నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, మార్చి 2016, బుధవారం

ప్రభూ నాకు విముక్తిని ప్రసాదించు...

ప్రభూ నాకు విముక్తిని ప్రసాదించు

పాండిత్యపు ప్రగల్భాల నుంచి
చాదస్తపు చండాలం నుంచి
దళారుల డాబుల నుంచి
పూజారుల జేబుల నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

వాచావైదుష్యం నుంచి
క్రియాకలాపం నుంచి
అహంకారపు ఆర్భాటం నుంచి
అసూయా ద్వేషాల అడుసులనుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నమ్మలేని నీచత్వం నుంచి
నడవలేని నీరసం నుంచి
మార్పురాని మనసు నుంచి
కట్టివేసే కర్మ నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

అలుపులేని అలవాట్ల నుంచి
అంతమవని అగచాట్ల నుంచి
అన్నీ తెలుసనే అజ్ఞానం నుంచి
అక్కరకు రాని అహంకారం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

లోకవ్యామోహ లౌల్యం నుంచి
దయాహీన క్రౌర్యం నుంచి
ఇంద్రియదాస్య జాలం నుంచి
కట్లు వదలని కాలం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

విన్నా వినలేని అజ్ఞానం నుంచి
చూచినా నమ్మలేని దౌర్భాగ్యం నుంచి
ఇచ్చినా అందుకోలేని బలహీనత నుంచి
చచ్చినా మారలేని నిస్సహాయత నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

ఇతరులను నిందించే అల్పత్వం నుంచి
సుతరామూ నేర్చుకోని శూన్యత్వం నుంచి
మంకుతనం వదల్లేని మూర్ఖత్వం నుంచి  
అడుగు ముందుకెయ్యలేని అజ్ఞానం నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నేను సృష్టించుకున్న బంధాలనుంచి
నన్ను నేనే కట్టుకున్న పాశాలనుంచి
అతితెలివితో వేసే వేషాలనుంచి
ముందుకు నడవనీని మోహాలనుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

కాటేసే కపటం నుంచీ
మాటేసే మోసం నుంచీ
పోటెత్తే వాంఛలనుంచీ
ఆటాడే ఆశలనుంచీ
నాకు విముక్తిని ప్రసాదించు

గర్వాహంకారాల చీకటి గుహలనుంచి
గమ్యం లేకుండా తిరిగే పయనాలనుంచి
నువ్వెన్నిసార్లు చెప్పినా వినలేని అశక్తతనుంచి
చెయ్యి పట్టి నడిపినా నడవలేని అసమర్ధత నుంచి
నాకు విముక్తిని ప్రసాదించు

నన్ను గెలవలేని నానుంచి
నన్ను మార్చుకోలేని నానుంచి
నన్ను దాటి ఎగరలేని నానుంచి
నన్ను మరచి నిన్ను చేరలేని నానుంచి
నాకు విముక్తిని ప్రసాదించు....