నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, డిసెంబర్ 2015, ఆదివారం

ఎడారిలో కోయిలా ...

హీరో రంగనాధ్ నిన్న హైదరాబాద్ లో మరణించాడు.ఆయనది సహజమరణం కాదనీ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

నిన్న సాయంత్రం 7.30 ప్రాంతంలో నాకు వార్త తెలిసింది. నేను మొదట్లో నమ్మలేదు. ఎందుకంటే ఎంతో పాజిటివ్ గా ఉండే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే నేను నమ్మలేక పోయాను. పైగా ఆయన కవీ భావుకుడూ సంగీత కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తీ అంతేగాక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి మనిషి.

మన అలవాటు ప్రకారం వెంటనే హోర వైపు దృష్టి పోయింది.బుధహోర జరుగుతున్నది.గోచారంలో బుధుడు ధనుస్సులో ఉన్నాడు.అంతేకాదు ప్లూటో తో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నాడు.బుధుడు బుద్ధి కారకుడు.అంటే మనుషుల బుద్ధిని నియంత్రించే శక్తి ఆయనకు ఉంటుంది.అలాగే ప్లూటో(యమగ్రహం) మరణానంతర జీవితానికి కారకుడు. యమలోకానికి అధిపతి ఆయనే.వీరిద్దరి డిగ్రీ కంజంక్షన్ వల్ల మనుషులలో తీవ్రమైన నిరాశ, విరక్తి, "ఈ జీవితం ఇకచాలు,చూసింది అనుభవించింది చాలు,ఇక చనిపోదాం,బ్రతికుండి సాధించేది ఏముంది?అంతా వేస్ట్" - అన్న భావాలు తీవ్రంగా కలుగుతాయి.

ముఖ్యంగా కొన్నికొన్ని జాతకచక్రాలలో చూస్తే - ఆయాజాతకులు బాగా సెన్సిటివ్ అయి ఉండి,విశాలమైన భావాలు వారిలో ఉండి, స్వార్ధం బాగా తక్కువగా ఉండి,బాగా ఎమోషనల్ టైప్ అయి ఉంటె మాత్రం అలాంటివారి మీద ఈ సమయం చాలా బలంగా పనిచేస్తుంది. బుధుడు ప్లూటో గ్రహాల కంబైండ్ ఎఫెక్ట్ వీరిమీద చాలా తీవ్రంగా ఉంటుంది. జీవితం వృధా అనీ, ఇంక ఒక్కరోజు కూడా బ్రతకడం శుద్ధవేస్ట్ అనీ వారికి బలంగా అనిపిస్తుంది. వారిని ఆత్మహత్య చేసుకునేలా ఈ గ్రహప్రభావం ప్రేరేపిస్తుంది.

ఒక్క రెండుమూడు రోజులు వారిని కొంచం కనిపెట్టి ఉండి ఈ బ్యాడ్ పీరియడ్ నుంచి తప్పించగలిగితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ  మామూలుగా బ్రతుకుతారు.అంతకు ముందు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న ఆలోచనకు వారికే అప్పుడు నవ్వొస్తుంది.

కానీ ఈ చెడు సమయం నుంచి తప్పుకోవడం చాలా కష్టం. కొందరు దీనికి బలైపోతారు.అంతే.

ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సమయం కూడా సూర్యహోర నడిచింది.సూర్యుడు బుధునితో కలసి యమగ్రహం యొక్క నీడలో ఉన్నాడు.

మీలో ఎవరికి వారు గమనించుకుంటే - గత మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా 'మానసిక డిప్రెషన్' బాగా ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని గమనిస్తారు.ప్రతివారికీ ఈ మూడురోజులలో ఏదో ఒక సమయంలో - చనిపోయిన వారివారి ఆప్తులు గుర్తురావడమూ, జీవితంలో జరిగిపోయిన చెడు సంఘటనలు గుర్తురావడమూ, ఒక విధమైన విరక్తి భావాలు కలగడమూ గమనించవచ్చు.ఇది ఈ గ్రహయోగ ప్రభావమే.

రంగనాథ్ గారితో నా శ్రీమతి తరచుగా పోన్ లో మాట్లాడుతూనే ఉంటుంది.దసరాలలో శుభాకాంక్షలు కూడా చెప్పింది.ఒకసారి వెళ్లి చూచివద్దామని అనుకుంటూనే ఉన్నాము.ఇంతలో ఈ వార్త వినవలసి వచ్చింది. "ఏమ్మా ఎప్పుడూ నువ్వే ఫోన్ చేస్తావు. వాడెక్కడ?ఏం చేస్తున్నాడు?" అని నా గురించి అడిగేవాడు. ఆయన ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారంకుల్. లైన్ డ్యూటీలో ఉన్నారు.వచ్చాక మాట్లాడిస్తానని తను చెబుతూ ఉండేది.

2009 లో ఆయన భార్య మరణించినప్పటి నుంచీ రంగనాద్ చాలా మానసిక డిప్రెషన్ లో ఉన్నారని సన్నిహితులు స్నేహితులు అంటున్నారు. స్వతహాగా ఆయన ఎంతో మంచి మనిషి.సున్నితమనస్కుడు.ప్రేమతత్త్వం,ఉదారస్వభావం, విశాలదృక్పధాలు కలిగిన ఒక జ్ఞాని అని చెప్పవచ్చు.

ఆధ్యాత్మికపరంగా నా భావాలూ ఆయన భావాలూ బాగా కలుస్తాయి.

ఆయనది కూడా నాలాగే ప్రాక్టికల్ ఆధ్యాత్మికత.గుళ్ళూ గోపురాలూ పూజలూ భజనలూ కంటే నిత్యజీవితంలో విశాలమైన భావాలతో కూడిన ఆధ్యాత్మికతను పాటించడాన్ని ఆయన ఇష్టపడేవాడు.విగ్రహారాధన కంటే కూడా నిరాకార దైవాన్నీ మానవత్వాన్నీ ఇష్టపడేవాడు.మచ్చలేని మనిషి. సినిమా ఫీల్డ్ లో ఎవరిని అడిగినా సరే కాంట్రవర్సీ లేని మంచిమనిషి ఎవరంటే రంగనాద్ గారే అని చెబుతారు.అంతమంచి పేరు ఆయనకున్నది.సినిమా రంగంలో అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉంటాడంటే అసలు మనం నమ్మలేం.అంత మంచివ్యక్తి.

"ఓపన్ హార్ట్ విత్ ఆర్కే" ప్రోగ్రాములో తనకు ఇంక బ్రతకాలని లేదని ఆయన క్లియర్ గా చెప్పేశాడు. "ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఏమీ తేడా లేదు.నేను ఆ స్థితికి వచ్చేశాను. I am waiting for call.మరణంలో మూడు రకాలున్నాయి.ఒకటి ఆత్మహత్య. రెండు ప్రాణదానం.మూడు జీవసమాధి.

ఆత్మహత్య పిరికితనం.ప్రాణదానం పౌరుషం.జీవసమాధి పరిపూర్ణత్వం,చావు ఈమూడు రకాలే.నేను ఈమూడో స్థితికి వచ్చానని నా భావన" - అని స్పష్టంగా చెప్పాడు.అంతేగాక - ఆత్మహత్య చట్టరీత్యా నేరం కాబట్టి ఆగుతున్నాననీ లేకుంటే చేసుకుంటాననీ,జీవితంలో ఇక సాధించవలసింది ఏమీ లేదనీ, బ్రతకడం మీద తనకు ఇంటరెస్ట్ పోయిందనీ స్పష్టంగా చెప్పాడు.

భార్య ఉండగానే ఇంకొక పదిమందితో కులుకుతున్న మనుషులున్న నేటి సమాజంలో - ఆరేళ్ళక్రితం చనిపోయిన భార్య ఫోటోను దేవుళ్ళతో సమానంగా పూజామందిరంలో పెట్టుకుని పూజించిన మహామనిషి రంగనాద్ గారు. ఆమెను మర్చిపోలేక అనునిత్యం స్మరించిన గొప్ప ప్రేమికుడు కూడా ఆయనే.

అంతేకాదు డాబామీదనుంచి క్రిందపడి నడుము విరిగిపోయి రెండుకాళ్ళూ పేరలైజ్ అయిన స్థితిలో దాదాపు పద్నాలుగేళ్ళు ఆమె మంచం మీద ఉంటే - ఏమాత్రం అసహ్యించుకోకుండా అన్నీ తానే అయి సేవలు చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. అలా చేసినందుకు ఆయన్ను ఎవరైనా పొగిడితే - తేలికగా నవ్వేస్తూ - "అది నా బాధ్యత. తను బాగున్న రోజులలో మాకు చేసిపెట్టలేదా?ఇప్పుడు తనకు బాగులేదు. నేను చేస్తున్నాను.తప్పేముంది?ఇందులో నా గొప్పేముంది?" అని అనేవాడు.

ఇలాంటి మనుషులు ఈ కాలంలో అసలెక్కడున్నారు?

అమితంగా ప్రేమించిన భార్య కన్నుమూయడం, జీవితంలో అన్నీ చూచాను ఇంక చూడవలసింది ఏమీ లేదన్న ఒక విధమైన విరక్తీ, బాధ్యతలన్నీ నేరవేర్చాను ఇక ఉండి సాధించేది ఏముందన్న ఒక విధమైన నిర్లిప్తధోరణీ అన్నీ కలసి ఉన్న ఆయన మనస్సుకు ఈ ప్రస్తుత గ్రహస్థితి బాగా ప్రేరకంగా పనిచేసి ఈ పనికి దారితీసి ఉంటుందని నేను భావిస్తున్నాను.

ఈ మరణం వెనుక ఇతరకారణాలు ఏమైనా ఉన్నాయో ఏమో మనకు తెలియదు.ఏదో ఒకరోజున చావు ఎవరికైనా తప్పదు.కానీ ఇలాంటి మంచిమనిషి ఈ విధంగా కన్నుమూయడం మాత్రం జీర్ణించుకోలేని విషయం.వ్యక్తిగతంగా మా కుటుంబానికి శరాఘాతం.

వ్యక్తులు చనిపోయినప్పుడు నాకు సాధారణంగా బాధ కలగదు.మా అమ్మ చనిపోయినప్పుడు మాత్రమే నా జీవితంలో నేను ఏడ్చాను.మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాను.

"బాధ నన్ను ఏడిపించలేదు.కానీ మంచితనం ఏడిపిస్తుంది" అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటలు గుర్తొస్తున్నాయి.

తను నటించిన ' ఎడారిలో కోయిలా తెల్లారని రేయిలా...' అనే ఒక పాటలోలాగే ఈ కుళ్ళు సమాజంలో ఇమడలేక తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఒక కోయిల - రంగనాధ్ గారు.

ఆయన పవిత్రాత్మకు శాంతిని చేకూర్చమని శ్రీరామకృష్ణులను ప్రార్ధిస్తున్నాను.