నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జనవరి 2016, ఆదివారం

ఈరోజు వివేకానందస్వామి జన్మదినం

ఈరోజు పుష్య బహుళ సప్తమి.అంటే ఈరోజు వివేకానంద స్వామి జన్మదినం. నేటికి ఆయన జన్మించి 153 సంవత్సరాలు గడిచాయి.ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించడం మన కర్తవ్యం.

స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన్ను స్మరిస్తే చాలు నా హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రపంచాన్నీ అందులోని మనుషులనూ ఏమాత్రం లెక్కచెయ్యని దివ్యాత్ముడైన శ్రీరామకృష్ణుడు,నరేన్ కనిపించకపోతే మాత్రం తల్లడిల్లి పోయేవాడు.అమ్మదగ్గర ఏడ్చేవాడు.నరేన్ కనిపిస్తే తన దగ్గరగా కూచోబెట్టుకుని తనచేతితో నరేన్ కు ముద్దుగా తినుబండారాలు తినిపించేవాడు.శ్రీరామక్రిష్ణుని దివ్యస్పర్శకు, ఆయన కరుణకు నోచుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో ఆలోచిస్తే వివేకానందస్వామి ఎంతటి మహనీయుడో మనం తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

ఆయన లక్షణాలను,ఆయన చేసిన పనులను, చెప్పిన బోధనలను ఒక్కసారి మననం చేసుకుందాం.

పోల్చలేని ధీశక్తి

అసాధారణమైన ధీశక్తి ఆయన సొంతం.చిన్నవయస్సులోనే భారతీయ వేదాంతాన్ని ఔపోసన పట్టాడు.అంతేగాక పాశ్చాత్య దార్శనికులనూ ఆయన క్షుణ్ణంగా చదివాడు.ఒక్కసారి విన్నా చూచినా చదివినా ఇక ఎప్పటికీ మరువని ఫొటోగ్రాఫిక్ మెమరీ ఆయనకు ఉండేది.వాదాలలో ఆయనను ఓడించినవారు లేరు. నిశితమైన పరిశీలనా,తర్కబద్ధమైన ఆలోచనా, వాదనాపటిమా ఆయనలో ఉండేవి.అటువంటి మేధస్సును ఆదిశంకరులలో మాత్రమే మనం మళ్ళీ గమనిస్తాం. 

ఆశ్చర్యపరిచే ధ్యానశక్తి

అతి చిన్నతనం నుంచే స్వామికి ధ్యానం సహజంగా అలవడింది.రెండు మూడేళ్ళ వయస్సునుంచే స్వామి అచంచలమైన ధ్యానంలో ఉండేవాడు. తన గదిలోకి పాము వచ్చినా, పక్కవాళ్ళు గోలగోలగా అరుస్తున్నా కూడా వినిపించనంత గాఢమైన ధ్యానంలో ఆయన అంత చిన్నవయస్సులోనే ఉండగలిగేవాడు.అది ఆయనకు సహజంగా పుట్టుకతో వచ్చింది.

అబ్బురపరిచే దయాస్వభావం

చిన్నతనంలో తన పుట్టినరోజున తల్లిదండ్రులు కొనిచ్చిన కొత్త బట్టలను ఏమాత్రం ఆలోచించకుండా పేదవారికి ఇచ్చేసేవాడు.ఇతరుల బాధలు చూచి చలించి వాటితో మమేకం చెంది బాధపడే గుణం ఆయనకు పుట్టుకతోనే వచ్చింది.

బహురంగాలలో ప్రావీణ్యం

స్వామికి అనేక రంగాలలో సహజమైన ప్రావీణ్యం ఉండేది.ఆయన అద్భుతంగా గానం చేసేవాడు.శ్రీరామకృష్ణుల మధురస్వరం తర్వాత అంతటి మధురమైన స్వరం స్వామిదే అని,వాటిని ఏ గాయకులతోనూ పోల్చలేమని,అవి ఈ లోకానికి చెందిన స్వరాలు కావని, రెండూ విన్నవారు వ్రాశారు.అంతేగాక ఆయన డోలక్,తబలా, వీణ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించేవాడు. మల్లయుద్ధంలో మెళకువలు ఆయనకు తెలుసు.పెయింటింగ్స్ చక్కగా వెయ్యగలిగేవాడు.ఆయన మంచి వక్త మాత్రమె గాక మంచి కవి కూడా.అనేక కవితలను ఆయన చిన్నతనంలోనే వ్రాశాడు.

నిశిత పరిశీలనా శక్తి

జీవితాన్ని చాలా నిశితంగా ఆయన చిన్నతనంలోనే పరిశీలించాడు.జీవితం అందరూ గడుపుతున్నట్లు డబ్బుకోసం, తిండి కోసం,విలాసాలకోసం కాదనీ, దానికి ఒక ఉన్నతమైన అర్ధమూ గమ్యమూ ఉన్నాయన్న విషయాన్ని ఆయన అతిచిన్న వయస్సులోనే గ్రహించాడు.జీవితం అంటే ఒక గమ్యం లేకుండా భోగాల కోసం,సరదాలకోసం,డబ్బుకోసం వృధా చేసుకునేది కాదని ఆయనకు అతి చిన్నప్పుడే స్పృహ ఉండేది.

ఆశ్చర్యపరచే వైరాగ్యం

అందరినీ రకరకాలైన వ్యామోహాలకు గురిచేసే యవ్వనప్రాయంలో స్వామి అమితమైన వైరాగ్యసంపన్నుడై మండుతున్న అగ్నిలాగా ఉండేవాడు.ఆయన చుట్టూ ఉన్న ఆరా ఎంత బలంగా ఉండేదంటే,ఆయన సమక్షంలో ఉన్నవారుకూడా అనవసరమైన చెత్త సంభాషణలను ఏమాత్రం చెయ్యలేకపోయేవారు.వారి మనస్సులు కూడా అసంకల్పితంగా ఉన్నతములైన విషయాలవైపు మళ్లేవి.

అద్భుతమైన సాధనాబలం

శ్రీరామకృష్ణులను స్వామి దర్శించేనాటికి స్వామికి 19 ఏళ్ళు. గురుదేవుని మార్గదర్శనంలో నాలుగేళ్ళు గడిచేసరికి తన 23 వ ఏట,యోగంలో అత్యంత ఉన్నతస్థితి అయిన నిర్వికల్ప సమాధిని స్వామి చేరుకోగలిగాడు.వెనక్కు తిరిగి చూడనటువంటి అలాంటి గొప్ప సాధనాబలం ఆయనకుండేది.

భారతీయ వేదాంతానికి కొత్త గమనం

అప్పటివరకూ కొండల్లో గుహలలో అడవుల్లో ఉన్న వేదాంతాన్ని స్వామి సమాజంలోకి తెచ్చాడు.సాధువులకు ఉన్న సంఘబాధ్యతలను ఆయన గుర్తుచేశాడు.కర్మకు యోగస్థాయిని కట్టబెట్టి కర్మయోగానికి పూర్వవైభవాన్ని తెచ్చాడు. తన మోక్షం ఒక్కటే ప్రధానం కాదు, నలుగురికీ కూడా ఆధ్యాత్మికంగా సాయపడాలన్న ఉన్నతమైన సాంప్రదాయానికి మళ్ళీ ఊపిరి పోశాడు.సన్యాస సాంప్రదాయానికి కొత్త భాష్యం చెప్పాడు.

మూడు మతాల సమన్వయం

అప్పటివరకూ మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని కొట్టుకు చస్తున్న ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాల గొడవకు తన గురుదేవులైన శ్రీరామకృష్ణుల బోధనల మార్గంలో చక్కగా సులువుగా పరిష్కారం చూపించాడు. "మనిషి దైవాన్ని చేరుకునే మార్గంలో ఈ మూడూ మూడు మెట్లు మాత్రమే, అనవసరంగా కొట్టుకోవద్దని" చెప్పి మధ్వ,శంకర,రామానుజ సాంప్రదాయాల మధ్యన ఎప్పటినుంచో ఉన్న ఈ వైరుధ్యాన్ని ఎంతో చక్కగా సమన్వయం చేశాడు.

అన్ని మతాల సారం హిందూమతం

ప్రపంచంలోని అన్ని మతాల భావాలూ హిందూమతంలో ఉన్నాయి.నిజానికి ఈ మతాలన్నీ ఒకే దైవాన్ని చేరుకునే రకరకాలైన దారులన్న తన గురుదేవుల బోధనను విశ్వవ్యాప్తం గావించి మనుషుల మధ్యా మతాల మధ్యా ఉన్న ద్వేషాలను పోగొట్టే ప్రయత్నం చేశాడు.

జాతికి శక్తిపాతం

అప్పట్లో బ్రిటిష్ పాలనలో బానిసత్వంతో కృంగిపోతున్న మన దేశానికి అమృతం లాంటి తన బోధల ద్వారా తిరిగి జీవాన్ని ప్రసాదించాడు.నిరాశనూ, నిరుత్సాహాన్నీ, దైన్యాన్నీ వీడమనీ, స్వశక్తిని ఆత్మశక్తిని గ్రహించమనీ ఉద్బోధించాడు.మనలో ప్రవహిస్తున్న ఋషి రక్తం యొక్క శక్తిని తెలుసుకొమ్మని మేల్కొలిపాడు.

మహత్తరమైన యోగశక్తి

చాలామంది యోగశక్తిని గురించి మాటలు మాత్రమే చెబుతారు.కానీ స్వామి మాత్రం, లోకంలో తను వచ్చిన పని అయిపోయిందని అనుకున్న మరుక్షణం స్వచ్చందంగా ప్రాణం వదిలేసి యోగమార్గంలో తనలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయనకు 39 ఏళ్ళు మాత్రమే.ఇటువంటి యోగశక్తిని మనం చాలా తక్కువమంది ప్రవక్తలలో మాత్రమే గమనిస్తాం.

తను శరీరాన్ని వదిలేసే కొద్ది నెలల ముందు తన సోదర శిష్యుడైన అభేదానంద స్వామితో ఆయన ఇలా అన్నారు.(సన్యాసం స్వీకరించడానికి ముందు అభేదానంద స్వామి పేరు కాళీప్రసాద్ చంద్ర.వాళ్ళు మాట్లాడుకునే సమయంలో పాత పేర్లతోనే పిలుచుకునే వారు) 

'కాళీ ! నేను ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఈ శరీరంలో ఉంటాను.'

దానికి అభేదానంద స్వామి ఇలా అన్నారు.

'అదేంటి నరేన్? ఇప్పుడు నీ వయసెంత? నీవు మాట్లాడే మాటలేమిటి?అప్పుడే ఏమైంది? నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో ఉంది?'

దానికి వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'అదికాదు కాళీ! నీకు తెలీదు.నా ఆత్మ బాగా ఎక్కువగా వికాసం చెందుతున్నది.అది ఎంతగా వికసిస్తోందంటే ఈ శరీరాన్ని దాటి విశ్వం మొత్తాన్నీ అది నిండిపోతున్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువగా కలుగుతున్నది.ఈ చిన్నశరీరం ఇక ఎంతమాత్రం నన్ను భరించలేదు.కనుక త్వరలో నేను శరీరాన్ని వదలక తప్పదు.'

ఆ తర్వాత మూడు నాలుగు నెలలకే ఆయన శరీరాన్ని వదిలేశారు.

ఈ సంభాషణ వినడానికే మనకు భయం వేస్తున్నది కదూ? అలాంటిది స్వామి యొక్క ఆధ్యాత్మిక స్థాయి !!

నవీనకాలపు మహా ప్రవక్త

భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఎప్పటికీ కావలసిన మహత్తరమైన దివ్యమార్గాన్ని తన బోధలద్వారా సూచించి ప్రపంచానికి మార్గనిర్దేశం గావించాడు.

ఇప్పటి వరకూ వచ్చిన అనేకమంది ప్రవక్తలు -బుద్ధుడు,మహావీరుడు, జీసస్, మహమ్మద్, జోరాస్టర్ - వీరందరి కంటే వివేకానందస్వామి ఉత్తమమైన ప్రవక్త అని నేను విశ్వసిస్తాను. నా దృష్టిలో వీరందరికంటే ఉన్నతమైన స్థానం వివేకానంద స్వామిది.

దీనికి కారణాలు కొన్ని చెప్తాను.

మహమ్మద్ బోధలవల్ల ఈనాటికీ ప్రపంచంలో ఎంతో రక్తపాతం జరుగుతున్నది.అమాయకులు వేలాదిమంది ఈయన బోధల కారణంగా చంపబడుతున్నారు.మతహింస అనేది ఇస్లాంలో అతిపెద్ద లోపం.

క్రీస్తు బోధలవల్ల ప్రపంచంలో ఈనాటికీ ఎంతో ద్వేషం ప్రచారం కాబడుతున్నది.మతమార్పిడి జరుగుతున్నది.ఇది క్రైస్తవంలోని అతి పెద్ద లోపం.

ఇస్లాం ద్వారా భౌతిక హింస జరుగుతుంటే క్రైస్తవం ద్వారా మానసిక హింస జరుగుతున్నది.

శాంతిని బోధిస్తున్నామని చెప్పుకునే ఈ రెండు మతాలవల్లా భూమిమీద ప్రవహించినంత మానవరక్తం ఇంకే మతం వల్లా ఇప్పటివరకూ ప్రవహించలేదు.ఇది చరిత్ర చెబుతున్న నిజం మాత్రమే కాదు నేటికీ కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.

కానీ వివేకానందస్వామి విశ్వజనీనమైన, హింసకు అతీతమైన, వేదాంత మార్గాన్ని బోధించాడు.అందరిలో ఉన్న ఆత్మ నిజానికి ఒక్కటే అనీ, ఆ ఆత్మకు మూలమైన పరమాత్మ కూడా ఒక్కటే అనీ,ఎవరూ ఎవర్నీ ద్వేషించనవసరం లేదనీ, మతాలు మారవలసిన అవసరం కూడా లేదనీ ఆయన బోధించాడు.దీనికి మూలాలను మన వేదాలనుంచి ఉపనిషత్తుల నుంచి ఆయన ఉటంకించాడు.

బుద్ధుడు అనాత్మవాది.బౌద్ధంలో మిగతా అన్ని లక్షణాలూ మంచివే అయినప్పటికీ ఈ అనాత్మవాదం వల్లనే ఈ మతం మన దేశం నుంచి అదృశ్యం అయిపోయింది.కానీ వివేకానందస్వామి బుద్ధుని బోధలకు సరియైన అర్ధాన్ని వివరించాడు.ఆత్మవాదం ద్వారా కూడా బుద్ధుడు సూచించిన నిర్వాణస్థితిని పొందవచ్చని స్వానుభవంతో ఆయన అన్నాడు.కనుక బుద్ధుని కంటే వివేకానందుని స్థాయి ఉన్నతమైనదని నేను విశ్వసిస్తాను.

జీసస్,మొహమ్మద్ వంటి ప్రవక్తల కంటే బుద్ధుడు ఎంతో ఉన్నతమైన వాడు.ఎందుకంటే బుద్ధుని బోధనలలో హింసకు తావు లేదు.కాకపోతే బుద్ధుని మార్గంలో కొన్ని మౌలిక లోపాలున్నాయి.వివేకానందస్వామి వాటిని కూడా అధిగమించాడు.కనుక బుద్ధుని కంటే కూడా వివేకానందస్వామి ఇంకా ఉన్నతమైన ప్రవక్త అని నా భావన.

మరి ఇన్ని ఉత్తమ లక్షణాలున్న వివేకానందుని వంటి మహాప్రవక్త మన దేశంలో జన్మిస్తే ఆయన జన్మదినం ఈరోజు అయితే ఆయన్ను స్మరించకుండా ఉండటం ఎంత ఘోరమైన పాపమో ఆలోచించండి.

విచిత్రమేమంటే అలాంటి గొప్ప ప్రవక్త పుట్టి నేటికి 153 సంవత్సరాలు అయినప్పటికీ, ఈరోజుకి కూడా మన దేశంలో ఆయన బోధనలను సరిగ్గా అర్ధం చేసుకున్న వారూ ఆచరిస్తున్న వారూ అతి తక్కువమందే ఉన్నారు.గారడీవిద్యలు ప్రదర్శిస్తూ,నల్లధనమూ బంగారమూ పోగేసుకుంటూ,కుహనా వేదాంతం చెప్తూ కోరికలు తీరుస్తామంటూ పిచ్చిపిచ్చి దీక్షలిస్తున్న నకిలీ స్వాములకూ, నకిలీ బాబాలకూ నేడుకూడా మన దేశంలో కొదవ లేదు.అలాంటి వారి వెంట వేలంవెర్రిగా పరుగులు తీసే వెర్రిగొర్రెలకూ కొదవ లేదు.అదే మన దేశ ప్రజల ఆధ్యాత్మిక దౌర్భాగ్యం, కలిప్రభావం.

అసలుని వదిలేసి నకిలీల వెంట పరిగెత్తడమే మన దేశ ప్రజల దురదృష్టం.శుద్ధమైన వేదాంత బోధలను వదిలేసి గారడీ విద్యల వెంటపడి పరుగులు తియ్యడమే నేటి ప్రజల చవకబారు మనస్తత్వాలకు నిదర్శనం.

శ్రీరామకృష్ణ వివేకానందుల బోధనలను అనుసరించడం ద్వారా మాత్రమే మానవజాతి సరియైన మార్గంలో దైవం వైపు ప్రయాణం చెయ్యగలుగుతుంది.వీరిద్దరి బోధనలకు అనుగుణంగా ఇంకెవరైనా బోధిస్తే అంతవరకూ మాత్రమే ఆ బోధకులుగాని ఆ ప్రవక్తలుగాని సరియైన మార్గంలో ఉన్నట్లు లెక్క. అలా లేనప్పుడు, వారు కూడా కుహనా బోధకులే. అలాంటి వారిని అనుసరించినంత వరకూ మానవజాతికి, అజ్ఞానం నుంచీ, ద్వేషం నుంచీ, హింస నుంచీ,ఆధ్యాత్మిక దరిద్రం నుంచీ నిష్కృతి లేదు. రాదు.

కనీసం ఈరోజైనా ఆ మహనీయుని స్మరిద్దాం.ఆయన బోధనలను నిత్యజీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా చెయ్యడం ద్వారా మాత్రమే మనం కూడా దివ్యత్వం వైపు శరవేగంతో పయనించగలుగుతాం.సత్యమైన వేదధర్మానికీ సనాతనధర్మానికీ వారసులం కాగలుగుతాం. అప్పుడే మనం నిజమైన భారతీయులమని అనిపించుకో గలుగుతాం.