Rudraksha Mutt-Another view
శ్రీశైలంలో మొన్న మూడురోజుల పాటు నేను బస చేసిన గెస్ట్ హౌస్ పక్కనే రుద్రాక్షమఠం ఉన్నది.శ్రీశైలంలో ఘంటామఠం,రుద్రాక్షమఠం మొదలైన పంచమఠాలు ఉన్నాయి.ఇవి ఎప్పటివో చాలా ప్రాచీనకాలం నాటివి. పూర్వ కాలంలో ఇక్కడ సాధకులు ఉండి వారి వారి సాంప్రదాయపు సాధనలు చేసుకుంటూ ఉండేవారు.
ఆదివారం ఉదయం రెండవ దీక్ష అయిపోగానే, గెస్ట్ హౌస్ కేర్ టేకర్ మల్లన్న భార్య--' ఈ ప్రక్కనే ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉన్నది.దర్శనం చేసుకొమ్మని'- చెప్పినది.
అందరం అక్కడకు వెళ్లి అమ్మవారిని పూజించి తిరిగి వచ్చాము. అక్కడ ఏ కాలం నాటిదో ఒక ఛిన్నమస్తాదేవి విగ్రహం ఉన్నది.కానీ ఆ విగ్రహం చెక్కడంలో నైపుణ్యం లేదు.ఏదో పల్లెటూరి శిల్పులు చెక్కినట్లు మోటుగా ఉన్నది.సాధారణంగా ఛిన్నమస్తాదేవి పాదాలదగ్గర రతిక్రీడలో ఉన్న రతీ మన్మధుల మూర్తులు ఉండాలి.కానీ ఇక్కడ అవి లేవు.
ఛిన్నమస్తాదేవికి మరో పేరు ప్రచండచండిక.అంటే కాళికాదేవి యొక్క అతి భయంకర రూపం అన్నమాట.కామశక్తిని ఓజస్సుగా రూపాంతరం చెందించి కుండలినీ జాగరణ గావించే సాధనలు ఈ మహావిద్యలో అంతర్భాగములు. ఇదొక అతి రహస్య తంత్రవిద్య.
వాసిష్ఠ గణపతిముని తన 'ప్రచండచండికా త్రిశతీస్తోత్రం'లో ఈ దేవిని పరశురామ జననియైన రేణుకాదేవిగా కీర్తిస్తూ--
'అమితవిక్రమే జయజయాంబికే పరశుధారిణీ జనని రేణుకే
వినతపాలికే ధరణికాళికే జనపతి ద్విషో జనని పాహిమాం'
అని ప్రార్ధిస్తారు.
'చండచండి తవపాణి పంకజే యన్నిజం లసతి కృతమస్తకమ్
దేవి సూచయతి చిత్తనాశనం తత్తవేంద్ర హృదయాధినాయకే'
అనే మంత్రంలో- 'తనచే ఖండింపబడిన తన శిరస్సు' అనే సూచనతో తాంత్రిక మహాసమాధిలో జరిగే చిత్తనాశనాన్ని ఈ మూర్తి నిర్దేశిస్తున్నట్లు తెలుస్తున్నది.
'దీప్తి విగ్రహలతాం మహాబలాం వహ్నికీల నిభరక్తకున్తలామ్
సంస్మరామి రతి మన్మధాసనాం దేవతాం తరుణభాస్కరాననామ్'
అనే మంత్రంలో 'రతీమన్మధపీఠమనే కామశక్తి' మీద మాత నిలిచి ఉన్నట్లు తెలుస్తున్నది.
'పిండే కుండలినీ శక్తి: సైవ బ్రహ్మాండచాలికా
నిద్రాతి జడదేహేషు యోగిదేహేషు ఖేలతి'
అనే మంత్రంలో--'మానవదేహంలో కుండలినీ శక్తిగానూ,సమస్త బ్రహ్మాండములను నడుపుతున్న శక్తిగా బాహ్యముగానూ ఉన్నది నీవే. పశుప్రాయుల నిద్రలో ఉన్న తమోగుణశక్తివి నీవే. అటులనే, శుద్ధసత్త్వ ప్రాణులైన యోగుల దేహాలలో నర్తించే కుండలినీ మహాశక్తివీ నీవే' అంటారు గణపతిముని.
'యా శ్రీ: స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీం పాపాత్మనాం' అన్న సప్తశతీ మంత్రభావం ఇక్కడ ద్యోతకమౌతున్నది.
'ఏషా వైరోచనీదుర్గా జ్వలన్తీ తపసా పరా' అనే మంత్రంలో -- 'తపస్వుల దేహాలలో ప్రజ్వరిల్లే వైరోచనీదుర్గా స్వరూపానివి నీవే'- అంటారు గణపతి ముని.
ఆ ఆలయానికి వెళ్ళే దారిలోనే చెట్టుక్రింద కాళికామాత విగ్రహం ఒకటి ఉన్నది.మొన్నమొన్నటి వరకూ అది వధ్యస్థలి అనీ అక్కడ బలులు ఇచ్చేవారనీ తెలిసింది.ఇప్పటికీ ఏడాదికి ఒకసారి అక్కడ బలి ఇస్తారట.
అదేరోజున ఛిన్నమస్తా అమ్మవారి జయంతి(వైశాఖ శుక్ల చతుర్దశి)కావడం, అనుకోకుండా మేమందరం అదే రోజున అక్కడకు చేరడం, మా గెస్ట్ హౌస్ పక్కనే ఆ అమ్మవారి ఆలయం ఉండటం,ఆ విషయం మాకు తెలియడం,అదేరోజున అమ్మవారిని దర్శించడం,ఇవన్నీ కాకతాళీయములు కానేకావు.
నేను చేసే తంత్రసాధనకూ ఛిన్నమస్తా అమ్మవారికీ సూటి సంబంధం ఉన్నది.అదే విషయాన్ని నాతో ఉన్న సభ్యులకు వివరించి,ఛిన్నమస్తాదేవి ఆకారానికీ అంతరిక తంత్రసాధనకూ ఉన్న సూక్ష్మ సంబంధాన్ని వారికి వివరించాను.
ఈలోకంలో కాకతాళీయం అనేది లేనేలేదని నేనెప్పుడూ చెప్పే విషయం అనుకోకుండా మళ్ళీ ఇలా రుజువైంది.
|