Pages - Menu

Pages

22, ఏప్రిల్ 2015, బుధవారం

మత్తెక్కిన నా హృదయం...


మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..
మఱుగుపడిన ఒక లోకపు
అవధులనే తాకుతోంది...

ఈ ఆనందానికి
ఏ హేతువూ అవసరం లేదు
ఈ ఆనందాన్ని
ఏ తీతువూ అపహరించలేదు
దీనికొకరి తోడూ అవసరం లేదు
ఒకరి నీడా అక్కర్లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

ఈ ఆనందం
ఈలోకానిది కాదు
ఈ లోకపు వస్తువులపై 
ఆధారపడి లేదు
దానికి ఒక కారణం లేదు
దానికి మరణమూ లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనున్నాను 
నా చుట్టూ ప్రకృతి..
ఇంకేం కావాలి?
ఓహ్..
ఏమిటీ నిష్కారణానందం..?

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనొక మధుపాయినని
చూచేవారనుకున్నారు
అనుకోనీ..
ఈ ఆనందం వారికర్ధం కాదు
నా మధువు రుచి వారికి తెలియదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

మత్తెక్కిన నా హృదయం...