Pages - Menu

Pages

21, మే 2015, గురువారం

విషయ సేకరణ-విష నిర్మూలన

ఆధ్యాత్మికత అంటే వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవడం,విషయాలు తెలుసుకోవడం అని చాలామంది అనుకుంటారు.కానీ అసలు విషయం అది కాదు.వేల పుస్తకాలు చదివిన తర్వాత (వాటిని నిజాయితీగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తే) ఒక విషయం స్పష్టంగా అర్ధమౌతుంది.

పుస్తకాలు దారిని మాత్రమే చూపగలవు.నడక మాత్రం మనమే నడవాలి. మనల్ని మనం మార్చుకోవడమే ఆ నడక.దానినే సాధన అంటాము.

చాలా పుస్తకాలు దారిని కూడా చూపలేవు.ఏదో చెదురుమదురుగా దారిని సూచించగలవు గాని నిర్దుష్టంగా 'ఇది చెయ్యి' అని అవికూడా చెప్పవు.నిజం చెప్పాలంటే 'ఏం చెయ్యాలనే విషయాన్ని' అంత ఖచ్చితంగా చెప్పే గ్రంధాలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు.

చాలామంది ఇంకొక్క పనిని కూడా చేస్తారు.చదివిన వాటిని కంఠస్థం చేసి ఇతరులకు ఒప్పజెబుతారు.అదే ఒక పెద్ద ఘనకార్యం అని వారనుకుంటారు. లోకంలోని పండితులందరూ ఇలాంటివారే.కాకపోతే జనరంజకంగా వారు ఆ పనిని చెయ్యగలరు.

ఈ క్రమంలో, చెప్పేవారికీ 'మనకింత తెలుసు' అన్న భ్రమ ఏర్పడుతుంది. వినేవారికీ, 'మనకేదో తెలిసింది' అనే భ్రమ ఏర్పడుతుంది.కానీ ఈ ఇద్దరికీ సత్యమైన అనుభవజ్ఞానం మాత్రం ఉండదు.

వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ ఉన్న విషయాలను చదివి అర్ధం చేసుకున్నంత మాత్రాన అవి మన సొంత అనుభవాలు ఎన్నటికీ కాబోవు. ఇతరులకు వినసొంపుగా వాటిని వివరించి చెప్పినంత మాత్రాన కూడా అవి మన సొంత అనుభవాలుగా ఎన్నటికీ అందవు.కానీ ఈ సున్నితమైన పాయింట్ లోకులకు ఎన్నటికీ అర్ధం కాదు.అదే అసలైన మాయ.శాస్త్రాలు దీనినే 'అజ్ఞానం' అన్న పేరుతో పిలిచాయి.

వేదాలూ ఉపనిషత్తులే కాదు,అది భగవద్గీత అయినా,యోగవాశిష్టం అయినా, ఇంకేదైనా కూడా - వాటిలో ఉన్న సాధనా మార్గాలను మనం ఆచరించి,మన జీవితంలో వాటిని అనువదించుకోగలిగినప్పుడే ఆ అనుభవాలను మన అనుభవం ద్వారా అందుకోగలుగుతాం.అంతేగాని వాటిని చదివి ఊరకే మనస్సుతో అర్ధం చేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు.

అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇలా అనేవారు.

'పుస్తకంలోంచి అనుభవం రాదు నాన్నా. అనుభవంలో నుంచి పుస్తకం వస్తుంది.'

ఆధ్యాత్మికత అంటే విషయ సేకరణ కాదు--విషనిర్మూలన.

మన లోపల ఇప్పటికే ఎంతో విషం ఉన్నది.అది ఇంద్రియ వ్యామోహపరంగా ఉండవచ్చు.పూర్వజన్మల నుంచి వచ్చిన సంస్కారముల పరంగా ఉండవచ్చు.మానసిక ప్రాణిక స్థాయిలలో పెనవేసుకుని ఉన్న అనేక చిక్కుముడుల రూపంలో ఉండవచ్చు.ఈ విషం ప్రతి మనిషిలోనూ రకరకాల స్థాయులలో పేరుకునిపోయి ఉన్నది.లోపలున్న ఆ విషాన్ని ప్రక్షాళన చేసుకోవాలి.అదే మానవుడు ఈ భూమ్మీద చెయ్యవలసిన అసలైన పని.

ఈ పనికీ పుస్తకపఠనానికీ ఏమీ సంబంధం లేదు.ఒక్క ఆధ్యాత్మిక గ్రంధాన్ని కూడా చదవకుండా ఈ పనిని చెయ్యవచ్చు.లోకంలోని పుస్తకాలన్నీ చదివినా కూడా ఈ పనిని చెయ్యలేకపోవచ్చు.లేదా అసలు మొదలు కూడా పెట్టకపోవచ్చు.

ఒక ఉపన్యాసంలో వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'మనం ఇప్పటికే హిప్నటైజ్ చెయ్యబడి ఉన్నాం.దీనినే మన శాస్త్రాలు 'మాయ' అని పిలిచాయి.ఇందులోనుంచి బయటపడాలంటే మనం 'డీ-హిప్నటైజ్' కావాలి.అలా డీ- హిప్నటైజ్ కావడాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు.'

తన లోలోపలకు వెళ్ళే దారిని అసలైన పుస్తకాలు  మనిషికి చూపించాలి. చూపిస్తాయి కూడా.ప్రపంచంలోని ఆధ్యాత్మిక గ్రంధాలన్నిటి ఉపయోగం అదే. కానీ మానవులు వాటిని ఆచరించరు.ఊరకే చదివి ఆనందిస్తారు.లేదా పుక్కిట బట్టి ఇతరులకు బోధిస్తారు.ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం.

విషయసేకరణ అనేది ఉత్త కుతూహలం మాత్రమే.దానివల్ల పాండిత్యం వస్తుంది.కానీ అనుభవం రాదు.

విష నిర్మూలన అనేది సాధన.దానివల్ల అనుభవం అందుతుంది.

కుతూహల పరులూ,పండితులూ ఎంతో మంది ఉంటారు.కానీ సాధకులు అతి కొద్దిమందే ఉంటారు.ఎందుకంటే,పాండిత్యం సులభం.సాధన కష్టం.

మన కుతూహలాన్ని చల్లార్చుకోడానికీ,పుస్తకాలు చదివి పాండిత్యం సంపాదించడానికీ పెద్ద కష్టం అక్కర్లేదు.కానీ విషనిర్మూలనకు మాత్రం చాలా కష్టపడాలి.

ముందుగా తనలో ఆ విషం ఎక్కడెక్కడ ఉందో తెలియాలి.ఆ తరవాత దానిని మార్చుకునే మార్గం తెలియాలి.ఆ మార్గాన్ని చూపించి దానిలో నడిపించే గురువు తారసపడాలి.ఆ గురువు చెప్పిన మార్గంలో త్రికరణశుద్ధిగా నడచే బుద్ధి మనకు కలగాలి.ఆ తర్వాత అందులోని కష్టాలను భరిస్తూ నడక సాగించాలి.ఎంతో అంతరిక సంఘర్షణను భరించాలి.అప్పుడే ఆ విషం పోతుంది.విషయం అనుభవం లోకి వస్తుంది.

ఇంతకష్టం మనకెందుకులే? అనుకుంటే పుస్తక పరిజ్ఞానం మాత్రమే మనకు మిగులుతుంది.అప్పుడు పుస్తకాలను మోస్తున్న గాడిదకూ మనకూ ఏమీ తేడా ఉండదు.

విషయపరిజ్ఞానం మాత్రమే నాకు చాలు అనుకున్నప్పుడు లోపల విషం అలాగే ఉంటుంది.అది లోపలున్నంత వరకూ పుస్తకాల ద్వారా సంపాదించిన విషయ పరిజ్ఞానం మోతబరువుగా తప్ప ఇంకెందుకూ ఉపయోగపడదు.

విషయం మీద మన దృష్టి ఉన్నంతవరకూ విషం పోదు.విషం పోయినప్పుడే అసలైన విషయం దక్కుతుంది.లోకులు విషయాన్ని ఆశిస్తారు,కాని విషాన్ని లోలోపల మొయ్యడానికే ఇష్టపడతారు.అందుకే వారు ఎన్ని జన్మలెత్తినా ఆధ్యాత్మికంగా ఎదగలేరు.