Pages - Menu

Pages

7, డిసెంబర్ 2014, ఆదివారం

మార్గశిర పౌర్ణమి+రోహిణీ శకటం=ప్రమాదాలు

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకిరాం మరణించడం నిన్న సాయంత్రం 6.30 ప్రాంతంలో జరిగింది.

ఇది యాదృచ్చికం కాదు.ఎందుకంటే పౌర్ణమి ఘడియలలోనే ఈ సంఘటన జరిగింది.గ్రహస్థితులు బాలేనప్పుడు వచ్చే అమావాస్య పౌర్ణమి ఘడియలు చాలా మందికి ప్రమాదాలను కొనితెస్తాయన్న విషయాన్ని నేను గతంలో లెక్కలేనన్ని పోస్ట్ లలో ఉదాహరణలతో సహా నిరూపించాను.ఈ సంఘటన కూడా అలాంటిదే.మనుషులమీద పౌర్ణమి అమావాస్యల ప్రభావానికి మళ్ళీ ఇదొక తిరుగులేని రుజువు.

నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో యాదృచ్చికమూ కాకతాళీయమూ అంటూ ఏదీ లేదు,ఉండదు.కారణాలు తెలియనిదానిని కాకతాళీయం అనుకుంటాం అంతే. కారణాలు మనకు అర్ధం కానంత మాత్రాన అసలు లేవని అనుకోవడం పొరపాటు.

నిన్న మార్గశిర పౌర్ణమి.ప్రతి మార్గశిర పౌర్ణమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమంటే ఆరోజున సూర్యుడు బలహీనుడుగా ఉంటాడు.చంద్రుడు ఉచ్చ స్థితిలో చాలా బలంగా ఉంటాడు.ఇద్దరి మధ్యనా సంపూర్ణ సమసప్తక దృష్టి ఉంటుంది.అలాంటి సమయంలో ప్రకృతిలోని సమతుల్యతలో తేడాలు వస్తాయి.అందువల్ల మనుషుల మనస్సులు తీవ్రంగా సంక్షోభానికి గురౌతాయి.అయితే తీవ్రమైన ఉద్రేకమయినా కలుగుతుంది.లేదా తీవ్రమైన డిప్రెషన్ అయినా కలుగుతుంది.కొందరికి ఆరోగ్యాలలో తేడా వస్తుంది. ఇంకొందరికి మానసికంగా చికాకులు ఎక్కువై పోతాయి.వారివారి జాతకాలలో సూర్యచంద్రుల స్థితులను బట్టి ఒక్కొక్కరినీ ఈ మార్గశిర పౌర్ణమి ఒక్కొక్క విధంగా ఊపుతుంది.

అదీగాక ఇప్పుడు శనీశ్వరుడు సూర్యునితో కలసి ఉన్నాడు.రోహిణీ నక్షత్రాన్ని త్వరలో తన వీక్షణద్వారా స్పర్శించబోతున్నాడు.కనుక ఈ చెడుప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.రోహిణీ శకటభేదనం యొక్క చెడు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో కొద్ది నెలలక్రితం ముందే హెచ్చరించాను.

అసలీ "శకట భేదనం" అనే పదం మన ప్రాచీనులు ఎలా పెట్టారో మన ఊహకు అందదు గాని,ప్రస్తుతం జానకిరాం విషయంలో జరిగింది అదే.శకట భేదనం అంటే "బండి విరిగిపోవడం" అనే కదా అర్ధం !!

జ్యోతిష్య పరమైన వివరాలను అలా ఉంచితే,రోడ్డు ప్రమాదాల గురించి నేను గతంలో వ్రాసిన ఒక పోస్ట్ లో మన దేశంలో ఎవడూ రోడ్డు రూల్స్ పాటించకపోవడాన్ని తూర్పార బట్టాను.మన దేశంలో ఒక టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని తీసుకుని రోడ్డెక్కిన చాలామంది తమకు ఏ రూలూ వర్తించదని భావిస్తారు.వాళ్లకు సినిమా హీరో ఆవహిస్తాడు.రోడ్డుమీద తాము తప్ప ఇంకెవరూ లేరనీ తాము ఏ రూల్సూ పాటించనవసరం లేదనీ భావిస్తారు.డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని ఎటునించి ఎటు తిప్పినా ఎవరూ అడిగేవారు మన దేశంలో ఉండరన్నది వాస్తవమే.సగటు ఇండియన్ కు రోడ్ సెన్స్ ఎప్పుడూ ఉండదు.పొరపాటు ఎవరిదైనా,ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఎన్నెన్ని విలువైన ప్రాణాలు రోడ్డు పాలు అయిపోతున్నాయో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

ట్రాఫిక్ రూల్స్ ను సగటు భారతీయపౌరుడు ఎవడూ తనంతట తానుగా పాటించడు.అంతటి సివిక్ సెన్స్ ఉంటె మన దేశం ఎప్పుడో ఇంకా చాలా బాగా ఉండేది.రోడ్ రూల్స్ ని పౌరులు ఖచ్చితంగా పాటించేలా చెయ్యడం ప్రభుత్వ బాధ్యత అయి కూచుంది మన దేశంలో.

ఒక రాంగ్ టర్న్ తీసుకున్నా,రాంగ్ సైడ్ లో ఓవర్ టేక్ చేసినా,రాంగ్ సైడ్ లో వచ్చినా,రాంగ్ ప్లేస్ లో డివైడర్ని దాటినా వెంటనే భారీ పెనాల్టీ పడే విధంగా మన వ్యవస్థలో మార్పులు వచ్చిననాడే ప్రాణాలతో పెనాల్టీ చెల్లించే ఇలాంటి పరిస్థితులు తప్పుతాయి.

ఎక్కడ చూచినా స్వార్ధపూరితులైన ప్రజలతో నిండి ఉన్న మన దేశంలో,'ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే' అని ప్రతివారూ అనుకునే సమాజంలో, వ్యవస్థాపరంగా అంతటి గొప్ప పరిణతి అంత స్పీడుగా వస్తుందని ఊహించడం తప్పేమో?

డ్రైవర్ ను తీసుకుని బయలుదేరి ఉంటె ఇతని ప్రాణాలు దక్కి ఉండేవని కొందరు అనడం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.అప్పుడు డ్రైవర్ పోయి ఉండేవాడు.అంటే డ్రైవర్ ది ప్రాణం కాదా?ఈ మాట ఎంత స్వార్ధపరమైనదో?ఎవరివైనా సరే ప్రాణాలు పోవాలని మనం ఎందుకు కోరుకోవాలి?అది డ్రైవరైనా, యజమాని అయినా, ఎవరి ప్రాణమూ ఈ విధంగా పోకూడదు.ప్రయాణం సుఖంగా ముగించి వారు ఇళ్ళకు చేరుకోవాలనే మనం ఆశించాలి.ఎందుకంటే వారివారి భార్యాబిడ్డలు వారికోసం ఎదురుచూస్తూ ఉంటారు గనుక.వారి మీద ఎందరి ఆశలో అల్లుకుని ఉంటాయి గనుక.

లాంగ్ డ్రైవ్స్ అనేవి ఇండియాలో చాలా రిస్క్ తో కూడుకున్నవనేది అక్షరసత్యం.ఎందుకంటే గమ్యం చేరేలోపల కొన్ని వందల రోడ్ రిస్క్ లను దాటుకుని ఇల్లు చేరవలసి ఉంటుంది.ఎటువైపు నుంచి ఎవడు ఎలా హటాత్తుగా అడ్దోస్తాడో తెలియదు గనుక అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది.అందులో రాత్రిపూటా,తెల్లవారే సమయంలో, పొగమంచు ఉన్నప్పుడూ ఇంకా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యవలసి ఉంటుంది.

రోడ్డు ప్రయాణం సేఫ్ గా జరిగే విధంగా మన రోడ్డు రవాణావ్యవస్థ రూపు దిద్దుకోవడమే దీనికి ఉన్న ఏకైక పరిష్కారం.పౌరులందరూ విధిగా రోడ్ రూల్స్ పాటించడమే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఏకైక మార్గం.

ఆ దిశగా పౌరులలోనూ ప్రభుత్వ విధానాలలోనూ మార్పు రావలసి ఉన్నది. అంతవరకూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

జానకిరాంకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిద్దాం.