తెలీని దాన్ని బట్టి చూడలేం.మనదగ్గర గజంబద్ద ఉంటే దానితోనే దేనినైనా కొలవగలం.లేనిదానితో ఎలా కొలుస్తాం?

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఒక మాట అనేవారు.

'గజంలో అంగుళాలున్నాయి గాని అంగుళంలో గజాలు లేవు నాన్నా' అనేవారు.

ఇదెంత అద్భుతమైన మాటో?

ఎవరైనా ఒక మంచి హృద్యమైన కవిత వ్రాసినా,ఒక పాథోస్ సాంగ్ పాడినా వెంటనే వినేవారు అనుకునే మాట -"భగ్నప్రేమ".

మార్మికులందరూ (Mystics) లోకానికి భగ్నప్రేమికుల లాగానో,పిచ్చివారి లాగానో మాత్రమే కనిపించారు.ఇదేమీ కొత్తవిషయం కాదు.ఎప్పటినుంచో జరుగుతున్న పాతకధే.సూఫీ యోగులందరూ లోకానికి పిచ్చివారిగానే కనిపించారు.మీరాబాయిని లోకం పిచ్చిదనే అన్నది.వేశ్య అని కూడా అన్నది. బస్రా నివాసి 'రబియా' అనే ఒక సూఫీ మహాత్మురాలిని కూడా లోకం వేశ్య అనే అనుకుంది.అక్కడిదాకా ఎందుకు?కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ లెక్కచెయ్యకుండా అందర్నీ ప్రేమగా దగ్గరకు తీసుకునే జిల్లెళ్ళమూడి అమ్మగారి గురించి కూడా లోకులు రకరకాలుగా అనుకునేవారు.

ఆ విషయం అలా ఉంచితే,అసలు 'ప్రేమ' అనేది ఎలా భగ్నం అవుతుందో నాకెప్పటికీ అర్ధం కాదు. భగ్నమయ్యేది ప్రేమ కానే కాదని నేను నమ్ముతాను. మన ఆశ భగ్నం కావచ్చు,మన కోరిక భగ్నం కావచ్చు,మన ఎక్స్ పెక్టేషన్ భగ్నం కావచ్చు.కానీ 'ప్రేమ' ఎలా భగ్నం అవుతుంది? అది అసంభవం.

లోకంలో అత్యంత బలమైన శక్తి 'ప్రేమ'.అది భగ్నం అవుతుందీ అంటే,పైనుంచి కింద పడేస్తే 'వజ్రం' పగిలిపోయింది అన్నట్లుగా ఉంటుంది.పైనుంచి కింద పడేస్తే గాజు పగులుతుంది కానీ వజ్రం పగలదు.

మనుషులలో ఎక్కువమందికి 'ప్రేమ' అంటే ఏమిటో తెలీదని నా ప్రగాఢవిశ్వాసం.ఆడామగా మధ్య ఉండే ఆకర్షణనే ప్రేమ అని లోకంలోని చవకబారు మనుషులు అనుకుంటారు.నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పదిమంది కూడా ఉంటారో ఉండరో అని నా ఊహ.

పగిలిపోవడానికీ భగ్నం కావడానికీ 'ప్రేమ' అనేది గాజుబొమ్మ కాదు.అది వజ్రం.దానికి చావు లేదు.

మార్మికులనేవాళ్ళు (Mystics) భగ్నప్రేమికులు కారు.వాళ్ళు అన్వేషకులు. ఈ ప్రపంచంలో దొరకని ఏదో ఒక అతీతసౌందర్యాన్నీ సత్యాన్నీ స్వచ్చతనీ వాళ్ళు నిరంతరం వెదుకుతూ ఉంటారు.దాన్ని అందుకోవాలని వాళ్ళు పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు.చాలాసార్లు వాళ్ళా ప్రయత్నంలో సఫలీకృతులౌతారు కూడా.

అయితే వాళ్ళ ప్రయత్నం అంతా అంతరికంగా ఉంటుంది.వాళ్ళ అన్వేషణ కూడా అంతరికంగానే ఉంటుంది.వాళ్లకు కలిగే సిద్ధి కూడా బయటకు కనపడకుండా అంతరికంగానే జరుగుతుంది.అయితే దానిని వాళ్ళు బయటకు వ్యక్తపరిచే తీరు,లోకానికి తెలిసిన భగ్నప్రేమికుల తీరుకు దగ్గరగా ఉంటుంది.

ఈ విషయం తెలియనివారు,మార్మిక అన్వేషకులను చూచి భగ్నప్రేమికులని అనుకోవడం వింతేమీ కాదు.

శ్రీ రామకృష్ణులిలా అంటారు.

'పుచ్చు వంకాయలు అమ్ముకునేవారికి వజ్రం విలువెలా తెలుస్తుంది?దాని విలువను కూడా వాళ్ళు వంకాయలలోనే కొలుస్తారు."కోహినూర్ వజ్రాన్ని చూచి -- "మహా అయితే రెండుకేజీల వంకాయల విలువ దీనికి ఉండవచ్చు"- అంటారు.అనుభవజ్ఞుడైన వజ్రాల వర్తకునికే దాని అసలైన విలువ తెలుస్తుంది.'

ఈ మాటలు అక్షర సత్యాలు.

ఎవరెస్ట్ శిఖరం మీద ఏముందో లోయలో ఉన్నవారికెలా కనిపిస్తుంది?