నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, నవంబర్ 2015, శనివారం

నేనెవర్ని?

విశ్వపుటంచుల లోయలలో
ఏముందో చూద్దామని శూన్యంలో
అలుపులేని గమనంతో
నిరంతరం ప్రయాణించే
వేగుచుక్కను నేను

విచిత్రాల ధరణి పైకి
ఏమీ తోచని సమయంలో
సరదాగా ఎప్పుడైనా
కాసేపు షికారుకొచ్చే
విస్మృత యాత్రికుడిని నేను

మానవ నీచత్వాల వలలో
మాయా వ్యామోహాల సుడిలో
కావాలని కాసేపు చిక్కి
చూస్తుండగానే వలను త్రెంచి
రివ్వున ఎగసే గరుడపక్షిని నేను

లోకనిమ్నత్వాలను మించిన
అతీతపధాల మహాటవిలో
అమరసరస్సుల తీరాలలో
భయమన్నది తెలియక
ఠీవిగా సంచరించే మృగరాజును నేను

లోలోని ఐక్యానుభవ కుసుమాల
తీపి మకరందాలు గ్రోలుతూ
నిరంతర ఝుంకారనాదంతో
విరులలో ఝరులు రగిలిస్తూ
మత్తుగా ఎగిరే తుమ్మెదను నేను

జన్మ పరంపరల గుట్టు తెలిసి
మానవ మస్తిష్కాన్ని తరచి తరచి
నిగూఢమైన దారులలో నడచి నడచి
కర్మ తుంపరలలో ముద్దగా తడిసినా
ఏమాత్రం తడి అంటని నీటికోడిని నేను

ఎన్నిసార్లు కన్నుమూసినా
ఎన్ని ముసుగులు చివికి పోయినా
ఎన్ని జన్మలు గడచి పోయినా
వెన్ను చూపక మళ్ళీ కన్ను తెరిచి
మరణాన్ని వెక్కిరించే గంధర్వపక్షిని నేను

ఎన్నిసార్లీ గళం మూగబోయినా
ఎన్నిసార్లీ స్వరం రాకపోయినా
చిరునవ్వుతో సరిదిద్దుకొని
మధురగీతాలను మళ్ళీ ఆలపించే
అలుపులేని అజ్ఞాత గాయకుడిని నేను

ఏ ఎడారీ ఇంకించుకోలేని
ఏ సరిహద్దూ బంధించుకోలేని
ఏ కల్మషమూ మలినం చెయ్యలేని
సత్యజలధి వైపు నిత్యగమనం చేసే
స్వచ్చజలాల జీవనదిని నేను

విశ్వపుటంచుల లోయలలో
ఏముందో చూద్దామని శూన్యంలో
అలుపులేని గమనంతో
నిరంతరం ప్రయాణించే
వేగుచుక్కను నేను

విచిత్రాల ధరణి పైకి
ఏమీ తోచని సమయంలో
సరదాగా ఎప్పుడైనా
కాసేపు షికారుకొచ్చే
విస్మృత యాత్రికుడిని నేను