నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, జనవరి 2015, బుధవారం

కాశ్మీర శైవం - త్రిక సిద్ధాంతం

2011 లో కాశ్మీరశైవాన్ని గురించి వ్రాస్తూ మధ్యలో అసంపూర్తిగా వదలి ఉంచాను.దాని కొనసాగింపును ఇక్కడ ఇస్తున్నాను.

కాశ్మీరశైవం త్రికసిద్ధాంతం అనబడుతుంది.జీవుడు,శక్తి,శివుడు అన్న మూడింటిని వివరించేదే త్రికం.జీవుడు పాశబద్ధుడు.శివుడు పాశరహితుడు. వీరిద్దరినీ శక్తి అనుసంధానం గావిస్తుంది.

శ్రీ రామకృష్ణులు తరచుగా ఇలా అనేవారు.

'పాశబద్ధుడే జీవుడు.పాశముక్తుడే శివుడు.'

మాయ అనే పాశంతో బంధింపబడి జీవుడు ఏడుస్తున్నాడు.అదే మాయ తొలగిననాడు అదే జీవుడు తాను జీవుడనుగాను శివుడనే అనిన అనుభవాన్ని పొందుతున్నాడు.ముండకోపనిషత్తులో చెప్పబడిన ఒక చెట్టుమీద ఉన్న రెండుపక్షుల కధ దీనినే సూచిస్తున్నది.

దీనినే 'శ్రీవిద్యా రహస్యం' లో ఇలా పద్యరూపంలో వ్రాశాను.

ఆ|| ఒక్కగాను దోచు రెక్కపక్షులు రెండు
చెట్టుమీద జేరి చిత్రముగను
ఒకటి దినగబోవు నొక్కొక్క ఫలమును
ఒకటి నిల్చునచట యొంటిగాను

ఒకే విధంగా ఉన్న రెండుపక్షులు ఒక చెట్టుమీద ఉన్నవి.ఒకటి పై కొమ్మ మీద ఉంటె రెండవది కిందకొమ్మ మీద ఉన్నది.క్రింద ఉన్న పక్షి ఆ చెట్టు పండ్లను తింటూ,చేదు పండ్లను తిన్నపుడు ఏడుస్తూ,మంచి పండ్లను తిన్నప్పుడు నవ్వుతూ,అనేక కొమ్మల మీదకు ఎగురుతూ గెంతుతూ ఉన్నది.పైనున్న రెండవ పక్షి మాత్రం ఏ పండునూ తినకుండా కదలకుండా మౌనంగా ఉండి ఊరకే చూస్తూ ఉన్నది.

క్రింద ఉన్న పక్షి నానారకాలైన పండ్ల వెంట పరుగెత్తుతూ వాటిని తింటూ ఉన్నంత కాలం దాని ఏడుపు తప్పదు.ఎప్పుడైతే అది ఈ వెదుకులాటను వదలిపెట్టి రెండవ పక్షిని తదేకంగా వీక్షిస్తుందో అప్పుడు నిజానికి రెండు పక్షులు లేవని ఉన్నది ఒకటే పక్షి యన్న సత్యాన్ని అది అనుభవంలో గ్రహిస్తుంది.

అంతేగాక శ్రీవిద్యలోని పరా,పరాపరా,అపరా అనే ఉపాసనా భేదములు కూడా దీనినే సూచిస్తున్నవి.

'పరా' అనేది శివుడు.ఎందుకంటే ఆయన మాయకు అతీతుడు,పరుడు గనుక.

'అపరా' అనేది జీవుడు.ఎందుకంటే అతడు మాయకు బద్దుడు గనుక.

ఇద్దరినీ అనుసంధానం గావించే 'పరాపర' అనేది శక్తి.మాయలో మునిగి ఉన్న జీవుని,మాయకు అతీతుడైన శివునితో అనుసంధానం గావించేది కరుణాస్వరూపిణి అయిన శక్తి.అందుకే శక్తి అనుగ్రహం లేనిదే మాయను దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

పరాతత్వం సహస్రారగతం.అపరా తత్త్వం మూలాధారగతం.కులమార్గంలో ఈ రెంటినీ కలిపే శక్తిసంచారమే పరాపర తత్త్వం.

ఈ కాశ్మీర శైవదర్శనం(త్రికం) తిరిగి ప్రత్యభిజ్ఞ, క్రమ, కుల, స్పంద అన్న నాలుగు సిద్ధాంతాలుగా నలుగురు కాశ్మీరశైవసాంప్రదాయపు సిద్ధగురువులచేత బోధింపబడింది. ప్రత్యభిజ్ఞ సిద్ధాంతం సోమానందనాధుని చేతా, క్రమసిద్ధాంతం ఏరాకనాధుని చేతా, కులసిద్ధాంతం సుమతీనాధుని చేతా, స్పందసిద్ధాంతం వసుగుప్తనాధుని చేతా ప్రచారంలోకి వచ్చాయి.

ఈ నాలుగు మార్గాలకూ వాటివాటి ప్రత్యేకమైన ధ్యాన ఉపాసనా విధానాలున్నవి.

అవి ఏమి బోధిస్తున్నవో క్లుప్తంగా చూద్దాం.

ప్రత్యభిజ్ఞం:--

ప్రత్యభిజ్ఞమంటే పుస్తకజ్ఞానానికి భిన్నమైన ప్రత్యక్షదర్శనం.అద్వైతం దీనినే అపరోక్షానుభూతి (Direct experience) అంటుంది.అపరోక్షం అంటే 'సూటి','సరాసరి','డైరెక్ట్' అని అర్దాలున్నవి.

అంటే,సాధకుడైనవాడు ఇతరములైన ఏ విధానాల సహాయమూ లేకుండా, సూటిగా,తన ఆత్మను పరమశివస్వరూపంగా అనుభవంలో దర్శించడమే ప్రత్యభిజ్ఞం.

ఉత్పలాచార్యుడు తన 'ఈశ్వర ప్రత్యభిజ్ఞమ్' లో ఈ వివరాలు ఇచ్చి ఉన్నాడు.దీనికి అభినవగుప్తుడు వ్యాఖ్యానం వ్రాశాడు.వసుగుప్తుని శివసూత్రాలలో ఇవ్వబడిన నాలుగు ఉపాయాలను తన వ్యాఖ్యానంలో అభినవగుప్తుడు విపులంగా చర్చించాడు.

అవి అణూపాయము, శాక్తోపాయము, శాంభవోపాయము, అనుపాయము.

ఉపాయాలంటే జీవభ్రాంతిని వదిలించి శివజ్ఞానాన్ని సిద్ధింపజేసే ఆచరణాత్మక సాధనా మార్గాలు,ధ్యాన విధానాలు అని అర్ధం.

అర్హతలు లేని మందాధికారులకు అణూపాయము ఆచరణీయం.కొంచం ఉన్నత తరగతికి చెందిన సాధకులకు శాక్తోపాయం అనుసరణీయం. ఇంకొంచం పైస్థాయి సాధకులకు శాంభవోపాయం అనుసరణీయం. అత్యున్నత తరగతికి చెందిన ఉత్తమసాధకులకు అనూపాయం(ఏ ఉపాయమూ అక్కర్లేని స్థితి) ఉచితం.

రమణమహర్షి పాటించినది నాల్గవస్థితి అయిన అనూపాయం. ఇక్కడ ఏ విధమైన సాధనా ఉండదు.సూటిగా ఆత్మను సరాసరి దర్శించడం ఉంటుంది.అయితే ఈ స్థితికి చేరాలంటే జ్ఞానయోగంలో మెట్లైన శమదమాది షట్కసంపత్తి నుంచి మొదలుబెట్టి ఒక్కొక్కదాన్నీ సాధిస్తూ ఎదగాలి.అప్పుడే ఈ సాధన కుదురుతుంది.నేటి మనుషులు ఈ పునాదులను ఒదిలిపెట్టి, సరాసరి రమణులు చెప్పిన 'నేనెవర్ని?' అనే సాధన ఆచరిస్తున్నారు. పునాదులు సరిగ్గా లేని ఇళ్ళు గనుకనే, వీరు సాధనలో ఎదగలేకపోతున్నారు.కొద్దిగా గాలి వీయగానే పడిపోతున్నారు.

రమణులు ఎంతో సాధన తర్వాత ఎన్నో అర్హతలు సంపాదించుకుని ఈ జన్మలో ఈ స్థితికి చేరినారు.మనం ఆ విషయం గమనించకుండా సరాసరి ఆయన బోధించిన సాధనను చేయ్యబోవడమే అసలైన పొరపాటు.గురుముఖతా నేర్చుకోకుండా పుస్తకాలు చదివి సాధనలు చేసేవారి పరిస్థితి ఇలాగే ఉంటుంది.

ముందుగా అర్హతలు సంపాదించుకోవాలి.ఆ తర్వాత ఆశించాలి.అర్హతలు లేని ఉత్తుత్తి ఆశ వల్ల ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమీ ఉపయోగం ఉండదన్న సంగతిని సాధకులు కాగోరేవారు ముందుగా స్పష్టంగా గ్రహించాలి.

గ్రంధపాండిత్యం వల్ల కలిగే మేధోపరమైన జ్ఞానం ఆ పేరుకు తగదు. సాధనానురూపమైన అనుభవజ్ఞానమే అసలైన జ్ఞానంగాని పుస్తకజ్ఞానం జ్ఞానంకాదు.కాశ్మీర శైవులు అనుభవ జ్ఞానులు.వారు వివిధగ్రంధాలలో మహాపండితులే గాని, దానికితోడు సాధనాపరమైన అనుభవ జ్ఞానం కూడా కలిగినట్టివారు.

క్రమం:--

క్రమమంటే దేశ,కాల,రూపాలనుంచి క్రమముగా విముక్తిని పొంది వాటి బంధాలకు అతీతుడు కావటం.

దేశమంటే స్థలం ప్రదేశం అని అర్దాలున్నవి.మనిషి ప్రదేశానికి బద్ధుడు.ఒక ప్రదేశంతో అతనికి రుణానుబంధం ఉన్నపుడు అక్కడనుంచి తెంచుకుని రాలేడు.అవతలకు పోలేడు.ఇది భౌతిక స్థలాలకూ దేశాలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లి కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి వద్దామని భావించినవారు అలా రాలేక అక్కడే చిక్కుకుని జీవితాంతం అక్కడే ఉండవలసి రావడం మనం ఈనాడు చూస్తున్నాం.ఇది భౌతికమైన దేశబంధం.

అలాగే అంతరిక ఆధ్యాత్మికస్థితులకూ ఇది వర్తిస్తుంది.సాధనామార్గంలో ఒక స్థాయిని అందుకున్నవారు దానిని దాటి అక్కడనుంచి ముందుకు పోలేరు.ఆ సిద్దే వారికి ఒక దేశంగా మారి వారిని పట్టి బంధిస్తుంది.ఇది అంతరిక దేశబంధం.

మనిషి కాలానికి లోబడే బ్రతుకును సాగిస్తూ ఉంటాడు.కాలాన్ని దాటి ఎవరూ ముందుకు పోలేరు.కాలప్రభావాన్ని ఎవ్వరూ అధిగమించలేరు.మనిషి కాలానికి కట్టుబానిస.కాలానుగుణం గానే మనిషి జీవితంలో సమస్తమూ జరుగుతుంది.కాని మన అహంకారంతో,అంతా మన ఇష్టప్రకారమే జరుగుతున్నదని మనం అనుకుంటాము.జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలి కొంత పరిపక్వత వచ్చినపుడు మాత్రమే ఈ సత్యం అర్ధమౌతుంది. కాలమే కాళీస్వరూపం.కాలాన్ని దాటాలంటే కాళీకటాక్షం తప్పనిసరిగా కావలసి ఉంటుంది.

మనిషి రూపానికీ దాసుడే.కళ్ళతో చూడగా కనిపించే రూపాలకే మనిషి కట్టుబడిపోతూ ఉంటాడు.మాయ అనేది కనిపించే వస్తువులు మనుష్యుల చుట్టూ ఆవరించిన ఆకర్షణగా మనిషిని మెడపట్టి తోసుకుంటూ నడిపిస్తూ ఉంటుంది.నేత్రేంద్రియానికి లొంగని వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు.కనిపించేది నిజం అనుకోవడమే మాయ.ఈ భ్రమను దాటినప్పుడే మనిషి సత్య స్వరూపమైన శివతత్వాన్ని చేరుకోగలుగుతాడు.

కనుక మాయాస్వరూపమైన దేశ,కాల,రూపాలను అధిగమించే సాధనలు ఈ మార్గంలో ఉపదేశించబడతాయి.

కులం:--

కులమంటే వ్యష్టి కుండలినిని సమిష్టిచైతన్యం అయిన పరమశివునితో అనుసంధానించే మార్గం.దీనినే 'కౌలమార్గం' అని కూడా అంటుంటారు.లలితా సహస్రంలో ఈ మార్గాన్ని శ్లాఘించే అనేక మంత్రాలున్నవి.

'కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా'

కులం అంటే మూలాధారచక్రం అని అర్ధం.కులకుండం అంటే మూలాధారమనబడే అగ్నిగుండం.అక్కడ నిద్రిస్తున్న కుండలినీ శక్తిని ప్రజ్వరిల్లజేసే సాధన ఈ మార్గంలో ప్రాధమికంగా గావించవలసి ఉంటుంది.

'కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ'

'కౌలినీ కులయోగినీ'

'కురుకుళ్ళా కులేశ్వరీ'

మొదలైన అనేక నామాలు ఈ కౌలమార్గాన్నే సూచిస్తున్నాయి.

కాశ్మీర్లో 'Kaul' అనబడే ఇంటి పేరున్నవారు ఈ సాంప్రదాయానికి చెందినవారే.మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పూర్వీకులు కూడా కౌళులే.తర్వాత తర్వాత వారి ఇంటిపేరు 'నెహ్రూ' గా మారింది గాని వారి అసలైన ఇంటి పేరు 'కౌల్' మాత్రమే.వారి పూర్వీకులందరూ కౌలమార్గాన్ని అనుసరించిన వారే.

'యోగభోగాత్మకం కౌలమ్'- అని తంత్రాలంటాయి.అంటే కౌలాచారంలో భోగమూ యోగమూ కలసి ఆచరించబడతాయి.కౌళులు భోగాన్ని త్యజించరు. దానిని యోగంగా మార్చుకునే రహస్యవిద్య వారికి తెలుసు.భోగాలను అనుభవిస్తూ కూడా వారు యోగంలో ఉండగలరు.అందుకే కౌలాచారం అనేది సమయ,దక్షిణ,వామ,కౌలాచారాలనబడే నాలుగు ఆచారాలలోకీ అత్యున్నతమైనదని వారంటారు.

స్పందం:--

స్పందమంటే అఖండసచ్చిదానందశివుని యొక్క లీలాస్పందనను ప్రతిచోటా ప్రతిక్షణమూ అనుభవిస్తూ ఉండటం.నిర్వికారుడైన శివుని నుంచి జనించిన స్పందమే శక్తి.ఎక్కడైతే చలనమూ స్పందనమూ ఉన్నవో అక్కడ శక్తి ఉన్నది.

ఈ శక్తి విశ్వంలో ఓంకారంగా నిరంతరమూ ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అదే శక్తి మానవునిలో హృదయస్పందనగా నిత్యమూ స్పందిస్తూ ఉన్నది.కుండలినీ స్పందనగా ప్రాణాధారయై మానవునిలో నిలిచి ఉన్న శక్తి ఈమెయే.

ప్రకృతిలో కదలిక ఉన్న ప్రతిచోటా ఈ చైతన్య స్పందనను ఈమార్గ సాధకులు చూచి, గ్రహించి,దానితో తాదాత్మ్యతను పొంది దానిని అనుభవిస్తారు.ఒక చెట్టు ఆకు కదిలినా కూడా ఆ స్పందనలో వారు శక్తినీ దైవత్వాన్నీ గమనిస్తారు.

ఈ విధంగా నాలుగురకాలైన సాధనామార్గాల ద్వారా అఖండ సచ్చిదానంద పరశివానుభవంలో కరిగిపోయే విధానాలను ఉపదేశించే మార్గమే కాశ్మీర శైవసిద్ధాంతం.ఇదంతా ఆచరణాత్మకమైన సాధనామార్గం.అంతేగాని గ్రంధపాండిత్యంతో చర్చలు చేసుకుంటూ కూచునే ఉబుసుబోని కాలక్షేపం కాదు.

వీటిలోని ఆచరణాత్మక సాధనలను గురుముఖతా నేర్చుకోవాలన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన పనిలేదు.

కాశ్మీరశైవం మీద 2011 నాటి పాత పోస్ట్ లను ఇక్కడమరియు ఇక్కడ  చూడండి.