Pages - Menu

Pages

8, ఆగస్టు 2015, శనివారం

జన్మదిన ఆధ్యాత్మిక సమ్మేళనం -2015
























































































6-8-2015 తిధుల ప్రకారం నేను పుట్టినరోజు గనుక 6,7 తేదీలలో ఆధ్యాత్మిక సమ్మేళనం గుంటూరులో నిర్వహించాను.దీనికి పంచవటి గ్రూపు సభ్యులు 20 మంది హాజరయ్యారు.వీరందరూ చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్, అనంతపురం,విజయనగరం,విజయవాడల,ఆర్మూర్ ల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదటి రోజున - అతి నిరాడంబరంగా జరిగిన పూజా కార్యక్రమం తర్వాత, తొమ్మిది నుంచి ఒంటిగంట వరకూ, శంకరాచార్య విరచితమైన 'దక్షిణామూర్తి స్తోత్రాన్ని' ఒక్కొక్క శ్లోకం తీసుకుని దాని విశేషార్ధంతో సహా వివరించడం జరిగింది.

ఇది పది శ్లోకాలతో కూడిన స్తోత్రమే అయినప్పటికీ,"అద్వైత వేదాంత సారం" అని చెప్పవచ్చు.శంకరులు పదే పది శ్లోకాలలో అద్వైతం మొత్తాన్నీ ఎలా కుదించి చెప్పారో పరమాద్భుతంగా ఉంటుంది.ప్రపంచం మిధ్య, దాని ఉనికి మొత్తం "నేను" అనే నీ ఎరుక మీద ఆధారపడి ఉన్నది అని మొదటి శ్లోకంలో చెబుతూ మొదలుపెట్టి, చివరకు వచ్చేసరికి చరాచర జగత్తు సమస్తమూ పరమేశ్వరవ్యాప్తమనీ,అదంతా అష్టమూర్తి అయిన ఆయన విభూతి అనీ చెప్పి ముగిస్తారు.శంకరులు వ్రాసిన అనేక గ్రంధాల లాగే ఇది కూడా అత్యద్భుతమైన గ్రంధం.ఆకారంలో అతి చిన్నదైనా, అర్ధంలో అత్యంత పెద్దది.

భోజనం తర్వాత, సాయంత్రం వరకూ జ్యోతిష్య క్లాస్ జరిగింది.జనన కుండలిని ఎలా విశ్లేషణ చెయ్యాలో కొన్ని చార్టులను తీసుకుని వివరిస్తూ, మధ్య మధ్యలో సభ్యుల చార్టులను చూస్తూ,జోకులతో నవ్వులతో ఈ కార్యక్రమం జరిగింది.

ఆ సాయంత్ర సమయంలోనే సూర్యహోరలో మా సంస్థ కొత్త వెబ్ సైట్ "Ma Panchawati.org" ను ప్రారంభం చెయ్యడం జరిగింది. సభ్యులు రాజూ సైకం, యోగేశ్వర్ లు కష్టపడి ఈ వెబ్ సైట్ ను రూపొందించారు.

చీకటి పడిన తర్వాత ఒక గంటసేపు జరిగిన సామూహిక ధ్యానంతో ఆరోజు కార్యక్రమం ముగిసింది.తరువాత అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించాము.

రెండో రోజున ఎక్కడకు వెళదామా? అని ముందే ఆలోచన వచ్చింది.ఎక్కడికో ఎందుకు?మాతృప్రేమకు నిలువెత్తు నిదర్శనం అయిన అమ్మ ఉన్న జిల్లెళ్ళమూడికి తప్ప ఏ గుడులూ గోపురాలకూ వెళ్ళనవసరం లేదని నిశ్చయానికి వచ్చాను.

మరుసటి రోజు ఉదయం నాలుగింటికే లేచి 5 నుంచి 6.30 వరకూ సభ్యులందరితో యోగాభ్యాసం చేయించాను.డాబామీద చిరుజల్లు పడుతున్నప్పటికీ ఎవరూ కదలకుండా ఆ జల్లులో అలాగే యోగాభ్యాసం చేశాము.ఆ తర్వాత 8 గంటలకు బయలుదేరి మూడు కార్లలో జిల్లెళ్లమూడికి వెళ్ళడం జరిగింది.అక్కడ రోజంతా వసుంధరక్కయ్య వంటి మహనీయుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో, ధ్యానమగ్నతలో గడపి రాత్రి 8 కి మళ్ళీ గుంటూరు చేరుకోవడంతో ఈ రెండురోజుల ఆధ్యాత్మిక సమ్మేళనం ముగిసింది.సభ్యులందరూ రాత్రికి బయల్దేరి ఈ రోజు ఉదయానికి ఎవరెవరి ఊర్లకు వారు చేరుకున్నారు.

నా దృష్టిలో వసుంధరక్కయ్య - నేడు జీవించి ఉన్న అనేకమంది గురువులకంటే, అనేకమంది సెయింట్స్ కంటే ఉన్నతమైన సెయింట్. 1958 లో అమ్మదగ్గరకు తను వచ్చింది.అప్పటినుంచీ 1985 వరకూ అమ్మ దగ్గరే ఉన్నది.అనుక్షణం అమ్మ పక్కనే ఉంటూ, తనకు కావలసినవి చూస్తూ,చివరి సమయంలో కూడా అమ్మకు సేవ చేసిన మహాపుణ్యాత్మురాలు.అంతటి అదృష్టం పట్టాలంటే ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి? మనలా పిచ్చి జీవితాలు గడపకుండా, ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం జీవితాన్ని త్యాగం చేసి,ఆజన్మ బ్రహ్మచారిణిగా అలా ఉండిపోయింది.నిరంతరం అమ్మ ధ్యానంలో పునీతురాలైన మహా ఉత్తమురాలు.మౌనంగా,నిరాడంబరంగా,అజ్ఞాతంగా జిల్లెళ్ళమూడిలో నేటికీ మన కళ్ళెదురుగా కనిపిస్తున్న మహనీయురాలు. అటువంటి వారి దగ్గరకు కాకపోతే ఇంకెవరి దగ్గరకు మనం వెళ్ళాలి?

ఈ రెండురోజులూ ప్రతిక్షణమూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే సభ్యులు గడపడమూ, వేరే ఎటువంటి అనవసర సంభాషణలూ లేకుండా పూర్తిగా ధ్యానచింతనలో ఉండటమూ, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడమూ జరిగింది.సభ్యులలో చాలామందికి - వారి వారి లోపాలు ఏమిటి? ఎలా వాటిని దిద్దుకోవాలి? నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది? - అన్న విషయాలు ప్రాక్టికల్ గా అర్ధమయ్యాయి.

అన్నిటినీ మించి అందరూ ఒకే కుటుంబంలా కలసిపోయి ఈ రెండురోజులూ చాలా ఆహ్లాదంగా సంతోషంగా నవ్వుతూ ఉండటం జరిగింది.

'మేము ఎంతోమందిని చూస్తుంటాము.కానీ ఇంత ఆత్మీయతగా,ఇంత ఆర్తిగా, ఇంత క్రమశిక్షణగా ఉన్న గ్రూప్ ను చాలా ఏళ్ళ తరువాత చూస్తున్నాము.' అని జిల్లెళ్ళమూడిలో ఒకరు అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.మనకు ఇంత మంచి కామెంట్ రావడానికి సహకరించిన పంచవటి గ్రూప్ సభ్యులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విశ్వజననీ పరిషత్ కార్యవర్గ సభ్యులలో ముఖ్యులు --" మీ 'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని చదివాము.చాలా అద్భుతంగా ఉన్నది." అని అనడం ఇంకా సంతోషాన్నిచ్చింది.

'నాకేం తెలీదన్నయ్యా ! అమ్మ వ్రాయించింది. వ్రాశాను.' అని సమాధానం చెప్పాను.

'అమ్మ మీకోసం వ్రాయించలేదు.మాకోసం వ్రాయించింది.' అని ఒక అక్కయ్య అన్నది.

ఏదో అనుకోకుండా వెళ్ళిన మాతో,వారు ఆ మాట అనడం మమ్మల్ని కూచోబెట్టి బట్టలు పెట్టడం,తమ పక్కన కూచోబెట్టుకుని భోజనం పెట్టించడం ఇదంతా - అమ్మే ఆ మాట అన్నట్లు,తనే తన చేత్తో మాకు బట్టలు పెట్టినట్లు, తనే మాకు స్వయంగా వండి అన్నం పెట్టినట్లు ఒక అలౌకికమైన అనుభూతిని నాకు కలిగించింది. ఇంతకంటే ఇంకేం కావాలి?

ఓపికగా ఈ కార్యక్రమం మొత్తాన్నీ దాదాపు 450 ఫోటోలలో బంధించిన సునీల్ వైద్యభూషణ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.