Pages - Menu

Pages

12, నవంబర్ 2015, గురువారం

11-11-2015 అమావాస్య ప్రభావం

ఈ అమావాస్యకు కొద్దిరోజుల ముందు నుంచీ అంతరిక్షంలో కొన్ని గ్రహస్థితులు నెలకొన్నాయి.దానివల్ల సమాజంలో కొన్ని విపరీత సంఘటనలు కనిపిస్తున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

కన్యారాశిలో రాహువు శుక్రుడు కుజుడు చంద్రుడు కలవడమే ఆ విపరీతస్థితి.జ్యోతిశ్శాస్త్ర ప్రకారం ఇది అతికామయోగం అనబడుతుంది.దీనిగురించి పాతపోస్టులలో వ్రాశాను చూడండి.అందుకనే ఈ మధ్యన అమ్మాయిలమీద బలాత్కారాలు మళ్ళీ ఎక్కువౌతున్నాయి.ఇది శుక్రుడికి నీచరాశి గనుక నీచమైన పనులు సమాజంలో జరుగుతున్నాయి. 

ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దామా?

3.11.2015
నల్గొండ జిల్లాలో 15 ఏళ్ళ అమ్మాయిని 16 ఏళ్ళ అబ్బాయి రేప్ చేశాడు.పైగా దీనిలో తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు.

3.11.2015
జోద్ పూర్ లో ఒక గృహిణి తన ఫేస్ బుక్ ఫ్రెండ్ చేతిలో రేప్ కు గురైంది.

అంతేకాదు.ఎప్పుడో జరిగిన ఆశారాం బాపూ మీద రేప్ అభియోగమూ, ఎప్పుడో జరిగిన Delhi UBER Cab రేప్ కేసూ కూడా ఇప్పుడు మళ్ళీ తెరమీదకు వచ్చాయి.

6.11.2015:
బెంగుళూరులో బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న నర్సు మీద అత్యాచారం జరిగింది.చేసిన వెధవపని చాలక ఆ అమ్మాయి ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని సదరు నిందితుడు ఆఫర్ ఇవ్వడం అతి హేయమైన చర్య.

అరేబియా దేశాలలో లాగా భయంకరమైన శిక్షలు పబ్లిగ్గా వెంటనే పడినప్పుడే మన దేశంలోని 'డిసిప్లిన్ లెస్' ప్రజలకు భయం అనేది ఉంటుంది.అలా శిక్షలు పడనప్పుడు ఇలాంటి కేసులు మళ్ళీమళ్ళీ మనదేశంలో జరుగుతూనే ఉంటాయి.తప్పదు.

9.11.2015
నాలుగు గంటల వ్యవధిలో ఆరు భూకంపాలు అండమాన్ నికోబార్ దీవులను వణికించాయి.పైన చెప్పిన గ్రహాల సంయోగం భూతత్వ రాశి అయిన కన్యలో జరగడం గమనార్హం.

11.11.2015
సరిగ్గా అమావాస్య ఘడియలలో - ముజఫర్ నగర్ లో 15 ఏళ్ళ బాలిక ముగ్గురి చేతిలో రేప్ కు గురైంది.

అసలీ 3.11.2015 ప్రత్యేకత ఏమిటి? ఆ సమయంలోనే ఇన్ని రేపులు ఎందుకు జరిగాయి? లేదా పాత కేసులు మళ్ళీ న్యూసులోకి ఎందుకు వస్తున్నాయి? అప్పటినుంచీ నేటివరకూ ప్రతిరోజూ మీడియాలో ఈ న్యూసులు ఎందుకు కనిపిస్తున్నాయి? - అని గమనిస్తే ఒక గ్రహస్థితి కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

శుక్రుడు కుజుడు అప్పుడే సరిగ్గా రాశి మారి సింహం నుంచి కన్యలోకి అడుగుపెడుతున్నారు.వీరిద్దరూ ఆ సమయంలో సున్నా డిగ్రీలలో రాశిసంధిలో ఉన్నారు.సరిగ్గా అదే సమయంలో మీడియా దృష్టికి వచ్చినవీ రానివీ చాలా రేపులు జరిగాయి.ఇవి మన దేశానికే పరిమితమా? ఇతరదేశాలలో జరగలేదా?అంటే మనకు తెలియదు.జరిగే ఉంటాయి. ఆయాదేశాల మీడియాలో వెదకాలి.వీటిల్లో కూడా కొన్ని బయటకు వస్తాయి. కొన్ని రావు.

3.11.2015 నుంచి నేటివరకూ ఒక్కసారి మీలోకి తొంగి చూచుకోండి.మీ జీవితాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని మీకు ఎదురయ్యే ఉంటాయి. మీలో చాలామందికి ఆ సమయంలో ఉద్రేకాలు విజ్రుంభించి ఉంటాయి. ప్రశాంతంగా ఆలోచించండి.మీకే అర్ధమౌతుంది.ఎందుకంటే మనుషులలో ఎవరూ గ్రహప్రభావానికి అతీతులు కారు,కాలేరు కాబట్టి.

ఓహో ! గ్రహప్రభావం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయా? అయితే శిక్షలు కూడా గ్రహాలకే వేస్తే సరిపోతుంది కదా? అని కొంతమంది హేతువాదులూ నాస్తికులూ ఎగతాళిగా కామెంట్ చేస్తూ ఉంటారు.నోరుందిగదా అని ఏదో ఒకటి మాట్లాడితే సరిపోదు."మనుషులలో కొన్నికొన్ని ఉద్రేకాలు కొన్నికొన్ని గ్రహస్థితులు ఉన్నప్పుడు విపరీతంగా పెల్లుబుకుతూ ఉంటాయి,ఇది వాస్తవం" అని చెప్పడమే ఈ పరిశీలనా ఉద్దేశ్యం.అంతేగాని మనం చేసే ప్రతితప్పునూ గ్రహాలమీదకో దేవుడిమీదకో నెట్టమని కాదు.తప్పు చేసి తప్పించుకోవచ్చనీ కాదు.

గ్రహాలను శిక్షించడం మనవల్ల కానేకాదు.కనీసం వాటివల్ల మనం శిక్షించబడకుండా ఉండే స్థితికి చేరుకోగలిగితే చాలు.మన జీవితాలు ధన్యములు అయినట్లే.ఒకపూట తిండి లేకుంటే నీరసం వచ్చి కూలబడిపోయే మనం స్టెల్లార్ ఫోర్సెస్ అయిన గ్రహాలను ఏదో చెయ్యగలం అనుకోవడం పిచ్చి భ్రమ మాత్రమే. 

గ్రహస్థితులకూ మానవజీవితంలోని సంఘటనలకూ ఖచ్చితమైన సంబంధం ఉన్నదని ఈ సంఘటనలు మళ్ళీ ఋజువు చేస్తున్నాయి.