నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, నవంబర్ 2015, శనివారం

స్వాగతం

నిద్రను చెదరిన స్వప్నం
నిన్ను క్రుంగదీస్తుంది
వదలని స్వప్నం ప్రేతం
కాకూడదు నీకది నేస్తం
కలనలాగే వదిలెయ్

చేజారే ప్రతి అవకాశం
అంతంలో ఆహుతౌతుంది
దానినలాగే పోనియ్
గతమన్నది గతమే నేస్తం
ముందున్నది కాలమనంతం

అనుభవమేదీ నిలవదు
అమరిక ఏదీ చెల్లదు
ఏదైనా కొన్నాళ్ళే
అనుభవ శూన్యత లోతున
అడుగుంచుట నేర్వవోయ్

ఎంతటి నాటకమైనా
ఒకనాటికి ముగిసిపోవు
వింతల రంగుల లోకం
ఒకరోజున నిన్ను వీడు
శాశ్వతమేదీ లేదోయ్

ఈ సత్యం తెలియనిచో
నీ హృదయం పగిలిపోవు
ఈ మార్గం ఎరుగనిచో
నీ గమనం ఆగిపోవు
వృధగా బ్రదుకకు నేస్తం

ఈ లోకపు వీధులలో
నీవొక సంచారివెపుడు
ఈ మాయల మనుషులతో
నీదొక సంసారమెపుడు
కళ్ళు తెరచి చూడవోయ్

కనుతెరచిన మరుక్షణమే
కలయన్నది మాయమౌను
నిజమెరిగిన నిముషమునే
వగపన్నది వదలిపోవు

తెలుసుకోర ఈ నిజం
మరచిపోర నీ గతం
పలుకు నీకు స్వాగతం
వెలుగులోక వైభవం