నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, జులై 2015, గురువారం

పుష్కర పాపం -3 (కర్ణపిశాచి సలహా)

సాయంత్రం పని ముగించుకుని ఇంటికొచ్చి కొద్దిగా రిలాక్స్ అవుతున్నా.

'ఏంటి కధ? ఏం చేస్తున్నావ్?' అంటూ ప్రత్యక్షమైంది కర్ణపిశాచి.

'ఏం లేదులే.ఏంటి విశేషాలు? మూడ్రోజుల్నించీ అడ్రసు లేవు.ఎక్కడికెళ్లావేం?' ప్రశ్నించా.

'గోదావరిలో పుష్కర స్నానం చేసి వస్తున్నా.' అంది నవ్వుతూ.

'అదేంటి నీక్కూడా అవసరమా?' అడిగా కుతూహలంగా.

'అవసరమే బాబూ.నేను రోజూ అక్కడ స్నానం చేస్తూనే ఉన్నా' అన్నది.

'పరాచికాలు ఆపి విషయం చెప్పరాదు?' అన్నా.

'సరే చెప్తా.విను. నువ్వు పాడిన 'చుట్టూ చెంగావి చీర' పాటలో చాలాసార్లు శృతి తప్పింది.గమనించావా? మళ్ళీ పాడు.' అంది.

'బాబోయ్ నావల్ల కాదు తల్లీ.ఏదో నాకు చాతనైనట్లు నేను పాడాను.పూర్తిగా బాలూగారిలా పాడాలంటే నావల్లకాదు.నేనేం పోటీలకెళ్ళడం లేదు.ఏదో సరదాగా హాబీలా పాడుకుంటున్నా.నన్నొదిలెయ్' అన్నాను.

'అలాకాదు.ఈ ఒక్కసారి ట్రై చెయ్యి.నీ ఎదురుగా నేనూ కూచుని వింటాను.' అన్నది ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడుతూ.

'సరే తప్పుతుందా' అనుకుంటూ మళ్ళీ ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడి మళ్ళీ అప్లోడ్ చేశాను.

'ఎలా ఉంది చెప్పు?' అడిగాను.

'నూటికి నూరుమార్కులు రావుగాని ఇంతకు ముందుకంటే పరవాలేదు.' అని తలాడించింది.

'సరే.నీ మాట విన్నాను గదా? ఇప్పుడు రాజమండ్రి పుష్కరంలో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి.' అడిగాను.

'సరే చెబుతా విను.'-అంటూ అక్కడ జరిగిన కధంతా పూసగుచ్చినట్లు వివరించింది.

నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

ఇంతలో ఫోన్ మ్రోగింది.

ఎవరా అని దాని వైపు చూచా.

'ఇంకెవరు?రాజమండ్రి నుంచి నీ వీర స్నేహితుడు.ఫోనెత్తు.నే మళ్ళీ వస్తా.' అంటూ మాయమైపోయింది.

'హలో.ఎలా జరుగుతున్నయిరా పుష్కరాలు.' అన్నా.

'బానే ఉన్నైలే గాని నువ్వెప్పుడొస్తున్నావ్?' అడిగాడు రామారావ్.

తను ఇప్పుడు స్పెషల్ డ్యూటీ మీద ఈ పదిహేనురోజులూ అక్కడే రాజమండ్రిలోనే ఉంటున్నాడు.

'ఈ హడావుడి అంతా తగ్గాక ఒక నెలాగి ప్రశాంతంగా వస్తాలే' - చెప్పా.

'ఊ!ఊ!చూస్తున్నా నీ పోస్టులు.అయినా అదేంట్రా టైటిల్ అలా పెట్టావ్? "పుష్కర పాపం" ఏంటి? నా బొందలా ఉంది?' అడిగాడు.

'అంటే -పుణ్యంకోసం అక్కడికి పోతే పాపం ఎదురై జనాలు నానా కష్టాలూ పడుతున్నారు.కొందరేమో ప్రాణాలే పోగొట్టుకున్నారు.అందుకని అలా పెట్టాలే టైటిల్ అంతకంటే వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు.' అన్నా.

'అది సరేగాని పుష్కరాలలో స్నానం చెయ్యడమే పాపం అన్నట్లు వ్రాస్తున్నావేంటి? మరీ ఘోరంగా ఉంది.మన మతాన్ని మనమూ విమర్శించి, ఇతర మతాల వాళ్ళూ విమర్శిస్తే ఎలారా?' అడిగాడు కోపంగా.

'ఆపరా బాబూ.నేనేమీ మన మతాన్ని విమర్శించేంత సాహసం చెయ్యడం లేదు.మన హిందూమతం అనేది ప్రపంచ మతాలన్నింటిలో అత్యంత ఉన్నతమైనదనీ విశాలమైనదనీ నాకు బాగా తెలుసు.కాకపోతే మన మతంలో సాగుతున్న కొన్ని నేలబారు పోకడలనీ, కొందరు పనిగట్టుకుని మన మతాన్ని కమర్షియల్ చెయ్యడాన్నే నేను విమర్శిస్తాను.ఈ పోకడలవల్ల ఋషిప్రోక్తమైన మన సనాతన హిందూమతం మరుగున పడిపోతున్నది. అదే నా బాధ.అంతేగాని మన మతాన్ని నేను విమర్శించడం ఏమిట్రా నీ మొహం?' అన్నాను.

'సరేలే.త్వరగా వచ్చి స్నానం కానిచ్చి పుణ్యం మూటగట్టుకో.'అన్నాడు నవ్వుతూ.

'ఈ మూడురోజుల్లో నువ్వెంత పుణ్యం సంపాదించావో చెప్పరా ముందు.ఆ తర్వాత నా సంగతి ఆలోచిస్తాను.అయినా రోజూ పాపాలు చేసే నీలాంటి వాళ్లకి ఆ స్నానాలూ గట్రా అవసరం గాని, నాకెందుకురా?' అన్నా నేనూ నవ్వుతూ.

'అదికాదురా.ఈ స్నానాల వల్ల పుణ్యం నిజంగా రాదంటావా?' అడిగాడు అనుమానంగా.

'చెప్తాగాని.ఒక విషయం చెప్పు.గోదావరి జలాలు పవిత్రమైనవనీ ఈ సమయంలో వాటికి ఇంకా ఎక్కువ పవిత్రత వస్తుందనీ నువ్వు నిజంగా నమ్ముతున్నావా?' అడిగాను.

'ఖచ్చితంగా నమ్ముతున్నాను.' అన్నాడు.

'ఓకే. మరైతే నదిలో స్నానం చేశాక బయటకొచ్చి మళ్ళీ పంపుదగ్గర స్నానం చేస్తున్నావా లేదా?' అడిగాను.

'చేస్తున్నాను' అన్నాడు.

'అదేంటి?అవి నిజంగా పవిత్రజలాలని నువ్వు నమ్ముతుంటే మళ్ళీ బయట స్నానం ఎందుకు?' అడిగాను.

'నీళ్ళు ఎర్రగా బురదనీళ్ళలా ఉన్నాయిరా.పైగా అంతమంది ఒకేచోట మునుగుతున్నారు.ఏం చర్మ రోగాలోస్తాయో అని భయంతో బయటకొచ్చాక డెట్టాల్ సబ్బుతో అయిదుసార్లు రుద్ది రుద్ది స్నానం చేస్తున్నా.' అని నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

'మరి ఇంకెక్కడి పవిత్రతరా నా బొంద?' అన్నాను.

'అవుననుకో.కానీ మన జాగ్రత్త మనకుండాలిగా' అన్నాడు.

'అదేమరి.అవి పవిత్రజలాలన్న భావన నీకు దృడంగా ఉంటే,నీకు పుణ్యం వస్తుంది.కానీ మళ్ళీ అవే నీళ్ళను నీవు అనుమానిస్తుంటే నీకు పుణ్యం రాదు. వచ్చిన పుణ్యంకాస్తా సబ్బు ఎకౌంట్లో అక్కడే అదే నీళ్ళలోకి కొట్టుకుపోతుంది. 'యద్భావం తద్భవతి'- అన్నా నవ్వుతూ.

'అదికాదురా.నిజం చెప్పవా ప్లీజ్' అడిగాడు.

'అలా అడుగు చెప్తా.ఏం లేదురా.జనం నీళ్ళలో మునగగానే వాళ్ళలో ఉన్న పాపాలన్నీ బయటకొచ్చి అక్కడ మెట్లమీదా చెట్లమీదా కూచుని వాళ్ళు స్నానం చేస్తుంటే చూస్తూ ఉంటాయి.వాళ్ళు బయటికి రాగానే మళ్ళీ ఎవరి పాపాలు వారిని ఆవహిస్తాయి.ఇది తప్ప అక్కడ ఇంకేమీ జరగదు.ఎవరో కొందరికి మాత్రం పాపప్రక్షాళన జరుగుతుంది.అది వారివారి నమ్మకాన్ని బట్టీ విశ్వాసబలాన్ని బట్టీ, దైవం అంటే వారికున్న భక్తిని బట్టీ ఉంటుంది.అంతే.' అన్నాను.

'అది సరేగాని, జ్యోతిష్యపరంగా పుష్కర చావులమీద నీ విశ్లేషణ ఏమిటి?' అడిగాడు.

'ఏముంది.వెరీ సింపుల్.అసలే 'రోహిణీ శకట భేదనం' జరుగుతున్నది.దానికి తోడు అమావాస్య నీడలో పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.అదీగాక మంగళవారం మొదటి రోజయ్యింది.ఇంకేం కావాలి? రోహిణీ శకట భేదనం మీద నా పాత పోస్ట్ లు ఒకసారి మళ్ళీ తిరగెయ్యి.జలప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయనీ,జననష్టం ఉంటుందనీ వ్రాశాను.ఇదీ ఒకరకమైన జలప్రమాదమే గదా.' అన్నాను.

'అవుననుకో.ఇలాంటి వాటిని తప్పించలేమా?' అడిగాడు సీరియస్ గా.

'ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టుకొచ్చావురా నువ్వు?అసలు మనమెందుకు ఆ పనికి పూనుకోవాలి?ఈ ప్రపంచంలో ఎవరి ఖర్మ వారిది.ఎవరి ఖర్మను వారు చేసుకుంటారు.అనుభవిస్తారు.మధ్యలో నీకెందుకు?' అన్నాను.

'మరి జ్యోతిష్యం ఉపయోగం ఏమిట్రా?' అడిగాడు.

ఇప్పటికి చాలాసార్లు వీడికి ఈ విషయం మీద జ్ఞానబోధ చేసి ఉన్నాను.అయినా వీడికి అర్ధం కావడం లేదని ఈ సారి వెరైటీగా చెబుదామని అనుకున్నా.

'జ్యోతిష్యం నిజమని ఎవరన్నార్రా?' అన్నా.

'అదేంట్రా అలా అంటున్నావ్? నువ్వేనా మాట్లాడేది?' అడిగాడు అయోమయంగా.

'అవున్రా అక్షరాలా నేనే.జ్యోతిష్యం అనేది ఏమీ తోచని నాబోటివాడూ నీబోటివాడూ మాట్లాడుకునే ఒక పనిలేని పనిరా.అంతకంటే ఇంకేమీ లేదుగాని, ఈరోజు ఎన్నిసార్లు స్నానం చేశావ్? గోదారిలో?'- అడిగాను. 

'పొద్దున్న ఒకసారి అయింది' అన్నాడు.

'మళ్ళీ ఇంకోసారి చేసి ఈరోజు ఎకౌంట్లో ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించు. స్నానం చేసి బయటకొచ్చాక మళ్ళీ బాత్రూంలో దూరి మంచినీళ్ళతో స్నానం చెయ్యకు.అప్పుడే నీకు పుణ్యం మిగులుతుంది.ముందా డెట్టాల్ సబ్బును అవతల పారెయ్యి.జ్యోతిష్యం సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం.నాకు వేరే పనులున్నాయి.ఉంటా.' అని ఫోన్ కట్ చేసేసా.