Pages - Menu

Pages

30, జులై 2015, గురువారం

అబ్దుల్ కలాం మరణం -- సమయానికి అందని వైద్యసహాయం

అబ్దుల్ కలాం గారి మరణానికి వెనుక గల జ్యోతిష్య కారణాలనూ, రామేశ్వరంలో పుట్టిన ఆయన షిల్లాంగ్ లో మరణించడానికి వెనుక గల కర్మరహస్యాలనూ కొద్దిసేపు పక్కన ఉంచితే, ఒక పెద్ద పేరుగాంచిన విద్యాసంస్థలో ఉపన్యాసం ఇస్తూ ఇస్తూ కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఒక దేశపు మాజీ రాష్ట్రపతికి వెంటనే అందవలసిన వైద్యసహాయం అందలేదనేది మాత్రం చేదువాస్తవం.

ఈ విషయాన్ని ఏ మీడియా అయినా చెబుతున్నదో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఈ దేశపు రాజకీయాల మీదా, వాటి తొత్తైన మీడియా మీదా ఏమాత్రం నమ్మకం లేదుగాబట్టి, నేను టీవీ చూడను గాబట్టి.

కలాంగారికి గోల్డెన్ అవర్ లో వైద్య సహాయం అందలేదు.

ఇది పచ్చినిజం.

మన దేశంలో మనుషులకు వాగుడెక్కువ,సమయానికి చెయ్యవలసిన పనిని చెయ్యడం మాత్రం తక్కువ అని నా నమ్మకం ఇప్పటిది కాదు.కనీసం నాకు ఊహ వచ్చినప్పటినుంచీ ఈ నమ్మకం నాలో ఉన్నది.ఆ నమ్మకం అనేక సంఘటనలను చూచిన మీదట ఏర్పాటైనది గాని ఏదో గాలివాటంగా ఏర్పరచుకున్నట్టిది కాదు.

గతంలో నా ఈ నమ్మకం ఎన్నోసార్లు రుజువౌతూ వచ్చింది. ప్రస్తుతం కలాం గారి మరణం చూచిన తర్వాత అది నిజమే అని మరొక్కసారి రుజువైంది.

ఒక మనిషికి C.A (Cardiac Arrest) అయినప్పుడు పది సెకన్ల లోపే గనుక C.P.R (Cardiac Pulmonary Resuscitation) గనుక చెయ్యగలిగితే అతన్ని నూటికి 99 కేసుల్లో తప్పకుండా బ్రతికించవచ్చు.ఈ సంగతి డాక్టర్లకందరికీ తెలుసు.డాక్టర్ల వరకూ ఎందుకు? నర్స్ ట్రైనింగ్ అయిన వారికి కూడా ఈ విషయం బాగా తెలుసు.ప్రస్తుతం సివిల్ వాలంటీర్లకు, ఎమర్జెన్సీ వర్కర్లకు, డిజాస్టర్ మేనేజిమెంట్ టీం మెంబర్లకు, సాధారణ పౌరులకు కూడా ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలో శిక్షణ ఇస్తున్నారు.కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా C.P.R చెయ్యడానికి పూనుకోకపోవడమూ అంతేగాక ఆయన్ను వెంటనే కారులో పడేసి అరగంట సేపు డ్రైవ్ చేస్తూ ఆస్పత్రికి తీసుకు పోవడమూ వాళ్ళు చేసిన ఘోరమైన పొరపాటు.

ఆ సమయాన్నే గోల్డెన్ అవర్ అంటారు.ఆ సమయంలో ప్రతి నిముషమూ విలువైనదే.ఒక్కొక్క నిముషం గడచేకొద్దీ కార్డియాక్ అరెస్ట్ అయిన మనిషి పూర్తిగా మరణపు ఛాయలోకి అతివేగంగా జారిపోతూ ఉంటాడు.

అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే C.P.R ప్రాసెస్ చెయ్యకపోవడమే కలాం గారి మరణానికి అసలైన కారణం.అంత ఉన్నత విద్యావంతులున్న I.I.M లో కనీసం కృత్రిమశ్వాస ఇవ్వడంలో శిక్షణ కూడా ఎవ్వరికీ లేదంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు.మినిమం లైఫ్ సేవింగ్ స్కిల్స్ కూడా లేని అక్కడి ట్రెయినీలు బయటకొచ్చి చేసేదేమిటి? కంపెనీలు పెట్టి,వైట్ కాలర్ మోసాలూ ఆర్ధికనేరాలూ తెలివిగా చేసి అవినీతి రారాజులు కావడమా? లేక MNC ప్రాడక్ట్స్ మన దేశంలో విచ్చలవిడిగా అమ్మడానికి ఏజంట్లుగా మారి దేశసంపదను విదేశీకంపెనీలు కొల్లగొట్టడంలో తమవంతు పాత్రను నిస్సిగ్గుగా పోషించడమా?మినిమం లైఫ్ సేవింగ్ స్కిల్స్ లేని ఆ I.I.M ట్రెయినింగ్ అసలు ఎందుకు?

పైగా -- ఆయన ఇప్పటికే హార్ట్ పేషంట్ అని అందరికీ తెలుసు.అలాంటి హృద్రోగి అయిన ఒక మాజీ రాష్ట్రపతి పక్కన ఎమర్జెన్సీ సహాయానికి ఒక్క డాక్టరు కూడా లేకపోవడం ఏమిటి? సమయానికి ఇవ్వవలసిన వైద్య సహాయం అందక ఆయన అలా చనిపోవడం ఏమిటి? ఇప్పుడు ఎన్ని రాజలాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది?

మన దేశంలో ఉపన్యాసాలు ఇచ్చేవారు చాలా ఎక్కువ.ఉత్తమాటలు చెప్పేవారు కూడా చాలా ఎక్కువ.కానీ సమయానికి చెయ్యవలసిన పని చేసేవారు మాత్రం చాలా చాలా తక్కువ.

మాటలు తగ్గించి నైపుణ్యాలు పెంచుకోవడం చాలా అవసరం అనీ, సమయానికి ఉపయోగపడని స్కిల్స్ అన్నీ వృధా అనీ ఈ సంఘటన మళ్ళీ నిరూపిస్తున్నది.

రోడ్డు మీద యాక్సిడెంట్ అయి సమయానికి సహాయం అందక చనిపోయిన సామాన్యుడికీ, ఒక ఉపన్యాసం ఇస్తూ కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిపోయి, సమయానికి వైద్య సహాయం అందక మరణించిన మాజీ రాష్ట్రపతికీ ఏమీ భేదం లేదు - ఘనత వహించిన మన దేశంలో.

సమన్యాయం అంటే ఇదేనేమో?

ఒకవేళ సమన్యాయం ఇదే అయితే మాత్రం, మన దేశంలో వెల్లివిరుస్తున్న ఈ రకమైన సమన్యాయాన్ని చూచి కొద్దిగానైనా ఆలోచనా,మనసూ మిగిలున్న కొద్దిమంది కూడా సిగ్గుతో తలలు వంచుకోక తప్పదు.

మారుమూల పల్లెలలో కూడా వైద్యులుండాలి.అతి పేదవాడికి కూడా వైద్యం అందాలి --అని స్టేజీలేక్కి అరిచే నాయకులు ఒక మాజీరాష్ట్రపతికి పట్టిన ఈ గతికి ఏం సమాధానం చెబుతారో?

అయినా, నా పిచ్చిగానీ, ఈ దేశంలో ఎవరు ఎవరికి జవాబుదారీ గనుక? ఎవరు ఎవరికి జవాబు చెప్పాలి గనుక?

మన గతిచూసి ఇతర దేశాలు పగలబడి నవ్వుతున్నాయన్న జ్ఞానం అయినా మనకు లేకపోవడం భావనైచ్యానికి పరాకాష్ట.

ఓ మహానుభావా! మళ్ళీ పుట్టవా? అని అరిచేవారంతా-, "ఓరి వెధవల్లారా!బ్రతికున్నపుడు చివరిక్షణంలో మీరు నాకేం చేశారు? రక్షించవలసిన సమయంలో ఆ పని చెయ్యకుండా అరగంట సేపు నన్నెందుకు కారులో పడేసి తిప్పారు? నా ప్రాణాలెందుకు మీ చేతులారా తీశారు? నేనెందుకు ఇలాంటి దేశంలో మళ్ళీ పుట్టాలి? మీ మధ్యకెందుకు నేను మళ్ళీ రావాలి?"- అని కలాం ఆత్మ ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతారో?  

ఇలాంటి ప్రజలతో ఈ దేశం అసలెప్పటికి బాగుపడుతుందో?