Pages - Menu

Pages

20, జులై 2015, సోమవారం

నాసిక్ త్రయంబకం నుంచి మా ఇంటికొచ్చిన గోదావరి మాత

సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పనులు ముగించుకుని,ధ్యానంలో కొంతసేపు ఉండి లేచే సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.

ఇంత రాత్రి సమయంలో ఎవరబ్బా? అని తేరి చూచేలోపు 'అన్నగారు నమస్తే' అంటూ చరణ్ లోపలికి వస్తూ కనిపించాడు.

'రా తమ్ముడూ' అంటూ ఆహ్వానించాను.

మంచినీళ్ళు త్రాగి ప్రశాంతంగా కాసేపు కూర్చున్న తర్వాత -'అన్నగారు ఇవి స్వీకరించండి' అంటూ సంచిలోనుంచి ఒక్కొక్క వస్తువూ తీసి దోసిలితో జాగ్రత్తగా నా ముందు ఉంచాడు. అవి -- ఒక సీసాలో నీళ్ళు, ఒక ప్లాస్టిక్ కవర్లో ప్రసాదం, ఒక దానిమ్మకాయ.

'ఏంటి తమ్ముడూ ఇవి?' అని అడిగేలోపు తనే --' అన్నగారు. గోదావరి జలం-త్రయంబకేశ్వరుని ప్రసాదం-షిర్డీ సాయిబాబా ప్రసాదం.' అన్నాడు.

ఈ లోపు మా శ్రీమతి అందుకుని -'రాజమండ్రి నుంచి వస్తున్నావా?' అన్నది.

'అబ్బే.రాజమండ్రి మనకెందుకు వదినగారు? సరాసరి నాసిక్ త్రయంబకం లోని 'రాంకుండ్' నుంచి  గోదావరిని తెచ్చా.' అన్నాడు నవ్వుతూ.

'ఎప్పుడు వెళ్ళావు తమ్ముడూ?'అడిగాను.

'అనిపించింది.వెళ్లి వచ్చానన్నగారు.అంతే.' అన్నాడు కూచుంటూ.

'ఎలా ఉంది అక్కడ?' అడిగాను.

'ఏం చెప్పమంటారు అన్నగారు?నాసిక్ ముందు అసలు మన రాజమండ్రి ఏం ఆగుతుంది?నాసిక్ దగ్గర నాలుగు రహదారుల రోడ్లమీద 26 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జాం అయిపొయింది.దాదాపు 10,000 కార్లు అలా పడేసి ఉన్నాయ్.26 కిలోమీటర్లు నడకే.'--అన్నాడు.

'అలాగా' అన్నా.

'అవునన్నగారు.అసలు మహారాష్ట్రా వాళ్ళ భక్తిభావం ముందు మనవాళ్ళ కాకిగోల చాలా అసహ్యంగా అనిపిస్తున్నది.మనంత గోలగా అక్కడ లేదు. త్రయంబకంలో అయితే 200 రూపాయల క్యూనే మూడు కిలోమీటర్ల పొడవున ఉన్నది.కానీ తోపులాట లేదు.ఇక మామూలు దర్శనం సంగతి చెప్పనక్కరలేదు.అదెక్కడ మొదలైందో కూడా అంతు తెలియనంత పొడవున ఉన్నది.మేమక్కడకు వెళ్లినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అంతా మబ్బులు పట్టి సన్నగా చినుకులు పడుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నది.అక్కడ మన తెలంగాణా వాళ్ళే పురోహితులు దొరికారు.చక్కగా అన్నీ చేసుకుని వచ్చాము.అక్కడ నుంచి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుని గుంటూరు వచ్చేశాము.చూచారా? మీరు గోదావరి దగ్గరకు రాకపోయినా తనే మీ దగ్గరకు వచ్చింది నాసిక్ నుంచి?' అన్నాడు.

'నాసిక్ లో ఏ ఘాట్ నుంచి తెచ్చావు?'అడిగాను.

'రాం కుండ్' అని అక్కడ ఉన్నది అన్నగారు.అక్కడే రాములవారు ఉన్న సమయంలో ఆయనకు దశరధుని మరణవార్త తెలుస్తుంది.ఈ తీర్ధంలోనే ఆయన తన తండ్రికి పితృతర్పణం గావించారు.ఆ తీర్ధంలోని నీళ్ళే ఇవి.' అన్నాడు.

'నాగమహాశయుని జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది తమ్ముడూ' అన్నాను.

'ఏంటది అన్నగారు?మీరు నాకు ఆ పుస్తకం ఇచ్చారు.అమ్మో?ఏం జీవితం అన్నగారు ఆయనది?' అన్నాడు.

'అవును తమ్ముడూ.ఆయన శ్రీరామకృష్ణుల గృహస్థభక్తుడు.భగవాన్ ఆయనతో ఇలా అన్నారు.'నువ్వు నీ ఇంటిలో కదలకుండా ఉండు. మహనీయులు నిన్ను వెదుక్కుంటూ నీ దగ్గరకే వస్తారు.అన్నీ నీ దగ్గరకే వస్తాయి.'ఆ మాటను పట్టుకుని,ఆయన జీవితమంతా ఏ యాత్రకూ వెళ్ళకుండా ఇంటిలోనే ఉన్నాడు.మహనీయులు ఆయన దగ్గరకే వచ్చారు. చివరకు గంగామాత కూడా ఆయన ఇంటికే వచ్చింది.నీకొక సంగతి చెప్పనా చరణ్? నందానందస్వామి నాతో సరిగ్గా ఇదే మాట అన్నారు.ఆ విషయం మన 'శ్రీవిద్యా రహస్యం'లో వ్రాశాను కూడా.చదివావా?' అడిగాను.

'చదివానేమో గుర్తులేదన్నగారు.నాగమహాశయుని జీవితంలో ఈ సంఘటన ఎలా జరిగింది?' అడిగాడు చరణ్.

'నాగమహాశయుని తండ్రి అవసాన దశలో మంచంలో ఉన్నాడు.ఆ సమయంలో గంగానదికి పుష్కరాలు వచ్చాయి.వాటిలో స్నానం చెయ్యాలని ఆ ముసలి తండ్రి కోరిక.కానీ గంగానదికి వెళ్ళాలంటే చాలా మైళ్ళు ప్రయాణం చెయ్యాలి.ఆ స్థితిలో అది సాధ్యం కాదు.అందుకని తండ్రి మాటమాటకీ అడిగినా కూడా నాగమహాశయుడు మౌనంగా ఉండిపోయాడు.తండ్రికి కోపం వచ్చి 'ఈ చివరి కోరికను కూడా తీర్చని నువ్వేం కొడుకువి?' అని తిడతాడు కూడా.దానికీ నాగమహాశయుడు చలించడు.

ఇలా ఉండగా ఒకరోజున వాళ్ళ ఆవరణలో ఒక మూలగా నీటి ఊట రావడం మొదలై, మహా ప్రవాహంగా మారి ఆవరణ అంతా నీరు నిండిపోయి చివరకు ఇంటిలోకి కూడా ఆ నీరు వచ్చేస్తుంది.తండ్రిగారు పడుకుని ఉన్న మంచం వరకూ ఆ నీరు వస్తుంది.అప్పుడు నాగమహాశయుడు ఆనందంతో నృత్యం చేస్తూ -' అమ్మా గంగామాతా ! నువ్వే వచ్చావా? గురుదేవా? నీ అనుగ్రహం ఎంత గొప్పది? నా తండ్రి చివరి కోరికను ఇలా తీర్చావా?' అంటూ ఆ నీటితో తండ్రిని స్నానం చేయిస్తాడు.ఆ తర్వాత ఆ జల అంతా ఇంకిపోవడం మొదలు పెట్టి ఒక పూటలో మళ్ళీ నీరంతా భూమిలోకి వెళ్ళిపోతుంది.భగవాన్ లీలలు అలా అత్యంత సహజంగా అనూహ్యంగా ఉంటాయి.ఇది జరిగిన సంఘటనే. నీకిచ్చిన పుస్తకంలో ఉంది చదువు.' అన్నాను.

'ఏం జీవితాలు అన్నగారు వాళ్ళవి?'- అన్నాడు చరణ్ తన్మయత్వంతో.

'అవును తమ్ముడూ.నాగమహాశయుడు సామాన్యుడు కాదు.సాక్షాత్తూ వివేకానందస్వామే ఆయన పాదాలకు నమస్కరించాడంటే ఆయన స్థితి ఏమిటో ఊహించుకో.ఆయన పేరు దుర్గాచరణ్ నాగ్.నీ పేరు దుర్గాశంకర చరణ్.అంతే తేడా.'-అన్నాను నవ్వుతూ.

'అవునన్నగారు.మా నాన్నగారు కాళీభక్తుడు.1963 లో ఆయన దక్షినేశ్వర్ వెళ్లివచ్చాడు.ఆ తర్వాతే నేను పుట్టాను.అందుకే పేరు అలా పెట్టాడు.' అన్నాడు చరణ్.

'ఇంకొక విషయం విను.నాగమహాశయుడు హోమియో డాక్టరు.భారతదేశంలో హోమియో పతీ వైద్యపు పయనీర్లైన రాజేంద్రలాల్ దత్తా మొదలైన ఉద్దండుల వద్ద ఆయన హోమియో వైద్యం నేర్చుకున్నాడు.కానీ ఒకరోజున భగవాన్ ఎవరితోనో అన్న మాటలు ఆయన విన్నాడు.

భగవాన్ ఒకరోజున ఇలా అన్నారు.'లాయర్లకూ వైద్యులకూ భగవంతుని దర్శనం కలగడం అసంభవం.అది జరిగే పనికాదు.'

ఎందుకంటే ఈ ఇద్దరి మనస్సులు ఎంతసేపూ మోసంతో నిండి ఉంటాయి. డబ్బు మీద ఆశతో ఉంటాయి.అందుకని అలాంటివారికి భగవంతుని దర్శనం ఎలా దక్కుతుంది?అందుకే భగవాన్ ఈ మాటను అన్నారు.ఆయన సరాసరి నాగమహాశయునితో ఈ మాటను అనలేదు.ఒక రోజున భక్తులతో అంటుండగా ఈయన విన్నాడు.

వెంటనే ఇంటికెళ్ళి తన హోమియో పుస్తకాలూ మందుల పెట్టెలూ అన్నీ మూటగట్టి గంగలో పారవేశాడు.ఆ తర్వాత మళ్ళీ వాటివైపు చూడలేదు.

'మరి జీవనం ఎలా అన్నగారు?' అడిగాడు చరణ్.

'నాకేది అవసరమో అది గురుదేవులు ఇస్తారు' అనేవాడాయన.అంతే.అదొక అచంచలమైన నమ్మకం.

'తన జీవితమంతా దుర్భరమైన పేదరికంలో గడిపినా సరే, చినిగిన బట్టలు కట్టుకుని, పైన తాటాకులు కూడా సరిగ్గా లేని ఒక పూరిపాకలో ఉంటూ, గాలివాన వచ్చినపుడు ఆ తాటాకులు కూడా ఎగిరిపోయి ఆ వానలో అలా వణుకుతూ ఆ గుడిసెలో రాత్రంతా ఉండవలసి వచ్చినా సరే, మళ్ళీ ఆయన తనకు జీవనోపాధిని ఇస్తున్న ఆ వైద్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గురుదేవులు ఒక మాట అన్నారు.దానిని తను ఆచరించాలి.అంతే.తన జీవితం ఏమైపోయినా పరవాలేదు.అదొక్కటే ఆయన ఆలోచన.'-- అన్నాను.

చరణ్ కాసేపు దిమ్మెరపోయి అలా ఉండిపోయాడు.

చివరకు తేరుకుని -'ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నగారు?' అడిగాడు.

'ఉంటారా ఏమిటి? ఉన్నారు.శ్రీరామకృష్ణుల గృహస్థభక్తులు అందరూ ఇలాంటి ఆణిముత్యాలే.ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉజ్జ్వలమైన జీవితం.అదిసరేలే గాని పక్కనే రాజమండ్రిలో గోదావరిని పెట్టుకుని అంతదూరం వెళ్లాలని అసలు నీకెందుకనిపించింది?' అడిగాను.

'ఏమో తెలీదన్నగారు.అనిపించింది పోయొచ్చాను.మీకు ఇవ్వాలనిపించింది తెచ్చి ఇస్తున్నాను.ఎందుకో నాకే తెలీదు.' అన్నాడు.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడి చరణ్ సెలవు తీసుకున్నాడు.

ఆ విధంగా నాసిక్ త్రయంబకం నుంఛి గోదావరిమాత ఈ సోమవారం రోజున సరాసరి మా ఇంటికొచ్చింది.

'భక్తుడు మరచిపోయినా భగవంతుడు మరచిపోడు'-- అంటే ఇదేనేమో?