నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఆగస్టు 2016, శనివారం

మా అమెరికా యాత్ర - 36 (గౌరీమా - గురు సమక్షంలో...)

మాట ఇచ్చిందే గాని గౌరీమా మనస్సు ఇంకా సందిగ్ధావస్థలోనే ఉన్నది.తోడేళ్ళు పులులూ నక్కలతో కూడిన ఈ ప్రపంచంతో తాను నెగ్గుకు రాగలదా? ఈ పనిని తాను నెరవేర్చగలదా? తన గురుదేవులకిచ్చిన మాటను తాను నిలబెట్టుకొన గలదా? - ఇలాంటి సందేహాలు ఆమెను చుట్టుముట్టేవి.

ఒకరోజున శ్రీ రామకృష్ణులతో ఆమె ఇలా అన్నది.

'గురుదేవా! ఈ లోకంలోని మనుషులు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు కదా.సహాయం చెయ్యడానికి చాచిన చేతినే ఖండించే రకాలు వీళ్ళు.ఇలాంటి తుచ్చులతో నాకెందుకు? దీని బదులు ఇంకొక పని చేస్తాను.అత్యంత పవిత్రాత్ములైన కొద్దిమంది అమ్మాయిలను నాకివ్వండి.వారిని హిమాలయాలకు తీసుకుపోయి అక్కడ వారికి తపస్సు ధ్యానము  నేర్పించి, దివ్యజీవనం ఎలా గడపాలి? ఈ లోకపు రొచ్చుకు అతీతంగా నిత్యనిర్మలంగా ఎలా జీవించాలి? అన్న విషయాలు నేర్పించి వారిని దివ్యాత్ములుగా తీర్చి దిద్దుతాను.ఈ కలకత్తా రొదలో నేను ఇమడలేను.హిమాలయాల ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిన నాకు రణగొణ ధ్వనితో కూడిన ఈ నగర వాతావరణం చాలా దుర్భరంగా ఉన్నది.ఉన్నతులైన స్త్రీలను తయారు చెయ్యడమేకదా నేను చెయ్యవలసిన పని?ఆ పనిని ఈ విధంగా చేస్తాను. అనుమతించండి."

శ్రీ రామకృష్ణులు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు.

"నీవు ఇప్పటికే చాలా తపస్సు చేశావు.ఇంక నీవు హిమాలయాలకు పోనవసరం లేదు.ఇదే నగరంలో ఇదే రణగొణ ధ్వని మధ్యలో నువ్వుంటూ నేను చెప్పిన పని చెయ్యాలి.అదే అసలైన సాధన.ఏకాంతంలో సాధన గొప్పదే.కానీ అది ఎల్లకాలం పనికిరాదు.నీవా స్థితిని దాటావు.నీ తపశ్శక్తి ఎంతటిదో పరీక్షించుకోవడానికి ఈ ప్రపంచమే సరియైన రంగస్థలం.కనుక నీ ఊహను విడచిపెట్టు.నీ కార్యరంగం ఈ నగరమే.ఇక్కడే నువ్వు పని చెయ్యాలి."

గురుదేవుల మాటలకు గౌరీమా ఆ క్షణానికి అయిష్టంగానే తలూపింది.

గౌరీమా భవిష్యత్తులో చెయ్యవలసిన పనికి శ్రీరామకృష్ణులే రంగం సిద్ధం చెయ్యసాగారు.తన భక్తులతో మాటల సందర్భంగా గౌరీమా ఎంత గొప్ప తపస్వినియో ఎంత గొప్ప పవిత్రాత్మురాలో ఆయన మాటమాటకూ చెప్పేవారు.ఆ మాటలు విన్నవారు ఆమెను ఎంతో గౌరవంగా చూడటమేగాక, ఆమె మాటలు వినాలని ఆమె సమక్షంలో కొంత సమయం గడపాలని కోరుకోసాగారు.ఆ విధంగా గౌరీమా గురించి నలుగురికీ తెలియడం ప్రారంభం అయింది.

తన భక్తులైన బలరాం బోస్, యదుమల్లిక్ వంటి వారి ఇళ్ళకు తరచుగా వెళ్లి అక్కడి స్త్రీలకు నాలుగు మంచిమాటలు చెప్పి వారిని సన్మార్గంలో పెట్టవలసిందిగా శ్రీరామకృష్ణులు గౌరీమాను ఆదేశించేవారు.ఇలా బోధించడం అనేది తనకు ఇష్టం లేకపోయినా ఆమె ఆ పనిని చెయ్యవలసి వచ్చేది.

తనకు బాగా అంతరంగికులైన వారిని శ్రీరామకృష్ణులు ఎప్పుడో ఒక క్షణంలో ఒక మాటను అడిగేవారు.ఆమాటకు వారిచ్చే జవాబును బట్టి వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతటిదో ఆయన అంచనా వేసేవారు.అతీతమైన దివ్యశక్తులు ఆయనలో మూర్తీభవించి ఉన్నప్పటికీ ఇలాంటి పద్దతులు కూడా ఉపయోగించి ఆయన తన శిష్యులను భక్తులను సరదాగా పరీక్షిస్తూ ఉండేవారు.అదేవిధంగా ఒకరోజున గౌరీమాను కూడా ఇలా అడిగారు.

"గౌరీ! నాగురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు? నేనెవర్నో చెప్పు?"

గౌరీమా తడుముకోకుండా ఇలా చెప్పింది.

'సర్వదేవతలూ ఎవరిలో భాగాలో ఆ పరమాత్మయే మీరు.మీరు సాక్షాత్తూ పరబ్రహ్మమే.ఈ రూపంలో మా అందరికోసం మీరు భూమికి వచ్చారు."

ఆమెకు శాస్త్రపాండిత్యం ఉన్నది గనుక, ఇలా అంటూ ఆమె శ్రీమద్భాగవతం నుంచి ఈ శ్లోకాన్ని ఉటంకించింది.

"ఋషయో మనవో దేవా: మనుపుత్రా: మహౌజసా:
కళా: సర్వే హరేరేవ సప్రజాపతయః స్మృతాః
ఏతే చాంశ కలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయమ్"

(ఋషులు,మనువులు,దేవతలు,మహా శక్తివంతులైన మనుపుత్రులు, ప్రజాపతులు వీరందరూ భగవంతుడగు హరి యొక్క అంశలు మాత్రమే.కానీ కృష్ణుడో - సాక్షాత్తూ భగవంతుడే."

ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో తన కుడి అరచేతిని ఆమె తలపైన ఉంచి ఆశీర్వదించారు.

అందరి దగ్గరా ఆయన తనను పొగుడుతుంటే గౌరీమాకు అసౌకర్యంగా ఉండేది.అందుకని ఆయనతో ఇలా దెబ్బలాడేది.

'ఎందుకు నా గురించి గొప్పగా అందరికీ చెబుతారు? దానివల్ల నాకు ఎంతో అసౌకర్యంగా ఉంటుంది."

దానికి శ్రీరామకృష్ణులిలా అనేవారు.

"చూడు గౌరీ.నువ్వు సామాన్యురాలవా? చిన్నప్పటి నుంచీ వేరే ఆలోచన లేకుండా దైవం కోసం నువ్వు తీవ్రమైన తపస్సు చేశావు.చిన్నవయసులోనే సాహసోపేతంగా హిమాలయాలకు వెళ్లి అక్కడ ఏళ్ళ తరబడి తపస్సు చేసి ఎందఱో పురుషులు ఈనాటికీ చెయ్యలేని పనిని నీవు చేశావు. నీ సంగతి అందరికీ తెలియాలి.నిన్ను చూచి జనులు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో నేర్చుకోవాలి.అందుకే అందరికీ నీగురించి నేనే చెబుతున్నాను."

ఆయన తన భక్తులతో తరచుగా ఇలా అనేవారు.

"గౌరీ చాలా పవిత్రాత్మురాలు.ఎన్నో జన్మలుగా ఆమె భగవంతుని పరమ భక్తురాలు.ఆమె బృందావనపు గోపికలలో ఒకతె. గోపికలు చాలా పవిత్రులు. వారి భక్తి కల్మషం లేనిది.వారికి భగవంతుడు ఎప్పుడూ అతి చేరువగానే ఉంటాడు.గౌరి చెప్పేవి వినండి.ఆమెను చూచి ఎలా జీవించాలో నేర్చుకోండి. మీకు ఒక ఉన్నతమైన జీవితాదర్శాన్ని చూపడానికే ఆమె ఈ లోకానికి వచ్చింది."

త్వరలోనే గౌరీమా గురించి అందరికీ తెలియడం ప్రారంభమయింది.

ఈ విధంగా గురుసమక్షంలో ఆమె ఆనందంగా రోజులు గడపసాగింది.చూస్తూ ఉండగానే ఈ విధంగా మూడేళ్ళు గడచాయి.

ఇదిలా ఉండగా,1886 వ సంవత్సరం వచ్చేసింది. శ్రీ రామకృష్ణులు శరీరాన్ని వదలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది.తన అంతరిక భక్తులు తన దగ్గరే ఉంటే ఈ సంఘటన చూచి వారు చాలా ఏడుస్తారని ఆయనకు తెలుసు. అందుకని వారిని దూరంగా పంపాలి.

అప్పటివరకూ గౌరీమా తన జీవితమంతా దేశాలు పట్టుకుని తిరిగింది.కానీ శ్రీ రామకృష్ణుల పరిచయం ఎప్పుడు కలిగిందో అప్పటినుంచీ ఆమెకు తీర్దాటన మీద విముఖత కలిగింది.తన దైవం ఎదురుగానే ఉన్నపుడు ఇంకా వేరే తీర్ధయాత్రలెందుకు? అందుకని ఆమె గురుసమక్షంలోనే ఆ మూడేళ్ళూ ఉండిపోయింది.

మనస్సులను మట్టిముద్దలు చేసి ఆడుకోవడంలో సిద్ధహస్తుడైన శ్రీరామకృష్ణుల లీల చాలా అద్భుతమైనది. ఉన్నట్టుండి గౌరీమా మనసులో ఒక సంకల్పం కలిగి అది దినదిన ప్రవర్ధమానమై పోసాగింది.అదేమంటే - మళ్ళీ బృందావనానికి వెళ్లి అక్కడ ఉండి కొన్నాళ్ళు తపస్సులో కాలం గడపాలని.ఉన్నట్టుండి ఈ కోరిక ఎందుకు కలుగుతున్నదో అర్ధంగాక ఆమె అయోమయంలో పడిపోయింది.చివరకు తట్టుకోలేక ఒకరోజున శ్రీరామకృష్ణులకు తన మనస్సును వివరించి,తీర్ధయాత్రలంటే అయిష్టత కల్గిన తనకు ఉన్నట్టుండి బృందావనానికి వెళ్లాలని బలంగా అనిపిస్తున్నదనీ, ఎందుకిలా జరుగుతున్నదో తెలియడం లేదనీ చెప్పింది.

ఆమె మాటలు చిరునవ్వుతో విన్న ఆయన ఇలా అన్నారు.

'అలాగే వెళ్ళు గౌరీ.కొన్నాళ్ళు బృందావనంలో ఉండు.అక్కడ ఉండి తపస్సు చెయ్యి.ఈ సంకల్పం నీ మంచికే."

తన దేహత్యాగ సమయంలో పక్కనే ఉంటే ఆ బాధను ఆమె తట్టుకోలేదని ఆయనకు తెలుసు గనుక ఆయనే ఆమె మనస్సులో ఆ సంకల్పాన్ని కలిగించారు.మౌనంగా తన లీలను నడిపించారు.అన్ని మనస్సులకూ ఆధారమైన విశ్వమానసం (Universal Mind) ఆయనది.దాని సంకల్పానికి తిరుగేముంది?

శ్రీమాత ఆశీస్సులు స్వీకరించిన గౌరీమా బృందావనానికి చేరుకుంది.అక్కడ ఉంటూ తపస్సులో కాలం గడపసాగింది.

ఈలోపల కలకత్తాలో, శ్రీరామకృష్ణులు తన దేహాన్ని వదిలేసి తన నిజధామానికి చేరుకున్నారు.కానీ ఈ విషయం ఆమెకు తెలిసేసరికి చాలా ఆలస్యం అయింది.ఈ రోజులలో లాగా అప్పుడు సమాచార వ్యవస్థ ఇంత వేగంగా లేదుకదా !

ఆ వార్త ఆమెను పిడుగుపాటులా తాకింది.నిర్ఘాంతపోయిన ఆమె ఆ షాక్ నుంచి చాలారోజులు తేరుకోలేకపోయింది.ఊహించని విధంగా తన దైవం ఇలా తనను వదలి వెళ్లిపోతాడని ఆమె ఎంతమాత్రం ఊహించలేదు.ఆ బాధను తట్టుకోలేక ఆమె కూడా శరీరాన్ని వదిలేద్దామని అనుకుంది. మహనీయులకు శరీరం ఉంటే ఎంత పోతే ఎంత?వారికి ఎటువంటి భేదమూ ఉండదు.బృందావనంలో భ్రుగుకుండం అని ఒక మడుగు ఉన్నది. అందులో దూకి చనిపోదామని ఆమె ఆ కుండం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. నీళ్ళలో దూకబోతున్న ఆమె, తనకూ నీటికీ మధ్యన అడ్డంగా ప్రత్యక్షమైన శ్రీరామకృష్ణులను చూచి అప్రతిభురాలై నిలబడిపోయింది.

ఆమె వైపు చూస్తున్న ఆయన కొంచం కటువైన స్వరంతో ఇలా అన్నారు.

'ఏంటి నువ్వు చెయ్యబోతున్న పని? ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నావా? ఇదేనా నువ్వు చెయ్యవలసిన పని? నేను నీకిచ్చిన పని పూర్తిచెయ్యకుండా ఎక్కడకు వద్దామని నీ ఆలోచన?'

ఆమోఘమైన ఆయన దర్శనంతో ఆమె మనస్సు క్షణంలో మారిపోయింది.తన ప్రయత్నాన్ని విరమించుకున్న ఆమె ఆలోచనలో పడింది.

అవును.తన గురుదేవులు తనకు ఒక పనిని అప్పగించారు.అది పూర్తి చెయ్యకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం పిరికితనమూ స్వార్ధమూ అవుతుంది.ఇది సరియైన పని కాదు.

ఇలా ఆలోచించుకున్న ఆమె వెనక్కు తిరిగి తన బసకు వచ్చేసింది.కొద్ది రోజులకు శ్రీరామకృష్ణుల దేహత్యాగాన్ని భరించలేని శ్రీమాత తన అంతరంగికులైన స్వామి యోగానంద, గోలాప్ మా, యోగిన్ మా మొదలైన వారితో తీర్ధయాత్రలు చేస్తూ బృందావనానికి వచ్చింది.అక్కడ గౌరీమాను కలుసుకున్న శ్రీమాత తనకు కలిగిన దర్శనాన్ని గౌరీమాకు వివరించింది.

శ్రీరామకృష్ణుల దేహత్యాగానంతరం వివాహిత యొక్క చిహ్నాలైన బొట్టు గాజులు మొదలైన వాటిని హిందూమత సాంప్రదాయం ప్రకారం తీసివెయ్య బోయింది శ్రీమాత.అదే క్షణంలో ఆమె ఎదురుగా ప్రత్యక్షమైన శ్రీరామకృష్ణులు ఆమె చేతిని పట్టుకుని వారిస్తూ ఇలా అన్నారు.

"ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను చనిపోయానని భావిస్తున్నావా? ఇదుగో చూడు నీ ఎదురుగానే నిల్చుని ఉన్నాను.కావాలంటే నన్ను తాకి చూడు. నేనెక్కడికీ పోలేదు.ఒక గదినుంచి ఇంకో గదిలోకి వచ్చాను.అంతే.నీ ఆలోచన విరమించు."

ఈ దర్శనం చూచిన శ్రీమాత బొట్టు గాజులను తీసి వెయ్యకుండా అలాగే ఉంచుకుంది.

ఈ విషయం విన్న గౌరీమా ఇలా అన్నది.

"అమ్మా.నువ్వు లక్ష్మీదేవివి.నువ్వు మంగళకరములైన చిహ్నాలను తీసివెయ్యకూడదు.ఠాకూర్ స్వయానా విష్ణువే. ఆయనకు మరణం ఎలా ఉంటుందమ్మా? నువ్వు అలా చెయ్యకు.నీవే గనుక ఈ పని చేస్తే లోకానికి అమంగళం వాటిల్లుతుంది.ఆ పని ఎప్పటికీ చెయ్యకు."

ఈ విధంగా శ్రీరామకృష్ణులను ధ్యానిస్తూ,ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకుంటూ, వారు బృందావనంలో కొన్ని నెలలున్నారు.ఆ సమయంలో వారికి అనేక దర్శనాలను శ్రీరామకృష్ణులు అనుగ్రహించారు.

ఆ తర్వాత వారు తిరిగి కలకత్తాకు వచ్చేసారు.

ఎన్ని దర్శనాలు నిదర్శనాలు చూచినా మానవ సహజమైన వేదన మహనీయులను కూడా సహజంగా బాధిస్తూనే ఉంటుందికదా? పైగా వారి ప్రేమ చాలా స్వచ్చమైనది. అవసరాలకోసం నటించే మన ప్రేమవంటి దొంగప్రేమ కాదది. కనుక అమితమైన వారి ప్రేమలాగే,వారి బాధకూడా అమితంగానే ఉంటుంది.

కలకత్తాకు వచ్చిన గౌరీమాకు అనుక్షణం శ్రీరామకృష్ణులు గుర్తొచ్చేవారు. ఆయన తిరిగిన ప్రదేశాలు ఏవి చూచినా ఆమె తట్టుకోలేక పోయేది. 'నా మనస్సులో అనుక్షణం మీరే ఉండాలి' అంటూ తానడిగిన వరం ఇలా ఇవ్వబడినందుకు ఆమెకు ఎంతో దుఖం కలిగేది.కృష్ణుడు మధురకు వెళ్ళిపోయిన తర్వాత గోపికలు పడిన బాధ ఈమె మళ్ళీ పడసాగింది.ఈ బాధను భరించలేక ఒకరోజున కాళీఘాట్ లోని కాళికాలయానికి వెళ్లి అమ్మ ముందు కూచుని ఏడ్వసాగింది గౌరీమా.

ఎంతో సేపు అలా ఏడ్చిన ఆమె ఉన్నట్టుండి తన భుజాన్ని ఎవరో తాకినట్లు అనిపించి తలఎత్తి చూచి ఆశ్చర్య పోయింది. అక్కడ కాళీమాత ఒక నల్లని త్రిభుజాకారమైన రాయి రూపంలో ఉంటుంది.తలెత్తిన గౌరీమాకు ఆ విగ్రహం కన్పించలేదు.దాని స్థానంలో నవ్వుతూ నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను చూచిన ఆమె నిర్ఘాంతపోయి ఆయనవైపు అలా చూస్తూ ఉండిపోయింది.

చిరునవ్వు చిందిస్తున్న ఆయన ఎప్పటిలాగే తన కుడిచేతిని ఆమె తలపైన ఉంచి ఆశీర్వదించారు.కాళీమాతే తనను తాకిన అనుభూతి ఆ క్షణంలో కలిగి ఆమె మనస్సులో వేధిస్తున్న బాధ అంతా మంత్రం వేసినట్లు మాయమై పోయింది.ఆ బాధ స్థానంలో అమితమైన ఆనందం ఆమెలో పొంగి వచ్చింది.

ఈ విధంగా వారి బాధ తారాస్థాయికి చేరినప్పుడల్లా శ్రీ రామకృష్ణుల దర్శనం వారికి కలిగి వారిని శాంతింపజేస్తూ ఉండేది.

ఈ విధంగా ఏళ్ళు గడుస్తూ ఉండగా మళ్ళీ గౌరీమా తీర్ధయాత్రలకు బయలుదేరింది.ఈసారి కలకత్తా నుంచి దక్షిణాదిన ఉన్న రామేశ్వరం కన్యాకుమారిల వరకూ కాలినడకన ప్రయాణించింది.దారిలో ఎన్నో క్షేత్రాలను దర్శిస్తూ ఆమె ప్రయాణం సాగింది.ఆ తరువాత మళ్ళీ హిమాలయాలకు వెళ్లి కొన్ని నెలలు ఉత్తరకాశీలోని మారుమూల అటవీ ప్రాంతాలలో ఉంటూ ఆమె తపస్సులో కాలం గడిపింది.

ఉత్తరకాశీ అంటే ఈ రోజులలోనే హిమాలయాలలో చాలా లోతట్టు ప్రాంతం.అక్కడ చలీ అధికమే.అదంతా మంచు కొండలూ దట్టమైన అడవితో కూడుకున్న నిర్మానుష్య ప్రాంతం.ఇక 150 ఏళ్ళ క్రితం అక్కడ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.సరియైన దారికూడా అప్పట్లో ఉండేది కాదు. బండరాళ్ళను పట్టుకుని ప్రాకుతూ ఆ కొండలు ఎక్కాలి.అక్కడ క్రూరమృగాలు కూడా విచ్చలవిడిగా తిరిగేవి.అలా రాళ్ళల్లో పడి ఎక్కుతూ పొతున్నపుడు ఏ పులో ఏ ఎలుగుబంటో ఎదురైతే అంతే సంగతులు.మౌనంగా దానికి ఆహారం అయిపోవడమే. లేదా కొంచం కాలు జారితే చాలు.వేల అడుగుల లోతున్న లోయలో పడి నుజ్జు నుజ్జు అయిపోవడమే.

అలాంటి అడవులలో మంచు కొండల్లో ఉంటూ గౌరీమా తన తపస్సును మళ్ళీ కొనసాగించింది.

ఇలా దాదాపు పదేళ్ళు గడిచాయి.

ఇక శ్రీరామకృష్ణులు ఇచ్చిన పనిని ప్రారంభించాలని ఆమెకు గట్టి సంకల్పం కలిగింది. ఆ సంకల్పం నుంచి ఉద్భవించినదే శ్రీ శారదేశ్వరీ ఆశ్రమం. ఈ ఆశ్రమ స్థాపనతో ఆమె జీవితంలో చివరి అధ్యాయం ప్రారంభమైంది.

(ఇంకా ఉంది)