నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, ఆగస్టు 2016, బుధవారం

ఆగస్ట్ - 2016 అమావాస్య ప్రభావం

ఈరోజు అమావాస్య.

ఈసారి అమావాస్య తనదంటూ ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉన్నది.

ఇది సహజ రాశిచక్రంలో, బుద్ధిస్థానమైన సింహరాశిలో సంభవించడం, అక్కడే రవిచంద్రులకు ప్రబల శత్రువైన రాహువు ఉండి ఇద్దర్నీ మ్రింగడం వల్ల ఈ క్రింది సంఘటనలు సంభవిస్తాయి/ సంభవిస్తున్నాయి.

-- చాలామందికి మనస్సు చికాకుగా అయిపోతుంది.బుద్ధిహీనత ప్రాప్తిస్తుంది. రెస్ట్ లెస్ అయిపోయి ఆందోళనా, అసహనమూ,కోపమూ పెరిగిపోతాయి. అనవసరంగా ఎవర్నో అరవడమూ, గొడవలు పడటమూ జరుగుతుంది. రక్తసంబంధమైన రోగాలూ, జీర్ణకోశ, హృదయసంబంధ రోగాలూ మేమున్నామంటూ గుర్తుచేస్తాయి.

గట్టిగా గమనిస్తే గత రెండు రోజులనుంచీ ఈ మార్పులు మీలో మీరే చూచుకోవచ్చు.

--సింహరాశి - అధికారులకు, నాయకులకు సూచిక గనుక - ఈ ఫలితాలు నాయకులకు బాగా వర్తిస్తాయి.ఉదాహరణకు - చంద్రబాబు పైన 'ఓటుకు కోట్లు కేసు' నీలి నీడలు గట్టిగా ప్రసరిస్తున్నాయి.అలాగే,ఉపవాసాలవల్ల శరీరంలో సోడియం లెవల్స్ తగ్గిపోయి మత నాయకుడైన కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి హటాత్తుగా కుప్పకూలిపోయి విజయవాడ లోని ఒక ఆస్పత్రిలో ICU లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఆయన భక్తులు శిష్యులు లక్షలాది మంది ఆందోళనలో ఉన్నారు.చంద్రబాబు రాజకీయ నాయకుడు, కంచి శంకరాచార్య మతనాయకుడు - కానీ ఇద్దరూ నాయకులే. సింహరాశిచే సూచింపబడే వారే.

సోడియం అనేది శరీరంలోని నీటిస్థాయిని నియంత్రిస్తుంది. నీరు అనేది చంద్రుని అధీనంలో ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతున్నది.కనుక చంద్రుడు శక్తిహీనుడైన అమావాస్య సమయంలోనే జయేంద్ర సరస్వతి గారు,శరీరంలో సోడియం లెవల్స్ తగ్గి, కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఎంత సరిగ్గా ఉన్నదో గమనించండి.

ఇంకా చాలామంది నాయకులు ఉండగా వీరిద్దరి మీదనే ఎందుకు గ్రహప్రభావం ఇలా ఉన్నదన్న చొప్పదంటు ప్రశ్న మీకు ఉదయిస్తుందని నాకు తెలుసు. అందుకే మీరు అడగకపోయినా జవాబు చెబుతున్నాను.

జాతకంలో ఎవరి దశలు బాగా లేవో వారిమీద గ్రహచారం చాలా గట్టిగా పనిచేస్తుంది.ప్రస్తుతం ప్రముఖులలో వీరిద్దరి దశలు బాగా లేవని అర్ధం చేసుకోవచ్చు.పైగా - వీరిద్దరే కాక మిగతా అందరికీ కూడా ఎవరికి అనువైన రీతిలో వారికి వడ్డన జరుగుతూనే ఉంటుంది.

కొంతమంది బయటకు చెప్పుకుంటారు.మరి కొంతమంది చెప్పుకోలేరు.కొంతమంది మీడియాలో బయటపడతారు. కొంతమంది పడరు. అంతే తేడా !

వీరు ప్రముఖులు, వీరు కాదు అని మనకు ఉండవచ్చు.కానీ దైవశక్తులైన గ్రహాలకు అలా ఉండదు.వాళ్ళు ఎవరైనా సరే, సమయం వచ్చినపుడు వారి ఖర్మను అనుభవింప జెయ్యడమే వాటి పని. గ్రహాల ముందు అందరూ ఒకటే.

నిజమైన కమ్యూనిస్టులూ సోషలిస్టులూ గ్రహాలే.

అందరూ ఒకే టైంలో పుట్టలేదు.అందరికీ ఒకే సమయంలో అన్నీ జరగవు. కానీ కొన్ని సిమిలారిటీస్ వల్ల కొంతకొంత మందికి దాదాపుగా ఒకే విధమైన సంఘటనలు ఒకే సమయంలో జరుగుతాయి.అదే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న విచిత్రం.

--అదే విధంగా రవిచంద్రుల మీద శనికుజుల ప్రభావం వల్ల - ఈరెండు రోజులలో అనేక దుర్ఘటనలు జరుగుతాయి.శుక్రుని నీచస్థితి వల్ల ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతాయి.ప్రముఖుల సెక్సు కుంభకోణాలు వెలుగు చూస్తాయి.ప్రముఖులకు,వారి తల్లిదండ్రులకు చెడుసమయం సూచింప బడుతున్నది.

రేపు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీన - ఖగోళంలో చంద్రుడు రాహువును క్రాస్ చెయ్యబోతున్నాడు.ఆ సమయంలో ఖచ్చితంగా మరికొన్ని సంఘటనలు జరుగుతాయి. వేచి చూడండి.