Pages - Menu

Pages

15, జూన్ 2015, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 14 (అమ్మ గురించి కొన్ని విషయాలు)




ఆఫీస్ కాంపౌండ్ లో మిత్రుడు రమణ కలిశాడు. ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా రమణ పనిచేస్తుంటాడు.మా పరిచయం పాతికేళ్ళ నాటిది.కానీ అతని కుటుంబం గురించి పూర్తి విషయాలు నాకు ఇప్పటికీ కొన్ని తెలియవు.

'మొన్నీ మధ్యన జిల్లెళ్ళమూడి వెళ్లి వచ్చాను.అక్కడ మీ పిన్నిగారు కనిపించారు.నీ గురించి అడిగారు.' అన్నాను.

'అవును.సుబ్బలక్ష్మి గారు మా అమ్మ చెల్లెలు.' అన్నాడు రమణ.

'నీ గురించి అడిగితే,అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటావని చెప్పాను.ఇద్దరం పనిచేసేది ఒకే బిల్డింగ్ లోనే అని కూడా చెప్పాను.' అన్నాను.

'అవును.పిన్ని వివాహం చేసుకోలేదు.అక్కడే సెటిల్ అయిపోయింది.అమ్మతో మా కుటుంబానికి చాలా అనుబంధం ఉన్నది.అసలీ విషయాన్ని అమ్మ ఎప్పుడో పాతికేళ్ళ క్రితమే ఒకసారి అన్నది.అప్పుడెప్పుడో మావాళ్ళు చాలామంది కలసి జిల్లెళ్ళమూడి వెళితే, వాళ్ళలో మా పిన్నిని దగ్గరకు రమ్మని అమ్మ పిలిచింది.ఏమిటా అని పిన్ని దగ్గరకు వెళ్ళింది.

'నువ్వు ఇక్కడకొచ్చి ఉండిపోవే' అని ప్రేమగా భుజం మీద చెయ్యివేసి చెప్పిందిట అమ్మ.అమ్మ ఏమంటున్నదో ఆమెకు అర్ధం కాలేదు.ఆ తర్వాత కొన్నేళ్ళకు అదే జరిగింది.ఇప్పుడు తనక్కడే ఉంటున్నది.

రామరాజు కృష్ణమూర్తిగారు గుంటూరులో లాయరు. ఎప్పుడో ఏభై ఏళ్ళక్రితమే అమ్మ దైవత్వాన్ని పరీక్షించాలని కరెంట్ వైర్లు పట్టుకున్నది ఆయనే.ఆయన వైర్లు పట్టుకున్నది గుంటూరులో. జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ ఎగిరిపడింది ఆ షాక్ కి.ఇక్కడ ఈయనకేమీ కాలేదు.కరెంట్ లేదేమో అని చూస్తే లైట్లూ ఫాన్లూ పనిచేస్తూనే ఉన్నాయి.

'ఒరేయ్! వాడిని ఆ వైర్లు వదలమని చెప్పండిరా' అని మాత్రం అమ్మ అన్నదిట.అమ్మ ఏమంటున్నదో చుట్టూ ఉన్నవారికి అర్ధం కాలేదు.తర్వాతెప్పుడో ఆయన జిల్లెళ్ళమూడి వెళితే --'ఎందుకురా అలా పరీక్షిస్తావు?' అని మాత్రం అన్నదిట.అమ్మ ఏది చెప్పినా ఇలాగే ఉంటుంది. వివరంగా చెప్పదు.ఆ తర్వాత ఎప్పుడో అన్ని లింకులూ కలుపుకుని చూచుకుంటే అర్ధమయ్యేవారికి అర్ధమౌతుంది.అమ్మ తీరు అలాగే ఉండేది.

క్షుద్రసిద్ధుల కోసం ఒకాయన గుంటూరులో ఉంటూ ఆ తాంత్రిక క్రియల్లో భాగంగా కోళ్ళను బలిస్తూ ఉండేవాడు.ఆయన ఒకరోజున జిల్లెళ్ళమూడి కెళ్ళి అక్కడ గుంపులో కూచుని ఉన్నాడు.అమ్మ ఆయనకేసి చూస్తూ - 'ఎందుకురా వాటి ప్రాణాలు తీస్తావు?' అని మాత్రం అన్నదట. అంటున్న ఆమెకూ వింటున్న ఆయనకూ మాత్రమే అది అర్ధమైంది.బహుశా ఆయనక్కూడా వెంటనే అర్ధమయ్యి ఉండదు.చుట్టూ ఉన్నవారికి మాత్రం అమ్మ ఏమంటున్నదో అర్ధమయ్యేది కాదు.అమ్మ అంతకంటే వివరించి చెప్పనూ చెప్పదు. అమ్మ మాటలు అలా ఉండేవి.

మనల్ని చూస్తూనే అమ్మకు మన భవిష్యత్తు అంతా కళ్ళముందు కనిపిస్తుంది.అందుకే ముందుముందు మనకు జరిగేదానిని చూస్తూ అమ్మ మాట్లాడేది.మనకేమో ఆ మాటలు అర్ధమయ్యేవి కావు.అమ్మ చెప్పిన మాటలు పాతికా ముప్పై ఏళ్ళ తర్వాత జరిగినప్పుడు మనకు ఇప్పుడు అర్ధమౌతున్నాయి.'ఓహో ఇదా..' అప్పుడు అమ్మ అన్న మాటలకు అర్ధం అని.

అమ్మ గుంటూరులో పట్టాభిపురంలోని మా ఇంటికి వచ్చింది.అరండల్ పేటలో ఉన్న ఇంటికి కూడా వచ్చింది.మా అమ్మావాళ్ళు కూడా మన్నవ వారే. అందుకని ఆ చనువుతో అమ్మ దగ్గరగా వెళ్లి కూచునేవారు.అమ్మ కూడా మా అమ్మావాళ్ళతో చనువుగా ఉండేది.

నేనా సమయంలో గుంటూరులో డిగ్రీ చదువుతున్నాను.నేను కూడా ఒకసారి మా అమ్మావాళ్ళతో కలిసి జిల్లెళ్ళమూడి వెళ్లాను.మా అమ్మావాళ్ళు చాలా దగ్గరగా కూచుని ఒక కుటుంబంలాగా అమ్మతో మాట్లాడుతున్నారు.నేను దూరంగా ఒక మూల కూచుని అమ్మను చూస్తూ నాలో నేను ఇలా అనుకుంటున్నాను.

'అందరూ నువ్వు దేవుడివని అంటున్నారు.అదెట్లా సాధ్యం? నువ్వు కూడా మాలాగే ఉన్నావు.నువ్వు దేవుడివి ఎలా అవుతావు?'

వాళ్ళతో మాట్లాడుతున్న అమ్మ ఉన్నట్టుండి నావైపు చూచి -- "ఒసేయ్. వీడు నన్ను శోధిస్తున్నాడే' అని మా అమ్మావాళ్ళతో అంటూ--'వీడికి అనుమానాలు ఎక్కువ.నువ్విట్లా రారా.' అని నన్ను పిలిచింది.

నేను దగ్గరగా వెళ్లాను.

'ఒరేయ్.నీది చంద్రవంశంరా.అందుకే నన్ను శోధిస్తున్నావు.' అని నవ్వుతూ తన వేలితో నా నొసటన కుంకుమను ఒక చంద్రవంకలాగా దిద్దింది.ఎందుకలా అన్నదో ఇప్పటికీ నాకర్ధం కాదు.

రామరాజు కృష్ణమూర్తిగారికి అమ్మంటే ఎంత నమ్మకమంటే, ఆ రోజుల్లోనే తనకున్న లా ప్రాక్టీస్  అంతా వదిలేసి జిల్లెళ్ళమూడిలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోయాడు.కుటుంబం కూడా అక్కడే ఉంచాడు.తర్వాత పిల్లల చదువులు సాగడం లేదని, భార్యాపిల్లలను మాత్రం గుంటూరులో ఉంచి తాను అక్కడే ఉండేవాడు.గుంటూరు జిల్లెళ్ళమూడి మధ్యలో తిరుగుతూ ఉండేవాడు. చివరకు అక్కడే చనిపోయాడు.

'బ్రాడీపేటలో ఉన్న వాళ్ళింట్లో పైన గదికి వెళ్లి చూడు.అమ్మ విగ్రహం ఉంటుంది.' అన్నాడు రమణ.

'చూచాను.గదినిండా పెద్దది అమ్మ పోటో ఉన్నది.విగ్రహం నేను చూడలేదు. మా అబ్బాయి మాధవ్ అక్కడే వేణువు నేర్చుకున్నాడు.వాడితో అక్కడకు వెళ్ళినపుడు చూచాను.' అన్నాను.

ఆ రోజుల్లో వాగు పొంగితే, బాపట్ల జిల్లెళ్ళమూడి మధ్యలో సంబంధాలు తెగిపోయేవి.మళ్ళీ ఆ వాగు శాంతించేదాకా,అది వారమైనా పదిరోజులైనా, జిల్లెళ్ళమూడికి పోయిన వాళ్ళు అక్కడే ఉండాల్సిందే.బయటకు రాలేరు. బయటవాళ్ళు అక్కడకు పోలేరు. అమ్మను చూడ్డానికి పోయిన కొందరు, వాగు పొంగినప్పుడు,అలాగే ఎన్నిరోజులైనా అక్కడే ఉండేవారు.అంత కుగ్రామం.

'ఆ గ్రామ వాతావరణంలో అమ్మ సమక్షంలో అలా ఉన్నవాళ్ళెంత అదృష్టవంతులో కదా?' అని నాకనిపించింది ఒక్క క్షణంపాటు.

అమ్మ గుంటూరులో మా ఇంటికి వచ్చినప్పుడు బావి దగ్గర బిందెలు బిందెలు నీళ్ళు తోడి పోస్తూనే ఉన్నాము.నేను కూడా తోడాను.ఏభై అరవై బిందెలు స్నానం చేసేది అమ్మ.ఒక్కొక్కసారి నూరు బిందెలు కూడా దాటేవి.నీళ్ళు పోస్తుంటే అలా కళ్ళుమూసుకుని కూచుని ఉండేది.ఎన్ని బిందెలు పోసినా లేచేది కాదు.శివునికి అభిషేకం చేస్తునట్లు అనిపించేది.

'జిల్లెళ్ళమూడిలో అమ్మ ఉన్న గదిలో బాత్రూంలో పెద్ద గంగాళం ఉన్నది చూచాను.' అన్నాను.

'అవును అక్కడ కూడా అంతే.అమ్మ స్నానం చేసే సమయంలో లోపల ఎవ్వరూ ఉండేవారు కారు.బాగా దగ్గరగా ఉండేవారు తప్ప.వాళ్ళు అలా నీళ్ళు పోస్తూనే ఉండేవారు అభిషేకం చేసినట్లు.అమ్మ ధ్యానంలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకుని కూచుని ఉండేది.అలా నీళ్ళు పొయ్యడానికి కూడా అందరూ సాహసం చేసేవారు కారు.ఎందుకంటే ఆ సమయంలో ఏ దేవతారూపంలో అమ్మ కనపడుతుందో అని భయపడేవారు.'

వసుంధరక్కయ్య మొదలైన కొందరికి అమ్మ శివుని రూపంలో కనిపించింది. అందుకని వాళ్ళు అమ్మనే తమకు తాళి కట్టమన్నారు.అమ్మ తాళి కట్టింది. వాళ్ళు జీవితాంతం అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.' అన్నాడు రమణ.

సామాన్యమానవులను భర్తలుగా ఒప్పుకోలేక, సాక్షాత్తూ భగవంతుడినే భర్తగా స్వీకరించిన పార్వతీదేవి, రాధాదేవి, అక్కమహాదేవి, మీరాబాయి,ఆండాళ్, లల్లాదేవి మొదలైన దివ్యమూర్తులందరూ నా కళ్ళముందు ఒక్కసారిగా మెదిలారు.

ఎంత అద్భుతమైన ఆదర్శం !!

ఒక ఉదాత్తమైన ఆదర్శం కోసం తమతమ జీవితాలన్నే అర్పించిన అలాంటి వాళ్ళుకదా నిజమైన మనుషులు!! వారిది కదా అసలైన జన్మ!! అనిపించింది.

'వారితో పోల్చుకుంటే -- సంసారపు రొచ్చులో పడి, రోజువారీ కుళ్ళూ కుత్సితాలలో ఈత కొడుతూ,డబ్బుకోసం నానా దరిద్రపు వేషాలు వేస్తూ, కుళ్ళు బ్రతుకులు గడుపుతున్న మనవి అసలు జీవితాలేనా? ఛీ..'- అని క్షణకాలం పాటు నాకు సిగ్గు కలిగింది.

రమణ ఇంకా ఇలా అన్నాడు.

అమ్మ దగ్గరకు వెళ్ళినవారిలో కొందరిని అమ్మ దగ్గరగా తీసుకుని వీపు నిమిరేది.అంటే వాళ్లకు జీవితంలో కష్టాలు రాబోతున్నాయని అర్ధం.మనల్ని చూస్తూనే మన ఫ్యూచర్ అంతా అమ్మ కళ్ళముందు సినిమాలా కనిపించేది. అందులో కష్టాలపాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు, అలాంటి వారిని దగ్గరకు రమ్మని ఓదార్పుగా వీపు నిమిరేది.లేదా ఏదన్నా తినమని నోటికి అందించేది.

'పరవాలేదులే నాన్నా.సర్దుకుంటుందిలే'-అన్నట్లుగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పేది.అంతా బాగానే ఉందికదా, ఇప్పుడెందుకు అలాంటి మాటలు అనేదో ఎవరికీ అర్ధమయ్యేది కాదు.కొన్నేళ్ళ తర్వాత-కొన్నికొన్ని చెడు సంఘటనలు తమతమ జీవితాలలో జరిగినప్పుడు - అన్వయించుకుంటే అమ్మ మాటలు అర్ధమయ్యేవి.కానీ అమ్మ అనుగ్రహం వల్ల - తేలిపోయే మేఘాలలాగా అలాంటి చెడులు ఊరకే కనిపించి తేలిపోయేవి.

హైమక్కయ్య పోతుందని అమ్మకు ముందే తెలుసు.

'హైమకు ఇక్కడ గుడికడదాం' అని అమ్మ ముందే ఒకచోటును చూపిస్తూ అన్నదిట.'ఆ పక్కన నేనుంటాను'-అని ఇప్పుడు తన సమాధి ఉన్న చోటును చూపిస్తూ అన్నదిట.

'హైమక్కయ్య పోయినప్పుడు-'తన కూతురునే బ్రతికించుకోలేదు అమ్మ,ఇంక మనల్నేమి రక్షిస్తుంది?'- అనుకుంటూ చాలామంది అమ్మను వదిలేసి పోయారనుకుంటా?' అడిగాను.

'అవును.అమ్మ మన భవిష్యత్తును చూస్తూ మనల్ని రక్షిస్తూ ఓదారుస్తూ ఉంటే,మనమేమో,అమ్మను పరీక్షించబోతాం.మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి.'అసలు నీలో దైవత్వం ఉంటే హైమక్కయ్య ఎందుకు చనిపోతుంది?'- అని కొందరు అప్పుడే అన్నారు.అమ్మ ఏమీ జవాబు చెప్పలేదు.బాగా దగ్గరగా ఉండే కొందరికి చెప్పిందేమో మనకు తెలియదు.

'కోరికలతో దగ్గరకు చేరే మనుషుల తీరు ఇలాగే ఉంటుంది.నువ్వు మా లెక్క ప్రకారం రెండొందల ఏళ్ళు బ్రతకాలి కదా? ఇదేంటి అరవై ఏళ్ళకే చనిపోయావ్? కనుక నీవు దేవతవు కావు.నీ కూతురుని నీవే బ్రతికించుకోలేకపోయావు.ఇక మాకేమివ్వగలవు?'-- ఇలాంటి చొప్పదంటు లాజిక్ మనం ఉపయోగిస్తాం.

ఎంతసేపూ అమ్మ మనకేదో ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి అని ఆశించే తక్కువస్థాయి భక్తుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.దైవంతో మనం బేరాలు చెయ్యకూడదు.శరణాగతి ఉండాలి.అది ఉన్నపుడు ఇలాంటి సందేహాలూ, అనుమానాలూ రావు.దైవఘటనను మన స్వల్పమైన బుద్ధులతో మనం ఎలా కొలవగలం? 

'ముందు ముందు జిల్లెళ్ళమూడి, తిరుపతి అంత పుణ్యక్షేత్రం అవుతుంది' అని అమ్మ ఒకసారి అన్నదిట.దాని ఛాయలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.అది ఎప్పుడో మనకు తెలియదు.ఎందుకంటే అమ్మ చూపు కాలగమనంలో కొన్ని వందల వేల ఏళ్ళ ముందుకు కూడా చూస్తూ ఉండేది. అందుకని ఆ టైం ఫ్రేం ను మనం కొలవలేం.' అన్నాడు రమణ.

'మీ కుటుంబానికి అమ్మతో ఇంత అనుబంధం ఉన్నందుకూ,నువ్వూ అమ్మను చూచినందుకూ,అమ్మే నిన్ను తాకి నీకు బొట్టు పెట్టినందుకూ నాకు చాలా ఆనందంగా ఉంది.' అన్నాను. 

ఆఫీసు సమయం కావడంతో రమణ సెలవు తీసుకుని తన వింగ్ కు వెళ్ళిపోయాడు.నేను నా రూముకు బయల్దేరాను.