Pages - Menu

Pages

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఉచ్చు

లౌకికజీవితంలో ఎదురయ్యే ఆటంకాలనూ అడ్డంకులనూ ఎలా అధిగమించాలో మానవుడికి తెలుసు.కానీ అంతరికలోకంలో,ఆధ్యాత్మిక లోకంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా దాటాలో తెలీదు.

లోకంలో ఎవరైనా మనల్ని ఒక తాడుతో కట్టేస్తే ఆ కట్లు ఎలా విప్పుకోవాలో మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మికలోకంలో మనల్ని మనమే రకరకాల తాళ్ళతో కట్టేసుకుంటూ ఉన్నామన్న సంగతి మనకు తెలియదు.మనల్ని మనమే కట్టేసుకుంటున్నామన్న విషయం తెలియకపోతే ఇక ఆ కట్లను విప్పుకోవాలని ఎలా అనిపిస్తుంది?మనకు తెలియకపోవడమే కాదు. తెలిసినవారు చెప్పినా వినిపించుకునే స్థితిలో,ఒప్పుకునే స్థితిలో మనం ఉండము.అదే ఆధ్యాత్మిక లోకంలో అసలైన విచిత్రం.

ఇలా జరగడానికి కారణం ఏమిటి?

బయట ప్రపంచంలో ఉన్న ఉచ్చులు ఆటంకాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.కనుక వాటిని దాటటం మనకు తెలుసు.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉండే ఆటంకాలు ఉచ్చులు కనిపించవు.బయట ప్రపంచంలో ఆటంకాలు బయటనుంచి వస్తాయి.ఇతరుల నుంచి వస్తాయి.కానీ ఆధ్యాత్మిక లోకంలో ఆటంకాలు తమనుంచే పుట్టుకొస్తాయి.లోలోపలే అవి ఉంటాయి.వాటిని తయారు చేసుకునేదీ మనమే.వాటితో మనల్ని మనం కట్టుకునేదీ మనమే.కనుక వాటిని దాటే విధానం మనకు తెలియదు.దాటాలని కూడా మనకు అనిపించదు.ఆ కట్లను విప్పుకోవాలన్న స్పృహే మనకు ఉండదు. ఎందుకంటే ఆ కట్లు చాలా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తాయి.

ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నవారుకూడా తాము స్వేచ్చగా ఉన్నామని అనుకోవడమే ఆధ్యాత్మిక లోకంలోని విచిత్రాలలో ఒకటి.

ఆధ్యాత్మిక లోకపు ఉచ్చులు ఎలా ఉంటాయో చూద్దామా?

'అ' 'ఆ' లు రానివారికి అద్భుతాల ఉచ్చు
అన్నీ చదివిన వాడికి అహంకారపు ఉచ్చు
అతితెలివి ఉన్నవాడికి అడుగు పడని ఉచ్చు
ఆశ ఎక్కువైపోతే అయోమయపు ఉచ్చు

ఆధ్యాత్మికత అంటే ఓనమాలు తెలియనివారు చాలామంది ఉంటారు.వారికి అద్భుతాల మీద మహామోజుగా ఉంటుంది.గారడీవిద్యలకూ ఈ అద్భుతాలకూ ఏమీ తేడాలేదు.రోడ్డుమీద గారడీ చేసి డబ్బులు అడుక్కునేవారికీ అద్భుతాలు చేసే మహాత్ములకూ పెద్దగా భేదం ఏమీలేదు. ఇద్దరూ దాదాపుగా ఒక స్థాయిలోని వారే.ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నవారు ఇలాంటి గారడీవిద్యలు చూచి బోర్లా పడిపోయి మోసపోతూ ఉంటారు.

ఇంకొంతమంది పుస్తకాలు విపరీతంగా చదివేసి విషయసేకరణ చేసి ఉంటారు. తద్వారా అన్నీ తెలుసుకున్నామని అనుకుంటూ ఉంటారు.ఇలాంటివారు పాండిత్య అహంకారం అనే ఉచ్చులో చిక్కుకుని ఇక అక్కడనుంచి ముందుకు కదలలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంతమంది అతితెలివితో నిండిపోయి ఉంటారు.వీరికి ఆధ్యాత్మికత అంటే ఒక పిచ్చివ్యవహారం కింద లెక్క.అదొక "టైంవేస్ట్" అని వారి ఉద్దేశ్యం.ఇలాంటి అతితెలివి మనుషులకు వారి అతితెలివే ఉచ్చుగా మారి వారిని ముందుకు అడుగు వెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటుంది.మాకన్నీ తెలుసు అనే భ్రమలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని కామెంట్ చేస్తూ వారు ఏమి కోల్పోతున్నారో వారే గ్రహించలేని స్థితిలో ఉంటారు.

ఇంకొంత మందికి అత్యాశ ఉంటుంది.వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదో లాభం పొందుదామనే ప్రయత్నిస్తూ ఉంటారు.ఇలాంటివారు ఎన్నేళ్ల తరబడి అందులో ఉన్నాకూడా చివరకు ఏమీ అర్ధంకాని అయోమయమే వారికి మిగులుతుంది.వారి అత్యాశే వారికి ఉచ్చుగా మారి బిగిస్తుంది.అప్పనంగా వరాలొస్తాయన్న అత్యాశతో నిన్నా మొన్నటివరకూ కొందరు ప్రసిద్ధ గురువులను,అవతార పురుషులను(?) అనుసరించిన వారికి నేడు మిగిలింది అదే.ఆయా గురువులూ,అవతార పురుషులూ 'ఫ్రాడ్' అని నేడు తేలడంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో వారు ప్రస్తుతం ఉన్నారు.

గురువులమనుకునేవారికి గ్రుడ్డితనపు ఉచ్చు
మోసకారులకు వారి మోహపాశమే ఉచ్చు
అడుగు వెయ్యని వారికి అలసత్వమనే ఉచ్చు
అర్పణ చేతకానివారికి అహంకారమే ఉచ్చు

అసలు "విషయం" అంటూ వారిదగ్గర పెద్దగా లేకపోయినా, అనేకమంది వారికివారే 'సద్గురు' వులమని పేర్లు పెట్టుకుని శిష్యులచేత ప్రచారాలు చేయించుకుంటూ తెలిసీ తెలియని ఆధ్యాత్మికతను బాగా మార్కెటింగ్ చేస్తున్నారు.ఇలాంటి స్వయంగురువులకు వారి గ్రుడ్డితనమే వారికి ఉచ్చుగా మిగులుతుంది.

ఇంకొంతమంది వారి మోసకారుతనాన్ని ఆధ్యాత్మికలోకంలో కూడా ప్రయోగిస్తూ ఉంటారు.ఇలాంటివారికి కావలసింది ఆయా సర్కిల్స్ లో దొరికే పరిచయాలు.ఆ పరిచయాల ద్వారా అయ్యే పనులు.వీరంతా పచ్చి మోసగాళ్ళు.పనులు కావడమే వీరికి ప్రధానంగాని పరిణతి రావడం కాదు. వారిని పట్టి పీడిస్తున్న మోహాలే ఇలాంటివారికి ఉచ్చులుగా మారుతాయి. పక్కదారులు పట్టిస్తాయి.

ఇంకొంతమంది ఏళ్ళతరబడి ప్రవచనాలూ బోధలూ వింటూ ఉన్నప్పటికీ ఆచరణలో ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేరు.ఇలాంటి వారికి వారి అలసత్వమూ బద్ధకాలే ఉచ్చులుగా మారి కట్టివేస్తాయి.

ఇంకొంతమంది గురువుకూ దైవానికీ శరణాగతి కాలేరు.దానికి అడ్డుపడేది వారి అహంకారమే.'అహం' అన్న మాటను ఒప్పుకోకుండా దానికి రకరకాల కారణాలను వారు చెబుతారు.అలా వారికి వారే సర్దిచెప్పుకుంటూ సంతృప్తి పడుతూ ఉంటారు.ఇలాంటివారికి వారి అహంకారమే ఉచ్చుగా మారి బంధిస్తుంది.దానిని వారు దాటలేరు.

లోన శుద్ధికాకపోతె లోకమనేదే ఉచ్చు
కాలు కదపలేకపోతే కల్లమాటలే ఉచ్చు
మానవత్వమెరుగనిచో మాయతంతులే ఉచ్చు
దేశద్రిమ్మరులకేమో దేబిరింపే ఉచ్చు

మనస్సు శుద్ధి కాకపోతే లోకంలో ప్రతిదీ ఉచ్చుగా మారి మనల్ని కదలకుండా బంధిస్తుంది.మనస్సు శుద్దంగా ఉంటే లోకంలో ఏదీ మనల్ని బంధించలేదు.మనస్సు ద్వారానే బంధమైనా స్వతంత్రమైనా మనిషికి ప్రాప్తిస్తుంది.

కొంతమంది ఆచరణ అనేది లేకుండా ఊరకే కూచుని ఉపన్యాసాలు ఇస్తుంటారు.వారికి చివరకు మిగిలేవి కల్లమాటలూ సొల్లుమాటలే.ఆ మాటలే వారికి ఉచ్చులు.

ఇంకొంతమంది దేశాలు పట్టుకుని ఊరకే పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.అదే నిజమైన ఆధ్యాత్మికత అని వారనుకుంటారు.పోయిన ప్రతీచోటా ఏదో దొరుకుతుంది అన్న దేబిరింపే వారికి ఉచ్చుగా మారి వారిని ఆధ్యాత్మికంగా ఎదగకుండా కట్టి ఉంచుతుంది.ఆ సంగతి వారు గ్రహించలేరు.

మరికొంతమంది మాయతంతులు హోమాలూ పూజలే మహాగొప్ప విషయాలని భ్రమిస్తూ వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారు.వారికి మానవత్వం మాత్రం ఉండదు.ఇలాంటి మనుషులకు వారి మాయతంతులే ఉచ్చుగా మారి వారిని బంధిస్తూ ఉంటాయి.వారూ ఈ విషయాన్ని గ్రహించలేరు.

ఈ విధంగా ఆధ్యాత్మికలోకంలో అడుగడుగునా ఎవరి అజ్ఞానమూ స్వార్ధమూ అహంకారమూ అలసత్వమూ ఆశపోతుతనాలే వారికి ఉచ్చులుగా మారి వారిని కట్టిపడేస్తూ ఉంటాయి.కానీ అలా కట్టబడి ఉన్నామన్న స్పృహ వారికి ఉండదు.

ఇదే ఆధ్యాత్మిక లోకపు విచిత్రాలలో ఒక మహావిచిత్రం.

ఈ ఉచ్చులనుండి బయటపడలేకపోతే నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో ఎన్నటికీ అర్ధం కాదనేది మాత్రం కఠోరవాస్తవం.అర్ధం చేసుకోడానికే జన్మంతా సరిపోతుంటే ఇక దానిని ఆచరణలో పెట్టేది ఎన్నడు? అనుభవాన్ని పొందేది ఎప్పుడు?