Pages - Menu

Pages

19, నవంబర్ 2015, గురువారం

రుజువైన వరాహమిహిరుని సూత్రం

2014 లో రోహిణీశకట భేదనం గురించి వ్రాస్తూ రెండువేల సంవత్సరాల నాటి ఖగోళపండితుడూ ప్రాచీన జ్యోతిర్వేత్తా అయిన వరాహమిహిరుని సూత్రాన్ని వివరించాను.

శ్లో||రోహిణీ శకట మర్కనందనో  యది భినత్తి రుధిరోధవా శిఖీ
కిం వదామి యదనిష్ట సాగరే జగత్సేష ముపయాతి సంక్షయమ్
(బృహత్సంహిత)

(రోహిణీ శకటమును అర్కనందనుడు(శని),రుధిరుడు(కుజుడు) లేదా శిఖి(తోకచుక్కగానీ లేక కేతువుగానీ కావచ్చు) భేదించినప్పుడు కలిగే ఉపద్రవాలను ఏమని చెప్పను? అప్పుడు ప్రపంచం అంతా ఉత్పాత సముద్రంలో మునిగిపోతుంది)

ప్రస్తుతం ఒక నాలుగైదు రోజులనుంచీ మనం చూస్తున్నది ఇది కాకుంటే మరేమిటి?

ప్రస్తుతం శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని కుజరాశి అయిన వృశ్చికం నుంచి తన సప్తమ దృష్టితో వీక్షిస్తున్నాడు. అంతేగాక కుజుడు కూడా అదే నక్షత్రాన్ని ఈ సమయంలో వీక్షిస్తున్నాడు. కుజుడు దక్షిణానికి సూచకుడు.ఆయన ప్రస్తుతం సంచరిస్తున్న కన్యారాశి దక్షిణానికి సూచిక.కనుక దక్షిణభారతం చాలావరకూ నీటిలో మునిగి పోయింది.అందునా ముఖ్యంగా తమిళనాడు ఈ విధ్వంసానికి బాగా గురైంది. కుజునికి అధిదేవత అయిన సుబ్రమణ్యస్వామిని తమిళనాడులోనే ఎక్కువ ఆరాధిస్తారు.

ఇక్కడొక అనుమానం రావచ్చు.ఆరాధించే చోటే ఈ విలయం ఎందుకు జరిగింది? అక్కడ జరగకూడదు కదా అని.

ఆరాధన అంటే ఊరకే విగ్రహాలు పెట్టి పూజలు చెయ్యడం కాదు. ఆ దైవం ఏయే భావాలకు సూచకుడో వాటిని త్రికరణశుద్ధిగా ఆచరించాలి.ఆ లక్షణాలను మన నిత్యజీవితంలో ఆనుసరించాలి.అది లేనప్పుడు ఏ దేవుడికి ఎన్నిరకాల దొంగపూజలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.కాసేపు పూజ చేసి ఆ తర్వాత మనిష్టం వచ్చినట్లు మనం జీవిస్తుంటే ఈ విధంగానే జరుగుతుంది. అప్పుడే దేవుడూ రక్షించడు. ఇది ఖచ్చితంగా సామూహిక కర్మ ప్రబావమే.

గత అయిదురోజులుగా కొన్ని వందల మైళ్ళ పొడుగునా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్నో ఊళ్లు నీళ్లలో దిగ్బంధనం అయ్యాయి.పంటలు పాడై పోయాయి.రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించి పోయింది.రైలు మార్గాలు అతలాకుతలం అయ్యాయి.మద్రాసు హైవే మీదుగా అయిదు అడుగుల ఎత్తున నీళ్ళు పారాయి.లారీలు బస్సులు కార్లు నీళ్ళలో మునిగిపోయాయి.పక్కనున్న ఊరికి పోవాలంటే ఎన్నో మైళ్ళు చుట్టూ తిరిగి పోవలసిన పరిస్థితులు తమిళనాడులో ఎన్నో చోట్ల జరిగాయి.కొన్ని చోట్ల అయితే 8 గంటలపాటు ఒకే స్టేషన్లో కదలని రైల్లో ప్రయాణీకులు కూచుని భజన చెయ్యవలసి వచ్చింది.ఎంతోమంది ముందే వేసుకున్న ప్లానులూ వాళ్ళ షెడ్యూళ్ళూ గందరగోళం అయిపోయాయి.ఆస్తినష్టం ఎంతో ఇంకా లెక్కలు తేలడం లేదు.ఈరోజే వాన కాస్త తెరపిచ్చింది.కానీ ఇంకా పూర్తిగా పోయినట్లు లేదు.

'ఈ గ్రహయోగం సంభవించినప్పుడు లోకం దుఃఖంలో 'మునుగుతుంది' అనే మాటను వాడటంలో వరాహమిహిరుడు ఎంతో శ్లేషను ఉపయోగించాడు. మార్మికభాషను వాడటంలో ఆయన సిద్ధహస్తుడు.ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ ఇలాగే మార్మికార్ధాలతో నిండి ఉంటాయి.ఎంతో క్లిష్టమైన గణిత సూత్రాలను 'కటపయాది' విధానంలో ఇమిడ్చి సూత్రబద్ధం గావించడంలో ఆయన దిట్ట.ఆయన వ్రాసిన సూత్రాలను విడమర్చి చెప్పడానికి పుస్తకాలకు పుస్తకాలే వ్రాశారు పరిశోధకులు.దీనినిబట్టి ఆయన తన గ్రంధాలలో వాడిన మార్మికభాష ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

గతంలో రోహిణీశకట భేదనం జరిగిన ప్రతిసారీ జననష్టం ఆస్తినష్టం జరిగింది. వాటిలో భూకంపాలున్నాయి.జలప్రమాదాలున్నాయి.ఈసారి కూడా అవన్నీ జరుగుతున్నాయి.తమిళనాడు ఆంధ్రాలలో లక్షలాది మంది అయిదు రోజులుగా కురుస్తున్న వర్షంవల్ల నానాపాట్లూ పడటమూ, పంట నష్టమూ,ఆస్తి నష్టమూ చాలా ఎక్కువగా ఉండటమే దీనికి తార్కాణాలు.

ఈ ఖగోళసూత్రాన్ని 2000 ఏళ్ళ నాడే పరిశీలించి, సూత్రీకరించి మనకందించి, ముందుముందు కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుందని వ్రాసిపెట్టిన వరాహమిహిరాది ప్రాచీన శాస్త్రవేత్తలకు జోహార్లు అర్పించకుండా ఉండగలమా?