ఉష్ట్రపక్షి అని ఒక పక్షి ఉంటుంది.దానినే ఈము పక్షి అని ఇప్పుడు అంటున్నారు.దానికేదైనా ఇతర జంతువుల నుంచి ప్రమాదం వాటిల్లినపుడు ఇసుకలో తలదూర్చి తాను హాయిగా ఉన్నాననీ తనకేమీ ప్రమాదం లేదనీ అనుకుంటూ ఉండిపోతుంది.అలా ఉంది మన ప్రభుత్వం స్థితి.
మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం అంతా కళ్ళుమూసుకుని ఉన్నదని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు.
మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం అంతా కళ్ళుమూసుకుని ఉన్నదని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు.
ఈ డాక్యుమెంటరీని తీసి లెస్లీ ఉద్విన్ చాలా మంచిపని చేసింది.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.ఆలోచనాపరులైన అనేకమంది భారతీయుల అభిప్రాయం.నాకే గనుక అధికారం ఉండి ఉంటే -- ఆమెకు ఒక మంచి అవార్డ్ ప్రకటించి ఉండేవాడిని.
ఈ డాక్యుమెంటరీని గనుక ప్రపంచం చూస్తె మన దేశపు పరువు గంగలో కలసి పోతుందట.అలా అని మన ప్రభుత్వం భావిస్తోంది.అందుకే దీనిని బ్యాన్ చేసిందట !!
గంగలో కలవడానికి మనకసలు పరువంటూ మిగిలిందా అని నాకొక పెద్ద అనుమానం ఎప్పటినుంచో ఉన్నది.ప్రపంచదేశాలలో ఎవరినడిగినా మన దేశం గురించి అంత గొప్పగా ఏమీ చెప్పరు.పైగా అదోక రకమైన హేళనగా మాట్లాడతారు.విదేశాలలో ఉంటున్న NRIs అందరికీ ఈ విషయం చాలా చక్కగా తెలుసు.
పోనీ గంగలో నిజంగానే కల్సిందేమో మన పరువు అని అనుకోవడానికి గంగ కూడా ఏమీ పవిత్రంగా లేదు.దానినెప్పుడో మురికికూపంగా మార్చిపారేశాం మనం.మురికిబట్టిన గంగలాగే ఉంది ప్రస్తుతం ప్రపంచదేశాలలో మన పరువు స్థితికూడా.ఎందుకంటే,2012 లో ఈ సంఘటన జరిగితే,ఇంతవరకూ నిందితులకెవరికీ శిక్షలు పడలేదు.కోర్టుల చేటభారతం తెగలేదు.పోనీ నిందితులలో పరివర్తన వచ్చిందా అంటే అదీ లేదు.ముకేష్ సింగ్ మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం.
శిక్షలూ పడక, నిందితులలో మార్పూ రాక,ఇంకెందుకు న్యాయవ్యవస్థ?
శిక్షలూ పడక, నిందితులలో మార్పూ రాక,ఇంకెందుకు న్యాయవ్యవస్థ?
"నిందితులను శిక్షించడం చట్టం ఉద్దేశ్యం కాదు.వారిలో మార్పు తేవడమే,మానసిక పరివర్తనను వారిలో కలిగించడమే అసలు మన కర్తవ్యమ్"--అంటూ కాపీ కొట్టబడిన బ్రిటిష్ న్యాయశాస్త్రపు ఎంగిలి మెతుకులను,Legal Jurisprudence అనే పేపర్లో ప్రతి న్యాయశాస్త్ర విద్యార్దీ రుచిచూస్తాడు.చదువుతాడు.వ్రాస్తాడు.నేను లా చదివిన రోజుల్లో నేనూ అదే చదివాను.నిజం అనుకున్నాను.పరీక్షలలో పేజీలకు పేజీలు వ్రాశాను కూడా. కానీ సమాజంలో వాస్తవపరిస్థితి అందుకు చాలా భిన్నం.అందుకే ఈ కుళ్ళు సమాజం మీద విసుగుతో నా 'లా' డిగ్రీని ఎప్పుడో పక్కన పెట్టాను.
పోనీ మన దేశంలో నిర్భయ కేస్ తర్వాత మిగతాచోట్ల రేపులు ఆగాయా అంటే అదీలేదు.ఆ తర్వాతకూడా అంతకంటే ఘోరమైన రేపులు ఎన్నో జరిగాయి. ప్రతిరోజూ నేటికీ జరుగుతూనే ఉన్నాయి.అంతకంటే ఘోరమైన రేపులు హర్యానాలో జరిగాయి.ఆంధ్రాలో జరిగాయి.బెంగుళూరులో అయితే చిన్నపిల్లల రేపులు కూడా ఇంకా వార్తల్లో వింటూనే ఉన్నాం.
ఘోరాలు నిత్యం మన దేశంలో జరుగుతున్నప్పుడూ,నిందితులు హాయిగా తప్పించుకుని తిరుగుతున్నప్పుడూ మనకు సిగ్గు లేదు గాని,ఆ విషయాలు ప్రపంచానికి తెలిస్తేమాత్రం మన పరువు పోతుందట.
అంటే,తెలియకపోతే పర్వాలేదనేగా?
అంటే,తెలియకపోతే పర్వాలేదనేగా?
1970 దశకంలో సోవియెట్ రష్యా కూడా ఇంకోరకంగా ఇలాగే ఉండేది.ఇనుప తెర వెనుక ఆ దేశంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలిసేది కాదు.అంతా బ్రహ్మాండంగా ఉన్నదన్న భ్రమను 'సోవియెట్ భూమి' వంటి పత్రికలు కల్పించేవి.కానీ ఒక పదేళ్ళలో ఆ బుడగ టప్పుమని పేలిపోయింది. ఒక్కసారిగా ఐరన్ కర్టెన్ పైకి లేవగానే లోపలంతా డొల్ల అన్న సంగతి ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసిపోయింది.ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.ఒకప్పటి సూపర్ పవర్ రష్యా ఇప్పుడు లేదు.
నిజాలను దాచిపెట్టి ఉంచినంత మాత్రాన అంతా బాగున్నట్లేమీ అవదు. అందులోనూ నేటి ఇంటర్నెట్ యుగంలో సమాచారాన్ని దాచాలంటే జరిగే పని కాదు.సోషల్ నెట్ వర్క్ ద్వారా ఒక్క క్షణంలో సమాచారం భూగోళం ఆ చివరకు పాకిపోతున్న రోజులివి.ఇప్పుడు కూడా సమాచార ప్రసారం కాకుండా బ్యాన్ చెయ్యాలని ప్రభుత్వాలు ప్రయత్నించడం పెద్ద పిచ్చిపనుల్లో మొదటి పని.
ఈ చర్య వల్ల ఏం జరిగింది? మన దేశంలో అది ప్రసారం కాలేదు.కానీ మిగతా అన్ని దేశాలూ చూడనే చూశాయి.అందులో ముఖేష్ సింగ్ ఏం వాగాడో నవ్వుకుంటూ చూశాయి.ఘనత వహించిన భారతదేశంలో ఆడదాని పరిస్థితి ఇది,సగటు భారతీయ మొగాడి మెంటాలిటీ ఇది-- అని హేళనగా నవ్వాయి.
ముకేష్ మాట్లాడిన మాటలకీ,తాలిబాన్ తీవ్రవాదుల మాటలకీ తేడా ఏముంది?
"ఆడదంటే ఒక ఆటవస్తువు.మగాడి సుఖానికి పనికొచ్చే ఒక కీలుబొమ్మ.అది ఎప్పుడూ ఇంట్లోనే పడుండాలి.బయటకు రాకూడదు.ఏ డ్రస్సు పడితే ఆ డ్రస్సు వేసుకోకూడదు.ఒళ్ళు కనిపించకుండా బురఖా ధరించాలి.రోడ్లమీద తిరగకూడదు.హోటళ్లకు క్లబ్బులకు పోకూడదు.పోతే మేం ఊరుకోం.మా ఇష్టం వచ్చింది చేస్తాం.వీలైతే చంపేస్తాం.ఆ అధికారం మాకుంది"--ఇదీ వీరి భావజాలం.
ఎవడిచ్చాడు వీరికీ అధికారం? ఒకవేళ ఆ దేవుడే ఈ అధికారాన్ని కొందరు మగాళ్ళకు కట్టబెడితే, ముందుగా అలాంటి దేవుడినే ఆలస్యం చెయ్యకుండా ఉరి తీయాలని నేనంటాను.
ఎవడిచ్చాడు వీరికీ అధికారం? ఒకవేళ ఆ దేవుడే ఈ అధికారాన్ని కొందరు మగాళ్ళకు కట్టబెడితే, ముందుగా అలాంటి దేవుడినే ఆలస్యం చెయ్యకుండా ఉరి తీయాలని నేనంటాను.
ఒక స్త్రీ రాత్రి తొమ్మిదిగంటల సమయంలో పబ్బుకు వెళితే తప్పేమిటి?తనకిష్టమైన డ్రస్సు తను వేసుకుంటే తప్పేమిటి?ఆమె అలా వెళ్ళినంత మాత్రాన,సమాజంలోని అందరు మొగాళ్ళకూ ఆమెమీద అన్ని హక్కులూ ఒచ్చేస్తాయా?సరదాగా ఒక సినిమాకు వెళ్ళినంత మాత్రాన అందరితోనూ పడుకోడానికి ఆమె రెడీ అయిపోయిందని భావించాలా? ఆమెను ఎవరు బడితే వారు రేప్ చెయ్యడానికి అదొక లైసెన్స్ అవుతుందా? ఇదెక్కడి ఆటవిక తర్కం? అసలిదొక లాజిక్కా?
మనదొక పవిత్రదేశం అని మనం డబ్బా వాయించుకుంటే సరిపోదు.అది ఒకప్పటి మాట.కొన్నివేల ఏళ్ళ క్రిందటిమాట.ఇప్పటిమాట కాదు.ఇప్పుడు మాత్రం మన దేశం ఒక sexually perverted country అనేది పచ్చినిజం.
ఈ పరిస్థితిని మార్చే దిశగా ప్రయత్నాలు త్వరగా జరగాలి.అంతేగాని,సమాజం మీద ఒక కంబళిని కప్పేసి-"మాదేశంలో అంతా సత్యహరిశ్చంద్రులూ, శ్రీరామచంద్రులూ ఉన్నారు.ఎక్కడా ఏమీ జరగడం లేదు.అంతా బానే ఉంది." అని డబ్బా కొట్టుకున్నంత మాత్రాన నమ్మడానికి ప్రపంచం తెలివిలేని పిచ్చిది కాదన్న సంగతి మన ప్రభుత్వం గ్రహించాలి.
తప్పును ఒప్పుకోవడమూ,దానిని బహిరంగంగా చర్చించడమూ,దానిని పరిష్కరించడానికి వెనువంటనే చర్యలు తీసుకోవడమూ,పరిణతి చెందిన సమాజపు లక్షణాలు.సంస్కారవంతులైన ప్రజలున్న సమాజంలో మాత్రమే దీనిని మనం ఆశించగలం.
చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నాలు చెయ్యడం,నిందితులను కాపాడటం,వాళ్ళను ఏళ్ళకేళ్ళు ఫైవ్ స్టార్ జైళ్లలో ఉంచి ప్రజాధనంతో పోషించడం,చివరకు వాళ్లకు క్షమాభిక్ష పెట్టి మరిన్ని నేరాలు హాయిగా చేసుకోండని దేశంమీద వదిలెయ్యడం--ఇవన్నీ మన దేశంలో పల్లెటూళ్ళ పంచాయితీల నుంచీ, సుప్రీం కోర్టు దాకా జరిగే తంతులే.
ప్రతిరోజూ రేపులు జరిగే దేశంలో,ఎవరో పరాయిదేశపు స్త్రీ వచ్చి డాక్యుమెంటరీ తీస్తే మన సిగ్గు పోతుందట.
ఎందుకూ సిగ్గు పోయేది?
రేపులు ఆపలేని మన చేతగానితనానికా? లేక నలుగురికీ తెల్సిపోయిందన్న నామోషీతోనా?
జరిగితే లేని బాధ తెలిస్తే ఎందుకు?
జరిగితే లేని బాధ తెలిస్తే ఎందుకు?
చివరకి నిర్భయ తండ్రికూడా ఇదే అన్నాడు.'ఆ డాక్యుమెంటరీని అందరూ చూస్తే తప్పేముంది? చూడనివ్వండి.మన మగాళ్ళ మనస్తత్వాలు ఎంత చండాలంగా ఉన్నాయో ప్రపంచానికి తెలుస్తుంది.తెలియాలి కూడా.కనీసం అప్పుడైనా మనకు బుద్దొస్తుంది"అన్నాడు.
కన్నతండ్రికే లేని బాధ,మన ప్రభుత్వానికెందుకో?
జరిగిన విషయం నలుగురికీ తెలియడమే తప్పైతే,సీతను రావణుడు కిడ్నాప్ చెయ్యడం కూడా ఎవ్వరికీ తెలియకూడదు కదా.అలా తెలిస్తే మన పరువు పోతుంది కదా.
రామాయణాన్ని కూడా ఎవ్వరూ చదవకుండా నిషేధించండి మరి.
త్వరలో అది కూడా చూస్తామేమో?
ఈ దేశాన్ని దేవుడే రక్షించుగాక !!!