Pages - Menu

Pages

27, మే 2015, బుధవారం

'తారా స్తోత్రమ్' పుస్తకావిష్కరణ


'పంచవటి ప్రచురణ'ల నుంచి వెలువడుతున్న రెండవపుస్తకం 'తారా స్తోత్రమ్' .ఈ పుస్తకావిష్కరణ జూన్ మొదటి వారంలో ఆన్ లైన్లో జరుగుతుంది.ఆ తర్వాత 'pustakam.org' లో ఆన్ లైన్లో లభ్యమౌతుంది.

దశమహావిద్యలలో ఒక దేవత ఐన తారాదేవిని ప్రార్ధిస్తూ ఆశువుగా చెప్పబడిన 108 పాదములతో కూడిన 27 సంస్కృత శ్లోకములూ,వాటి అర్ధమును వివరిస్తూ వచ్చిన 260 తెలుగు ఆశుపద్యములూ,వాటి వచన తాత్పర్యమూ ఈ పుస్తకంలో ఉన్నాయి.

నిగూఢములైన తంత్ర సాధనా రహస్యములను తనలో పొందుపరచుకున్న ఈ పుస్తకం కూడా 'శ్రీవిద్యా రహస్యం' వలెనే సాధకలోకాన్ని రంజింపజేస్తుందని, అంతరిక పధగాములైన సాధకులకు చక్కని మార్గదర్శనం గావిస్తుందని ఆశిస్తున్నాను.

21, మే 2015, గురువారం

విషయ సేకరణ-విష నిర్మూలన

ఆధ్యాత్మికత అంటే వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవడం,విషయాలు తెలుసుకోవడం అని చాలామంది అనుకుంటారు.కానీ అసలు విషయం అది కాదు.వేల పుస్తకాలు చదివిన తర్వాత (వాటిని నిజాయితీగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తే) ఒక విషయం స్పష్టంగా అర్ధమౌతుంది.

పుస్తకాలు దారిని మాత్రమే చూపగలవు.నడక మాత్రం మనమే నడవాలి. మనల్ని మనం మార్చుకోవడమే ఆ నడక.దానినే సాధన అంటాము.

చాలా పుస్తకాలు దారిని కూడా చూపలేవు.ఏదో చెదురుమదురుగా దారిని సూచించగలవు గాని నిర్దుష్టంగా 'ఇది చెయ్యి' అని అవికూడా చెప్పవు.నిజం చెప్పాలంటే 'ఏం చెయ్యాలనే విషయాన్ని' అంత ఖచ్చితంగా చెప్పే గ్రంధాలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు.

చాలామంది ఇంకొక్క పనిని కూడా చేస్తారు.చదివిన వాటిని కంఠస్థం చేసి ఇతరులకు ఒప్పజెబుతారు.అదే ఒక పెద్ద ఘనకార్యం అని వారనుకుంటారు. లోకంలోని పండితులందరూ ఇలాంటివారే.కాకపోతే జనరంజకంగా వారు ఆ పనిని చెయ్యగలరు.

ఈ క్రమంలో, చెప్పేవారికీ 'మనకింత తెలుసు' అన్న భ్రమ ఏర్పడుతుంది. వినేవారికీ, 'మనకేదో తెలిసింది' అనే భ్రమ ఏర్పడుతుంది.కానీ ఈ ఇద్దరికీ సత్యమైన అనుభవజ్ఞానం మాత్రం ఉండదు.

వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ ఉన్న విషయాలను చదివి అర్ధం చేసుకున్నంత మాత్రాన అవి మన సొంత అనుభవాలు ఎన్నటికీ కాబోవు. ఇతరులకు వినసొంపుగా వాటిని వివరించి చెప్పినంత మాత్రాన కూడా అవి మన సొంత అనుభవాలుగా ఎన్నటికీ అందవు.కానీ ఈ సున్నితమైన పాయింట్ లోకులకు ఎన్నటికీ అర్ధం కాదు.అదే అసలైన మాయ.శాస్త్రాలు దీనినే 'అజ్ఞానం' అన్న పేరుతో పిలిచాయి.

వేదాలూ ఉపనిషత్తులే కాదు,అది భగవద్గీత అయినా,యోగవాశిష్టం అయినా, ఇంకేదైనా కూడా - వాటిలో ఉన్న సాధనా మార్గాలను మనం ఆచరించి,మన జీవితంలో వాటిని అనువదించుకోగలిగినప్పుడే ఆ అనుభవాలను మన అనుభవం ద్వారా అందుకోగలుగుతాం.అంతేగాని వాటిని చదివి ఊరకే మనస్సుతో అర్ధం చేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు.

అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అనేవారు.

'పుస్తకంలోంచి అనుభవం రాదు నాన్నా. అనుభవంలో నుంచి పుస్తకం వస్తుంది.'

ఆధ్యాత్మికత అంటే విషయ సేకరణ కాదు--విషనిర్మూలన.

మన లోపల ఇప్పటికే ఎంతో విషం ఉన్నది.అది ఇంద్రియ వ్యామోహపరంగా ఉండవచ్చు.పూర్వజన్మల నుంచి వచ్చిన సంస్కారముల పరంగా ఉండవచ్చు.మానసిక ప్రాణిక స్థాయిలలో పెనవేసుకుని ఉన్న అనేక చిక్కుముడుల రూపంలో ఉండవచ్చు.ఈ విషం ప్రతి మనిషిలోనూ రకరకాల స్థాయులలో పేరుకునిపోయి ఉన్నది.లోపలున్న ఆ విషాన్ని ప్రక్షాళన చేసుకోవాలి.అదే మానవుడు ఈ భూమ్మీద చెయ్యవలసిన అసలైన పని.

ఈ పనికీ పుస్తకపఠనానికీ ఏమీ సంబంధం లేదు.ఒక్క ఆధ్యాత్మిక గ్రంధాన్ని కూడా చదవకుండా ఈ పనిని చెయ్యవచ్చు.లోకంలోని పుస్తకాలన్నీ చదివినా కూడా ఈ పనిని చెయ్యలేకపోవచ్చు.లేదా అసలు మొదలు కూడా పెట్టకపోవచ్చు.

ఒక ఉపన్యాసంలో వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'మనం ఇప్పటికే హిప్నటైజ్ చెయ్యబడి ఉన్నాం.దీనినే మన శాస్త్రాలు 'మాయ' అని పిలిచాయి.ఇందులోనుంచి బయటపడాలంటే మనం 'డీ-హిప్నటైజ్' కావాలి.అలా డీ- హిప్నటైజ్ కావడాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు.'

తన లోలోపలకు వెళ్ళే దారిని అసలైన పుస్తకాలు  మనిషికి చూపించాలి. చూపిస్తాయి కూడా.ప్రపంచంలోని ఆధ్యాత్మిక గ్రంధాలన్నిటి ఉపయోగం అదే. కానీ మానవులు వాటిని ఆచరించరు.ఊరకే చదివి ఆనందిస్తారు.లేదా పుక్కిట బట్టి ఇతరులకు బోధిస్తారు.ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం.

విషయసేకరణ అనేది ఉత్త కుతూహలం మాత్రమే.దానివల్ల పాండిత్యం వస్తుంది.కానీ అనుభవం రాదు.

విష నిర్మూలన అనేది సాధన.దానివల్ల అనుభవం అందుతుంది.

కుతూహల పరులూ,పండితులూ ఎంతో మంది ఉంటారు.కానీ సాధకులు అతి కొద్దిమందే ఉంటారు.ఎందుకంటే,పాండిత్యం సులభం.సాధన కష్టం.

మన కుతూహలాన్ని చల్లార్చుకోడానికీ,పుస్తకాలు చదివి పాండిత్యం సంపాదించడానికీ పెద్ద కష్టం అక్కర్లేదు.కానీ విషనిర్మూలనకు మాత్రం చాలా కష్టపడాలి.

ముందుగా తనలో ఆ విషం ఎక్కడెక్కడ ఉందో తెలియాలి.ఆ తరవాత దానిని మార్చుకునే మార్గం తెలియాలి.ఆ మార్గాన్ని చూపించి దానిలో నడిపించే గురువు తారసపడాలి.ఆ గురువు చెప్పిన మార్గంలో త్రికరణశుద్ధిగా నడచే బుద్ధి మనకు కలగాలి.ఆ తర్వాత అందులోని కష్టాలను భరిస్తూ నడక సాగించాలి.ఎంతో అంతరిక సంఘర్షణను భరించాలి.అప్పుడే ఆ విషం పోతుంది.విషయం అనుభవం లోకి వస్తుంది.

ఇంతకష్టం మనకెందుకులే? అనుకుంటే పుస్తక పరిజ్ఞానం మాత్రమే మనకు మిగులుతుంది.అప్పుడు పుస్తకాలను మోస్తున్న గాడిదకూ మనకూ ఏమీ తేడా ఉండదు.

విషయపరిజ్ఞానం మాత్రమే నాకు చాలు అనుకున్నప్పుడు లోపల విషం అలాగే ఉంటుంది.అది లోపలున్నంత వరకూ పుస్తకాల ద్వారా సంపాదించిన విషయ పరిజ్ఞానం మోతబరువుగా తప్ప ఇంకెందుకూ ఉపయోగపడదు.

విషయం మీద మన దృష్టి ఉన్నంతవరకూ విషం పోదు.విషం పోయినప్పుడే అసలైన విషయం దక్కుతుంది.లోకులు విషయాన్ని ఆశిస్తారు,కాని విషాన్ని లోలోపల మొయ్యడానికే ఇష్టపడతారు.అందుకే వారు ఎన్ని జన్మలెత్తినా ఆధ్యాత్మికంగా ఎదగలేరు.

15, మే 2015, శుక్రవారం

Hindi Melodies-Jagjit Singh-Hosh Walon Ko...




హోష్ వాలోం కో ఖబర్ క్యా బేఖుదీ క్యా చీజ్ హై...

సినిమాలలో జగ్జీత్ సింగ్ పాడిన మధురములైన ఘజల్స్ లో ఇదీ ఒకటి.

Movie:--Sarfarosh(1999)
Lyrics:--Nida Fazli
Music:--Jatin -Lalith
Singer:--Jagjit Singh
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------
Mmm Mm Mm
laa la laa laa la laa

[Hoshwalon Ko Khabar Kya
Bekhudi Kya Cheez Hai]-2
Ishq Ki Jaye Phir Samajhiye-2
Zindagi Kya Cheez Hai
Hoshwalon Ko Khabar Kya
Bekhudi Kya Cheez Hai…

Unse Nazar Kya Milin Roshan Fizaein Ho Gayee
Hmm Hmm Hmm Hmm
Aah Haa Aah Haa Haa Haa
La La La La La La
Unse Nazar Kya Milin Roshan Fizaein Ho Gayee
Aaj Jana Pyaar Ki Jaadugari Kya Cheez Hai-2

Ishq Ki Jaye Phir Samajhiye-2
Zindagi Kya Cheez Hai…

Khulti Zulfon Ne Sikhayee Mausamon Ko Shayaree
Umm Hmm Hmm Hmm
Aah Haa Aah Haa Haa Haa
La La La La La La
Khulti Zulfon Ne Sikhayee Mausamon Ko Shayaree
Jhukti Aankhon Ne Bataya Maikashi Kya Cheez Hai-2

Ishq Ki Jaye Phir Samajhiye-2
Zindagi Kya Cheez Hai…

Hum Labon Se Keh Na Paaye, Unse Haal-E-Dil Kabhi
Umm Hmm Hmm Hmm

Aah Haa Aah Haa Haa Haa
La La La La La La
Hum Labon Se Keh Na Paaye,

Unse Haal-E-Dil Kabhi
Aur Woh Samjhe Nahin Ye Khamoshi Kya Cheez Hai-2

Ishq Ki Jaye Phir Samajhiye-2
Zindagi Kya Cheez Hai…

Meaning:--

What do sober people know
What (a thing) being enraptured is like,
Fall in love, and then (you'll) understand
What (a thing) life is!

No sooner did my eyes meet hers,
than the environment brightened,
Today I realized
What love's magic really is!

(Her) opening wisps of hair
taught poetry to seasons
(Her) lowering of eyes taught me
What being intoxicated feels like!

I could never tell her from my own lips
The condition of my heart
And she never understood
What my silence was trying to convey

What do sober people know
What (a thing) being enraptured is like!!

13, మే 2015, బుధవారం

హోమియో అద్భుతాలు-ప్రేతాత్మ పిలుస్తోంది

హోమియోవైద్య విధానం గురించి ఇంకా ప్రజల్లో అపోహలు ఉండటం కూడా సామూహిక కర్మప్రభావమే.ఎవరికైతే రోగాలు తగ్గే కర్మ లేదో వారు హోమియో వైద్యవిధానం వైపు తొంగి కూడా చూడరు.చూడలేరు.ఈ విషయాన్ని చెప్పినా వారు ఒప్పుకోలేరు.

ఎవరికైతే రోగం తగ్గే మంచికర్మ కొద్దో గోప్పో వారి జీవితంలో ఉన్నదో వారుమాత్రమే ఒక మంచి హోమియోవైద్యుని సంప్రదించగలుగుతారు. చెప్పినట్లు మందు వాడగలుగుతారు.రోగాన్ని తగ్గించుకోగలుగుతారు.

డా||హన్నేమాన్ కాలంలో హోమియోలో దాదాపు 300 మందులు ఉండేవి. ఇప్పుడో ఆ సంఖ్య 3000 దాటింది.నేడు కొత్తగా ప్రూవ్ అయిన మందులతో హోమియో వైద్యవిధానం ఒక పరిపూర్ణమైన వైద్యవిధానంగా రూపు దిద్దుకుంటున్నది.దీనిలో నయంకాని రోగం లేదంటే ప్రస్తుతం అతిశయోక్తి కాబోదు.అయితే రోగి వయసూ,అతని ప్రాణశక్తి పరిస్థితీ,రోగం ముదిరిన తీరూ మొదలైన విషయాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

ఈ మధ్యనే మేము డీల్ చేసిన ఒక కేస్ గురించి వింటే,మానసిక రోగాలంటూ సైకియాట్రీ ట్రీట్మెంట్ అంటూ,భూతవైద్యాలంటూ హింసకు గురయ్యే కేసులు కూడా సరియైన హోమియోపతి ట్రీట్మెంట్ తో ఎంత సులువుగా,నొప్పి లేకుండా,సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హాయిగా, వెంటనే తగ్గుతాయో అర్ధమౌతుంది.

పేషంట్ ఒక అమ్మాయి.ఆమె వయసు 23 సం||సామాన్యమైన ఎత్తులో బలంగా కొంచం బొద్దుగా ఉంటుంది.బీ టెక్ పాసయింది.ఉండటం పెద్ద సిటీలోనే ఉంటుంది.కానీ ఉద్యోగం చెయ్యడం లేదు.

వీళ్ళ నాన్న బిజినెస్ మాన్ కావడంతో,బ్రతికున్న రోజులలో రాత్రి 2 దాటాక మాత్రమే ఇంటికొచ్చి బెల్ కొట్టేవాడు.వాళ్ళమ్మను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని ఈ అమ్మాయే వెళ్లి తలుపు తీసేది.ఇలా కొన్నేళ్ళు జరిగింది. ఇంతలో రెండేళ్ళక్రితం ఒకరోజున హార్ట్ ఎటాక్ తో ఆయన హటాత్తుగా చనిపోయాడు.

అప్పటినుంచీ ఈ అమ్మాయి తీవ్రమైన డిప్రెషన్కి గురయింది. క్రమంగా నిద్రపట్టని ఒక విచిత్రపరిస్థితి మొదలైంది.ఎప్పుడో అర్ధరాత్రికి నిద్రపడుతుంది.కానీ రెండున్నరకు హటాత్తుగా మెలకువ వస్తుంది.కాలింగ్ బెల్ మోగుతూ ఈ అమ్మాయికి వినిపిస్తుంది.పక్కనున్న వారికి వినిపించదు.

'నాన్నొచ్చాడు'- అని ఉలిక్కిపడి లేచి నిద్రలో నడుస్తున్నట్లుగా ఈ అమ్మాయి వెళ్లి తలుపు తీస్తుంది.అక్కడే శూన్యంలోకి చూస్తూ,ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా తనలో తాను గొణుక్కుంటూ కొంచంసేపు నిలబడుతుంది.ఆ తర్వాత అక్కడే కుప్పకూలిపోతుంది.తెచ్చి బెడ్ పైన పడుకోబెడతారు.ప్రతిరాత్రీ ఇలా జరగడం మొదలై నేటికి రెండేళ్ళు దాటింది. పగటిపూట కూడా వాళ్ళ నాన్న తనకు కనిపిస్తున్నాడంటూ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది.

దీనితోడు విపరీతమైన తలనొప్పి మొదలైంది.ఆ నొప్పి షూటింగ్ పెయిన్ లా ఉంటుంది.మాడులోనూ నుదురులోనూ వస్తుంది.పెయిన్ కిల్లర్స్ వాడితే కాసేపు ఉపశమిస్తుంది.మళ్ళీ వస్తుంది.

ఇదిలా ఉండగా, నాన్నగారు పోయిన కొత్తలో ఒకబ్బాయితో ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఏవో సిల్లీ రీజన్స్ తో ఆ ప్రేమ చట్టుబండలైంది. కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయే మళ్ళీ వచ్చి ప్రాధేయపడి మాట్లాడబోతే తను విసుక్కుని అతన్ని దూరం పెట్టింది.

ఎప్పుడూ ఒక రూంలో కూచుని తనలో తను గొణుక్కోవడమో,లేక శూన్యంలోకి చూస్తూ కూచోడమో చేస్తుంది.ఆకలి మందగించింది.నిద్రపట్టని ఇన్ సోమ్నియా రోగం పట్టుకుంది.విసుగు చిరాకు ఎక్కువయ్యాయి.డిప్రెషన్ బాధిస్తున్నది.దీనికి తోడుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బాధపెడుతున్నాయి.ఏదో అంతుబట్టని రోగంతో బాధపడుతున్నట్లుగా పరిస్థితి తయారైంది.

మామూలుగా అయితే,ఆ అమ్మాయిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళేవారు.అక్కడ అడుగు పెట్టాక ఏయే ట్రీట్మెంట్లు జరుగుతాయో మనకు తెలుసుకదా.ముందుగా మత్తుమందు (tranquilizers) లిస్తారు.ఆ దెబ్బతో పేషంటు మత్తుగా పడి ఉంటుంది.కానీ రోగం తగ్గదు.ఆ తర్వాత నరాల మీద పనిచేసే మరికొన్ని మందులిస్తారు.ఉన్నరోగం తగ్గకపోగా పేషంటు నీరసపడి నిజంగా పిచ్చిదై పోతుంది.ఆ తర్వాత కరెంట్ షాకులు ఇవ్వడం మొదలు పెడతారు.సంకెళ్ళతో కట్టెయ్యడం మొదలుపెడతారు.ఒక రూంలో బంధిస్తారు.

చివరకు మా వల్లకాదని,ఈ మందులు జీవితాంతం  వాడమని చెప్పి చేతులెత్తేస్తారు.అవి వాడుతూ ఉంటె సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువై ఇతర అవయవాలు దెబ్బతినడం మొదలౌతుంది.చివరకు ఒక బంగారుజీవితం అర్ధాంతరంగా విషాదాంతంగా ముగుస్తుంది.ఈ లోపల కొన్ని లక్షలు ఆవిరై పోయేవి.పోనీ డబ్బు పోయినా పరవాలేదు.రోగం మాత్రం తగ్గకపోగా ఇంకా ఇంకా ముదిరేది.

మూఢనమ్మకాలను నమ్మే ఇంకోరకం మనుషులైతే, ఏ భూతమాంత్రికుని దగ్గరకో తనను తీసుకెళతారు.ఇక అక్కడ జరిగే హింస నేను వర్ణించలేను.ఆ క్రమంలో ఆ అమ్మాయికూడా తనకు ఏదో దయ్యం పట్టిందని నమ్మే స్థితిలోకి నెట్టబడి చివరకు తానే ఒక పిశాచంలా మారిపోతుంది.

ఈ అమ్మాయి అదృష్టం బాగుండి, తన బంధువుల అబ్బాయి మా అమ్మాయికి సీనియర్ క్లాస్ మేట్ అయ్యాడు.ఈ కేస్ వివరాలు చెప్పి,కొంచం తనను ట్రీట్ చెయ్యమని అడిగాడు.ఎక్యూటైనా,క్రానిక్ అయినా కేసులను చక్కగా డీల్ చేస్తుందని మా అమ్మాయికి వాళ్ళ కాలేజీలో మంచి పేరుంది.కేస్ తీసుకోనా?ట్రీట్మెంట్ లో సాయం చేస్తావా?అని తను నన్నడిగింది. సామాన్యంగా నేను ఫోన్లో ట్రీట్మెంట్ ఇవ్వను.పాపం ఆడపిల్ల కదా అని జాలేసి సరే కేస్ తీసుకొమ్మని చెప్పాను.

పేరెంటల్ హిస్టరీ, పేషంట్ హిస్టరీ,మానసిక శారీరక లక్షణాలన్నీ సేకరించి, వాటిని మూడు గంటలపాటు బేరీజు వేసి,ఆ అమ్మాయి తత్త్వమేమిటో గ్రహించి,తులనాత్మకంగా ఒకే ఒక్క హోమియో ఔషధాన్ని ఎంపిక చేసి రెండురోజుల వ్యవధిలో మూడే మూడు డోసులు ఇవ్వడం జరిగింది.

మొదటిసారిగా మందు వేసుకున్న రోజున రాత్రి పదిగంటలకు పడుకున్న ఆ అమ్మాయి మర్నాడు ఉదయం వరకూ నిద్రనుండి లేవలేదు.కాలింగ్ బెల్ వినిపించలేదు.రెండవరోజు కూడా మందు రిపీట్ చెయ్యమని చెప్పాము.ఆ రోజూ నిద్ర బాగా పట్టింది. కాలింగ్ బెల్ వినపడలేదు.వాళ్ళ నాన్నగారి ఆత్మ రాలేదు.ఇక మందు ఆపెయ్యమని సూచించాము.

ఇది జరిగి ఇప్పటికి రెండువారాలు అవుతున్నది.అప్పటినుంచీ ఈరోజువరకూ తనకు నిద్ర బాగా పడుతున్నది.రాత్రిళ్ళు రెండున్నరకు ఉలిక్కిపడి లేవడం లేదు.వాళ్ళ నాన్నగారి ఆత్మకూడా రావడం లేదు.ఈ అమ్మాయికి ఆకలి మామూలుగా వేస్తున్నది.తలనొప్పి మాత్రం ఒక 5% ఇంకా ఉన్నది.కానీ పెద్దగా బాధించడం లేదు.ఇతర రోగలక్షణాలన్నీ మంత్రం వేసినట్లు పూర్తిగా తగ్గిపోయాయి.

వాళ్ళ ఇంటిలో వారు,ఈ కేస్ రిఫర్ చేసిన అబ్బాయీ,అందరూ, హోమియోపతి చేసిన ఈ అద్భుతానికి మాటా పలుకూ లేకుండా అయిపోయారు.ఈ ట్రీట్మెంట్ కు అయిన ఖర్చు Rs 100/- మాత్రమే.మేమేం ఫీజు తీసుకోలేదు.మందులు మాత్రం కొనుక్కుని వేసుకోమని చెప్పాము. అంతే.

ఇంతా చేస్తే మేమా అమ్మాయిని చూడనే లేదు.ఫోన్లో వివరాలు తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.తనిప్పుడు హాయిగా ఉంది.ఒకే ఒక్క సింగిల్ డోస్ ఇంత అద్భుతాన్ని చేసింది.

కేస్ సరిగ్గా తీసుకుని,లక్షణాలన్నీ క్రోడీకరించి,తత్త్వపరంగా సెలెక్ట్ చెయ్యబడిన హోమియో ఔషధం ఎంత అమోఘంగా పని చేస్తుందో--అది కూడా సింగిల్ మినిమం డోస్ తోనే ఎంత అద్భుతం జరుగుతుందో--చెప్పినా ఎవరూ నమ్మరు.కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన మాకు తెలుసు.తీసుకున్న ఆ అమ్మాయికి తెలుసు,చూచిన ఆమె బంధువులకు తెలుసు--ఇదంతా నమ్మలేని నిజమని.

మా ఇంటిపక్కనే ఉన్నవారైనా సరే, వివరించి చెప్పినా కూడా దీనిని చస్తే నమ్మరు.వాళ్ళ ఖర్మ అలా నమ్మనివ్వదు.కానీ ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న ఆ అమ్మాయికి రోగం తగ్గే యోగం ఉంది.కనుక మాద్వారా ఇది జరిగింది-అదికూడా మమ్మల్ని తను చూడకుండా - తనను మేము చూడకుండా.అదీ వింత.

హోమియో అద్భుతాలు ఇలా ఉంటాయి.

9, మే 2015, శనివారం

శ్రీశైలం సాధనా సమ్మేళనం-ఆంధ్రా తెలంగాణా గొడవలు-పరాకాష్టకు చేరుతున్న పిచ్చి





అక్కమహాదేవి గుహలు,కదళీవనం అనేవి శ్రీశైలంలో కొన్నికోట్ల ఏళ్ళ నాటి పవిత్ర స్థలాలు.వెయ్యేళ్ళ క్రితం అక్కమహాదేవి ఆ స్థలాలలో తపస్సు చేసి పరమేశ్వరునిలో ఐక్యం అయ్యింది.కానీ ఆ ప్రదేశాలు అంతకంటే ఇంకా ఎంతో ప్రాచీనమైనవి.కొన్ని కోట్ల సంవత్సరాల నాడే అవి ఏర్పడ్డాయి.అప్పటినుంచీ ఎందఱో మహర్షులు, సిద్ధులు అక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతున్నది. వారిలో దత్తాత్రేయులు కూడా ఒకరు.

తిరుపతిలోని శిలాతోరణం కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది.అలాగే కదలీవనంలోని గుహ కూడా కోట్ల సంవత్సరాల నాటిదే.ఇవన్నీ భూమి పుట్టిన కొత్తల్లో ఏర్పడిన శిలారూపాలు.

మొన్న శ్రీశైలం సాధనాసమ్మేళనం సమయంలో రెండవరోజున అక్కమహాదేవి గుహలను కదలీ వనాన్ని దర్శించాలని ముందుగా అనుకున్నాం.కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.దానికి కారణాలేమిటో వింటే చాలా వింతగా అనిపించడం తో బాటు,మనుషుల మనస్తత్వాల మీద అసహ్యం తప్పకుండా వేస్తుంది.

అక్కమహాదేవి గుహలకు వెళ్ళాలంటే కృష్ణానది మీదుగా ఎగువకు 10 కి.మీ బోటులో వెళ్ళాలి.అక్కడ ఆ గుహలు ఉన్నాయి.అక్కడనుంచి ఒక 6 కి.మీ. కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కితే అప్పుడు కదలీ వనానికి చేరుకోవచ్చు.అంత కష్టపడి అక్కడకు ఎందుకు వెళతాం?అది మహాసిద్ధక్షేత్రమనీ అక్కడ మహనీయులైన ఋషులు,సిద్ధులు తపస్సు చేశారనీ,ఆ స్పందనలను మనం కూడా ఆస్వాదించి వారి అనుగ్రహాన్ని పొందుదామనే కదా?

కానీ మా ప్రయత్నం ఫలించలేదు.కారణం?

మనం పాతాళగంగ దగ్గర నిలబడి డ్యాం వైపు చూస్తె, కుడివైపు ఉన్న కొండలు ఆంధ్రాలో ఉన్నాయట.నదికి ఎడమవైపున మనకు కనిపించే కొండ ప్రాంతం,ముఖ్యంగా కదళీవనం ఉన్న ప్రాంతం తెలంగాణలో ఉన్నదట.ఆంధ్రా టూరిజంవారు మా ప్రాంతాలకు వచ్చి పోవడం ఏమిటి? దానివల్ల మా రెవెన్యూ అంతా వారికి పోతున్నది,అంటూ వారు అభ్యంతరం చెప్పడమే గాక,ఆంధ్రా వైపునుంచి టూరిస్టులు రాకుండా ఆ అడవిలో ఒక గోడను కడుతున్నారట. అందుకని శ్రీశైలం నుంచి పడవలు ఆ ప్రదేశానికి పోవడానికి అనుమతి లేదని తేల్చి చెప్పాడు శ్రీశైలం ఈవో.

కావాలంటే హైదరాబాద్ నుంచి మినిస్టర్ గారి అనుమతి తెచ్చుకోండి అప్పుడు అనుమతి ఇస్తానన్నాడు.అనుకుంటే ఆ పని చెయ్యడం పెద్ద విషయం కాదు. కానీ ఇదంతా విని నాకు పరమ అసహ్యం అనిపించింది.గొడవపడి మరీ అక్కడకు వెళ్ళవలసినంత అవసరం లేదనిపించింది.

చైనా,టిబెట్ లలో విస్తరించి ఉన్న మానస సరోవరానికి పోవడానికి మనకు అనుమతి లభిస్తున్నది.కానీ మన రాష్ట్రంలోనే ఉన్న శ్రీశైలంలో కొన్ని ప్రదేశాలకు పోవడానికి మనకు అనుమతి లేదు.

భలే విచిత్రం కదూ?

తెలంగాణా అంటే అదేదో పాకిస్తానో చైనానో కాదుగా? అది కూడా మన రాష్ట్రంలో ఒక భాగమేగా నిన్న మొన్నటిదాకా? నేడు కూడా అది భారతదేశంలో భాగమేగా? లేక పరాయి దేశమా?

పాకిస్తాన్ మన దేశం నుంచి ద్వేషభావంతో పుట్టింది.దాని గతి ఎలా అఘోరిస్తున్నదో చూస్తున్నాం.తెలంగాణా కూడా అలాంటి ద్వేషభావంతో పుట్టి ఉంటే, అర్జంటుగా ఆ ద్వేషాన్ని వారి మనసులో నుంచి తుడిఛి పెట్టవలసిన అవసరం ఉన్నది.ఎందుకంటే ద్వేషంతో మొదలైన పనులు ఒక మంచి సాఫల్యత వైపు ఎన్నటికీ ప్రయాణం సాగించలేవు.వాటి గమ్యస్థానం కూడా అంత అందంగా ఏమీ ఉండదు.

మానసిక దిగజారుడు తనానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకెక్కడుంటుంది?

7, మే 2015, గురువారం

అంగారకుని రాశిమార్పు-మరిన్ని విలయాలకు సూచన?

3-5-2015 రాత్రి పదకొండు పన్నెండు మధ్యలో అంగారకుడు మేషరాశిని వదలి భూతత్వరాశియైన వృషభ
రాశిలో ప్రవేశించాడు.

ఆరోజునుంచి 15-6-2015 వరకూ అక్కడనే సంచరిస్తాడు.ఈ క్రమంలో వృశ్చికరాశిలో ఉన్న శనీశ్వరుడిని సప్తమదృష్టితో వీక్షిస్తాడు.అంతేగాక రోహిణీనక్షత్రం మీదుగా ఈ సమయంలోనే ఆయన సంచరిస్తాడు.మే 15 వ తేదీన అంగారక శనీశ్వరుల మధ్యన ఖచ్చితమైన సమసప్తకదృష్టి ఉన్నది.ఇది అమావాస్య పరిధిలో ఉంటున్నది.

ఈ 40 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతాయి.మే 10 నుంచి జూన్ 5 వరకూ నవాంశలో నీచస్థితిలో ఉండబోతున్న గురువు ప్రభావం ఈ అగ్నికి ఆజ్యం పోస్తుంది.రోహిణీశకట భేదనప్రభావం దీనికి సుడిగాలిని తోడుచేస్తుంది.

మనుషులు తలపొగరుతో చేసుకున్న పాపాలకు ఫలితాలు అనుభవించే సమయాన్ని గ్రహచారం నిర్దేశిస్తుంది.ఆయా గ్రహాల సంచార సమయంలో ఎవరు చేసుకున్న పాపాలకు శిక్షలు వారికి ఖచ్చితంగా పడతాయి.ఆ శిక్షలు రకరకాలుగా చిత్రవిచిత్రాలుగా ఉంటాయి.

కనుక ఆయా సమయాలలో ఊహించని ఈ క్రింది దుర్ఘటనలు తప్పకుండా జరుగుతాయి.

1.టెర్రరిస్టు,మాఫియా దాడులు- ప్రతిదాడులు.
2.అనేక వాహన ప్రమాదాలు,అగ్నిప్రమాదాలు.
3.ఇంకా ఉధృతమైన భూకంపాలు మళ్ళీ రావచ్చు.
4.దేశాల మధ్య,జాతుల మధ్య యుద్ధాలు జరుగుతాయి.
5.వ్యక్తిగత జీవితాలలో యాక్సిడెంట్లు దుర్ఘటనలు జరుగుతాయి.
6.అధికారులపైన,నాయకులపైన సామాన్యుల దాడులు,తిరగబడటం జరుగుతాయి.

ముఖ్యంగా ఈ దుర్ఘటనలు:--

మే 17 అమావాస్య,జూన్ 1 పౌర్ణమి,జూన్ 14 అమావాస్య లకు అటూ ఇటూగా ఖచ్చితంగా జరగడాన్ని గమనించవచ్చు.

కొన్ని ప్రమాదకర తేదీలు:--
మే 15-17, మే 22, మే 25 -28,మే 31- జూన్ 5,జూన్ 10,జూన్ 16.

వీటిని తప్పుకోవడం సాధ్యం కాదా అని ఒకరు నన్ను ప్రశ్నించారు.

సాధ్యంకాదు.కర్మఫలం అనేది సముద్రం అడుగున దాక్కున్నా వదలదు. వడ్డీతో సహా అనుభవింప చేస్తుంది.దీనిని ఎవరూ దాటలేరు.మార్చలేరు. పూజలవల్లా,తూతూ మంత్రపు రెమెడీల వల్లా ఇది పోదు.అలాంటి పిచ్చి రెమెడీలకు ఇది లొంగదు.

పైగా ఇది సామూహిక భౌగోళికకర్మ(global group karma).దీనిని మార్చడం ఎవరివల్లా కాదు.మార్చడం వీలయ్యే పనైతే మొన్న నేపాల్లో భూకంపం జరిగినప్పుడు అక్కడ హిమాలయాలలో ఉన్న బాబాజీ మొదలైన మహాసిద్ధులు దానిని ఎందుకు ఆపలేదు?అన్ని వేలమంది ప్రాణాలను ఎందుకు కాపాడలేదు?ఎందుకంటే, ఒకరి కర్మను మార్చడం ఆషామాషీ వ్యవహారం కాదు.అందులోనూ సామూహిక చెడుకర్మను మార్చడంలో సిద్ధపురుషులు కూడా అనవసరంగా జోక్యం చేసుకోరు.

మంచి చెబుతున్నప్పుడు ఎవరూ వినరు.పైగా హేళన చేస్తారు. కర్మఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం ప్రాధేయపడతారు.ఇది సామాన్య మానవుని నీచప్రవర్తన.కనుక ఈ సామూహిక కర్మను మార్చగల శక్తి ఉన్నా కూడా మహనీయులు ఇందులో జోక్యం చేసుకోరు.ఈ లోకంలో ఎవరి ఖర్మను వారు అనుభవించక తప్పదు. ఇది తిరుగులేని విశ్వనియమం.

Srisailam Retreat 2015- Photo Slideshow



శ్రీశైలం సాధనా సమ్మేళనం ఫోటోలను కొన్నింటిని వరుసగా ఇక్కడ చూడవచ్చు.

5, మే 2015, మంగళవారం

శ్రీశైలం సాధనా సమ్మేళనం-2015 విశేషాలు(రుద్రాక్ష మఠం - ఛిన్నమస్తా జయంతి)

Chinna Mastika Mahavidya

Rudraksha Mutt-Srisailam

Chinnamasta Temple-Srisailam

Rudraksha Mutt-Long view

In front of Rudraksha Mutt

In front of Rudraksha Mutt

At the feet of Ma Kali

At the feet of Ma Kali

Rudraksha Mutt-Long view

Rudraksha Mutt-Another view


శ్రీశైలంలో మొన్న మూడురోజుల పాటు నేను బస చేసిన గెస్ట్ హౌస్ పక్కనే రుద్రాక్షమఠం ఉన్నది.శ్రీశైలంలో ఘంటామఠం,రుద్రాక్షమఠం మొదలైన పంచమఠాలు ఉన్నాయి.ఇవి ఎప్పటివో చాలా ప్రాచీనకాలం నాటివి. పూర్వ కాలంలో ఇక్కడ సాధకులు ఉండి వారి వారి సాంప్రదాయపు సాధనలు చేసుకుంటూ ఉండేవారు.

ఆదివారం ఉదయం రెండవ దీక్ష అయిపోగానే, గెస్ట్ హౌస్ కేర్ టేకర్ మల్లన్న భార్య--' ఈ ప్రక్కనే ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉన్నది.దర్శనం చేసుకొమ్మని'- చెప్పినది.

అందరం అక్కడకు వెళ్లి అమ్మవారిని పూజించి తిరిగి వచ్చాము. అక్కడ ఏ కాలం నాటిదో ఒక ఛిన్నమస్తాదేవి విగ్రహం ఉన్నది.కానీ ఆ విగ్రహం చెక్కడంలో నైపుణ్యం లేదు.ఏదో పల్లెటూరి శిల్పులు చెక్కినట్లు మోటుగా ఉన్నది.సాధారణంగా ఛిన్నమస్తాదేవి పాదాలదగ్గర రతిక్రీడలో ఉన్న రతీ మన్మధుల మూర్తులు ఉండాలి.కానీ ఇక్కడ అవి లేవు.

ఛిన్నమస్తాదేవికి మరో పేరు ప్రచండచండిక.అంటే కాళికాదేవి యొక్క అతి భయంకర రూపం అన్నమాట.కామశక్తిని ఓజస్సుగా రూపాంతరం చెందించి కుండలినీ జాగరణ గావించే సాధనలు ఈ మహావిద్యలో అంతర్భాగములు. ఇదొక అతి రహస్య తంత్రవిద్య.


వాసిష్ఠ గణపతిముని తన 'ప్రచండచండికా త్రిశతీస్తోత్రం'లో ఈ దేవిని పరశురామ జననియైన రేణుకాదేవిగా కీర్తిస్తూ--

'అమితవిక్రమే జయజయాంబికే పరశుధారిణీ జనని రేణుకే
వినతపాలికే ధరణికాళికే జనపతి ద్విషో జనని పాహిమాం'

అని ప్రార్ధిస్తారు.


'చండచండి తవపాణి పంకజే యన్నిజం లసతి కృతమస్తకమ్
దేవి సూచయతి చిత్తనాశనం తత్తవేంద్ర హృదయాధినాయకే'

అనే మంత్రంలో- 'తనచే ఖండింపబడిన తన శిరస్సు' అనే సూచనతో తాంత్రిక మహాసమాధిలో జరిగే చిత్తనాశనాన్ని ఈ మూర్తి నిర్దేశిస్తున్నట్లు తెలుస్తున్నది. 

'దీప్తి విగ్రహలతాం మహాబలాం వహ్నికీల నిభరక్తకున్తలామ్
సంస్మరామి రతి మన్మధాసనాం దేవతాం తరుణభాస్కరాననామ్'

అనే మంత్రంలో 'రతీమన్మధపీఠమనే కామశక్తి' మీద మాత నిలిచి ఉన్నట్లు తెలుస్తున్నది.

'పిండే కుండలినీ శక్తి: సైవ బ్రహ్మాండచాలికా
నిద్రాతి జడదేహేషు యోగిదేహేషు ఖేలతి'

అనే మంత్రంలో--'మానవదేహంలో కుండలినీ శక్తిగానూ,సమస్త బ్రహ్మాండములను నడుపుతున్న శక్తిగా బాహ్యముగానూ ఉన్నది నీవే. పశుప్రాయుల నిద్రలో ఉన్న తమోగుణశక్తివి నీవే. అటులనే, శుద్ధసత్త్వ ప్రాణులైన యోగుల దేహాలలో నర్తించే కుండలినీ మహాశక్తివీ నీవే' అంటారు గణపతిముని.

'యా శ్రీ: స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీం పాపాత్మనాం' అన్న సప్తశతీ మంత్రభావం ఇక్కడ ద్యోతకమౌతున్నది.

'ఏషా వైరోచనీదుర్గా జ్వలన్తీ తపసా పరా' అనే మంత్రంలో -- 'తపస్వుల దేహాలలో ప్రజ్వరిల్లే వైరోచనీదుర్గా స్వరూపానివి నీవే'- అంటారు గణపతి ముని.

ఆ ఆలయానికి వెళ్ళే దారిలోనే చెట్టుక్రింద కాళికామాత విగ్రహం ఒకటి ఉన్నది.మొన్నమొన్నటి వరకూ అది వధ్యస్థలి అనీ అక్కడ బలులు ఇచ్చేవారనీ తెలిసింది.ఇప్పటికీ ఏడాదికి ఒకసారి అక్కడ బలి ఇస్తారట.

అదేరోజున ఛిన్నమస్తా అమ్మవారి జయంతి(వైశాఖ శుక్ల చతుర్దశి)కావడం, అనుకోకుండా మేమందరం అదే రోజున అక్కడకు చేరడం, మా గెస్ట్ హౌస్ పక్కనే ఆ అమ్మవారి ఆలయం ఉండటం,ఆ విషయం మాకు తెలియడం,అదేరోజున అమ్మవారిని దర్శించడం,ఇవన్నీ కాకతాళీయములు కానేకావు.

నేను చేసే తంత్రసాధనకూ ఛిన్నమస్తా అమ్మవారికీ సూటి సంబంధం ఉన్నది.అదే విషయాన్ని నాతో ఉన్న సభ్యులకు వివరించి,ఛిన్నమస్తాదేవి ఆకారానికీ అంతరిక తంత్రసాధనకూ ఉన్న సూక్ష్మ సంబంధాన్ని వారికి వివరించాను.

ఈలోకంలో కాకతాళీయం అనేది లేనేలేదని నేనెప్పుడూ చెప్పే విషయం అనుకోకుండా మళ్ళీ ఇలా రుజువైంది.

4, మే 2015, సోమవారం

శ్రీశైలం సాధనా సమ్మేళనం-7 విశేషాలు (మే 2015)


Group Photo taken in front of Shivaji Sphurthi Kendram-Srisailam

Group Photo taken in front of Shivaji Sphurthi Kendram-Srisailam

Inside the Shivaji Kendram with Sri Nageshwar Rao garu,its secretary

On the way to Pathala Ganga

1-5-2015 నుండి 3-5-2015 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఏడవ సాధనా సమ్మేళనం జరిగింది.పంచవటి గ్రూప్ లో ఉన్న 89 సభ్యులలో 21 మంది (నాతో సహా)మాత్రమే దీనికి హాజరవ్వగలిగారు.మిగిలినవారు ఈ అవకాశాన్ని అందుకోలేక పోయారు.ఈ సారికి వారికి అదృష్టం కలసి రాలేదు.
On the terrace where 2nd initiation was given

Select 5 who had second level initiation on Chinnamasta Jayanthi
వైశాఖ పౌర్ణమి ఛాయలో మూడు రోజులు శ్రీశైల మహాక్షేత్రంలో ఉంటూ ఇతర వ్యాపకాలు ఆలోచనలు ఏమీ లేకుండా 60 గంటలపాటు ఏకధాటిగా సాధనలో గడపడం జరిగింది.హాజరైన సభ్యులందరికీ,అంటే 20 మందికీ, First Level Initiation ఇవ్వడం జరిగింది.ఇది యోగ-తంత్ర పరిభాషలో 'ప్రాణ సంచాలన క్రియ' (Prana Adjustments Initiation) అనబడుతుంది.

మూడో రోజున,అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు ప్రశాంత ఉదయసంధ్యా సమయంలో వీరిలో ఎంచుకొనబడిన 5 గురికి రహస్యమైన Second Level Initiation ఇవ్వబడింది.ఇది 'కుండలినీ జాగరణక్రియ' (Kundalini Activation Initiation) అనబడుతుంది.మూడురోజులూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తూ,'శ్రీవిద్యా రహస్యం' నుంచి కొన్ని భాగాలను వారికి వివరిస్తూ,లోతైన ఆధ్యాత్మిక విషయాలను హాజరైన సభ్యులకు బోధించడం జరిగింది.

During Sadhana session
ఈ సాధనా సమ్మేళనానికి వచ్చిన పంచవటి సభ్యులకు మొదటిరోజు నుంచే ఆధ్యాత్మిక అనుభవాలు అనేకం కలిగాయి.కొన్ని ఏళ్ళపాటు ఇతర మార్గాలలో సాధన చేసినా కలుగని అనుభవాలు వీరికి మొదటిరోజునుంచే కలిగాయి.ఇది వారిని చాలా ఆశ్చర్యపరచింది.
At the place where I stayed
వైశాఖ పౌర్ణమి రోజున--ఈ మూడురోజుల సాధనలో వారికి కలిగిన అనుభవాలను నిత్యజీవితంలోకి ఎలా అనువదించాలి?నిత్యజీవితంలో వచ్చే రోజువారీ సమస్యలను యోగిక్ కోణంలో ఎలా డీల్ చెయ్యాలి? అన్న సూక్ష్మమైన విషయాలను వారికి ప్రాక్టికల్ గా వివరించి చెప్పడం జరిగింది.

Praying to Divine Father and Divine Mother
Before commencing Sadhana
మేము అక్కడ అడుగుపెట్టిన సాయంకాల సమయంలో ఎన్నడూ లేని విధంగా ఒక సుడిగాలితో కూడిన వాన ఈ మండువేసవిలో హటాత్తుగా ప్రత్యక్షమై కొద్దిసేపు ఆ ప్రాంతాన్ని కుదిపేసి హటాత్తుగా మాయమైంది.ఈ సుడిగాలి అక్కడకు 16 కిమీ దూరంలో ఉన్న కదళీవనం వైపునుంచి వచ్చి మళ్ళీ ఆవైపుకే తిరిగి వెళ్ళిపోయింది.కదళీవనం మహాసిద్ధక్షేత్రమని తెలిసిన విషయమే.
Explaining relevant chapters from 'Sri 
Vidya Rahasyam'
మహాయోగిని అక్కమహాదేవి,వీరశైవ సిద్ధగురువైన అల్లమప్రభువే కాక, ఆదిశంకరాచార్యులు,అవతారమూర్తియైన దత్తాత్రేయులు ఇంకా ఎందఱో ప్రాచీన మహాసిద్ధులు  అక్కడ తపస్సు చేసినారు.వీరిలో అక్కమహాదేవి, అల్లమప్రభువులు అక్కడనే విదేహముక్తిని పొంది పరమేశ్వరునిలో లీనమైనారు.మహాసిద్ధగురువుల నుంచి మా సాధనా సమ్మేళనానికి వచ్చిన అనుగ్రహంగా ఈ సూచనను స్వీకరించడం జరిగింది.

ఇవ్వబడిన సాధనను క్రమం తప్పకుండా చెయ్యమని,తద్వారా కొన్ని నెలలలో మళ్ళీ జరుగబోయే సాధనా సమ్మేళనంలో ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని మొదటి రెండు దీక్షలను స్వీకరించిన అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను.
Guiding the participants in sadhana

A happy occasion
భవిష్యత్తులో జరుగబోయే సాధనా సమ్మేళనాలకు హాజరయ్యే అర్హతను సంపాదించుకొమ్మని, ఈసారి హాజరు కాలేకపోయిన పంచవటి సభ్యులను ఈ సందర్భంగా ఉద్బోధిస్తున్నాను.