Pages - Menu

Pages

11, జనవరి 2015, ఆదివారం

దర్శనమివ్వని శ్రీనివాసుడు ధన్యతనిచ్చాడు

ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.

ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.

నేను తిరుమల వెళ్లి దాదాపు నాలుగేళ్ళు అయింది.ఈ నాలుగేళ్ళలో ఏమైనా మారిందా అని చూచాను.అక్కడి పరిస్థితి ఏమీ మారలేదు.అదే తోపులాట.అదే హడావుడి.మనుషుల్లో అదే స్వార్ధం.అదే చవకబారుతనం. అదే మోసం.

విసుగొచ్చింది.

సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న  TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.

నాకు భలే చికాకూ అసహ్యమూ కలిగాయి.ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.

కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.

ఈ లోపల మా గ్రూపులో ఐడీ కార్డ్ ఉన్న ఒకరిని లోనికి పంపించాము.నా దగ్గర ID card ఉన్నప్పటికీ మావాళ్ళ కోసం నేను ఆగిపోయాను.

ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్లో నాకు పరిచయాలున్నాయి.కొంతమంది మంత్రులూ వాళ్ళ పీఏలూ కూడా నాకు పరిచయం ఉన్నది.ప్రభుత్వం లోని ఉన్నతోద్యోగులు కూడా నాకు చాలామంది తెలుసు.వాళ్లకు ఒక్క ఫోన్ చేస్తే పని చిటికెలో అయిపోతుంది.గేట్లో ఆపుతున్న ఉద్యోగులే అప్పుడు నమస్తే పెట్టి దగ్గరుండి లోపలదాకా తీసికెళతారు.

కానీ నాకాపని చెయ్యాలనిపించలేదు.అలా రికమండేషన్ తో దర్శనం పొందటం ఏదో గిల్టీగా అనిపించింది.

పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు.అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు.ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.

భలే వింత!!

పైగా,మన మతాన్నీ మన దేవాలయాలనూ మన దేవుళ్ళనూ విమర్శించడానికి ఇలాంటి చర్యలద్వారా మనమే ఇతర మతాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాం.కొంతమంది భక్తులు గుంపుగా ఒక కుటుంబంగా వచ్చినపుడు కొందరికి ఐడీ ఉండి కొందరికి లేనప్పుడు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించే పరిస్థితి అక్కడి అధికారులకు ఉంటుంది. ప్రతి నియమానికీ ఒక వెసులుబాటు తప్పకుండా ఉంటుంది.కానీ వాళ్ళు దానిని ఉపయోగించడం లేదు.గుడ్డిగా రూల్ ను ఫాలో అవుతున్నారు. లేదా అలా నటిస్తున్నారు.కొండొకచో తమకు కావలసినప్పుడు మాత్రం అదే రూల్ ను చక్కగా తీసి పక్కన పెడుతున్నారు.

పైగా క్యూలో ఉన్నవాళ్ళు తీవ్రవాదులు కారు.వారివద్ద మారణాయుధాలు ఏమీ లేవు.ఒంటిమీద చొక్కా కూడా తీసేసి ఒక తువ్వాలు కప్పుకుని పంచె కట్టుకుని ఉన్నవారివల్లా,ఆడవారూ పిల్లలవల్లా,చలిలో వణుకుతూ దర్శనానికి వచ్చిన భక్తులవల్ల ఆలయానికి ప్రమాదం ఏముంటుంది?చిన్న పిల్లల దగ్గర ఐడీ కార్డ్ ఎలా ఉంటుంది?ఇలాంటి తలాతోకా లేని రూల్స్ ఎందుకు పెడతారో ఎవరు పెడతారో ఆ దేవునికే ఎరుక.

మాకు దర్శనం కానందుకు నాకు బాధ కలగలేదు.కానీ దూరాభారాల నుంచి వచ్చి దైవదర్శనం కోసం ఉద్యోగుల కాళ్ళూవేళ్ళూ పట్టుకుంటున్న ఆ భక్తులను చూచి బాధ కలిగింది.మన హిందూమతపు దుస్థితి చూచి బాధ కలిగింది.

ఇదంతా చూచిన మీదట నాకొక ఆలోచన వచ్చింది.

దేవుడున్నాడో లేడో మనకు తెలీదు.దేవుడు గొప్పవాడో కాడో మనకు తెలియదు.కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.భక్తుల నమ్మకం విశ్వాసం మాత్రం గొప్పవి.

మౌనంగా వెనక్కు తిరిగి నిదానంగా నడుచుకుంటూ కాటేజీకి వచ్చేశాము.

మా శ్రీమతి బాధపడుతూ ఉండటం గమనించి 'నిన్న ఒకసారి దర్శనం అయింది కదా.ఎన్నిసార్లైనా అదే దర్శనం.బాధపడకు.దర్శనం ముఖ్యం కాదు.ఆ దర్శనంవల్ల మనలో ఎంత పరిపక్వత వచ్చిందీ అనేదే ముఖ్యం. దర్శనం ఎందరికో అందుతుంది.ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం.దానివల్ల ఏమి ఒరిగింది? దర్శనం ముఖ్యం కాదు. సమత్వస్థితిలో కలిగే ధన్యత ముఖ్యం.ప్రశాంతంగా ఆలోచించు.' అని చెప్పాను.

కాటేజీలో మౌనంగా ధ్యానంలో కూచుని నా మనస్సును పరిశీలించుకున్నాను.ఎక్కడా ఏమూలా బాధ అనేదిగాని,కోపం అనేది గాని,"అయ్యో ఇంతదూరం వస్తే ఇలా జరిగిందే" అన్న ఫీలింగ్ గాని కొద్దిగా కూడా కనిపించలేదు.

పైపెచ్చు ఏదో తెలియని సంతోషం లోనుంచి ఉబికి వస్తున్నది.

చుట్టూ ఉన్న ప్రకృతిని తేరిపార చూచాను.దైవం మహోజ్జ్వలంగా వెలుగుతూ ప్రకృతిలో దర్శనం ఇస్తున్నది.ఇంతకంటే మించిన దైవదర్శనం ఇంకెక్కడుంది? దైవం ఒక్క రాతి విగ్రహంలోనే లేడుగా? మనం చూడగలిగితే దైవం ప్రతిచోటా ఉన్నది.'చరాచర జగన్నాథా చక్రరాజ నికేతనా' అని లలితా సహస్రం అనడంలేదా?

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఒకరిలా అడిగారు.

'అమ్మా.దైవం ఎక్కడుంది?'

'ఎక్కడికక్కడే నాన్నా' -- అమ్మ జవాబు.

మౌనంగా కూచున ఉన్న నాకు హటాత్తుగా గురునానక్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

గురునానక్ ఒకసారి ఇలాగే ఎంతో కష్టపడి మక్కా కు వెళతాడు.అక్కడ పూజారులు ఈయన హిందువని లోనికి రానివ్వరు.గురునానక్ ఏమీ బాధపడడు.చీకటి రాత్రిలో ఆరుబయట వెల్లకిలా పడుకుని పైన కనిపిస్తున్న నక్షత్ర మండలాలను చూస్తూ "నీలి గగనమందు వెలిగె చంద్రతారలూ,నీ మహిమయె గోచరించె నలుదిక్కులనూ" అంటూ గానం చేస్తాడు.

ఒకరోజున ఆయన కాళ్ళను 'కాబా' వైపు ఉంచి నిద్రిస్తూ కనిపిస్తాడు.అక్కడ ఉన్న కాజీ రుక్నుద్దీన్ అనేవాడు కోపంతో - నానక్ ను లేచి తలను కాబా వైపుగా ఉంచి పడుకోమ్మని గద్దిస్తాడు.

దానికి నానక్ ' నేను నిద్ర మత్తులో నీరసంగా ఉన్నాను.లేవలేను.నీవే నా కాళ్ళను జరుపు' అని కాజీ ని కోరుతాడు.కాజీ నానక్ కాళ్ళను ఎటు తిప్పితే అటువైపుననే కాబా అతనికి దర్శనం ఇస్తుంది.దానితో నిర్ఘాంతపోయిన కాజీకి నానక్ ఇలా చెబుతాడు - 'చూడు.భగవంతుడు అన్ని దిక్కులలోనూ ఉన్నాడు.ఏ దిక్కులో నా తలను ఉంచాలి? ఏ దిక్కులో నా కాళ్ళను ఉంచాలి?"

దేవాలయంలో మాత్రమే దైవాన్ని చూడటం చాలా ప్రాధమిక స్థితి.సర్వే సర్వత్రా అన్నిచోట్లా దైవస్పర్శను ఫీలవడం అత్యుత్తమమైన స్థాయి.

ఆ రోజంతా కొండమీదే ఉండి అటూఇటూ తిరుగుతూ ఉన్నాము.వ్యతిరేక భావాలు ఏమీ తలెత్తలేదు.సాయంత్రానికి కొండ దిగుతూ మళ్ళీ మరొక్క సారి మనస్సులోకి తొంగి చూచాను.ప్రశాంతంగా ఆనందంగా ఉన్నది.దర్శనం కలిగితే వచ్చే డొల్ల ఆనందం కంటే,కలగకుండా వస్తున్న ఆనందమే ఎంతో ఉన్నతంగా జీవంతో కూడి ఉన్నట్లు అనిపించింది.

ఇంటికి వచ్చాక ఒక మిత్రురాలు ఫోన్ చేసింది.

విషయం అంతా విని -'పాపం!మీకు ప్రాప్తం లేనట్లు ఉన్నది' అన్నది.

'అవును.నాకు ఏది ప్రాప్తం ఉన్నదో తెలియాలంటే ఇప్పుడే నీకర్ధం కాదు. ఎప్పటికైనా నీకర్ధం అయితే మాత్రం అదృష్టవంతురాలవే.' అని క్లుప్తంగా జవాబు చెప్పాను.

విజయంలో ఆనందాన్ని పొందటం అందరికీ తెలుసు.ఆ ఆనందం క్షణికమే. కానీ అపజయంలో కూడా అమితమైన ఆనందాన్ని పొందగలగడమే అసలైన ఆధ్యాత్మికత అని నేనంటాను.ఎందుకంటే రెంటిలోనూ ఉన్నది అమ్మేగా.

ఈ విషయమై భగవద్గీత ఏమంటున్నది?

శ్లో||తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేన చిత్
అనికేత: స్థిరమతి: భక్తిమాన్యే ప్రియో నర:

(నిందనూ పొగడ్తనూ సమంగా స్వీకరించి సమచిత్తంతో సంతోషంతో ఉన్నవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు) 

శ్లో||సుఖ దుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం పాపమవాప్స్యసి

(సుఖాన్నీ దుఖాన్నీ, లాభాన్నీ నష్టాన్నీ, జయాన్నీ అపజయాన్నీ సమంగా చూచి (జీవన) యుద్ధాన్ని చెయ్యి.అప్పుడు నీకు ఏ విధమైన పాపమూ అంటదు.)

ఈ భావాన్నే 'శ్రీవిద్యా రహస్యం'లో ఇలా వ్రాశాను.

ఆ||సుఖము నొందు నపుడు చక్కనేడ్వగజాలు
దుఖమొదవి నంత దేరినవ్వు
దేని నందగోర దాని నెదుటను జూచు
రెంటి మీరినట్టి రహితమెరుగు

(సుఖం కలిగినప్పుడు ఏడవగలడు.దుఖం కలిగినప్పుడు నవ్వనూ గలడు. దేనిని కావాలంటే దానిని క్షణంలో కళ్ళెదుట చూడగలడు.ఈ రెంటినీ దాటిన రహితస్థితిని చేరుకోవడం అతనికి తెలుసు.మనస్సును మట్టిముద్దలా చేసి ఆడుకోవడమూ అతనికి తెలుసు)

ఆ విధంగా రెండు రోజులు తిరుమల కొండమీద ఉండి దర్శనం కాకుండా ఆనందంగా క్రిందకు దిగి వచ్చాము.

శ్రీనివాసుడు దర్శనం ఇవ్వకపోతేనేమి? ధన్యత్వాన్ని ఇచ్చాడు.

అర్ధం చేసుకుంటే అది చాలు.