Pages - Menu

Pages

1, మార్చి 2015, ఆదివారం

మొట్టమొదటి నిజాయితీ రైల్వే బడ్జెట్

ఊహించినట్లుగానే ఈసారి కూడా ఆంధ్రాకు రైల్వే బడ్జెట్లో వరాలు ఏమీ దక్కలేదు.ఇది మనకు కొత్త కాదు.గత పది పదిహేనేళ్ళుగా జరుగుతున్న తంతే ఇది.కాకపోతే ఈసారి బడ్జెట్లో నిజాయితీ కనిపిస్తోంది.అంతే తేడా.

ఈసారి మాత్రం చెయ్యగలిగినదే చెప్పారు.ఉన్న పరిస్థితిని ఉన్నట్లుగా చూపించారు.మసిపూసి మారేడు కాయ చెయ్యలేదు.తమ లైన్ కెపాసిటీని ఎప్పుడో దాటేసి,కిక్కిరిసిన రైళ్లతో నడుస్తున్న అనేక బిజీ రూట్లలో,మరిన్ని రైళ్ళు ఎనౌన్స్ చేసేసి-"ఎలా నడుపుకుంటారో మీ ఖర్మ.నడుపుకోండి"- అని చేతులు దులుపుకోలేదు.ఇది మంచి మార్పే.

అయితే దీనికీ ఒక కారణం ఉన్నది.బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఎందుకు వదిలిపెట్టి పోయాడో అదే కారణం చేతనే ఈ బడ్జెట్లోనూ కొత్త రైళ్ళు ఎనౌన్స్ చెయ్యలేదు.

ఘనత వహించిన వీరుల పోరాటాల వల్ల మనకు స్వాత్రంత్రం రాలేదనేది చరిత్ర లోతులు చదివినవారికి విదితమే.ప్రపంచవ్యాప్తంగా వారివారి కాలనీ దేశాలలో వస్తున్న భారీమార్పులు,మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు,రాన్రాను న్యూసెన్స్ గా మారిన దేశ పరిపాలన,అప్పటికే అన్నిరకాలుగా దోచుకోబడి పిప్పిగా మారిన భారతదేశం,అతికష్టంగా మారిన నిర్వహణ ఇత్యాది అనేక కారణాల వల్ల బ్రిటిష్ వారు మన దేశాన్ని వారంతట వారే వదలి పోయారన్నది వాస్తవం.

అలాగే,ప్రస్తుతం ఇప్పటికే తడిసి మోపెడుగా ఉన్న అనేక డైలీ,నాన్ డైలీ రైళ్ళు,కిక్కిరిసి ఉన్న లైన్లు,నిర్వహణకు డబ్బు లేకపోవడం ఇత్యాది అనేక సమస్యలతో ఉన్న భారతీయ రైల్వేలలో,ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను,బేసిక్ ఎస్సెట్స్ ను పెంచకుండా ఇప్పటికిప్పుడు కొత్తకొత్త రైళ్ళను ప్రవేశపెడితే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందన్న వాస్తవమే కొత్త రైళ్ళను ఎనౌన్స్ చెయ్యకుండా ప్రభుత్వాన్ని ఆపింది.

నడపడం ఇక తమ చేతగాక బ్రిటిష్ వారు మన దేశాన్ని వదలిపెట్టి పోయారు. అలాగే నడపడం కుదరదన్న భయంతోనే ప్రస్తుత బడ్జెట్లో కొత్త రైళ్ళను ఎనౌన్స్ చెయ్యలేదు.

మన దేశపు ఆర్ధిక సామాజిక ప్రగతితో రైల్వేల ప్రగతి ముడిపడి ఉన్నది. ఒకరకంగా చూస్తే రైల్వే అనేది మన దేశానికి వెన్నెముక లాంటిది.కానీ, స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళలో రైల్వేలలో ఆశించినంత వేగంగా ప్రగతి కనపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.

ఓట్లు పోతాయేమో అని భయపడుతూ రేట్లు పెంచకపోవడం ఒక కారణం.

ప్రపంచంలో ఎక్కడైనా రేట్లు ఏడాదికేడాది పెరుగుతూ పోతాయి.కానీ భారతీయ రైల్వేలో మాత్రం ఏడు సంవత్సరాల పాటు తగ్గుతూ వచ్చాయి.వ్యవస్థకంటే ఓట్లే ప్రధానం అనుకునే మంత్రులను మనం ఎన్నుకుంటే ఇంతగాక ఇంకేమౌతుంది?

రేట్లు పెంచకపోతే డబ్బులెక్కడ నుంచి వస్తాయి?డబ్బుల్లేకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి?కనుక ప్రాజెక్టులు నత్తనడక నడవడం.వాటి వ్యయం ఊహించలేనంతగా పెరిగిపోవడం.చివరకు వాటిని ఎలా పూర్తి చెయ్యాలో తెలియక చేతులెత్తేయడం-ఇదీ గత కొన్నేళ్లుగా జరుగుతున్న భాగోతం.

ఒచ్చిన ఒకటి రెండు ప్రాజెక్టులనూ బలమున్న నాయకులు తమతమ రాష్ట్రాలకు దక్కించుకొని ఎగరేసుకు పోవడం ఇంకో కారణం.మన ఎంపీలు ఎక్కడా పత్తా కనిపించకపోవడం.బడ్జెట్ ప్రసంగాన్ని వారి వారి ఇళ్ళలో కూచుని టీవీలో చూచి ఆ తర్వాత 'మనకేమీ దక్కలేదు' అని పేపర్లకు స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు.ఈ స్టేట్మెంట్లు చదివితే భలే చిర్రెత్తుకొస్తుంది. రాష్ట్రానికి ప్రాజెక్టులు సాధించుకోవడం చేతగానివాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఇవి.

బడ్జెట్ ప్రసంగంలో కూడా మంత్రులు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడం ఇంకో వింత.ఉదాహరణకు--ఇంతకు ముందు రైల్వే బడ్జెట్లలో ఒక నూరు కొత్తరైళ్ళు ప్రకటిస్తే వాటిలో నిజానికి ఒక పదికూడా పట్టాలు ఎక్కేవి కావు.అడిగేవారు ఎవరున్నారు?కానీ ఈసారి అలా జరగలేదు.నిజాయితీగా బడ్జెట్ ను రూపొందించారు. అనవసరంగా కొత్త కొత్త రైళ్ళను ప్రకటించలేదు.అంతవరకు సంతోషం.

ప్రకటించిన పనులు కూడా ఎన్నేళ్ళైనా నిధుల కొరత వల్ల కాకపోవడం ఇంకొక కారణం.ఉదాహరణకు గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు గత అయిదేళ్ళనుంచీ ప్రకటిస్తూనే ఉన్నారు.కానీ ఇంతవరకూ అతీగతీ లేదు.23 కి.మీ దూరాన్ని డబ్లింగ్ చెయ్యడానికి అయిదేళ్ళు పడితే ఇక పెద్దపెద్ద పనులు ఎప్పటికి అవుతాయి? అదే చైనాలో చూస్తే,కొన్ని వందల మైళ్ళ రైలు మార్గాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ఏడాదిలో వేసి పారేస్తున్నారు. వాటి క్వాలిటీ కూడా మనకంటే బ్రహ్మాండంగా ఉంటున్నది.

రైల్వేలను గాడిలో పెట్టాలంటే ఇప్పటికిప్పుడు 8.5 లక్షల కోట్లు కావాలట. కానీ రేట్లు మాత్రం పెంచరాదు.టికెట్ల రేట్లు పెంచనిదే డబ్బు రాదు.రేట్లు పెంచితేనేమో ఓట్లు రావు. డబ్బు లేకపోతే అభివృద్ధి లేదు.కనుక అయితే "ప్రీమియం రేట్లు" అంటూ,"తత్కాల్" అంటూ దొడ్డిదారిన డబ్బు దండుకోవాలి. లేదా అసాంప్రదాయిక విధానాలద్వారా డబ్బు సమకూర్చుకోవాలన్న మాట. అంటే,రైల్వేలు తమ ముఖ్యమైన పని అయిన ప్రజల రవాణా,సరుకు రవాణాలను పక్కన పెట్టి,పంచభూతాలను అమ్ముకోవడం మొదలుపెట్టాలి.

రైల్వే ల్యాండ్ ను వ్యాపారాలకు,వ్యవహారాలకు,ప్రకటనలకు అమ్ముకోవాలి. ఆ విధంగా భూమితో వ్యాపారం చెయ్యాలి.రైల్వేవారే మరిన్ని ప్లాంట్ల ద్వారా త్రాగునీటిని తయారు చేసి "రైల్ నీర్" అమ్మాలి.ఆ విధంగా జలభూతాన్ని అమ్ముకోవాలి.ఇకపోతే ఆకాశం(స్పేస్) ను కూడా ప్రకటనలకు అద్దెకివ్వాలి. ఇక మిగిలిన అగ్నిభూతాన్ని విద్యుత్తు రూపంలో,బ్రాడ్ బ్యాండ్ రూపంలో సృష్టించి వాటినీ అమ్ముకోవాలి.విద్యుత్తును సృష్టించడానికి అవసరమైతే విండ్ మిల్ టెక్నాలజీ వాడి వాయుభూతాన్నీ అమ్ముకోవాలి.ఈ విధంగా ముందు పంచభూతాలతో వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టి తద్వారా డబ్బు సమకూర్చుకోవాలి.అంతేగాని రేట్లు పెంచకూడదు.పెంచితే పాపం పేదవారైన మన దేశ ప్రజలు భరించలేరు.

పబ్బుకెళ్ళి పదివేలూ,ఐమాక్స్ కెళ్ళి అయిదువేలూ ఒక్క గంటలో ఖర్చు చేసేవారు రైలు టికెట్ కొనలేరట.భారతదేశంలో అంత పేదవాళ్ళు ఇంకా ఉన్నారా? అని చూడాలంటే భూతద్దం వేసినా ప్రస్తుతం దొరకరు.కానీ రేట్లు మాత్రం పెంచరాదని మన ప్రభుత్వాల ఘనమైన అంచనా.ఎంత వింతో?

'ప్లాట్ ఫాం బ్రాండింగ్' పేరుతో వ్యాపార ప్రకటనలు కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎనౌన్స్ మెంట్ సిస్టం లో వినిపిస్తున్నాయి.ఇంతకు ముందు,అంటే నా చిన్నప్పుడు,రేడియోలో 'హోటల్ మనోరమా' వారి సమయం ఉదయం తొమ్మిదిగంటలు అని ప్రకటన వచ్చేది.ఇప్పుడు రైల్వేవారు కూడా ఈ విధానాన్ని కాపీ కొట్టి, రైళ్ళు రాని సమయంలో,ప్రయాణీకులు ఆకాస్త మాత్రం విశ్రాంతి ఎందుకు తీసుకోవాలి అని,వ్యాపార ప్రకటనలు ఊదరగొడుతున్నారు.

ఇలాంటి 'నాన్ ట్రెడిషనల్ సోర్సెస్' ద్వారా మీ బడ్జెట్ కి అవసరమైన డబ్బులు మీరే సమకూర్చుకొమ్మని,మేం ఎటువంటి సాయం చెయ్యలేమనీ,పార్లమెంట్ ఎప్పుడో చెప్పేసింది.ఆ దిశగా రైల్వేలలో ప్రయత్నాలూ భారీగానే మొదలయ్యాయి.క్రమంగా కోర్ యాక్టివిటీ కి ప్రాధాన్యత తగ్గిపోతున్నది.నాన్ కోర్ యాక్టివిటీ పెరిగిపోతున్నది.అంటే అసలు కంటే కొసరు ఎక్కువై పోతున్నదని అర్ధం.

రైల్వే పెట్టెలలో శుభ్రతా,మరుగుదొడ్ల శుభ్రతా,ట్రాక్ శుభ్రతా,రైళ్ళలో ఇంటర్ నెట్టూ,మంచి ఆహారమూ,మంచి స్టేషన్ పరిసరాలూ,మంచి బెడ్డింగులూ,ఏసీ కోచ్ లలో కూడా బొద్దింకలూ ఎలుకలూ పందికొక్కులూ లేకపోవడమూ ఇవన్నీ చాలా అవసరమే.కానీ వీటన్నిటి కంటే ముఖ్యంగా కావలసినవి-సమయానికి రైళ్ళు నడవడం,మరిన్ని ఎక్కువ రైళ్ళు నడవడం,మరింత వేగంగా నడవడం,యాక్సిడెంట్లు కాకుండా పూర్తి భద్రతతో నడవడం.

ఇవి జరగాలంటే అర్జెంట్ గా కావలసినవి మరిన్ని లైన్లు.మరిన్ని రైల్వే లైన్లు లేనిదే కొత్తకొత్త రైళ్ళను ప్రవేశపెట్టలేము.నిర్ణీత సమయంలో రెండు స్టేషన్ల మధ్యన ఉన్న రైల్వే లైన్లో దాని కెపాసిటీని బట్టి 'ఇన్ని' రైళ్ళను మాత్రమే నడపడానికి వీలవుతుంది.దీనిని 'సెక్షన్ కెపాసిటీ' అంటారు.ప్రస్తుతం భారతీయ రైల్వేలలో ఈ సెక్షన్ కెపాసిటీ ఏనాడో 100% ని దాటిపోయింది. అంటే నడపవలసినన్ని రైళ్ళకంటే ఇంకా ఎక్కువగా కుక్కికుక్కి మరీ ప్రస్తుతం మనకున్న పరిమిత ట్రాక్ మీద రైళ్ళను నడుపుతున్నాం.అయితే దీనికీ ఒక పరిమితి ఉంటుంది.ఒక పరిమితి దాటితే ఒక రైలు మీద ఇంకొక రైలును ఎక్కించవలసి వస్తుంది.అలా తప్ప,ఇంకే విధంగానూ,మరిన్ని రైళ్ళను అదే లైన్ మీద నడపడం సాధ్యం కాదు.

కనుక కొత్తలైన్లు అర్జంటుగా వెయ్యాలి.దానికోసం డబ్లింగ్,ట్రిప్లింగ్ పనులు శరవేగంగా జరగాలి.ఇప్పటికంటే బలమైన ట్రాక్ వెయ్యబడాలి.ఆ తర్వాత కొత్తకొత్త రైళ్ళు రావాలి.ట్రాక్ విద్యుదీకరణ జరగాలి.అప్పుడు మాత్రమే, పశువుల కన్నా హీనంగా ఒకపెట్టెలో నాలుగుపెట్టెల జనం కిక్కిరిసి ప్రయాణం చేసే ఖర్మ తప్పుతుంది.అప్పుడు మాత్రమే,రైళ్ళవేగం అనూహ్యంగా పెరుగుతుంది.మరిన్ని లైన్లు ఉంటే ఒక రైలు కోసం ఇంకొక రైలు ఆగి వేచి చూచే బాధా తప్పుతుంది.

వాజపేయి గారి నాయకత్వంలో స్వర్ణచతుర్భుజి వచ్చిన తర్వాత నాలుగురోడ్లు,ఆరురోడ్ల రహదారులు ఏర్పడి రోడ్డు ప్రయాణం ఎంత సౌకర్యంగా మారిందో అందరికీ తెలుసు.అలాగే రైల్వేలో కూడా ఆరు లైన్ల దారులు దేశం మొత్తం ఏర్పడిననాడు,మన రైల్వే కూడా ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది. నేటికీ మన దేశంలో సింగిల్ లైనున్న దారులు అనేకం ఇంకా ఉన్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. ప్రయారిటీస్ సరిగా లేకపోతే,విజన్ అనేది సరిగా లేకపోతే ఇలాగే అఘోరిస్తుంది.

వనరుల కొరత,ఓటు బ్యాంకు రాజకీయాలు,ప్రాంతీయ ఫీలింగులు,అసూయా ద్వేషాలతో నిండి ఉన్న వాతావరణంలో -- విద్యుదీకరణ కాబడిన ఆరులైన్ల రైల్వే రహదారులు ఎప్పటికి సాధ్యం అవుతాయో?క్రాసింగ్ అనేది లేకుండా, ఎదురుగా వచ్చే ఏ రైలు కోసమూ ఏరైలూ ఆగకుండా దేని దారిలో అది రయ్యిమంటూ దూసుకుపోయే రోజు ఎప్పుడు చూస్తామో?

వేచి చూడటం తప్ప ఈ దేశంలో ఇంకేం చెయ్యగలం?