నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, ఏప్రిల్ 2016, సోమవారం

మా అమెరికా యాత్ర - 2

































































 







 


ఇక్కడకొస్తూనే చేసిన ముఖ్యమైన పని జగన్నాధ హోరా సాఫ్ట్ వేర్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ను ఆబర్న్ హిల్స్ కు సెట్ చేసి పెట్టడం.ఎందుకంటే పొద్దున్న లేస్తూనే తిథి వార నక్షత్రాలు తెలియాలిగా మరి.అవి తెలియకపోతే ఏ పనీ ముందుకు సాగదు.

ఇక్కడ సూర్యోదయం ఉదయం 6.45 కి అవుతున్నది అస్తమయం రాత్రి 8 గంటలకు అవుతున్నది.రాత్రి ఎనిమిదికి కూడా సూర్యుడు ఉండటం వింతగా అనిపించింది.

వాతావరణం చాలా హాయిగా ఉన్నదని మా వాడితో అంటే - "మీరు వింటర్ లో వచ్చినట్లయితే ఆ మాట అనేవాళ్ళు కారు.అప్పుడు కనిపిస్తుంది నరకం  అంటే ఎలా ఉంటుందో"- అని నవ్వేశాడు.

పొద్దున్న లేస్తూనే ఆ తొమ్మిది డిగ్రీల చలికి తోడు జల్లులుగా చిరువాన పడుతూ ఉన్నది.బాల్కనీలో కొచ్చి నిలబడితే బాగా చలిగా ఉన్నది.కానీ వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో అక్కడే కాసేపు నిలబడ్డాము.

ఇంతలో ఎక్కడనుంచో ఒక పిచ్చుక వచ్చి ఇంటి మీద కూచుని కిచకిచలు మొదలు పెట్టింది.పిచ్చుకను చూడటంతోటే మహానందం కలిగింది. ఇండియాలో అయితే పిచ్చుకలు కనబడటం ఎప్పుడో మానేశాయి.ఇక్కడ మాత్రం రకరకాల పక్షులు ఇంకా సజీవంగా ఉన్నాయి.ఇక్కడ ప్రకృతిని మనిషి నాశనం చెయ్యడం లేదు గనుక అవి ఇంకా నిలిచి ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఊరపిచ్చుక లేహ్యాలకూ, సెల్ ఫోన్ టవర్ల దెబ్బకూ అవి ఎప్పుడో అంతరించి పోయాయి.

అదే బాల్కనీలో కాసేపు కూచుని రాజూ నేనూ ధ్యానస్థితిని ఎంజాయ్ చేశాము.

ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని ఆశ్రమానికి బయలుదేరాము.అక్కడకు కొందరు శిష్యులు వచ్చి చేరారు.వారితో పిచ్చాపాటీగా ఆధ్యాత్మిక సంభాషణలు జరిగాయి.

'ప్రపంచంలోని వస్తువులలో అల్టిమేట్ ఆనందం లేదు.మనుషులలోనూ లేదు.కానీ మనం ఈ రెంటిలోనూ దానిని వెదుకుతున్నాం.ఈ వెదుకులాటే మనిషి యొక్క అసంతృప్తికి కారణం.ఇలా బయట బయట వెదుకుతున్నంత వరకూ మనిషికి నిజమైన ఆనందం ఎన్నటికీ దొరకదు.దీనినే కఠోపనిషత్తు -' న విత్తేన తర్పణీయో మనుష్యో...(మనిషి ధనంతో ఎన్నటికీ సంతృప్తి చెందలేడు)..' అనే శ్లోకంలో చెప్పింది.ఇక్కడ 'విత్తం' అంటే ధనం అని ఒకటే అర్ధం కాదు.భౌతికమైన బాహ్యమైన అన్ని వస్తువులనూ 'విత్తం' అన్న మాటతో వేదం ఇక్కడ సూచించింది.కనుక అల్టిమేట్ ఆనందం కావాలంటే మనిషి బయట వెదుకులాట ఆపేసి లోపల వెదకడం నేర్చుకోవాలి.అదే మెడిటేషన్ లేదా ధ్యానం లేదా సాధన అంటే.' - అని ఆశ్రమంలో కూడుకున్న శిష్యులకు మొదటిరోజున చెప్పాను.

మా అబ్బాయి ఇలా అన్నాడు.

'నాన్నా.ఆనంద్ గారు మొన్న నాతో మాట్లాడుతూ ఇలా అన్నారు - ' మాధవ్ !అమెరికాకు వచ్చికూడా, నాకు ఏదీ చూడాలని లేదు.ఎక్కడకూ వెళ్లాలని లేదు.అన్నవారిలో బహుశా అమెరికా చరిత్ర మొత్తం మీద నాన్నే ఫస్ట్ అనుకుంటా.'

నవ్వాను.

'చెప్పానుగా నాన్నా! అల్టిమేట్ ఆనందం బయట లేదు.అది లోపల ఉన్నది.దానిని చేరడానికి ఒక స్పార్క్ మనిషికి కావాలి.ఒక ట్రిగ్గర్ కావాలి.చూడగలిగితే ఆ స్పార్క్ ఆ ట్రిగ్గర్ ప్రతిచోటా ఉన్నది.నీ చుట్టూ ఎక్కడ బడితే అక్కడ అది ఉన్నది.నీ చుట్టూ ఉన్న దేనిని చూచినా నీ మనస్సు పైకి ఎగసి అనంతంలో లీనం అవుతున్నప్పుడు ఇక నీకు ఎక్కడెక్కడో తిరగాలనీ ఏవేవో చూడాలనీ ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు.

ఈ టెక్నిక్ తెలిసినవాడికి ఒక చిన్న గాలి అల చాలు.ఒక చిన్న పువ్వును చూస్తే చాలు.ఒక పక్షి కిచకిచ వింటే చాలు.ఒక నది ఒడ్డున ఊరకే కూచుంటే చాలు.ఆకాశంలో మేఘాలను ఊరకే చూస్తే చాలు.ఒక సూర్యోదయపు ఎండ చాలు.ఒక చిరుజల్లు చాలు.ఇవన్నీ కూడా అతన్ని అధ్బుతమైన ఆనందపు ఒడ్డుకు చేరవేస్తాయి.ఈ న్యాక్ తెలిస్తే నీకు ఎక్కడికీ తిరగాలని అనిపించదు.అది తెలీకే మనుషులు పిచ్చికుక్కల్లా సైట్ సీయింగ్ అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.కానీ ఎక్కడా వాళ్లకు ఏదీ దొరకదు.మిగలదు.అలా తిరగడంలో ఆనందం ఉన్నదనుకోవడం పెద్ద భ్రమ.అదే అసలైన మాయ.

ఎప్పుడైనా వర్తమానపు క్షణికం లోనుంచే అనంతానికి డోర్ ఉంటుంది.ఆ తలుపులోనుంచి ప్రయాణించే కిటుకు తెలిస్తే ఎక్కడికీ కదలనక్కరలేదు.ఉన్నచోటినుంచే అనంతాన్ని అందుకోవచ్చు.ఈ కిటుకు తెలీకపోతే ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం ఏమీ ఉండదు.ఇదే అసలైన కీలకం.

అయినా,నేను ఇక్కడకు వచ్చింది మీకోసం.అంతేగాని సైట్ సీయింగ్ కు తిరగడానికి కాదు.నాకు ప్రదేశాలూ వస్తువులూ డబ్బూ ముఖ్యం కాదు.నాకు మనుషులు ముఖ్యం.మానవ సంబంధాలు ముఖ్యం.నేను ప్రదేశాల ఆరాను కూడా తేలికగా ఫీల్ అవగలను.అక్కడున్న సూక్ష్మ శక్తులతో అనుసంధానం అవ్వగలను.కానీ దానికంటే నాకు మనుషులతో సంబంధాలు,వారిని ఆధ్యాత్మికంగా సరియైన దారిలో గైడ్ చెయ్యడం ఇష్టం.' - అన్నాను.

సంభాషణ తర్వాత పక్కనే ఉన్న లేక్ ఒడ్డుకు వెళ్లి అక్కడ మన మెంబర్స్ కొందరు ధ్యానం చేసుకున్నారు.అక్కడ ధ్యానంలో కూచున్న కొందరికి 'బగళాముఖి మాత' దర్శనం కలిగింది.ఇంకొందరికి - 'తమనే గమనిస్తున్న ఒక చాలా అందమైన దేవత ఎడమ కన్ను' కనిపించింది.ఏదో తెలియని ప్రశాంతత మాత్రం అందరికీ కలిగింది.

ఆ లేక్ ఒడ్డున 'తూజా ఆక్సిడెంటాలిస్' పెద్ద పెద్ద చెట్లను చూచాను.ఇది హోమియోలో సైకోటిక్ మయాజం కు మహత్తరమైన రెమెడీ.

శనివారం రోజున ఉదయం 10 గంటలకు ఆనంద్ దంపతులు వచ్చి చేరుకున్నారు.అందరం వారితో కలసి దగ్గరలోనే ఉన్న పరాశక్తి ఆలయానికి వెళ్ళడం జరిగింది.ఈ ప్రదేశానికి ఒక స్థలమహత్యం ఉన్నది.పురాతన కాలంలో రెడ్ ఇండియన్స్ ఇక్కడ ఉండేవారు.వాళ్ళు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతినే తల్లిగా పూజించే సంస్కృతి వారిది.ఇప్పుడు పరాశక్తి ఆలయం ఉన్న ప్రదేశంలో ఈ రెడ్ ఇండియన్స్ ఎన్నో వందల ఏళ్ళుగా అమ్మను ఆరాధించేవారు.వాళ్ళూ వాళ్ళ సంస్కృతీ చాలావరకూ నశించిపోయాక ఈ ప్రదేశంలో పరాశక్తి ఆలయం ఆవిర్భావం జరిగింది.

ఒక ప్రదేశంలో జరిగిన ఉపాసనలు ఎన్నటికీ అంతరించిపోవు. ఆ శక్తి, తరంగాల రూపంలో ఆ ప్రదేశంలోనే ఆవరించి ఉంటుంది.మళ్ళీ కొన్ని తరాల తర్వాత ఎవరో ఇంకొందరు ఆ శక్తిని ఇంకొక రూపంలో ఆరాధించడం మొదలు పెడతారు.దేవత ఆకారం మారవచ్చు,పూజించేవారి భాష మారవచ్చు, మతాలు మారవచ్చు.కానీ అక్కడి శక్తి మారదు.పరాశక్తి ఆలయం కూడా అలాంటిదే.

దీనిని మదరాసీ వైష్ణవులు కట్టించారట.అమ్మవారి విగ్రహం చాలా కళగా ఉన్నది.శ్రీచక్రం మేరుప్రస్తారం ప్రతిష్ట చేసి ఉన్నది.అమ్మవారికి ఇరుపక్కలా వారాహి, రాజమాతంగి విగ్రహాలు, కొంచం ముందుగా భువనేశ్వరి విగ్రహం ఉన్నాయి.ఆలయంలో ఉన్నంతసేపూ అమెరికాలో ఉన్న ఫీల్ రాలేదు.ఎక్కడో తమిళనాడులో ఒక ఆలయంలో ఉన్న ఫీల్ కలిగింది.అదే వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడంలో ఆలయ నిర్వాహకులు చక్కగా కృతకృత్యులైనారనే చెప్పాలి.

అమ్మవారి సమక్షంలో అద్భుతమైన అనుభవం కలిగి చాలాసేపు అలా నిలబడి ఉండిపోయాను.అందరికీ కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. మేమెవరం ఏమీ చెప్పకపోయినా అక్కడ ఉన్న పూజారి, అమ్మవారి మెడలో ఉన్న గులాబీ దండను తీసి నా మెడలో వెయ్యడం ఒక మరపురాని అనుభవాన్ని మిగిల్చి నన్ను ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది.అమ్మ ఆ విధంగా నన్ను అనుగ్రహించినట్లు తోచింది.నేను చెయ్యబోతున్న అంతరిక కార్యాన్ని అమ్మకు చెప్పి అమ్మ పర్మిషన్ కోసం ప్రార్ధించాను.ప్రసన్న వదనంతో అమ్మ చిరునవ్వు నవ్వినట్లు నా మనోనేత్రానికి తోచింది.

పై వచ్చే శుక్రవారం రోజు ఇక్కడే 'శ్రీవిద్య' గురించి మాట్లాడాలి.దానికి కూడా అమ్మ పర్మిషన్ అర్ధించి చాలాసేపు ఆలయంలో ఉండి తిరిగి ఇంటికి చేరుకున్నాము.

భోజనం తర్వాత ఆశ్రమానికి బయలుదేరాము.ఆశ్రమం ఓనర్ - మిస్టర్ నెల్సన్ - అనే ఒక అమెరికన్.అతను పద్మజ గారిని ఇలా అడిగాడట.

'మీ గురువుగారు హీలరా?'

'అవును.కానీ అది ఆయన చేసే ముఖ్యమైన పని కాదు.ప్రాధమికంగా ఆయనొక మిస్టిక్.' అని తను చెప్పింది.

'నేను,నా భార్యా పిల్లలతో ఆయన్ను ఒకసారి కలవాలని అనుకుంటున్నాను.వీలవుతుందా?' అని అతను అడిగాడు.

'ఆయనతో కనుక్కుని చెబుతాను' అని తను జవాబు చెప్పింది.

'మధ్యాన్నం ఒంటిగంటకు ఆశ్రమానికి వస్తాము.అక్కడ ఆయన మమ్మల్ని కలవవచ్చు.' - అని ఆమెతో చెప్పాను.

కానీ మేమక్కడకు వెళ్లేసరికి బాగా ఆలస్యం కావడంతో వాళ్ళను కలవడానికి వీలుకాలేదు.ఇంకోసారి వాళ్ళను తీరికగా రమ్మనమని చెప్పాను.

ఆశ్రమంలో కూడుకున్న శిష్యులతో ఈ క్రింది టాపిక్స్ మాట్లాడాను.

>>ప్రకృతిలోని అంతరిక సమగ్ర కనెక్టివిటీ
>>కొన్ని జంతువులకు, పక్షులకు, చెట్లకు ఉన్న విచిత్ర శక్తులు.వాటికీ ఆధ్యాత్మిక భూమికలకూ ఉన్న సంబంధాలు.
>>అంతం లేని ఆనందం - అంతం అయ్యే ఆనందం.
>>నా పద్ధతిలో సాధనా మార్గం ఎలా ఉంటుంది? దానిలో ఎలా నడవాలి?దానికి కావలసిన అర్హతలు ఏమేమిటి?

ఈ సంభాషణ జరుగుతున్నపుడే ఒక శక్తివంతమైన ధ్యానోన్ముఖ వాతావరణం ఆ హాల్లో సృష్టింపబడింది.దాని ప్రభావ ఫలితంగా - వింటున్నవారు అందరూ వారంతట వారే సైలెంట్ గా అయిపోయి ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే  ధ్యానంలోకి ప్రవేశించారు.

అలా చాలాసేపు ఆశ్రమంలో ఉండి,అందరం మళ్ళీ ఇంటికి బయలుదేరాము.