Pages - Menu

Pages

17, ఆగస్టు 2015, సోమవారం

సిస్టర్ నివేదిత జాతకం


సిస్టర్ నివేదిత 28-10-1867 న ఐర్లాండ్ లో పుట్టింది.13-10-1911 న డార్జిలింగ్ లో చనిపోయింది.ఈ మధ్యన 43 ఏళ్ళలో ఆమె ఒక ఉజ్జ్వలమైన జీవితాన్ని గడిపింది.ఐరిష్ వనితగా క్రైస్తవ మత విశ్వాసపు కుటుంబంలో పుట్టి వివేకానందస్వామి శిష్యురాలుగా మారి భారతదేశాన్నీ ఆ దేశపు సంస్కృతినీ మతాన్నీ అమితంగా ప్రేమించి మనదేశంలో ఉండిపోయి మనకు సేవచేస్తూ తనువు చాలించిన మహోత్తమురాలు.కలకత్తాలో పుట్టిన అనేకమంది వివేకానంద స్వామిని చూడకుండానే తనువు చాలించారు. కానీ ఎక్కడో ఐర్లండులో పుట్టిన ఈమె స్వామికి ప్రియశిష్యురాలైంది.ఆయన చూపిన బాటలో నడుస్తూ ఒక ఉదాత్తమైన ఆశయంకోసం తన జీవితాన్ని అర్పించి చరిత్రలో చిరస్మరణీయురాలుగా మిగిలిపోయింది. కర్మబంధాలనేవి ఇలా ఉంటాయి.

చూస్తే ఇలాంటి మహనీయుల జాతకాలను చూడాలి.

సిస్టర్ నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్.చిన్నతనంలో తన తండ్రినుంచీ తన ఉపాధ్యాయుల నుంచీ సేవాభావాన్ని ఆమె పుణికి పుచ్చుకుంది.దీనుల సేవలోనే భగవంతుని నిజమైన సేవ దాగి ఉన్నదన్న సత్యాన్ని ఆమె వివేకానంద స్వామిని కలవక పూర్వమే ఆకళింపు చేసుకుని ఉన్నది.

ఏదో తెలియని ఒక ఉన్నతమైన దారికోసం ఆమె ఎప్పుడూ తపిస్తూ ఉండేది.ఆ దారి ఆమెకు బాగా తెలిసిన క్రైస్తవ మతంలో కనిపించలేదు.ఆ దారిని తనకు చూపే ఒక మహనీయుడు తన జీవితంలో తనకు ఎదురు కావాలని నిరంతరం ఆమె జీసస్ ను ప్రార్ధించేది. తీరిక సమయాలలో లైబ్రరీలో కూచుని బౌద్ధమతం, హిందూమతాల ప్రామాణిక గ్రంధాలను అధ్యయనం చేసేది.ఆ భావాలను తన జీవితంలో ఆచరించి, వాటి ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవించి వాటిని అధికారికంగా చెప్పగలిగే ఒక మహోన్నతుడైన గురువు కోసం ఆమె తపించేది.అలాంటి వ్యక్తిని తను కలుసుకుంటానని భావిస్తూ ఆశగా ఎదురు చూచేది.

1895 లో మొదటిసారిగా వివేకానంద స్వామిని ఆమె లండన్ లో చూచినప్పుడు, తను ఇంతవరకూ వెదుకుతున్న మహనీయుడు ఈయనే అని ఆమెకు వెంటనే అర్ధమైపోయింది.భారతదేశపు అమూల్యమైన యోగవేదాంత జ్ఞానసంపదను తనకు ఇవ్వగల సద్గురువు ఈయనే అని ఆమె హృదయం గట్టిగా చెప్పింది.తన ప్రార్ధనను దైవం విన్నదన్న నమ్మకం ఆమెకు కలిగింది.

వివేకానందస్వామి ఉత్త ఉపన్యాసక గురువు కాదు.నేడు మనం చూస్తున్న అనేకమంది ఉపన్యాస చక్రవర్తుల వలె ఆయన అనుభవం లేని ఉత్త ఊకదంపుడు పండితుడు కాదు.

అయిదేళ్ళ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ధ్యానస్థితిలో బుద్ధుని దర్శనాన్ని పొందిన జ్ఞాని ఆయన.

వివేక వైరాగ్యాలతో ఆమూలాగ్రం నిండి 19 ఏళ్ళ వయస్సులోనే కాళీమాత దర్శనాన్ని పొందిన మహర్షి ఆయన.

23 ఏళ్ళకే దుర్లభమైన నిర్వికల్పసమాధి స్థితిని సొంతం చేసుకున్న మహాయోగి ఆయన.

భగవంతుని అవతారం అయిన శ్రీ రామకృష్ణుల అనుగ్రహపాత్రుడాయన. క్షీణిస్తున్న హిందూధర్మానికి తిరిగి తనదైన పూర్వ వైభవాన్ని ఇవ్వడానికి అవతరించిన సప్తఋషులలోని ఒక ఋషి ఆయన.

మొదటిసారి లండన్లో వివేకానంద స్వామి ఉపన్యాసాన్ని వినినప్పుడు మార్గరెట్ మంత్రముగ్దురాలై పోయింది.స్వామియొక్క ఉన్నతమైన వ్యక్తిత్వమూ, ఆయన యొక్క అనర్గళమైన వచోవైఖరీ,వేదములనుంచీ ఉపనిషత్తుల నుంచీ ఉన్నతములైన భావాలను ఆయన వివరించే తీరుకు ఆశ్చర్యపోయి ఆమె ఒక శిలాప్రతిమలా అయిపోయింది.ముఖ్యంగా ఆయననుంచి ప్రసారం అవుతున్న దివ్యశక్తి తరంగాలను ఆమె ఫీల్ అవగలిగింది.

నివేదితతో వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'మార్గరెట్ !! సనాతనధర్మం యొక్క అసలైన మార్గం ఆచరణలో ఉన్నది. పాండిత్యంలో లేదు.నీవు ఎన్ని ఉపన్యాసాలైనా విను.ఎన్ని పుస్తకాలైనా చదువు.కానీ, నీవు ఆ ధర్మం సూచిస్తున్న మార్గంలో నడవనంతవరకూ ఏమీ లాభం లేదు.బౌద్ధికంగా తెలుసుకునే సమాచార జ్ఞానం వల్ల ఏమీ ఉపయోగం లేదన్న విషయం ముందుగా గ్రహించు.నీవు సాధన చెయ్యాలి. హిందూమతంలో ఉన్న మహోన్నతములైన సత్యాలను నీవు స్పష్టంగా ముఖాముఖీ నీ కళ్ళెదురుగా దర్శించాలి.దైవ సాక్షాత్కారాన్ని నీవు ఇదే జన్మలో పొందాలి. అప్పుడే అసలైన హిందూమతం అంటే ఏమిటో నీకు ఆచరణ పూర్వకంగా తెలుస్తుంది.'

మార్గరెట్ వెదుకుతున్నది ఉపన్యాస కేసరుల కోసం కాదు.అనుభవ జ్ఞాన సంపన్నుడైన ఇలాంటి మహనీయుని కోసమే ఆమె ఇన్నాళ్ళూ వెదుకుతున్నది.ఎట్టకేలకు తన ఎదురుచూపు ఫలించిందని ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది.తన గురువును తనకు చూపించినందుకు దైవానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంది.

ఎందుకంటే - నిజమైన సద్గురువు యొక్క పరిచయం కంటే మించిన అదృష్టం జీవితంలో ఇంకేదీ లేదు,ఉండదు గనుక.

వివేకానందస్వామిని మించిన సద్గురువు ప్రపంచంలో ఇంకెవరుంటారు?

మారుమాట లేకుండా తన గురువు చూపిన బాటలో నడవడానికి ఆమె సంసిద్ధురాలైంది.

ఆయనిలా అన్నారు.

'నీ జీవితాన్ని నేను చూపే మార్గం కోసం త్యాగం చెయ్యగలవా? నీ ఇల్లూ వాకిలీ వదలిపెట్టి నాతో ఇండియాకు రాగలవా?అక్కడ స్త్రీల పరిస్థితి ఏమీ బాగాలేదు.వారికి విద్య లేదు.స్వతంత్రం లేదు.వంటింటి బానిసల్లా పడుండి బ్రతుకులు ఈడుస్తున్నారు.బాల విధవలుగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు.ఒకనాడు గార్గి,మైత్రేయి,విశ్వవర వంటి జ్ఞానమూర్తులైన బ్రహ్మవాదినులతో విలసిల్లిన భరతభూమిలో నేడు స్త్రీకి బానిసత్వం ప్రాప్తించింది.చదువు లేక, స్వతంత్రం లేక,పిల్లలు కనే యంత్రాలుగా మారి ఆడవారు, -  మగవాడి దౌష్ట్యానికి బలై పోతున్నారు.వారికోసం నువ్వేమైనా చెయ్యగలవా? నీ జీవితాన్ని వారి ఉద్ధరణ కోసం త్యాగం చెయ్యగలవా? అప్పుడు మాత్రమే నీవు వెదుకుతున్న వెలుగుబాట నీకు కనిపిస్తుంది. నా మాట నమ్ము.త్యాగంలోనే అమృతత్వానికి దారి ఉన్నది.సుఖంగా గడిపే జీవితంలో అది లేదు.ఇప్పుడు మనకు కావలసింది గుహలలో కొండలలో కూచుని తపస్సు చెయ్యడం కాదు.హిమాలయాలలోని వేదాంతాన్ని సమాజంలోకి తేవాలి.నా దేశంలో అలముకున్న అజ్ఞానాన్ని,దరిద్రాన్ని, చీకటిని, దురాచారాలను పారద్రోలాలి.దానికోసం నీ జీవితాన్ని నీవు త్యాగం చెయ్యాలి.నీ సాధనను చేసుకుంటూ ఈ పనిని నీవు చెయ్యాలి.ఇదే నీకు నేను ఉపదేశిస్తున్న కర్మయోగం. ఈ పనిని నీవు చెయ్యగలవా?'

మార్గరెట్ ఇలా జవాబు చెప్పింది.

'మీరు చూపిన బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.దానికోసం నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తాను.వివాహం చేసుకోను.జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉంటాను.మీ అడుగుజాడలలో నడచి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను.'

వివేకానందస్వామి చేతులమీదుగా బ్రహ్మచర్య దీక్షను,మంత్రోపదేశాన్నీ గ్రహించిన మార్గరెట్ నోబుల్ -- 'సిస్టర్ నివేదిత' గా మారింది.

(ఇంకా ఉంది)