నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, జులై 2015, బుధవారం

ఆషాఢ పౌర్ణమి - కొన్ని ఫలితాలు

ఈ రోజు అధిక ఆషాడ పౌర్ణమి.

పౌర్ణమికి ప్రతిసారీ జరిగే ప్రపంచ విలయాలు ఈసారి కూడా మళ్ళీ గత రెండురోజులుగా జరిగాయి.జరుగుతున్నాయి.వాటిని నేను ఏకరువు పెట్టబోవడం లేదు.

వాటి సంగతి అలా ఉంచితే, ఈ సారి గురుశుక్రుల డిగ్రీ సంయోగం కర్కాటక రాశిలో ఈరోజున జరిగింది.ఈ సంయోగానికి స్థానం ఆశ్లేషా నక్షత్రం-4 పాదం అయింది.నవాంశలో వీరిద్దరూ మీనరాశిలో ఉన్నారు.మీనం శుక్రునికి ఉచ్చస్థానం.గురువుకు స్వక్షేత్రం.

పై గ్రహప్రభావాలవల్ల,ఈ రోజునా, ఇంకొక రెండు రోజులవరకూ ఈ క్రింది ఫలితాలను జనజీవనంలో గమనించవచ్చు.

ఉన్నట్టుండి మనుషులలో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది.అనుకోకుండా దేవాలయాలకు వెళ్ళడం,స్తోత్రాలు చదవడం,పూజలు చెయ్యడం జరుగుతుంది.

చాలా రోజులుగా చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న ధార్మిక కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యడం చూడవచ్చు.ఉదాహరణకు, ఎప్పటినుంచో లలితా సహస్రనామాలు చదువుదాం అని వాయిదా వేస్తున్నవారు ఈ సమయంలో చదవడం జరుగుతుంది.అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడమూ జరుగుతుంది.పూజలు అభిషేకాలు మొదలైనవి చేయించడం జరుగుతుంది.లేదా ఎప్పటినుంచో దేవాలయానికి వెళదామని వాయిదా వేస్తున్నలాంటి పనులు ఈ సమయంలో జరుగుతాయి.లేదా ఎప్పటినుంచో మొదలు పెడదామనుకుంటున్న జపధ్యానాలు ఈరోజున మొదలు పెడతారు.రోజూ కంటే ఇంకా ఎక్కువగా చేస్తారు.

స్త్రీల సమూహాలలో సామూహిక పారాయణాలు,సామూహిక పూజలు జరగడానికి ప్రేరేపణ కలుగుతుంది. స్త్రీలకు గౌరవం పెరుగుతుంది.లౌకిక జీవితంలో అయితే, మహిళా సమావేశాలు, చర్చలు, సెమినార్లు, ఆడవారి ఫంక్షన్లు జరుగుతాయి.ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చులు చెయ్యడం జరుగుతుంది.

నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు ఈ సమయంలో ఎక్కువగా అంతర్ముఖులౌతారు.జనసమూహాలకు దూరంగా వారి లోకంలో వారుంటారు.

అయితే దీనిలో ఇంకొక చీకటికోణం కూడా ఉన్నది.నక్షత్రాదిపతి బుధునిపైన శని రాహువుల దృష్టి వల్లా,నవాంశలో గురుశుక్రుల కున్న రాహుస్పర్శ వల్లా ఈరోజున అనేక అనైతిక కార్యకలాపాలు జరుగుతాయి.ఇవి ఎక్కువగా,బాగా డబ్బున్న హైసొసైటీ సర్కిల్స్ లో రహస్యంగా జరుగుతాయి. తాగుడు, తందనాలు,అమ్మాయిలతో కాలక్షేపాలు, విలాసాలకు డబ్బు ఖర్చు పెట్టడాలు మొదలైన చీకటిపనులు ఈరోజూ, రేపూ ఎల్లుండి కూడా జరుగుతాయి.

ధనుస్సు గాని మిథునం గాని లగ్నం లేదా చంద్రలగ్నం అయినవాళ్ళు--లేదా ఈ రెండు రాశులలో ముఖ్యమైన గ్రహాలున్నవారు ఈ సమయంలో బాగా డిస్టర్బ్ అవుతారు.తేలికగా ఉద్రేకానికి లోనౌతారు.రకరకాలైన ఆలోచనలు వారిని స్థిమితంగా ఉండనివ్వవు.నిద్రలో కూడా ఈ మూడురోజులూ విచిత్రమైన కలలు వీరిని వెంటాడుతాయి.

ఛాతీ మరియు గుండె సంబంధ వ్యాధులున్నవారికి ఈ మూడురోజులూ ప్రమాదకరం. జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

మీమీ జీవితాలలో వీనిని గమనించి చూచుకోవచ్చు.