నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, ఏప్రిల్ 2016, ఆదివారం

ఈరోజు ఒక మహనీయుని జన్మదినం

ఏప్రియల్ 10 డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్ జన్మదినం. నేటికి ఆయన పుట్టి 261 సంవత్సరాలు గడిచాయి. హోమియోపతి సిద్ధాంతాన్ని కనిపెట్టడమే గాక దాదాపు 100 నూతన ఔషధాలను ప్రపంచానికి ఇచ్చిన మహనీయుడాయన.

సరిగ్గా చెప్పాలంటే ఆయన కనుక్కున్న ఆవిష్కరణలకు పది నోబుల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే అవుతుంది.

ప్రపంచానికి నిజమైన మేలును చేసిన ఒక పదిమంది పేర్లను చెప్పమంటే వారిలో హన్నేమాన్ పేరును నేను చెబుతాను.ఒక అయిదుగురి పేర్లను చెప్పమన్నా కూడా వాటిలో ఆయన పేరును చెబుతాను.

కానీ ఖర్మేంటంటే ఈ లోకం ఈనాటికీ హోమియో వైద్యవిధానాన్ని నమ్మడం లేదు.ఈ లోకం సైతాన్(మాయ) గుప్పిట్లోనే ఉన్నదనీ అది దైవపు అదుపులో లేదనీ చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు.

నిర్మొహమాటంగా చెప్పాలంటే హోమియో వైద్య విధానం ఒక్కటే అసలైన వైద్య విధానం అని నేను విశ్వసిస్తాను.నేను ఇంగ్లీషు వైద్యాన్ని నమ్మను.నా దృష్టిలో అదొక వైద్యమే కాదు.ఎంతో పరిశీలన మీదా వ్యక్తిగత అనుభవం మీదా నేనీ నిశ్చయానికి వచ్చాను.

ఎన్నో ఎక్యూట్ కేసుల్లోనూ క్రానిక్ కేసుల్లోనూ ఇంగ్లీషు వైద్యం కంటే హోమియో వైద్యం అత్యంత అద్భుతంగా పనిచెయ్యడం నేను ప్రత్యక్షంగా చూచాను.

మరి అది అంత గొప్పదైతే దానికి లోకంలో పేరు ఎందుకు రాలేదు? అని మీకు అనుమానం రావచ్చు.దానికి నా సమాధానం ఒక్కటే.

లోకంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినంత మాత్రాన అది నిజమైనది కావాలని ఎక్కడా లేదు.చాలావరకూ లోకంలో గొప్పపేరు వచ్చినవన్నీ మాయసరుకులే అయి ఉంటాయి.నిజమైన అసలైన విషయాలు శాస్త్రాలు లోకంలో ఎప్పుడూ మైనారిటీలే.కారణం ఏమంటే లోకం మొత్తం మాయ యొక్క గుప్పిట్లో ఉన్నది.అది సత్యపు నీడలో లేదు.సైతాన్ నీడలోనే ప్రపంచం మొత్తం బ్రతుకుతున్నది.ఇది నా దృఢవిశ్వాసం.

అంతేకాదు.స్వార్ధంతో అవినీతితో బ్రతికేవాళ్ళు హోమియోపతిని వాడటానికి ఖచ్చితంగా ఇష్టపడరు.వారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పోవాల్సిందే.లక్షలు చెల్లించుకోవాల్సిందే,అయినా సరే సరియైన వైద్యం దొరక్క అల్లాడాల్సిందే.కెమికల్ డ్రగ్స్ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవాల్సిందే. మోసపోవాల్సిందే.వారి ఖర్మే వారిని అలా నడిపిస్తుంది.స్వచ్చమైన బ్రతుకులు బ్రతకందే వారు ఎన్నటికీ హోమియోపతి వంటి సత్యశాస్త్రాల ప్రయోజనాలను పొందలేరు గాక పొందలేరు.

ఇంకో అసలైన విషయం ఇప్పుడు చెబుతాను.మనుషుల రోగాలనూ ఆరోగ్యాలనూ నిర్ణయిస్తున్నది ఎవరో తెలుసా? బడా బడా ఫార్మా కంపెనీలు ఆ విషయాన్ని నిర్ణయిస్తాయి.మీరేం మందులు వాడాలో అవే నిర్ణయిస్తాయి. మీకు ఆ చాయిస్ లేదు.అంతేకాదు.హోమియోపతి వంటి విధానాలు బూటకాలని ఈ కంపెనీలే ఏజెంట్లను పెట్టి మరీ ప్రచారం చేస్తాయి.డబ్బులిచ్చి ప్రభుత్వాలను కొని ఆయా దేశాలలో హోమియోపతిని బ్యాన్ చేయిస్తాయి.రాజకీయ పార్టీలకు లంచాలిచ్చి మరీ హోమియోపతి మీద విషప్రచారం చేయిస్తాయి. ఈ ప్రచారం నిజమని మిమ్మల్ని నమ్మిస్తాయి.ఇదీ మీ ఖర్మే.

లోకాన్ని సృష్టించిన దేవుడిని అదేలోకం నుంచి సైతాన్ తరిమేసినట్లే, ఈలోకం నుంచి సత్యాన్ని కూడా అసత్యం తరిమేసింది.అందుకే హోమియోపతిని ఎవరూ నమ్మడం లేదు.అది ప్రజల చెడుఖర్మ తప్ప ఇంకేమీ కాదు.

ఏ వేదకాలపు మహర్షో ఇలా జెర్మనీలో శామ్యూల్ హన్నేమాన్ గా జన్మించాడని నా నమ్మకం.ఆయన వల్ల ఈ 261 ఏళ్ళలో ఎన్ని లక్షలమంది రోగాల నుంచి పరిపూర్ణంగా విముక్తులైనారో ఆలోచిస్తే ఆయనది ఎంత గొప్ప జన్మో అర్ధమౌతుంది.

అసలైన బ్రతుకులంటే అవి.అంతేగాని పొద్దున్న లేచిన దగ్గరనుంచీ మోసంతో నటనతో స్వార్ధంతో కృత్రిమంగా జంతువుల్లా బ్రతికే బ్రతుకులు ఆ పేరుకు అసలు తగవని నా విశ్వాసం.

ఆయన జన్మదినం రోజున ఆ మహనీయునికి నా నమోవాకాలు అర్పిస్తున్నాను.