నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, ఏప్రిల్ 2016, గురువారం

వచ్చే జన్మలో నేనొక క్రీస్తునై...

వచ్చే జన్మలో నువ్వేమౌతావని
ఎవరో నన్నడిగారు

వారితో ఇలా అన్నాను
-----------------
వచ్చే జన్మలో నేనొక క్రీస్తునై
మీచేత శిలువ వేయించుకుంటాను

వచ్చే జన్మలో నేనొక మస్తునై
అస్తిత్వానికి అతీతంగా వెళతాను

వచ్చే జన్మలో నేనొక అవధూతనై
అగాధమౌనపు అడుగునౌతాను

వచ్చే జన్మలో నేనొక విరబూతనై
అలౌకిక సౌరభాన్ని అంతటా చల్లుతాను

వచ్చే జన్మలో నిరుపేద మీరానై
మీచేత రాళ్ళతో కొట్టించుకుంటాను

వచ్చే జన్మలో ఘనవేద సారాన్నై
విశ్వప్రేమలో విలీనమౌతాను

వచ్చే జన్మలో నేనొక అంగద్ నై
మీచేత తల నరికించుకుంటాను

వచ్చే జన్మలో నేనొక మారుతినై
గుండె రక్తంతో మీకభిషేకం చేస్తాను

వచ్చే జన్మలో నేనొక మన్సూర్ నై
మీచేత కైమా కొట్టించుకుంటాను

వచ్చే జన్మలో హైమపు మొహర్ నై
మీ అంగళ్ళ ముంగిట అమ్ముడౌతాను

వచ్చే జన్మలో నేనొక రబియానై
పిచ్చిదంటూ ముద్ర వేయించుకుంటాను

వచ్చే జన్మలో నేనొక శిబిరాజునై
నా మాంసాన్నే మీకు విందు చేస్తాను

వచ్చే జన్మలో నేనొక రాధనై
ఎదురుచూపుల్లో అంతమౌతాను

వచ్చే జన్మలో నేనొక లైలానై
ప్రేమకోసం జీవసమాధి నౌతాను

వచ్చే జన్మలో నేనొక సీతనై
మీకోసం నిప్పుల్లో నడుస్తాను

వచ్చే జన్మలో నేనొక సతినై
మీ తప్పుల్లో కాలి బూడిదౌతాను

వచ్చే జన్మలో లోలోని ప్రేమనై
మీ గుండెల్లో నిత్యనర్తనం గావిస్తాను

వచ్చే జన్మలో మీకోసం ఆహుతై
అశ్రుతర్పణం అందుకుంటాను

వచ్చే జన్మలో ఆదిశేషుడినై
అనంత భారాన్ని అవలీలగా మోస్తాను

వచ్చే జన్మలో నాదలోలుడినై
ఓంకార నాదాన ఒదిగి ఉంటాను 

వచ్చే జన్మలో విగత మోహుడినై
విశ్వపు అవధుల్ని మించిపోతాను

వచ్చే జన్మలో వీతరాగుడినై
విశ్వాంతరాత్మలో విశ్రమిస్తాను

వచ్చే జన్మలో వినత పుత్రుడినై
అమృతపు భాండాన్ని అవనికిస్తాను

వచ్చే జన్మలో నేనొక జటాయువునై
మీకోసం ఆత్మార్పణం గావిస్తాను

వచ్చే జన్మలో నేనొక చిరాయువునై
మీ ఆత్మలో ఆత్మగా నిలుస్తాను