నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, ఆగస్టు 2015, మంగళవారం

నీ పరిచయమే ఒక అదృష్టం అని వేలాది మంది అనే రోజొస్తుంది

ఈ మధ్యకాలంలో అనేకమంది నాతో అంటున్న మాటలు వింటుంటే 27 ఏళ్ళ క్రితం ఒక మహనీయుడైన సిద్ధపురుషుడు అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి.

1988 లో నేను ఆదోనిలో ఉన్న రోజులలో పూజ్యపాద నందానందస్వామి వారు నాతో ఒకమాటన్నారు.

'నీ పరిచయం కావడమే వాళ్ళ జీవితంలో అతిపెద్ద అదృష్టం అని వేలాది మంది అనేరోజు ముందు ముందు వస్తుంది.'

ఆమాట విని నేను నిర్ఘాంతపోయాను.ఎందుకంటే అప్పట్లో ఏ రకంగా చూచినా నేనొక అతి సామాన్యమైన మామూలు మనిషిని మాత్రమే.కాకపోతే సాధన తీవ్రంగా చేసేవాడిని.

ఆయన నోటివెంట అబద్ధం రాదని, సత్యం పలకడాన్ని ఆయన ఒక వ్రతంగా దాదాపు 50 ఏళ్ళపాటు ఆయన జీవితంలో నిరాఘాటంగా పాటించారనీ నాకు తెలుసు.ఆమాటను ఆయనే నాతో చాలాసార్లు అన్నారు.

నేనంటే ఆయనకున్న వాత్సల్యభావంతో ఆయన అలా అంటున్నారని అప్పుడనుకున్నాను.అదే మాటను ఆయనతో అన్నాను కూడా.

నిష్కల్మషమైన నవ్వును ఆయన నవ్వారు.

ఎంతోమంది అందమైన వాళ్ళు నవ్వితే నేను చూచాను.కానీ ఆయన నవ్వితే వచ్చే ఒక విధమైన నిష్కల్మషమైన తేజస్సును మాత్రం ఇంతవరకూ ఇంకెవరిలోనూ చూడలేదు.ఎనభై ఏళ్ళ వృద్ధుడైన ఆయన నవ్వితే ఒక చిన్న పాప నవ్వినట్లు ఎంతో స్వచ్చంగా మనస్ఫూర్తిగా ఉండేది.ఒక చల్లని వెన్నెల చుట్టూ ప్రసరించినట్లు అనిపించేది.

అప్పుడాయన ఇలా అన్నారు.

'నేనన్న మాట వృధా పోదు.ఈ విషయం నీకు ఇప్పుడర్ధం కాదు.ముందు ముందు అర్ధమౌతుంది'.

27 సంవత్సరాల తర్వాత ఇప్పుడది నిజమౌతున్నది.

ప్రస్తుతానికి వేలమంది అనడం లేదు గాని,వందలమంది ఇప్పుడా మాటను అంటున్నారు.సరిగ్గా 27 ఏళ్ళ క్రితం మహనీయుడైన పూజ్యపాద నందానందస్వాములవారు అన్నమాటనే ఈరోజున వందలాది మంది అంటున్నారు.

'సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వమ్'-- 'సత్యాన్ని పలికే వారి మాటను వెన్నంటి ఆమాటకు తగిన ఫలితం వస్తుంది' - అని పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో ఊరకే అన్నారా?

మహనీయుల మాటలు వృధాగా ఎందుకు పోతాయి? అలా పోతే వారు మనలాంటి మామూలు మనుషులు అవుతారు గాని మహనీయులు ఎందుకౌతారు?