నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2015, శుక్రవారం

గురువు - దేవుడు - ఆత్మ

"ఈశ్వరో గురురాత్మేతి"..అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.అంటే, దైవము, గురువు,ఆత్మా ఒక్కరే అని అర్ధం.

గురుపూర్ణిమ సందర్భంగా ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ అసలైన ఒక్క విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.ఒకవేళ ఎవరైనా నాబోటివాడు చెప్పినా ఎవరూ పాటించడమూ లేదు.

అదేంటంటే - మనుషులు గురువును పూజిస్తారు గాని గురుబోధను పాటించరు.అలాగే దేవుడిని పూజిస్తారు గాని దేవుడిని (చేరాలని) కోరుకోరు.

ఇదే మానవజాతి ఆడుతున్న అతి పెద్దనాటకం.ఈ నాటకాన్ని గమనించలేనంత తెలివితక్కువ వాళ్ళు కారు దేవుడూ గురువూ.

గురుబోధను పాటించాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.దీనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.

దైవాన్ని చేరుకోవాలంటే నువ్వే అదృశ్యం కావాలి.దీనికీ ఎవరూ సిద్ధంగా లేరు.

మరి మహాభక్తులుగా నటిస్తున్న ఈ లోకులందరూ ఏం చేస్తున్నారు?

"మేము నీ బోధను పాటించము.కానీ మేము కోరిన వరాలు మాకివ్వు. కష్టాల్లో మాకు అండగా ఉండు" - అని గురువు చుట్టూ చేరి గోల పెడుతున్నారు.

"నువ్వు మాకక్కర్లేదు.మేం చేసే పూజలు స్వీకరించి మేము కోరుకునే వరాలు మాత్రం మాకివ్వు" - అని దేవుడితో చెబుతున్నారు.

వెరసి దైవాన్నీ గురువునూ మానవులు అడ్డంగా తిరస్కరిస్తున్నారు.వాళ్ళ దగ్గర ఉన్న వరాలిచ్చే శక్తిని మాత్రం వీళ్ళు దోపిడీ చెయ్యాలని చూస్తున్నారు. అదికూడా పూజ అనే లంచం ఆశచూపించి.అంటే - లోకంలో ఆడే నాటకాలనే దైవం దగ్గర,గురువు దగ్గరా కూడా ఆడాలని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఆడుతున్నారు కూడా.

మనుషులకు నిజంగా కావలసింది దేవుడూ కాదు గురువూ కాదు.వాళ్లకు కావలసింది సెక్యూరిటీ మాత్రమే.ఒక మానసిక ఆసరా మాత్రమే వాళ్లకు కావాలి.వారు ఆడే రోజువారీ నాటకాలకు ఒక డివైన్ సపోర్టూ డివైన్ శాంక్టిటీ మాత్రమే వారికి కావాలి.మేము చేస్తున్నవి పాపాలు కావు,మేము చేస్తున్నవి తప్పులు కావు - అన్న భరోసా మాత్రమే వారికి కావాలి.ఒకవేళ అవి తప్పులూ పాపాలూ అయినా సరే వాటిని ఎల్లకాలమూ క్షమిస్తూ, 'నీ పద్ధతి మార్చుకో' అని చెప్పకుండా,వీళ్ళు పెడుతున్న బెల్లమూ మరమరాలూ కొబ్బరి ముక్కలూ తింటూ నోర్మూసుకుని పడుండే దేవుడే వీరికి కావాలి.

"నువ్వు నడుస్తున్న దారి తప్పుదారి.అది సరియైన దారి కాదు.నువ్వు మారాలి." అని చెప్పే గురువునూ దేవుడినీ మనుషులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు.

తమతమ స్వార్ధపూరిత అవసరాలకోసం,దేవుడిని పూజించినట్లు మనుషులు నటిస్తారు.గురువు చెప్పినది విన్నట్లు నటిస్తారు.కానీ ఈ రెండూ త్రికరణశుద్ధిగా మాత్రం ఎవ్వరూ చెయ్యరు.

ఈ క్రమంలో గురువుకూ దైవానికీ నిజానికి దూరం అవడమే గాక, వారికి ప్రతిరూపం అయిన తన ఆత్మకు కూడా దూరమై పోతున్నారు.ఈ మూటికీ దూరమైన వానికి జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? అందుకే నేడు ఎవరి జీవితాలు చూచినా శాంతి మాత్రం లేదు.మిగిలినవన్నీ ఉండవచ్చు.కానీ శాంతి మాత్రం లేదు.

దానికి అసలైన కారణం దైవానికీ, గురువుకూ,ఆత్మకూ దగ్గరౌతున్నామన్న భ్రమలో ఉంటూ ఇంకా ఇంకా దూరం కావడమే.

మానవులు ఈ మోసపూరితమైన తమ మనస్తత్వాన్ని పోగొట్టుకోనంత వరకూ వారికి శాంతి ఎప్పటికీ దొరకదు.

ఇది రేపటి సూర్యోదయమంత నిజం.