Pages - Menu

Pages

13, అక్టోబర్ 2015, మంగళవారం

రెండు పడవల ప్రయాణం

మనుషులలో చాలా విచిత్రమైన వాళ్ళుంటారు.

ప్రపంచంలో వారు ఉపయోగించే వక్రతెలివినే ఆధ్యాత్మికంగా కూడా చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.అది జరిగేపని కాదని వారికి ఎంత చెప్పినా అర్ధంకాదు.అర్ధం చేసుకోవాలని వారసలు ప్రయత్నించరు.అదే వారిలోని అతి పెద్ద లోపం.

ఒకాయనున్నారు.ఒక టీవీ గురువుగారి దగ్గర ఆయన మంత్రోపదేశం స్వీకరించారు.ఆ తర్వాత ఆయనకు వచ్చే సందేహాలకు నేను సమాధానాలు చెప్పాలని నన్ను అడుగుతారు. అది సరియైన పని కాదు.మీ గురువు గారినే అడిగి మీ సందేహాలు కూడా తీర్చుకోండి.నన్ను అడుగవద్దు.ఆయన బ్రతికే ఉన్నారు కదా.ఆయన చెప్పిన ఉపదేశానికి నేను సమాధానాలు ఇవ్వడం కరెక్టు కాదు,కనుక మీ సందేహనివారణ ఆయన ద్వారా జరగడమే సరియైన విధానం - అని ఆయనకు చాలాసార్లు చెప్పాను.కానీ ఆయన వినడు.

ఫోన్ చేస్తే ఆ గురువుగారు పలకడట.పోనీ ఎప్పుడైనా లైను కలిస్తే ఆయన చెప్పే జవాబులు ఈయనకు నచ్చవట.ఇదెక్కడి ప్రహసనమో నాకర్ధం కాదు.అలాంటప్పుడు ఆయన దగ్గర దీక్ష తీసుకోవడం ఎందుకు? సందేహాలు నన్నడగడం ఎందుకు? ఆయన్ను వదలలేక బాధపడటం ఎందుకు? సమాధానం ఉండదు.

టీవీ ప్రవచనాల మాయలో పడితే జరిగే ప్రహసనాలు ఇలా ఉంటాయి.

ఇంకొకాయన ఒక ప్రసిద్ధ సూడో తాంత్రిక గురువుగారి దగ్గర తారాదేవి మంత్రాన్ని దీక్ష తీసుకున్నాడు.ఆయన చెప్పినట్లే జపమూ హోమమూ తర్పణమూ ఇత్యాదులు శాస్త్రోక్తంగా చేశాడు.కానీ దేవతాదర్శనం కాలేదు.మంత్రం సిద్ధించినట్లు ఏ సూచనా ఆయనకు కనిపించలేదు.'అసలు మంత్రం సిద్ధించిందో లేదో నాకు అర్ధం కావడం లేదు.సిద్ధిస్తే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? నేను నడుస్తున్న దారి సరియైనదేనా?నన్నేం చెయ్యమంటారు?' అంటూ నాకు మెయిల్ చేశాడు.

మధ్యలో నాకెందుకు? ఆయన దగ్గర దీక్ష తీసుకునేటప్పుడు నన్నడిగి తీసుకున్నారా? పైగా ఆయన బ్రతికే ఉన్నాడు.కనుక ఆయన చెప్పిన మార్గం ఎందుకు ఫలించలేదో పరిష్కారం ఏమిటో ఆయన్నే అడగమని చెప్పాను. ఇలాంటి సూడో దీక్షలవల్ల సిద్ధి కలిగేమాట అటుంచి ఉన్నతెలివి కూడా పోతుంది.నన్నడగవద్దు ఆయన్నే అప్రోచ్ అవండి.అసలైన సాధనామార్గం ఇది కాదు.ఇలా ఉండదు."-- అని చెప్పాను.

ఆయనేమనుకున్నాడో తిరిగి మెయిల్ చెయ్యలేదు.వారూ వీరూ చెబితే విని పాపులర్ గురువులను ఆశ్రయించడం వల్ల కలిగే నష్టాలు ఇలా ఉంటాయి.

కొన్నేళ్ళ క్రితం ఒకాయన నన్నిలా అడిగేవాడు.

"నేను ఫలానా ప్రసిద్ధ గురువుగారి దగ్గర మంత్రోపదేశం స్వీకరించాను.నాకు కొన్ని సందేహాలున్నాయి.మీరు సమాధానం చెప్తారా?"

వినడానికి కొంచం ఇబ్బందిగా ఉన్నా ఈ ప్రశ్నను ఆయన్ను అడిగాను.

'మీ గురువుగారు బ్రతికే ఉన్నారా? కాలం చేశారా?'

'బ్రతికే ఉన్నారు.'

'మరి మీ మధ్యన మాటల్లేవా?విడాకులు తీసుకున్నారా?'

'అబ్బే అదేమీ లేదు.మీరైతే ఇంకా బాగా చెబుతారని.'

'సారీ.ఆయన చెప్పిన ఉపదేశానికి ఆయనదే బాధ్యత.మీరు ఆయన్నే అడిగి మీ సందేహాలను తీర్చుకోండి.నేను చెప్పకూడదు.'

ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పానని ఆయనకు కోపం వచ్చి నాతో మాట్లాడటం మానేశాడు.

అప్పటికే ఇద్దరు ముగ్గురు గురువులను మార్చిన ఒకామె మూడేళ్ళ క్రితం నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేది.

'సమాధి స్థితి ఎలా వస్తుంది? సవికల్ప సమాధిస్థితిలో ఎలా ఉంటుంది? నిర్వికల్ప సమాధిస్థితిలో ఏమనిపిస్తుంది?' ఇలాంటి హై లెవల్ ప్రశ్నలు మాత్రమే ఆమె అడుగుతూ ఉండేది.అంతకంటే తక్కువస్థాయి ప్రశ్నలు అడిగేది కాదు.అప్పుడే నాకర్ధమైంది.కొన్నాళ్ళలో ఈమె దుకాణం మార్చేయ్యబోతున్నదని.అనుకున్నట్లుగానే ఆమె ఆ తర్వాత ఇంకొక గురువుకు షిఫ్ట్ అయిపొయింది.ఆ తర్వాత ఆయన్ను కూడా వదిలేసి ప్రస్తుతం ఇంకొక గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తోందని విన్నాను. ఆయనెన్నాళ్ళు ఉంటాడో తెలియదు.

ఒకచోట దీక్షగా తవ్వితే నీళ్ళు పడతాయిగాని రోజుకొక గజం చొప్పున ఒక్కొక్కచోట తవ్వుతుంటే నీళ్ళెప్పటికి పడేను?

రెండు రోజుల నాడు ఒకాయన ఫోన్ చేశాడు.

'నా పేరు ఫలానా.నేను చిన్నప్పటినుంచి చాలా ఆధ్యాత్మిక చింతనతో పెరిగాను.ఎన్నో ఆశ్రమాలు తిరిగాను.ఎన్నో సాధనలు చేశాను.కానీ నా మార్గం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియడం లేదు.మీరు మార్గదర్శనం చేస్తారేమోనని ఫోన్ చేశాను.ప్రస్తుతం నేను గుంటూరులోనే ఉన్నాను.మీరు రమ్మంటే వచ్చి కలుస్తాను.' అన్నాడు.

నాకానందం కలిగింది.నిజమైన ఆధ్యాత్మిక తపన ఉన్నవారిని చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది.

'అలాగే రండి.మాట్లాడుదాం.రేపు పొద్దున్న తొమ్మిదికి మా ఇంటికి రండి.' అన్నాను.

'రేపు నాకు కుదరదు.హోమం ఉన్నది.' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'పోనీ రేపు సాయంత్రం రండి.' అన్నాను.

'వేరే పనుంది.బజారుకెళ్లాలి.' అన్నాడు.

'పోనీ ఎల్లుండి రండి' అన్నాను.

'ఎల్లుండి కూడా నాకు కుదరదు.వేరే పని ఉంది.గుడికెళ్ళాలి.' అన్నాడు అదేదో నేను నాపనికోసం ఆయన్ను భంగపోతున్నట్లు.

అప్పుడిలా చెప్పాను.

'సారీ,నాకూ కుదరదు.నా టైము మీకంటే విలువైనదే.మీకు మార్గదర్శనం చేసే అంత తీరిక నాకు లేదు.మీరు రావద్దు.' అని ఫోన్ పెట్టేశాను.

ఇలా ఉంటాయి మనుషుల మనస్తత్వాలు.

నిన్న ఇంకొకామె ఫోన్ చేశారు.

'నేను గత 14 ఏళ్ళ నుంచి మాతా నిర్మలాదేవిగారి సహజయోగాన్ని ఫాలో అవుతాను.నాకు అన్నీ అమ్మే ధ్యానంలో అర్ధమయ్యేలా చెబుతూ ఉంటారు.ఏ సమస్య వచ్చినా అమ్మే గైడ్ చేస్తుంటారు.కానీ ఈ మధ్య నాకు తరచూ అనారోగ్యం చేస్తున్నది.హెల్త్ బాగుండటం లేదు.జాతకం చూచి ఏమైందో చెబుతారా?' అని అడిగారు.

'అన్నీ అమ్మే చెబుతున్నపుడు మీకు ఇంకా జాతకం ఎందుకు? మీకు అనారోగ్యం ఎందుకు వస్తున్నదో అదికూడా అమ్మనే అడగకపోయారా?' అన్నాను.

'అడగవచ్చు.కానీ మాతాజీ ఇప్పుడు లేరు.గతించారు.' అన్నారామె.

నిర్మలాదేవి చనిపోయిన విషయం నాకు తెలుసు.

అయితే, గురువు అంటే శరీరం అని ఈమె అనుకుంటున్నదన్నమాట.ఇంకేం చెబుతాం?

'మరి మీకు చెప్పేవన్నీ ఎలా చెబుతున్నారు?' అడిగాను.

'ధ్యానంలోనే సూచనలిస్తారు.' అన్నారు.

'మరి ఈ విషయం కూడా ధ్యానంలోనే అడగండి.' అన్నాను.

'నేనింకా అంత ఎదగలేదు.మా సాధన కరెక్ట్ గా చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి.అసలు ఇంకేమీ అవసరం లేదు.' అన్నారామె.

'మీ సాధన కరెక్ట్ గా చెయ్యద్దని నేనేమైనా మిమ్మల్ని ఆపుతున్నానా?' అడిగాను.

'లేదనుకోండి.నేనే చేయలేకపోతున్నాను.మాతాజీ చక్రాస్ గురించి చాలా బాగా వివరించారు.ఈ సాధన చాలా బాగుంటుంది.ఆమె అన్నీ explain చేశారు.' అన్నారామె మళ్ళీ.

'మంచిది.మీ సాధన సక్రమంగా చేసుకోండి.నేను మీ జాతకం చూడను. చూడవలసిన అవసరమూ లేదు.' అని ఫోన్ పెట్టేశాను.

అయిదేళ్లుగా ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉండేవారు కొందరైతే, నెలకొక గురువును మార్చే వారు మరికొందరు.ఊరకే మాటలు చెబుతూ,సాధనంటే సందేహించేవారు కొందరైతే, ఒకరి దగ్గర దీక్ష తీసుకుని వారి మార్గం ఫాలో అవుతూ వారు బ్రతికి ఉండగానే ఇంకొకరిని సలహాలు అడిగేవారు ఇంకొందరు.ఆధ్యాత్మికత అంటే వీరంతా అసలు  ఏమనుకుంటున్నారో నాకర్ధం కావడం లేదు.ఇదేదో కూరగాయల బేరంలా వీరికి కనిపిస్తున్నట్లు నాకనిపిస్తున్నది.వీరెవరూ ఎన్నటికీ ఆధ్యాత్మికంగా ఎదగలేరు.ఈ జన్మకు వీరికది సాధ్యం కాదని నేను గట్టిగా చెప్పగలను.

గురువులూ దీక్షలూ అంటే ఇప్పటికాలపు పెళ్ళిళ్ళు కావు.ఈరోజు ఒక పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు సంసారం చేసి నచ్చకపోతే విడాకులిచ్చి ఇంకొక పెళ్లి చేసుకోడానికి.బాయ్ ఫ్రెండ్స్ నీ, మొగుళ్ళనీ మార్చినట్లు గురువులను మార్చకూడదు.

అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడే దీక్షలు ఫలిస్తాయి.ఒక గురువు దగ్గర దీక్ష తీసుకుంటే ఇక జీవితాంతం మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయనకు కట్టుబడిపోవాలి.ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడకూడదు.అదే అసలైన ఆధ్యాత్మిక పాతివ్రత్యధర్మం.

అంతేగాని రోజుకొక మొగుడిని మార్చినట్లు గురువులను మార్చేవారికి ఏ దీక్షా ఫలించదు.ఏ దేవుడూ పలకడు.

పాత కాలంలో పల్లెల్లో ఒక మోటుసామెత ఉండేది.

"తినేది మొగుడి తిండి.పాడేది రంకుమొగుడి పాట"- అని. ఈ వ్యవహారాలన్నీ అలా ఉంటాయి.

మా గురుదేవులైన పూజ్యపాద నందానందస్వామివారు ఒక మాటను తరచుగా అనేవారు.

'పతివ్రతకు ఒక్క మొగుడు చాలు సత్యా'

ఎంత గొప్ప మాట ! ఎంత లోతైన మాట !

నిజంగా శుద్ధంగా ఉండే స్త్రీకి ఒక్క మొగుడు చాలు.ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే.నిజమైన సాధకుడికి నిజమైన శిష్యుడికి ఒక్క గురువు చాలు. మనం పతివ్రతలం కాకుంటే ఎంతమంది మొగుళ్ళూ మనకు చాలరు. అలాగే మనం నిజమైన శిష్యులం కాకుంటే ఎంతమంది గురువులూ మనకు సరిపోరు.

ఇష్టం వచ్చినట్లు మొగుళ్ళని మార్చడం కాదు.పతివ్రతగా బ్రతకడం రావాలి.రోజుకొక్క గురువును మార్చడం కాదు.ఆధ్యాత్మిక పతివ్రతలుగా బ్రతకడం నేర్చుకోవాలి.ముందు మనం నిజమైన శిష్యుడిగా తయారు కావాలి. నిజమైన శిష్యుడంటే ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి.అప్పుడు నిజమైన గురువు మనకు లభిస్తాడు.అప్పుడన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి.

రెండు పడవల మీద ప్రయాణం మనల్ని ముంచుతుంది గాని తేల్చదని ఎంత త్వరగా గ్రహిస్తే ఆధ్యాత్మికంగా అంత మంచిది.