నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, ఫిబ్రవరి 2016, సోమవారం

మనది అతి పెద్ద ప్రజాస్వామ్యమా? ఎవరన్నారు?

తగలబడుతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్
మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని అనేక వేదికలపైన చాలా గొప్పగా మనవాళ్ళు చెబుతూ ఉంటారు. నిజానికి మనది ఎంత గొప్ప ప్రజాస్వామ్యమో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే అర్ధమౌతుంది.

తీవ్రవాదం వైపు వెళ్ళవద్దని మంచి చెప్పినందుకు మొన్నటికి మొన్న నెల్లూరులో పోలీస్ స్టేషన్ ను ఎటాక్ చేసి వాహనాలు తగలబెట్టి పోలీసులను కొట్టారు.కులగోలతో నిన్నటికి నిన్న తుని దగ్గర రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టి,పోలీస్ స్టేషన్ ను ఎటాక్ చేసి,పోలీస్ ఆఫీసర్స్ ను కొట్టి,బస్సులూ కార్లూ పగలగొట్టి తగలబెట్టారు.పైగా దీనిని దగ్గరుండి రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రజాప్రతినిధులూ ఇంతకుముందు మంత్రులుగా చేసినవారూ? ఎంత సిగ్గుచేటో? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుందేమో మరి?

మాకు తెలిసిన కొంతమంది,సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కారేసుకుని గుంటూరు నుంచి అన్నవరం వెళ్ళారు.క్రిమినల్స్ కొంతమంది దారిలో హైవే మీద కార్లన్నీ ఆపి అద్దాలను విచక్షణా రహితంగా పగలగొట్టుకుంటూ పోతున్నారు.వీరి కారు అద్దాలను కూడా పగలగొట్టారు. లోపలున్న ఆడవాళ్ళకూ పిల్లలకూ ఆ గాజుముక్కలు తగిలి ముఖమూ గొంతూ చీరుకుపోయి గాయాలయ్యాయి.వీళ్ళు నోర్మూసుకుని కారు అక్కడే ఒదిలేసి బ్రతుకుజీవుడా అని పారిపోయి గుంటూరుకు తిరిగి వచ్చారు. అసలెక్కడున్నాం మనం?

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ చాలా కొత్తది.లేటెస్ట్ కంప్యూటర్ టెక్నాలజీతో తయారైనది.పోయిన నెలలోనే అది కమీషన్ అయింది.దాని విలువ 65 కోట్లు. అనవసరంగా ఆ ఇంజన్ను ధ్వంసం చేశారు.రైలు బోగీలకు నిప్పు పెట్టారు. రైల్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్ళూ పిల్లలూ తీవ్రంగా భయపడి రైల్లోంచి దూకి పొలాల్లో పరుగులు పెట్టారు. చాలామంది అయితే,ప్రాణాలు దక్కితే చాలని, వారి లగేజిని రైల్లోనే వదిలేసి కిందకు దూకేశారు.వాటిల్లో పాసుపోర్టులూ డిగ్రీ సర్టిఫికేట్లూ మొదలైన ఇంపార్టెంటు డాక్యుమెంట్లు ఏమేం ఉన్నాయో? ఏ ముఖ్యమైన వస్తువులున్నాయో? అవన్నీ మళ్ళీ తిరిగి పొందాలంటే ఎంత కష్టం? అసలేమిటిదంతా? మనం ఉన్నది నాగరిక సమాజంలోనా లేక అడవిలోనా? మనకు లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా లేనట్లా? అని సందేహం కలుగుతున్నది.

నాకే గనుక అధికారం చేతులో ఉంటే ఈ క్రిమినల్స్ నూ, ఆ మాబ్ నూ జలియన్ వాలాబాగ్ లో చేసినట్లు స్పాట్లో షూట్ చేయించి పారేసి ఉండేవాడిని. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులను క్షమించి వదలకూడదు.అలా చేస్తే సమాజానికే ప్రమాదం.ఇలాంటి వారిని ఊరకే వదిలేస్తే సమాజంలో శాంతి మృగ్యమై పోతుంది.జనజీవనం అస్తవ్యస్తమై పోతుంది.కనుక కఠిన చర్యలు చాలా అవసరం.ఆ చర్యలు ఎలా ఉండాలంటే, తిరిగి ఇంకొకరు అలాంటి పనులు చెయ్యాలంటే భయపడి వణికిపోయేలా ఉండాలి.అప్పుడే సమాజంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది.

చైనాలో చేసినట్లు - కనీసం ఒక ఏభైమంది క్రిమినల్స్ ను ఈ సంఘటనలో గుర్తించి,వారి సోషల్ స్టేటస్ ఎంత పెద్దదైనా సరే,ఒక వారం లోపల వాళ్ళందరినీ అదే రైల్వే ట్రాక్ పక్కన పబ్లిగ్గా ఉరి తియ్యాలి. అప్పుడు గాని జనంలో భయం కలగదు.

అసలు కులానికి ప్రాధాన్యత ఏమిటి? దానికి రిజర్వేషన్లు ఏమిటి? కులం పేరుతో ఇన్ని గొడవలేమిటి? పేదవాడికి సహాయం అందాలి.అంతే.దానికి కులంతో పనేముంది? పేదవారు అన్ని కులాలలోనూ ఉన్నారు.వారిని గుర్తించి వారికి సాయం చేస్తే సరిపోతుంది. ఇంతమాత్రానికి కులం కులం అంటూ ఇంత గోల ఎందుకో నాకు ఎప్పటికీ అర్ధం కాదు.

నాకెప్పుడూ ఒకటి అనిపిస్తూ ఉంటుంది.మన దేశం ఒక సోషల్ డిజాస్టర్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నది.అంతా బాగానే ఉంది అని మనం అనుకుంటున్నాం గాని అది నిజం కాదు.సమాజంలో స్లీపింగ్ సెల్స్ లాగా అనేక సంఘవిద్రోహ శక్తులు ఊపిరిపోసుకుంటున్నాయి. దానికి తగినట్లు ప్రభుత్వ విధానాలు కూడా బుజ్జగింపు ధోరణిలో లోపభూయిష్టంగా ఉంటున్నాయి.ఈ ధోరణులు ఎంతమాత్రం మంచివి కావు.ఇవి ముందుముందు సివిల్ అన్ రెస్ట్ కు ఖచ్చితంగా దారి తీస్తాయి.

మాటమాటకీ ప్రభుత్వ ఆస్తులను ప్రజలే ధ్వంసం చెయ్యడం ఏమిటో,అలా చెయ్యమని నాయకులే రెచ్చగొట్టడం ఏమిటో,వారిని ప్రభుత్వం ఏమీ అనకపోవడం ఏమిటో నాకు అర్ధంకాని ఇంకొక విషయం.అలా చేస్తే నష్టపోయేది మనమేగా?మనం కడుతున్న టాక్స్ తోనే కదా ఆ ఆస్తులు తయారౌతాయి?వాటిని ధ్వంసం చేసుకుంటే మన ఇంటికి మనం నిప్పు పెట్టుకున్నట్లే కదా?పైగా అమాయకులైన ప్రయాణీకులు ఏం తప్పు చేశారు? వాళ్ళెందుకు ఇలా భయపడి వణికిపోయి పరుగులు పెట్టాలి?ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే?ఓట్ల కోసం మరీ ఇంత దిగజారుడుతనమా?

ప్రతిదీ జరిగిన తర్వాత బాధపడటం తప్ప ఇంటలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నట్లు?ఈ ప్లాన్ ను ముందే పసి గట్టలేకపోవడం ఇంటలిజెన్స్ వారి వైఫల్యం కాదా? పోలీసుల మీదా పోలీస్ స్టేషన్ మీదా దాడులు జరిగినా కూడా ఏమీ చర్యలు లేకపోవడం కులవర్గాల బుజ్జగింపు చర్య కాదా? ఇదెంత తప్పు సంకేతాలను ప్రజల్లోకి ఇస్తుందో,ఇలా ఊరుకుంటూ పోతే సమాజంలో  క్రైం రేట్ ఎంత పెరుగుతుందో ఆలోచించనవసరం లేదా? ఇదేనా సరియైన నాయకత్వం?

మొత్తం మీద రాహుప్రభావం సమాజం మీద చాలా బలంగానే పనిచేస్తున్నది. తిరుగుబాటు ధోరణులూ ఉగ్రవాద చర్యలూ హటాత్తుగా ఎక్కువౌతాయని అనుకున్నట్లే అంతా జరుగుతున్నది.తెలంగాణా రాష్ట్రం కంటే ఆంధ్రరాష్ట్రం అన్నింట్లోనూ వెనుకబడుతుందని చెప్పిన ప్రిడిక్షన్ కూడా నిజమౌతున్నది. దానికి తగినట్లే ప్రతిదానిలోనూ మన చేతగానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

అయితే,విషయాన్ని గ్రహాల మీదకు నెట్టకుండా ఈ సంఘటనలకు కారకులైన దుష్టగ్రహాల పని పట్టే విధంగా ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలి. రైలు తగలబడటం వల్ల కలిగిన దాదాపు 100 కోట్ల నష్టాన్ని ఆ మీటింగ్ పెట్టినవారి నుంచి వెంటనే వసూలు చెయ్యాలి.లేదా కాపు కార్పోరేషన్ నుంచి ఆ డబ్బును వెంటనే వసూలు చేసి ఇండియన్ రైల్వేకు జమ చెయ్యాలి.అలా చెయ్యకుండా,నాలుగురోజుల్లో ప్రజలే మర్చిపోతారులే అని ఊరుకుంటే మాత్రం,సమీప భవిష్యత్తులో రాష్ట్ర పరిస్థితి ఇంకా ఘోరంగా దిగజారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.