Pages - Menu

Pages

7, డిసెంబర్ 2015, సోమవారం

4th Astro Workshop on Medical Astrology and Nadi Principles - Photos

ముందే ప్లాన్ చేసినట్లుగా 4th Astro Workshop హైదరాబాద్లో విజయవంతంగా జరిగింది.ఈ వర్క్ షాప్ కు దాదాపు 50 మంది జ్యోతిశ్శాస్త్ర అభిమానులు హాజరై రోజంతా ఓపికగా కూర్చుని జ్యోతిశ్శాస్త్ర రహస్యాలను ఆకళింపు చేసుకున్నారు.

మెడికల్ ఆస్ట్రాలజీ (వైద్యజ్యోతిష్యం) లోని రహస్యాలను, భృగునాడీ జ్యోతిష్య రహస్యాలతో మిళితం గావిస్తూ ఉదయం 9.30 నుంచి సాయంతం 5.30 వరకూ సభ్యులకు క్లాస్ చెప్పడం జరిగింది.

ఈ వర్క్ షాప్ కు హాజరైనవారు - వారీ అదృష్టాన్ని నిలుపుకోగలిగితే మాత్రం - చాలా అదృష్టవంతులనే చెప్పాలి.ఎందుకంటే ఈ రహస్యాలను వారంతట వారు నేర్చుకోవాలంటే ఎన్నేళ్ళు ప్రయత్నించినా సాధ్యంకాదు.గురుముఖతా విన్నప్పుడే ఇవి వంటబడతాయి.వినయపూర్వకమైన అచంచలసాధనతో జీర్ణం కాబడతాయి.దాదాపు నాయొక్క పదిహేనేళ్ళ రీసెర్చిని 60 జాతకచక్రాల సహాయంతో విశ్లేషణాత్మకంగా వివరిస్తూ సులువైన ప్రభావవంతమైన నాడీ జ్యోతిష్యశాస్త్ర సూత్రాలను ఈ సందర్భంగా సభ్యులకు వివరించి చెప్పడం జరిగింది.

నాడీజ్యోతిష్య శాస్త్రానికి ఆద్యుడైన భృగుమహర్షి అనుగ్రహంతోనే ఇది సాధ్యమైనదని భావిస్తున్నాను.

మరొక్క విషయం.

విశాలభావాలూ ఉన్నత వ్యక్తిత్వమూ కలిగిన ఉత్తమసాధకులను చూచినా వారితో మాట్లాడినా నాకు చాలా ఆనందం కలుగుతుంది.ఈ సమ్మేళనానికి వచ్చినవారిలో అనంతమూర్తి గారు అటువంటి ఉత్తమవ్యక్తి.

ఈ సందర్భంగా లంచ్ బ్రేక్ సమయంలో అనంతమూర్తిగారితో జరిగిన సంభాషణ చాలా ఆనందాన్ని కలిగించింది.వృత్తిపరంగా ఆయనొక ఉన్నతోద్యోగి.ప్రవృత్తిపరంగా చూస్తె ఆయనొక ఉన్నతస్థాయికి చెందిన రహస్య శ్రీవిద్యోపాసకుడు.వృత్తిపరంగానూ ఉపాసనాపరంగానూ ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ గొప్ప వినయశీలి.వయసులో నాకంటే కొంచం పెద్దవాడైనప్పటికీ శక్తి ఉపాసనలో లోతైన అనుభవజ్ఞానం కలిగినవాడైనప్పటికీ, ఆయన యొక్క వినయసంస్కార పూరితమైన ప్రవర్తన నన్ను ముగ్దుడిని గావించింది.ఆయన చుట్టూ ఉన్న 'ఆరా' చాలా ఆహ్లాదంగా ఉండి ఆయన ఉపాసనా స్థాయి ఏమిటో మనకు సూచిస్తున్నది.

శంకరుల అద్వైతాన్నీ,కాశ్మీర శైవాన్నీ,శాక్తేయాన్నీ,ఉత్తరకౌళ సాంప్రదాయపు సాధనా విధానాలనూ,నిజమైన శ్రీవిద్యనూ, శ్రీరామకృష్ణుల అత్యున్నతమైన భావనలనూ స్పృశిస్తూ సాగిన మా సంభాషణ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.నిజానికి ఆయన జ్యోతిష్య శాస్త్రం కోసం ఈ మీటింగ్ కు రాలేదు.కేవలం నాతో మాట్లాడాలని మాత్రమె వచ్చారు.నిజానికి నా దగ్గర దీక్ష స్వీకరించిన చాలామంది నా శిష్యులు, ఊరకే నన్ను చూచి నా మాటలు వినడానికే దూరాలనుంచి వస్తున్నారని కూడా నాకు తెలుసు.

బెంగాల్ లోని మహాసిద్ధక్షేత్రం"తారాపీఠ్" నుంచి తారాదేవి పాదాలను ఈ సందర్భంగా రత్న నాకు తెచ్చి ఇవ్వడం ఆదిపరాశక్తి తారాదేవి నామీద కురిపిస్తున్న అనుగ్రహంగా భావిస్తున్నాను.


జ్యోతిశ్శాస్త్రం మీద ఎంతో ప్రేమతో నామీద నమ్మకంతో అభిమానంతో ఎంతో దూరాలనుంచి వచ్చి ఈ సమావేశానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


ఉన్న తక్కువసమయంలో ఎంతో శ్రమించి,లాజిస్టిక్స్ మొత్తాన్నీ ఎంతో చక్కగా ప్లాన్ చేసి,ఈ workshop ను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలకూ పాత్రుడైన రాజూ సైకంను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి ఉత్తమశిష్యులు దొరకడం జగన్మాత నాకిచ్చిన వరంగా భావిస్తున్నాను.


నేను అనుసరించే తంత్రయోగమార్గంలో దీక్ష ఇవ్వమని చాలామంది ఈ సందర్భంగా నన్ను అడిగారు. వారి కోరిక త్వరలో తీరుతుంది.త్వరలో మళ్ళీ జరుగబోతున్న "సాధనా సమ్మేళనం" లో వారికి దీక్ష ఇవ్వబడుతుంది.

ఈ సందర్భంగా శ్రమపడి ఫోటోలు తీసి, కార్యక్రమం మొత్తాన్నీ చిత్రాలలో బంధించి మాకందించిన సునీల్ వైద్యభూషణ, రాఘవేంద్ర,సరళాదేవిలను అభినందిస్తున్నాను.

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.