నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, ఏప్రిల్ 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 4

"ఆధ్యాత్మికత ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిజమేనా?" అని ఒకరు ప్రశ్నించారు.

"ఒక రకంగా చూస్తే నిజమే" - అన్నాను.

ఆధ్యాత్మికత అంటే ఎటు చూచినా గుడులూ గోపురాలూ ఉండటం కాదు.బొట్లు పెట్టుకుని వేషాలు వేయడం కాదు.పొద్దున్నే గుడికి వెళ్లి మొక్కడం కాదు.లేదా రోజూ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడమూ,స్తోత్రాలు చదవడమూ కాదు.ఇవి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అని ఎవరైనా అంటే నాకు బాగా నవ్వొచ్చేస్తుంది.

అలా అనేవారికి ఆధ్యాత్మికత అంటే ఏమీ అవగాహన లేదని నా అవగాహన చెబుతోంది.

ఇవేవీ చెయ్యకుండానే నీవు ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవచ్చు.ఇవన్నీ చేస్తూకూడా నీవు ఆధ్యాత్మిక లోకపు పొలిమేరను కూడా ఇంకా చూచి ఉండకపోవచ్చు.రెండూ సాధ్యమే.

నిజమైన ఆధ్యాత్మికత అంటే - తనలోనూ తన చుట్టూ అందరిలోనూ అన్నింటిలోనూ దైవాన్ని ఫీల్ అవడం.ఆ స్థాయిలో అందరితోనూ డీల్ చెయ్యడం మాత్రమే. ఇదే నిజమైన ఆధ్యాత్మికత.

"ఆత్మవత్ సర్వభూతాని" (నీ ఆత్మవలె అందరినీ చూడు), "జీవో దేవస్సనాతన:" (ఈ జీవుడే ప్రాచీనుడైన దైవం), "సర్వం ఖల్విదం బ్రహ్మ:" (ఇక్కడున్న సమస్తమూ దైవమే) వంటి వేదవాక్యాలు ఈ భావాన్నే ఎలుగెత్తి చాటుతున్నాయి.కానీ అర్ధం చేసుకునే వారూ, ఆచరించేవారూ ఏరీ?

ఆధ్యాత్మికతకు అమెరికా అనీ, ఇండియా అనీ, భేదం ఏమీ లేదు.అది ఆకలి లాంటిది.ఆకలి ఎక్కడైనా వేస్తుంది.ఏ దేశంలో ఉన్నా వేస్తుంది.లేదా అది గాలి వంటిది.మనం బ్రతకాలంటే ఎక్కడున్నా సరే గాలిని పీల్చక తప్పదు.ఇదీ అంతే.

కాకుంటే కొన్ని భేదాలున్నాయి.

ఇండియాలో అయితే - సంపాదించడానికీ సుఖంగా బ్రతకడానికే మనిషి జీవితం అంతా ఆవిరైపోతుంది.ఒకవేళ డబ్బు అనేది చేతిలో ఉన్నప్పటికీ, అతని జీవితం సుఖంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు.అన్ని వైపులనుంచీ ఎన్నో ఒత్తిళ్ళు అతనిమీద పడిపోతూ ఉంటాయి.పొద్దున్న లేచిన దగ్గరనుంచీ అతని జీవితంలో ఎంతోమంది అనవసరంగా జోక్యం చేసుకుంటూనే ఉంటారు. దేనిలోనూ ఒక పద్ధతీ పాడూ ఏమీ ఉండదు.ప్రతివాడూ రూల్సు ఇతరులకు చెబుతూ తాను మాత్రం అనుక్షణం వాటిని బ్రేక్ చేస్తూనే ఉంటాడు.

ప్రాధమికంగా చూస్తే - ఇండియాలో మనిషికి ఇన్సెక్యూరిటీ ఎక్కువ.భయం ఎక్కువ.ప్రతిదానికీ భయమే.ప్రతిదానికీ అపనమ్మకమే.ఏదీ గ్యారంటీ లేదు.న్యాయానికి తప్ప మిగతా అన్నిటికీ మనిషి అక్కడ భయపడుతూనే ఉంటాడు. అందుకే - మోసం కూడా అన్ని రంగాలలోనూ ఎక్కువే.ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడే స్వార్ధం ఉంటుంది.ప్రతివాడూ చెప్పేదొకటి చేసేదొకటి. అక్కడ ప్రతివాడూ ఎన్నో సైకలాజికల్ కాంప్లెక్సులతో సతమతమౌతూ ఉంటాడు. అలాంటి సమాజంలో - వీధికొక గుడి ఉన్నప్పటికీ - నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడనుంచి వస్తుంది? ఎలా వస్తుంది?

అమెరికాలో చూద్దామా అంటే - ఇక్కడ సుఖంగా బ్రతకడం చాలా సులభం.నీ జీవితంలో అనవసరంగా ఎవడూ జోక్యం చేసుకోడు.ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది.కష్టపడి ఒక పద్ధతిని నీ చుట్టూ నువ్వు సృష్టించుకోనవసరం లేదు.నీ చుట్టూ అది సహజంగానే ఏర్పరచబడి ఉంది.కనుక ఉన్నంతలో జీవితం హాయిగా సాగిపోతుంది.ఇండియాలో కూడా - ఉన్నంతలో బ్రతుకుదాం అనుకునేవాడికి జీవితం బాగానే ఉంటుంది.కానీ అలాంటి వాడిని కూడా సుఖంగా బ్రతకనివ్వని సామాజిక పరిస్థితులు అక్కడ ఎక్కువగా ఉన్నాయి.అలా ఉన్నంతలో బ్రతకడానికి కూడా వాడు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఇక్కడ పరిస్థితి అది కాదు.ఇక్కడ నీ జీవితంలో ఎవడూ జోక్యం చేసుకోడు.నీ జీవితం నీది.లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంది గనుక,సామాజికంగా నువ్వు సృష్టించుకోవలసినదేదీ కొత్తగా లేదు.కనుక ఇక్కడ సుఖం ఎక్కువ.

జీవితంలో సుఖాల శిఖరాలు అన్నీ చూచాకే మనిషికి నిజమైన ఆధ్యాత్మిక తపన అనేది మొదలౌతుంది.అన్నీ చూసేశాను.ఆ తర్వాత ఏంటి? ఇంకేమీ లేదా? జీవితం ఇంతేనా? అన్న అన్వేషణ అప్పుడు మాత్రమే మనిషికి మొదలౌతుంది.అప్పుడు మాత్రమే మనిషికి నిజమైన ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి.అంతవరకూ అతను ఎన్నో గుడులూ గోపురాలూ తిరగవచ్చు.ప్రపంచంలోని పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించి ఉండవచ్చు.వాటివల్ల దమ్మిడీ కూడా ఉపయోగం ఉండదు.ఆ యాత్రలన్నీ అతను చేసేది - భయంతోనూ - దురాశతోనూ - మాత్రమే.ఇవి రెండూ మనిషి గుండెలో తిష్ట వేసుకుని ఉన్నంతవరకూ అతనికి నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశం దొరకనే దొరకదు.

సుఖాన్ని పొందాలన్న తపనలో మనిషి ఇంకా ప్రాకులాడుతూ ఉన్నంతవరకూ అతనికి ఆధ్యాత్మికత ఆమడదూరంలో ఉంటుంది.ఆ ప్రాసెస్ పూర్తికానివాడికి ఆధ్యాత్మికత దక్కదు.

అందుకే నేనెప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను. "వీధిలో అడుక్కుండే బెగ్గర్ ఏనాటికీ ఒక బుద్ధుడు కాలేడు. అన్నీ అనుభవించిన రాజే బుద్ధుడు కాగలడు" - అని.

అయితే ఇక్కడ ఒక మెలిక ఉన్నది.

ఈ అనుభవించడం అనేది చిన్నవయసులోనే అయిపోవాలి.వెనువంటనే, సాధన అనేది కూడా చిన్నవయసులోనే మొదలు కావాలి. అలా కాకుండా, మధ్యవయసు దాటే వరకూ కూడా 'జీవితాన్ని అనుభవించడం' ఇంకా పూర్తి కాకపోతే. అలాంటివాడికి ఈ జన్మ వృధా అయినట్లే అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి అన్నీ అర్ధమై,దైవం కోసం సాధన మొదలుపెట్టే సమయానికి, దానికి కావలసిన శక్తి వంట్లో ఉండదు. రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి.మిగిలిన శేషజీవితం అంతా ఎవరో ఒకరి మీద ఆధారపడి మందులు మ్రింగుతూ బ్రతకడమే సరిపోతుంది. ఈ లోపల మరణం తలుపు తడుతూ ఉంటుంది.నిజమైన ఆధ్యాత్మికత అనేది ఏమిటో తెలియకుండానే ఆ జీవితం ముగిసిపోతుంది. ఇలాంటి జీవితాలు ఇండియాలో ఎక్కడ చూచినా మనకు వేలూ లక్షలలో కనిపిస్తాయి.

ఇండియాకూ అమెరికాకూ - సామాజికంగా చూచినా,ఆధ్యాత్మికంగా చూచినా చాలా భేదాలున్నాయి.

ఇండియాలో ఎక్కడ చూచినా గుళ్ళూ గోపురాలూ కనిపిస్తాయి.ఇక్కడ కనిపించవు.ఇండియాలో జనం పోలో మంటూ గుళ్ళకు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తిరగరు.ఇండియాలో మనకు ఎందఱో గురువులున్నారు. ఇక్కడ లేరు.కానీ ఇండియాలో కంటే ఇక్కడే నిజమైన ఆధ్యాత్మికతకు అవకాశం ఎక్కువని నా అభిప్రాయం.

ఇక్కడి జీవితంలో యవ్వనం వచ్చేసరికే అన్నీ అనుభవించడం జరిగిపోతుంది.అన్ని సుఖాల శిఖరాలూ చూసేయడం జరుగుతుంది.ఇక ఆ తర్వాత ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.ఒక రకమైన అసంతృప్తి ఒక అగ్నిలా లోపలనుంచి బయలుదేరుతుంది.ఆ అసంతృప్తాగ్ని నుంచి నిజమైన అన్వేషణ కలుగుతుంది.అదే మనిషిని అసలైన ఆధ్యాత్మిక ఆవరణలకు చేరుస్తుంది.

కనుక ఆధ్యాత్మికత అనేది ఇండియన్ సొసైటీలో బాహ్యంగా చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజానికి అక్కడ ఏమీ లేదు.ఇక్కడ బయటకు ఏమీ లేనట్లు కనిపించినప్పటికీ నిజమైన ఆధ్యాత్మిక ద్వారాలు ఈ సమాజంలో ఎక్కడ బడితే అక్కడే రెడీగా ఉన్నాయి.వాటిని తెరవడమే తరువాయి.కానీ వాటిని తెరుస్తున్నవారు తక్కువగా ఉన్నారు.

ఇండియాలోని ఈ పరిస్థితికి ఇంకొక ముఖ్యమైన కారణం - హిపోక్రసీ.

ఇండియన్ సొసైటీ అంతా హిపోక్రసీ మయం.ఇక్కడ అది లేదు.ఎక్కడైతే హిపోక్రసీ ఎక్కువో అక్కడ ఆధ్యాత్మికత ఒక్కక్షణం కూడా ఉండలేదు.అందుకే మనకు ఇండియాలో కనిపించే ఆధ్యాత్మిక గురువులూ ఆ వాతావరణమూ అదంతా కూడా మోసంతోనే ఎక్కువగా నిండి ఉంటుంది.

అయితే ఇంకొక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

ఇండియాలోని ప్రస్తుత కాలపు మనుషులలో ఆధ్యాత్మికత మృగ్యమైనప్పటికీ, అక్కడి మట్టిలో గాలిలో ఆధ్యాత్మికత సమృద్ధిగా నిండి ఉన్నది.అది ప్రాచీన మహర్షులు, జ్ఞానులు, యోగులు మనకిచ్చిపోయిన వరం.సరిగా స్వీకరిస్తే,ఇండియాలో అది మనకు తేలికగా దొరుకుతుంది.కానీ నిజంగా దానిని స్వీకరించేవాళ్ళు తక్కువ.మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ.

అమెరికాలోని వాతావరణంలో చూద్దామా అంటే, మన వాతావరణంలో ఉన్నట్లు ఇక్కడ ఆధ్యాత్మికత పోగుపడి లేదు.మనకిచ్చినట్లు ఇక్కడెవరూ ఆస్తులిచ్చి పోలేదు.ఇక్కడంతా భోగం ఎక్కువ.నిజమైన ఆధ్యాత్మికత కోసం ఇక్కడ చాలా వెదకవలసి వస్తుంది. దారిచూపించే వారికోసం, గైడ్ చేసే వారికోసం ఇక్కడ ఎంతో కష్టపడి సెర్చ్ చెయ్యవలసి వస్తుంది.

ఇండియాలో అయితే, అది ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.కానీ స్వీకరించే వాళ్ళు లేరు.ఇక్కడేమో అది అలా దొరకదు.కానీ దానికోసం తపించేవాళ్ళు ఇక్కడే ఎక్కువ.ఇదే సృష్టి విచిత్రాలలో ఒకటి.అమ్మ చేసే వింతమాయలన్నీ ఇలాగే ఉంటాయి.

పెద్దలు సంపాదించిన ఆస్తి ఎంతో ఉంది.దానిని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.కానీ దానిని క్లెయిం చేసుకోవడం, సరిగా దానిని అనుభవించడం, క్రింది తరాలకు తెలియదు.ఇండియాలో పరిస్థితి అది.

అమెరికాలో అయితే -  పెద్దలూ లేరు.వాళ్ళిచ్చి పోయిన ఆస్తీ లేదు.కానీ ఆస్తికోసం మనిషిని వెదికింపజేసే పరిస్థితులు ఇక్కడ నిండుగా ఉన్నాయి.ఆ ఆస్తికోసం ఇక్కడి వారు వెదుకవలసి వస్తుంది.

ఇండియా అయినా - అమెరికా అయినా - జీవితాన్ని సక్రమంగా జీవించేవాడికి ఆధ్యాత్మికత అతి సమీపంలోనే ఉంటుంది.కానీ అలా 'సక్రమంగా' జీవించడం కోటికి ఒక్కడికి కూడా సాధ్యం కాదు.అలా జీవించనివ్వకుండా మాయ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వలలు సెట్ చేసి ఉంచుతుంది.ఆ వలలను బ్రేక్ చెయ్యగలిగినప్పుడు మాత్రమే "సక్రమంగా" జీవించడం అంటే ఏమిటో తెలుస్తుంది. అలా జీవించగలగడమే అసలైన "సాధన" అని నేనంటాను. నేనే కాదు. వేల సంవత్సరాలనుంచీ అసలైన యోగులూ జ్ఞానులూ ఇదే చెప్పారు.వారివారి జీవితాలలో ఆచరించి చూపించారు కూడా.

ప్రతివారూ తాము సక్రమంగానే జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు.కానీ అది నిజం కాదు.నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో వారికి అనుభవంలో తెలియకపోవడమే నేను చెబుతున్నది సత్యం అనడానికి రుజువు.

శ్రీ రామకృష్ణుల ప్రసిద్ధవాక్యం ఒకటి నాకు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నది.

'అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు.కానీ అందరూ భగవంతునిలో లేరు.' అని ఆయన తరచూ అనేవారు.

ఇదే మనిషి దురవస్థకు గల ఏకైక కారణం.ఇదే మనిషిలోని అసంతృప్తికి గల ఏకైక కారణం.

భగవంతునితో కనెక్షన్ ఏర్పరచుకోగలిగితే - అది ఇండియా అయినా అమెరికా అయినా ఒక్కటిగానే ఉంటుంది.కానీ అలా ఏర్పరచుకోడానికి చేసే ప్రయత్నంలో ఎదురయ్యే సహాయకాలూ ఆటంకాలూ దోహదాలూ ఇండియాలో వేరుగా ఉన్నాయి.అమెరికాలో వేరుగా ఉన్నాయి.సాధకునికి అక్కడైనా ఘర్షణ తప్పదు.ఇక్కడైనా తప్పదు.ఆ అంతరిక ఘర్షణ అనే అగ్నిలో నడిచి నెగ్గి బయటకు రాగలిగిన వాడే ఆద్యాత్మిక శిఖరాలను అందుకోగలడు.ఈ ప్రాసెస్ ఏ దేశంలోనైనా ఒకే విధంగానే ఉంటుంది.

ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా భగవంతుని సృష్టిలో భాగమేగా? అణువణువులోనూ సర్వే సర్వత్రా నిండి ఉన్న దైవం ఒక దేశానికి పరిమితం అవుతుందా?అమ్మ ఒడిలో కూచుని ఉన్నవాడికి ఈ దేశాలూ ప్రాంతాలూ కులాలూ మతాలూ వేషాలూ మోసాలూ ఎలా హద్దుల్ని సృష్టించగలవు?

ఈ ప్రపంచంలో సామాన్యంగా ఏమౌతుందంటే - దాహంతో ఉన్నవాడికేమో నీరు దొరకదు.నీరు ఎదురుగా ఉన్నవాడికేమో దాహం ఉండదు.కానీ "నిజమైన దాహం" ఉన్నవాడి దగ్గరకు మాత్రం నీరే వెదుక్కుంటూ వస్తుంది.ఇండియా అయినా అమెరికా అయినా ఈ ప్రాసెస్ ఒకే విధంగానే జరుగుతుంది. ఆధ్యాత్మిక జీవన రహస్య నియమాలు ఏ దేశంలోనైనా ఒకే రకంగానే ఆపరేట్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే అవి విశ్వనియమాలు గాబట్టి.

రకరకాల దేశాలలో, రకరకాల మతాలతో, రకరకాల మనుషులతో,రకరకాల పరిస్థితులు సృష్టిస్తూ, అమ్మ ఆడే ఆటలు చిత్రవిచిత్రాలుగా ఉంటాయి.వాటిని సక్రమంగా అర్ధం చేసుకోవడమూ అమ్మ చూపిన దారిలో కిమ్మనకుండా నడవడమే మనం చెయ్యవలసిన అసలైన పని.

అలా నడిచేవాడికి ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే.

నడవలేనివాడికి కూడా - ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే.

నిజంగా ఆకలి ఉన్నవాడు ఆహారం కోసం వెదుక్కుంటాడు.అది లేనివాడు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేడు.

సింపుల్ గా చెప్పాలంటే ఇంతే.