Pages - Menu

Pages

5, ఆగస్టు 2015, బుధవారం

గురు మౌఢ్యమి - శుక్ర మౌఢ్యమి

గ్రహములు సూర్యునికి దగ్గరగా వచ్చినపుడు వాటికి అస్తంగత్వదోషం అనేది కలుగుతుంది.అంటే అవి సూర్యుని కాంతిలో కనపడకుండా పోతాయి. అప్పుడు అవి శక్తిహీనాలౌతాయి.ఆ సమయంలో అవి చెయ్యవలసిన పనిని చెయ్యలేవు.ఇవ్వవలసిన ఫలితాలను ఇవ్వవు.వాటి కారకత్వాలన్నీ(అంటే మానవజీవితంలో ఆయా గ్రహాలకున్న ఆధిపత్య విషయాలు,రంగాలు) ఆ సమయంలో దెబ్బ తింటాయి.ఆ పరిధినుంచి బయటపడిన తర్వాతనే అవి మళ్ళీ శక్తిని పుంజుకుంటాయి.తమతమ పనులను తిరిగి మామూలుగా చెయ్యగలుగుతాయి.

అవి శక్తిహీనములుగా ఉండే సమయాన్నే మౌఢ్యమి అనీ మూఢమి అనీ మూఢం అనీ అంటుంటారు.అంటే మందబుద్ధితో కూడిన జడత్వం అని అర్ధం.

ప్రస్తుతం గురుశుక్రులిద్దరూ సింహరాశిలో ఉన్నందువల్ల, త్వరలో సూర్యుడు వారికి దగ్గరగా రాబోతున్నందువల్ల వీరిద్దరికీ మౌఢ్యమి రాబోతున్నది.ఆ సమయాలేవో చూద్దాం.

గురు మౌఢ్యమి -- 12-8-2015 నుంచి 12-9-2015 వరకు.
శుక్ర మౌఢ్యమి -- 10-8-2015 నుంచి 20-8-2015 వరకు

అయనాంశ భేదాలవల్ల ఒకటి రెండురోజులు అటూ ఇటూగా ఇవి ఉండవచ్చు.

ఈ రెంటిలో శుక్రమౌఢ్యమి ప్రస్తుతం చాలా ప్రభావవంతంగా ఉండబోతున్నది. ఎందుకంటే శుక్రుడు ప్రస్తుతం వక్రస్తితిలో ఉండి సింహరాశి నుంచి వెనుకకు కర్కాటకరాశి లోకి ప్రయాణం చెయ్యబోతున్నాడు.ఆ క్రమంలో కర్కాటకరాశి నుంచి సింహరాశిలోకి రాబోతున్న సూర్యుడిని శుక్రుడు దాటి వెనక్కు వెళతాడు.అప్పుడు సూర్యబింబం మీదుగా శుక్రుడు వెనక్కు ప్రయాణం గావిస్తాడు.కనుక ఈ పదిరోజులూ శుక్రుని కారకత్వాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.

కనుక గురుదోషం కంటే శుక్ర దోషం అతి ప్రభావవంతంగా ఉండబోతున్నది.

వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో గమనిద్దాం.

గురు మౌఢ్యమి ఫలితాలు :--

>ఉపనయనం,వేదాధ్యయనారంభం,తీర్ధయాత్రలు,పుణ్యక్షేత్ర సందర్శనం, గృహప్రవేశం మొదలైన ధర్మకార్యాలు,శుభకార్యాలు ఏవీ ఈ సమయంలో చెయ్యరాదని అంటారు.
>గురువులకు,మతాధికారులకు,పీఠాధిపతులకు,వయసుమీరిన ముసలివారికి ఇది ప్రమాద సమయం.
>ధర్మంగా జీవించేవారు నీలాపనిందలకు గురౌతారు.కృంగిపోతారు.
>సమాజంలో ధర్మం పట్టు తప్పి అధర్మం ప్రజ్వరిల్లుతుంది.
>పాలకులు అవినీతి పరులౌతారు.
>గురువులు కూడా ఈ సమయంలో భ్రష్టులౌతారు.
>సమాజంలో అనైతిక కార్యకలాపాలు ఎక్కువౌతాయి.

శుక్ర మౌఢ్యమి ఫలితాలు

>ఈ సమయంలో వివాహాలు చెయ్యకూడదు.
>సమాజంలో మోసాలు విలాసాలు జల్సాలు అక్రమసంబంధాలు ఎక్కువౌతాయి.
>వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
>కార్లు మొదలైన విలాస వాహనాలు రిపేర్లు వస్తాయి.
>స్త్రీలపైన దాడులు జరుగుతాయి.
>స్త్రీలకు రుతుసంబంధ బాధలు ఎక్కువౌతాయి.ఊహించని అనారోగ్యాలు వారికి కలుగుతాయి.
>సినిమా నటులకు,కళాకారులకు గండకాలం.
>మాఫియా మరియు తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువౌతాయి.
>ఆర్ధిక మోసాలు కుట్రలు జరుగుతాయి.ఆర్ధిక వ్యవస్థ బలహీనమౌతుంది.
>బంగారం వెండి మొదలైన విలువైన లోహాలు ధరను కోల్పోతాయి.
>విలాసాలకు నెలవులైన పాశ్చాత్య దేశాలు చిక్కులను ఎదుర్కొంటాయి.
>విహారయాత్రలలో,రిసార్టులలో,బీచ్ లలో,క్లబ్బులలో,పార్టీలలో,సామూహిక ప్రయాణాలలో ఘోర ప్రమాదాలు జరుగుతాయి.
>వివాహసంబంధాలు దెబ్బ తింటాయి.భార్యాభర్తలలో ఒకరిమీద ఒకరికి అనుమానాలు కలుగుతాయి.విడాకులవరకూ కూడా కొన్ని కేసులు వెళతాయి.
>ముస్లిం తీవ్రవాదం ఎక్కువౌతుంది.

ఈ సమయాలలో గురుశుక్ర లగ్నాలలో రాశులలో నక్షత్రాలలో జన్మించిన వారికి
-అంటే
-వృషభ,తులా,ధనూ,మీనరాశులవారికి-సింహరాశివారికి
-పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర,భరణి,పుబ్బ,పూర్వాషాఢ నక్షత్రాల వారికి చెడుకాలం జరుగుతుంది.

వీటిలో మళ్ళీ గురుదోషం అనేది ఆగస్ట్ 25-28 మధ్యలోనూ శుక్రదోషం అనేది ఆగస్ట్ 11 -18 మధ్యలోనూ చాలా తీవ్రంగా ఉంటుంది.

కావలసినవారు తగిన పరిహారక్రియలు చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడవచ్చు.