నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, మార్చి 2016, సోమవారం

లక్ష్మణరేఖ

లక్ష్మణ రేఖ దాటాకే
నేనెవరో నాకు తెలిసింది
విలక్షణ పధంలో నడిచాకే
నేనేంటో నాకర్ధమైంది

ఇన్నాళ్ళూ
రావణుడు పూర్తిగా చెడ్డవాడని భ్రమపడ్డాను
రాముడు పూర్తిగా మంచివాడని అపోహ పడ్డాను
రెండూ అసత్యాలే అని ఇప్పుడర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
నాలోని రాముడు అర్ధమయ్యాడు
నాలోని రావణుడూ దగ్గరయ్యాడు
ఇద్దరికీ పైనున్న ఆత్మారాముడూ అగుపించాడు

ఇన్నాళ్ళూ నేనొక శీలవతి ననుకున్నాను
ఇన్నాళ్ళూ నేనొక పతివ్రత ననుకున్నాను
అసలా మాటలకు అర్ధమే లేదని
ఇప్పుడే నాకర్ధమైంది

నా శీలమంతా నా అహమనీ
నా పాతివ్రత్యమంతా నా భయమనీ
నా ఛాందసమంతా నా బద్ధకమనీ
నా ధార్మికమంతా అధర్మమేననీ ఇప్పుడే నాకర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
రాజభవనమూ అడవీ ఒకటేననీ
పతివ్రతా పతితా ఒక్కటే అనీ
రాముడూ రావణుడూ ఒక్కరే అనీ తెలిసింది

నా చుట్టూ నేను కట్టుకున్న
నాలుగు గోడలు కూలిపోయాకే
ప్రపంచపు విశాలత్వం గోచరించింది

నా మనసుకు నేనల్లుకున్న
సాలెగూడు చెరిగిపోయాకే
ఆ అవతల ఉన్నదేదో అర్ధమయ్యింది

ప్రస్తుతం
నేను రాముడి దగ్గరే ఉండి
రావణుడి ప్రేమలో పడ్డాను
రావణుడితో నా అంతట నేనే వెళ్లి
రాముడి ప్రేమలో మునిగిపోతున్నాను

రాముడిలో రావణుడినీ
రావణుడిలో రాముడినీ స్పష్టంగా చూస్తున్నాను
ఇద్దరినీ మించిన ఆత్మారాముడిలో
భేదం లేనంతగా ఐక్యమయ్యాను 

లక్ష్మణ రేఖ బయట లేదు
నాలోనే ఉంది
రాముడూ రావణుడూ బయట లేరు
నాలోనే ఉన్నారు
అసలు నేనే పెద్ద లక్ష్మణ రేఖను

లక్ష్మణ రేఖకు
అటు చూస్తే రావణుడు
ఇటు చూస్తే రాముడు
ఎటూ చూడకుంటే ఆత్మారాముడు
అందరూ నాలోనే ఉన్నారు

అసలు నిజం చెప్పనా?

రాముడూ రావణుడూ లక్ష్మణరేఖా నేనూ
నలుగురమూ ఒక్కరమే అన్న సత్యం
ఇప్పుడే నాకర్ధమైంది
నేననే లక్ష్మణరేఖ దాటాకే ఈ నిజం నాకు తెలిసింది

ఇప్పుడు నేను రావణుడి లంకలో ఉండి
అయోధ్యను పాలిస్తాను
రామరాజ్యంలో ఉంటూ
లంకలో వేదాలు చదివిస్తాను

కైకకూ కౌసల్యకూ ఒకే సత్కారం చేయిస్తాను
మంధరకూ త్రిజటకూ ఒకే బహుమానం ఇస్తాను
శూర్పణఖను నేనే పెళ్ళాడి
రామలక్ష్మణులను దాని బారినుంచి రక్షిస్తాను 

హనుమంతుడిని రాముడి వద్దకే
రాయబారం పంపిస్తాను
విభీషణుడి నోరుమూయించి
రావణుడికే దాసోహం అనిపిస్తాను

మేఘనాధుడి చేత యుద్ధాలు ఆపించి
అతడూ ఇంద్రుడూ ఒక్కరే అని తెలియపరుస్తాను
కుంభకర్ణుడిని నిద్రలోనే సమాధిస్థితికి చేరుస్తాను
మండోదరిని నాతోనే ఎల్లకాలం ఉండిపొమ్మంటాను

లంక నుంచి అయోధ్యకు
కనిపించని వారధి కట్టిస్తాను
నా ఇష్టం వచ్చినన్ని సార్లు అటూ ఇటూ
రాకపోకలు సాగిస్తాను

వానర సైన్యంతో రాక్షసులకు
పెళ్లి సంబంధాలు కుదురుస్తాను
ఇద్దరికీ ఒకే బంతిలో
భోజనాలు పెట్టిస్తాను

లంకలోనూ అయోధ్యలోనూ
నిరంతరం ఆటపాటలూ
ఆగిపోని విందువినోదాలూ
నడిపిస్తాను

ఎందుకంటే ...

లంకా అయోధ్యా ఒక్కటేననీ
రాముడూ రావణుడూ ఒక్కరేననీ
రాజభవనమూ అడవీ ఒక్కటే అనీ
జీవనమూ మరణమూ ఒక్కటే అనీ
ఇప్పుడే నాకర్ధమైంది

లక్ష్మణ రేఖ దాటాకే
నేనెవరో నాకు తెలిసింది
విలక్షణ పధంలో నడిచాకే
నేనేంటో నాకర్ధమైంది....