Pages - Menu

Pages

30, డిసెంబర్ 2015, బుధవారం

ఓ మహర్షీ ఓ మహాత్మా...

గుండె గుహలో నిత్యమెపుడు
నేను నేనను స్పందనముతో
వెలుగు కేవలమేది కలదో
అదియె నేనను నిజము నెరుగ
చిన్తనమునో మగ్నతమునో
శ్వాస నియమపు ఊత వలనో
అడుగు జేరుచు అణగిపోవుచు
అన్ని లోకము లాక్రమించుచు
ఆత్మ తానై నిలిచి జూడగ
ఆట ముగియును అంతు దెలియును
సాధనంబుల సారమిదియే

అంటూ సాధనా సారాన్ని మొత్తం ఒకే ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పిన మహనీయుడు రమణమహర్షి పుట్టినరోజు మొన్న 26-12-2015 మార్గశిర బహుళ ద్వితీయ.

తేదీల ప్రకారం ఈరోజు.

ఆ మహనీయుని స్మరిస్తూ ఈ కవిత...
-------------------------------

దైవం జడం కాదన్న నిన్నే
ఒక విగ్రహంగా మార్చి పూజిస్తున్నాం
ప్రదక్షిణాలొద్దన్న నీ చుట్టూ
నిత్య ప్రదక్షిణాలు చేస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

తంతులెందుకన్న నీ చుట్టూ
అంతులేని తంతులను నిర్మించాం
సొంతగూటిని మర్చిపోయి
వింత అహంతో మంతనాలాడుతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ఆత్మనిష్ఠవు నీవై నిరూపించినా
కర్తవ్యనిష్ఠను మాకై నువ్వు బోధించినా
వాటిని పాటించలేని అశక్తులం
బంధాలను తెంచుకోలేని గానుగెద్దులం 
ఓ మహర్షీ ఓ మహాత్మా...

మౌనబోధవై నీవు చెలగుతుంటే
మాటల ప్రశ్నలతో నిన్ను వేధిస్తున్నాం
జ్ఞానతేజస్సువై నీవు వెలుగుతుంటే
చీకటి గబ్బిలాలమై నిన్ను శోధిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

శుద్ధజ్ఞానపు వెలుగును చూడలేక
నాటకాలకు తెరలను దించలేక
మేటి బాటల సాగే ధాటిలేక
ఆటపాటల చెరలో అలమటిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

నువ్వు చెప్పేవి ఊరకే వింటున్నాం
మేం చేసేవి మాత్రం మేం చేస్తున్నాం
నిన్ను అనుసరిస్తున్నామన్న భ్రమలో
మా అహాలకే మేం ఆహుతౌతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ఆత్మే దైవమని నీవెంతగా చెప్పినా
అనేక క్షేత్రాలలో దాన్ని వెదుకుతున్నాం
అవ్యయబోధను నీవు మాకిచ్చినా
అజ్ఞానపు బరువుతో అణగిపోతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

నీ వాక్యాలను ఇతరులకు బోధిస్తున్నాం
నీ గౌరవాన్ని మేం గుంజుకుంటున్నాం
నీతో మాత్రం నడవలేక పోతున్నాం
చీకటి బ్రతుకులలో తడబడుతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

మౌనంగా ఉండమని నీవంటే
నీపై స్తోత్రాలల్లి పాడుతున్నాం
నీలో నీవుండమని నీవంటే
లోకంతో సంసారం సాగిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

దేహభ్రాంతిని ఒదుల్చుకోలేక
మోహశాంతిని పొందే వీల్లేక
ఆత్మదీప్తిని అందుకోలేని అధములమై
ఆషాఢభూతులమై మిగిలిపోతున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

వెలుగుచుక్కవై నీవు దారి చూపిస్తున్నా
వెయ్యి చీకట్లలో చిక్కి విలపిస్తున్నాం
బ్రతుకు మార్గాన్ని నీవు బోధిస్తున్నా
అతుకుల బొంతలమై అఘోరిస్తున్నాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

ప్రశ్నలెన్నో అడుగుతాం
నీ జవాబును మాత్రం వినిపించుకోం
అడుగు వెయ్యమంటే లెక్కచెయ్యకుండా
మళ్ళీమళ్ళీ అవే ప్రశ్నలడుగుతాం
ఓ మహర్షీ ఓ మహాత్మా...

చిత్తశుద్ధిలేని మాకెప్పటికి నిష్కృతి?
విత్తమోహం వీడని మాకెప్పటికి సుగతి?
మొత్తం స్వార్ధంతో నిండిన మాకెప్పటికి ప్రగతి?
నిత్యసోమరులమైన మాకేనాటికి ఆత్మస్థితి?
ఓ మహర్షీ ఓ మహాత్మా...