నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, జూన్ 2016, ఆదివారం

జూన్ 2016 పౌర్ణమి ప్రభావం

రేపు పౌర్ణమి.

పౌర్ణమికీ అమావాస్యకూ మానవజీవితాలలో మార్పులు అలజడులు కలగడం చాలా సహజం.గమనించేవారికి ఈ తేడాలు అర్ధమౌతాయి. గమనించకపోతే అర్ధం కావు. కానీ - ఈసారి పౌర్ణమి మాత్రం చాలా తేడాగా ఉంది.

దానికి కారణం - ప్రస్తుతం అంతరిక్షంలో నడుస్తున్న గ్రహచారమే.

ఒకవైపు రాహువు గురువు చాలా దగ్గరగా డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నారు.ఇంకోవైపు శని కుజులు కలసి ఉన్నారు.పైగా ఇద్దరూ వక్రించి ఉన్నారు.రెండు రోజులనుంచీ అయితే కుజుడు వెనక్కు నడుస్తూ వృశ్చిక రాశి నుంచి తులా రాశిలోకి అడుగు పెట్టాడు.కానీ నిన్నా మొన్నటి వరకూ శనీశ్వరునితో కలిసే ఉన్నాడు.పైగా నిన్న శనివారం నాడు త్రయోదశి కలసి శనిత్రయోదశి వచ్చింది.ఈ స్థితులన్నీ కలసి మానవజీవితంలో ఏయే ప్రభావాలు చూపిస్తున్నాయో గమనిద్దాం.
  • మానసికంగా తీవ్రమైన అలజడికి చాలామంది లోనౌతారు.
  • కొందరి జీవితాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.ఈ మార్పులు చిన్నా చితకా మార్పులు కాకుండా చాలా కాలం పాటు ప్రభావం చూపించేవి అయి ఉంటాయి.
  • చాలామందికి ఇంటి ఉపకరణాలు రిపేర్లు వస్తాయి.అవి నీటి పంపులు కావచ్చు.లేదా డ్రైనేజి సమస్య కావచ్చు.లేదా వాషింగ్ మెషీన్, కంప్యూటర్,మొబైల్ ఫోన్, కార్ మొదలైన వస్తువులు హటాత్తుగా రిపేర్ రావచ్చు.
  • ఇతరులలో సంబంధాలు చాలా తీవ్రస్థాయిలో దెబ్బ తింటాయి. చాలామందికి తమవారితో తెగతెంపులు అయిపోతాయి. ఇవి - కుటుంబ సభ్యులమధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు,లేదా ఒక గ్రూపులో ఉన్నవారి మధ్య కావచ్చు,లేదా ఎన్నాళ్ళగానో కలసి ఉన్న స్నేహితుల మధ్య కావచ్చు - విభేదాల వల్ల ఒకరినుంచి ఒకరు విడిపోవడం మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది.
  • మనుషుల సహాయం తప్పకుండా తీసుకోవలసిన పరిస్థితులు చాలామందికి ఎదురౌతాయి.
  • గత మూడురోజుల నుంచీ చాలామంది మానసికంగా చాలా హైపర్ గా ప్రవర్తిస్తూ ఉంటారు.గమనించండి.
  • మరికొంతమంది డిప్రెషన్ కు గురి ఔతారు.దీనికి కారణం - తాము ఊహించని సంఘటనలు అనుకోకుండా తమతమ జీవితాలలో జరగడమే. కానీ ఇలా జరగడానికి వెనుక తమతమ అహంకారపూరిత ప్రవర్తనే కారణం అన్న విషయం వారు గ్రహించలేరు.నెపమంతా ఎదుటివారి మీదనే నెడతారు.
  • ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రైం రేట్ పెరుగుతుంది. దీనికి కారణం - మనుషులు మానసికంగా అన్ బేలెన్స్ అయిపోవడమే.
ఇన్ని రకాలుగా ఈ గ్రహస్థితులు మనుషులపైన ప్రభావం చూపిస్తాయి.సూక్ష్మంగా గమనిస్తే అర్ధమౌతుంది.అయితే ఈ హైపర్ పరిస్థితులన్నీ ఇంకొక రెండు మూడురోజులలో సర్దుకుంటాయి.అయితే - ఈ సమయంలో వచ్చిన మార్పులు మాత్రం చాలాకాలం కొనసాగుతాయి.కొందరికి అవి జీవితంలో తిరిగి మార్చుకోలేని మార్పులు అవుతాయి.తిరిగి కోలుకోలేని దెబ్బలుగా మిగిలిపోతాయి.

మనిషి జీవితం కర్మాధీనం. తమతమ కర్మలను బట్టి ఆయా గ్రహచారం జరుగుతున్నపుడు ఫలితాలు మనిషికి వస్తూ ఉంటాయి. వాటిని సూక్ష్మంగా గమనించేవారు కర్మసూత్రాలను చక్కగా అర్ధం చేసుకోగలుగుతారు.తద్వారా జీవితాన్ని సరియైన దారిలో మలచుకోగలుగుతారు.లేకుంటే అన్నీ తామే చేస్తున్నాము తామే అనుభవిస్తున్నాము అన్న కర్తృత్వ భోక్తృత్వ భావనలలో పడి నలిగిపోతారు. అప్పుడు - దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని అహంకారంతో పాడు చేసుకోవడమే జరుగుతుంది. అలాంటి వారికి ఎవ్వరూ సహాయం చెయ్యలేరు.

అలాంటి ఘట్టాలు జరగడానికి ఇలాంటి గ్రహస్థితులు రంగం సిద్ధం చేస్తాయి.