నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, ఆగస్టు 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 39 (అమెరికన్లకు దీక్షా ప్రదానం)

















































మేం రిట్రీట్ హోం కు తిరిగి వచ్చాక మా సంభాషణలలో మేం మునిగి ఉన్నాం.సాయంత్రం ఆత్మలోకానంద గారు వచ్చి మమ్మల్ని కలిశారు.ఆదివారం మధ్యాన్నం నేను ఇచ్చిన "శ్రీవిద్య" మీద ఉపన్యాసం విన్న మైకేల్ అనే అమెరికన్, నాదగ్గర దీక్ష తీసుకుందామని అనుకుంటున్నాడనీ, గౌరీవ్రతమా కూడా దానికి ఆమోదం తెలిపారనీ ఆయన నాతో చెప్పారు.

నా చిన్నప్పటినుంచీ నడచిన సాధనామార్గంలో నేను తెలుసుకున్న సత్యాలనూ, గ్రహించిన రహస్యాలనూ అర్హులైన వారికి పంచిపెట్టవలసిన సమయం వచ్చిందనీ, దానికి సిద్ధంగా ఉండమనీ 'గౌరీవ్రత మా' నాతో చెప్పమన్నారని ఆయన అన్నారు.

ముందు అతనితో మాట్లాడాలనీ, అతని "ఆరా" ఎలా ఉందో చూడాలనీ నేను అన్నాను.

ఎందుకంటే - ఉపదేశం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.అర్హతను చూడకుండా ఎవరికి బడితే వారికి దానిని ఇవ్వడమూ కుదరదు.ఒక మనిషిని ఎంతో పరీక్షించిన తర్వాతే అతన్ని నేను శిష్యునిగా స్వీకరిస్తాను గాని ఊరకే అడిగిన వెంటనే దీక్షను ఇవ్వడం ఎన్నటికీ జరగదు.

ఈరోజు ఒక గురువును రేపు ఇంకొక గురువును ఇలా రోజుకొక గురువును మార్చే చపలచిత్తులను మనం ఈనాడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం.నిజమైన గురుశిష్య సంబంధం అంటే అలా ఉండదు.ఒకసారి ఒక గురువును ఎంచుకున్న తర్వాత ఆ బంధం జన్మజన్మాన్తరాలలో కూడా కొనసాగుతూ ఉంటుంది.ఆ విధంగా ఒకరికొకరు కట్టుబడి ఉండేవారే నిజమైన గురుశిష్యులు.

నిజమైన గురుశిష్య సంబంధం ఎలా ఉండాలనే దానిమీద నేనెప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను.

'మనుషులకు జన్మకొక భర్తా జన్మకొక భార్యా మారవచ్చు. కొంతమందికి అఫీషియల్ గానో అనఫిషియల్ గానో ఒకే జన్మలో ఎందఱో భర్తలూ ఎందఱో భార్యలూ ఉండవచ్చు కూడా.కానీ గురుశిష్య బంధం మాత్రం ఎన్ని జన్మలైనా సరే మారేది కానే కాదు.శిష్యుడు దైవం యొక్క సన్నిధికి చేరేవరకూ,ఎన్ని జన్మలెత్తినా సరే, అది కొనసాగుతూనే ఉంటుంది.అదే నిజమైన గురుశిష్య బంధం అంటే.'

ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధమే అతి గొప్పదని చాలామంది అనుకుంటారు.అది నిజం కాదు.గురుశిష్య బంధం అనేది అంతకంటే కొన్ని వేలరెట్లు గొప్పది.భర్తలూ భార్యలూ జన్మజన్మకూ మారిపోతూ ఉంటారు.కానీ గురువు మారడు.ఎన్ని జన్మలైనా అతడు నీ వెంటనంటి నీడలా వస్తూనే ఉంటాడు.నీకు జన్మరాహిత్యం కలిగేవరకూ, నీకు సిద్ధత్వం కలిగేవరకూ, తన మోక్షాన్ని వాయిదా వేసుకుని నీకోసం ఈ లోకంలో పుడుతూ చస్తూ నీకు సహాయం చేస్తూ నిన్ను నిరంతరం రక్షిస్తూ ఉంటూనే ఉంటాడు.ఈ క్రమంలో, నీ నిజాయితీ రాహిత్యాన్నీ, నీ కపటాన్నీ, చెబితే వినిపించుకోని, చెప్పకుండా అర్ధం చేసుకోలేని నీ అల్పత్వాన్నీ,మానసికంగా నువ్వు పెట్టే హింసనూ మౌనంగా భరిస్తూనే ఉంటాడు.కానీ ఇదంతా చేసినందుకు నీనుంచి ఏ పరిస్థితిలోనూ ఏదీ ఆశించడు.

అదెంత గొప్ప బంధమో మీరే ఆలోచించండి మరి?

కనుకనే ఒకరిని గురువుగానో శిష్యుడు గానో స్వీకరించే ముందు క్షుణ్ణంగా పరీక్షించడం చాలా మంచిది.ఆ తర్వాత విచారించి లాభం ఉండదు.ఎందుకంటే ఒకసారి కమిట్ అయ్యాక ఈ మార్గంలో వెనక్కు పోవడం అంటూ సాధ్యం కాదు.ఇక్కడ విడాకులు ఉండవు.కోర్టులు ఉండవు.ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి ఒప్పుకున్నాక చచ్చినట్లు ఈ బంధం కొనసాగాల్సిందే.

శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు.

'నాణెం అసలుగా నకిలీదా అని వర్తకులు పరీక్షించినట్లు నీ గురువును శతవిధాలుగా పరీక్షించు.ఆ తర్వాతే అతన్ని గురువుగా ఒప్పుకో.అలాగే గురువూ తన కాబోయే శిష్యుని అదేవిధంగా పరీక్షించాలి.ఈ పరీక్షలలో ఇద్దరూ నెగ్గితేనే వారు ముందుకు సాగాలి.అప్పుడే అది నిజమైన బంధంగా కలకాలం నిలుస్తుంది.'

అమెరికన్లు మానవ సంబంధాలలో చాలా మర్యాద పాటిస్తారు. మనలాగా లేకిగా ప్రవర్తించరు.మనకు అవసరం అయితే అతిచనువు తీసుకుని రాసుకుని పూసుకుని తిరుగుతాం. ఎదుటి మనిషి ప్రైవసీని కూడా పట్టించుకోం.అదే, అవసరం తీరాక,అదే మనిషిని సిగ్గులేకుండా డస్ట్ బిన్ లో పారేస్తాం.మనవి చాలా కపట జీవితాలు.కానీ నేను చూచిన అమెరికన్స్ చాలా మర్యాద పాటిస్తారు.

మైకేల్ సరాసరి రిట్రీట్ హోంకు వచ్చి నన్ను కలవవచ్చు.కానీ అలా చెయ్యకుండా,ముందుగా గౌరీవ్రతమానూ, ఆత్మలోకానంద గారినీ కలసి, వారిద్వారా నన్ను అడిగించాడు.ఇది నాకు బాగా నచ్చింది.అతన్ని రమ్మనమని చెప్పాను.

కొద్ది సేపట్లో అతను వచ్చి కలిశాడు.అతనితో కాసేపు మాట్లాడాక అతను నిజాయితీపరుడే అనీ, కపటి కాదనీ నాకు నమ్మకం కలిగింది.న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో అతను చాలా ఏళ్ళు స్టాక్ బ్రోకర్ గా ఉన్నాడు.ఆ తర్వాత ఆ జీవితం విసుగు పుట్టి ఆధ్యాత్మిక తపనతో వెదుకులాట సాగించాడు.ప్రస్తుతం గాంగెస్ ఆలయం వెనుక ఉన్న 108 ఎకరాల భూమినీ, 'హెరిటేజ్ మానర్' అనే ఒక హోటల్ నూ కొన్నాడు.ఆ భూమిలో శ్రీచక్రా గార్డెన్ తయారు చెయ్యాలనీ, విమానంలో పోతూ పైనుంచి చూస్తె అది పెద్ద శ్రీచక్రంలాగా కనిపించే విధంగా ఆ గార్డెన్ ను ప్లాన్ చేస్తున్నాడు.ఇంకా అతనికి ఉన్న చాలా రకాలైన ప్లాన్స్ ను మాకు వివరించాడు.అతనిలోని ఆధ్యాత్మిక తపన నాకు నచ్చింది.

మర్నాడు ఉదయం స్నానం చేసి, ఏమీ తినకుండా, ఆలయానికి రమ్మనీ,అతనికీ అతని భార్యకూ కలిపి ఒకేసారి దీక్షను ఇస్తాననీ చెప్పాను.ఎందుకంటే - భార్యాభర్తలిద్దరూ ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటేనే వారి జీవితం చాలా బాగుంటుంది.ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ,ఒకే గురువు శిక్షణలో చక్కగా ముందుకు సాగవచ్చు.అదే వేర్వేరు మార్గాలైతే గొడవలు వచ్చే ఆస్కారం ఉన్నది.అలా గొడవలు పడుతున్న కపుల్స్ చాలామంది నాకు తెలుసు.

మర్నాడు ఉదయం చెప్పిన సమయానికి అరగంట ముందుగానే శ్రీమాత ఆలయానికి చేరుకొని ధ్యానంలో కూచున్నాను.ఒక అరగంట తర్వాత వారిద్దరూ అక్కడకు వచ్చి చేరుకున్నారు.ముందుగా వారికి నా విధానం వివరించి, నన్ను అనుసరించడం మీకు ఇష్టమేనా? ఈ మార్గంలో చివరివరకూ మీరు నడవగలరా? అంటూ వారిని అడిగాను.వారు చాలా సంతోషంగా అంగీకరించారు.

ధ్యానంలో శ్రీమాత అనుజ్ఞను తీసుకుని,మహాగ్ని జ్వాలా స్వరూపమైన హోలీ రెలిక్స్ సమక్షంలో,వారికి ఎనర్జీ ట్రాన్స్ మిషన్ చేసి, జన్మ-కర్మ తారకమైన మహోత్తమమైన శ్రీవిద్యాదీక్షను మంత్ర-తంత్ర సహితంగా వారికి ప్రదానం గావించాను.దీక్షా సమయంలో వారు ఎంతో ఎమోషనల్ అయిపోయి వెక్కిళ్ళు పెట్టి ఏడవడం చూచి నాకే చాలా  ఆశ్చర్యం అనిపించింది.అమ్మ కరుణ వారిపైన ఆ విధంగా ప్రసరించింది. ఎంతటి అదృష్టవంతులో వాళ్ళు?

శ్రీమాత లీల ఎంత విచిత్రమైనది?

ఎక్కడి గుంటూరు? ఎక్కడి మిషిగన్ లోని గాంగెస్? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన భిన్న ధ్రువాల వంటి మేము ఈరోజున ఇక్కడ ఈ ఆశ్రమంలో కలవడం ఏమిటి? వారు నాకు శిష్యులు కావడం ఏమిటి? కనీసం మా ఇంటి పక్కన ఉన్నవారికి కూడా నా గురించీ, నేను చేసే సాధన గురించీ, ఇన్నేళ్ళుగా ఏమీ తెలియదు.కానీ ఎక్కడో వేలమైళ్ళ దూరంలో ఉన్న ఈ విదేశీయులకు ఈ మహత్తర పరంపరాగతమైన శ్రీవిద్యాతంత్ర దీక్ష ఈరోజున ప్రాప్తం అయింది.

ఎవరి ప్రాప్తం వారిది.ఎవరి అదృష్టం వారిది.అమ్మ లీల ఏమిటో మనలాంటి అల్పబుద్ధులు ఎలా అర్ధం చేసుకోగలరు?

పక్కనే ఉంటూ నాతో కలసిమెలసి తిరిగేవారు కూడా నాలో ఉన్న సంపదను అందుకోలేకపోవచ్చు.కానీ ఎక్కడో భూగోళానికి ఇంకో వైపు ఉన్న ముక్కూ ముఖం తెలియనివారు దానికి అర్హులు కావచ్చు.

అంతా, ఆ జీవి చేసుకున్న పుణ్యకర్మ మీదా, ఆ జీవియొక్క హృదయ పరిశుద్ధత మీదా ఆధారపడి ఉంటుంది.మామూలుగా లోకంతో మనం చేసే నాటకాలు, వేసే వేషాలు ఈ మార్గంలో అనర్హతకు దోహదాలౌతాయి. అవి ఆధ్యాత్మిక మార్గంలో పతనాన్ని కొనితెస్తాయి.స్వచ్చమైన భక్తీ, ప్రేమా, కల్మషం లేని మనస్సూ, త్రికరణశుద్ధిగా గురువును అనుసరించడాలు మాత్రమే ఈ మార్గంలో ఉత్తీర్ణతకు కారణాలౌతాయి.ఈ సద్గుణాలు ఉన్నవారు భూమికి ఇంకోవైపున ఉన్నా ఏదో రోజున నన్ను కలుస్తారు.నా మార్గంలో నడుస్తారు.ఇవి లేనివారు నా పక్కనే ఉంటూ నాతో రోజూ మాట్లాడుతూ నాతో కలసిమెలసి తిరుగుతున్నా కూడా నాలో ఉన్న ఈ సంపదను అందుకోలేరు. ఏదో ఒకరోజున నానుంచి దూరమై పోతారు.ఈ మార్గం చాలా విచిత్రంగా ఉంటుంది మరి !!

శిష్యులంటే సొంత బిడ్డలతో సమానం గనుక, దీక్షా కార్యక్రమం అయిపోయిన తర్వాత రిట్రీట్ హోం కు వచ్చి మాతో పాటు భోజనం చెయ్యమని వారిని ఆహ్వానించాను.ఆ విధంగా అందరం కలసి ఆరోజు భోజనం చేసి సాయంత్రం దాకా మాట్లాడుకుంటూ కాలం గడిపాము.

ఆ మాటల్లో తెలిసింది వారిద్దరూ కూడా బేస్ బాల్ ప్లేయర్స్ అని.మాధవ్ క్రికెట్ వీరుడు గనుక క్రికెట్ గురించి వారితో చాలా మాట్లాడాడు.గాంగెస్ లో ఒక క్రికెట్ టీం ను ఏర్పాటు చేద్దామనీ, అక్కడ గేమ్స్ ఆడదామనీ మైకేల్,మాధవ్ లు తీర్మానించుకున్నారు.మైకేల్ వింగ్ చున్ కుంగ్ ఫూ కొన్నాళ్ళు నేర్చుకున్నాడు.అందుకని అతనితో ఆ విద్యకు సంబంధించిన కొన్ని టెక్నికల్ పదాలలో మాట్లాడాను. Bong Sao,Pak Sao,Bil Sao,Chun Sao అనే బ్లాక్స్ గురించీ, Sil Lum Tao ఫాం గురించీ అడిగాను.నాకు మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు.సూట్ కేస్ సర్దుకుని నాతో ఇండియాకు వచ్చేస్తానని అన్నాడు.అతన్ని వారించి, వచ్చే ఏడాది వేసవిలో నేను మళ్ళీ అమెరికా వస్తాననీ, అప్పుడు అతనికి నా స్టైల్ లో మెళకువలు నేర్పిస్తాననీ, అప్పుడు మనిద్దరం కలసి ప్రాక్టీస్ చేద్దామనీ,ఈలోపల  తనకు తెలిసినవి బాగా ప్రాక్టీస్ చెయ్యమనీ చెప్పాను.

ఆ తర్వాత మా దగ్గర సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

ఒకరి భుజాలపైన ఒకరు చేతులు వేసుకుని చెట్టాపట్టాగా నడుచుకుంటూ వారిద్దరూ అలా వెళుతుంటే ముచ్చటగా చూస్తూ ఉండిపోయాం మేమందరం.

(ఇంకా ఉంది)