నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, అక్టోబర్ 2016, బుధవారం

భారత్ పాకిస్తాన్ యుద్ధాలు - జ్యోతిశ్శాస్త్ర పరిశీలన - 2

భారత్ పాకిస్తాన్ యుద్ధం - 1971

ఈ యుద్ధం సమయంలోనే ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్న దేశం వెస్ట్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రాన్ని పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.

ఈ యుద్ధం 1971 డిసెంబర్ 3 నుంచి 16 వరకూ కేవలం 13 రోజులపాటు జరిగిన చిన్న యుద్ధమే అయినప్పటికీ ఈ యుద్ధంలో జరిగిన నష్టమూ, యుద్ధం తర్వాత మన నాయకుల తెలివిలేని చర్యలవల్ల మనదేశానికి జరిగిన నష్టమూ చాలా పెద్దవి. కనుక ఈ యుద్ధం ఈ రెండు దేశాల చరిత్రలలో చాలా ముఖ్యమైన ఘట్టం.ఆ సమయంలో ఉన్న గ్రహస్థితులను పరిశీలిద్దాం.

ఈ సమయంలో శనీశ్వరుడు సరిగ్గా వృషభరాశిలోకి వచ్చి రెండు దేశాలనూ ప్రభావితం చేస్తున్నాడు.యుద్ధ కారకుడైన కుజుడు తన చతుర్ధ దృష్టితోనూ, కుట్రలకు కారకుడైన రాహువు తన పంచమ దృష్టి తోనూ వృషభ రాశిలో ఉన్న శనీశ్వరుని వీక్షిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా, కేతువు మూడింట ఉన్నాడు.శని దృష్టి కేతువు మీద ఉన్నది.కుజుని సప్తమ దృష్టి వృషభానికి చతుర్ధ స్థానమైన సింహం మీద ఉన్నది.

ఇకపోతే నవాంశ చక్రంలో రాహు కేతువులు సరిగ్గా మళ్ళీ వృషభ, వృశ్చిక రాశులలో ఉంటూ ఇంతకు ముందు రెండు యుద్ధాలలో తాము ఉన్నట్టి స్థితిలోకి మళ్ళీ వచ్చి ఉన్నాయి.దీనికి తోడుగా గురువు నీచ స్థితిలో ఉన్నాడు.

దీనిని బట్టి - మనం గత రెండు యుద్ధాలలో గమనించిన సూత్రం మళ్ళీ రుజువౌతున్నది.

వృషభ రాశి మీదా, దానికి మూడు నాలుగు రాశులైన కర్కాటకం సింహాల మీదా ఒకేసారి శని, కుజ,రాహువుల చెడు దృష్టి గానీ స్తితిగానీ ఉన్న సమయంలో భారత పాకిస్తాన్ దేశాల మధ్యన యుద్ధాలు వస్తున్నాయన్నదే ఆ సూత్రం.

ఈ యుద్ధంలో మనవాళ్ళు చాలా ఘోరమైన తప్పులు చేశారు. చేతికందిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. పాకిస్తాన్ చేతిలో ఉన్న కాశ్మీర్, సింద్,పంజాబ్ ప్రాంతాలలో దాదాపు 6000 చదరపు మైళ్ళ భూభాగాన్ని ఈ యుద్ధంలో హస్తగతం చేసుకున్న మన సైన్యం, ఇందిరాగాంధీ భుట్టోల మధ్యన జరిగిన సిమ్లా ఒప్పందం ఫలితంగా ఆ మొత్తం భూభాగాన్ని మళ్ళీ పాకిస్తాన్ కు ధారాదత్తం చేసింది. ఇలా చెయ్యడం ద్వారా 'రాముడు మంచి బాలుడు' అన్నట్లుగా మనకేదో మంచి పేరు వస్తుందని ఇందిరాగాంధీ భావించి ఉండవచ్చు. కానీ ఆమె అనుకున్నట్లుగా - ఆ విధమైన మంచి పేరూ రాలేదు. పాకిస్తాన్లో మార్పూ రాకపోగా అది ఇంకా కరుడుగట్టిన దుర్మార్గపు దేశంగా రూపుదిద్దుకుంది.ఈ 45 ఏళ్ళలో బాగా బలాన్ని పుంజుకుంది.మనమీద ఎన్నో దాడులు చేసింది.మన సైనికుల్ని ఎంతో మందిని పొట్టన బెట్టుకుంది.

నాకు తెలిసి, గత 2000 వేల ఏళ్ళ మన దేశ చరిత్రలో మన నాయకులు చేసిన అతి ఘోరమైన పెద్ద తప్పు ఇదే. దాని ఫలితంగా పగతో రగిలిపోయిన పాకిస్తాన్ (దానికెలాగూ కృతజ్ఞతా, నీతీ లేవు గనుక),మామూలు యుద్ధంలో మనల్ని గెలవలేమని గ్రహించి, చైనా దేశపు సహాయంతో అణుబాంబులను సమకూర్చుకుంది. ఇప్పుడు వాటి సాయంతో మనల్ని బెదిరిస్తోంది. అప్పుడే చావగొట్టి చెవులు మూసి ఉన్నట్లయితే ఈనాటి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పాకిస్తాన్ ను నమ్మటమే మనవాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు.దూరదృష్టి లేకుండా ఇందిరాగాంధీ చేసిన తప్పుకు ఫలితాన్ని ఈనాటికీ మనం అనుభవిస్తున్నాం.

ఇప్పుడు కార్గిల్ యుద్ధాన్ని పరిశీలిద్దాం.

కార్గిల్ యుద్ధం - 1999

ఇది 1999 లో మే - జూలై మధ్యలో జరిగింది.ఈ యుద్ధంలో కూడా మొదట మనల్ని రెచ్చగొట్టింది పాకిస్తానే. LoC ని దాటి కార్గిల్ ప్రాంతంలో వాళ్ళ సైనికులు ఆక్రమణలకు పాల్పడటమే ఈ యుద్ధానికి నాంది పలికింది.దీనిలో మనవాళ్ళు విజయాన్ని సాధించినప్పటికీ - అది అత్యంత ప్రతికూల పరిస్థితులలో మన సైనికుల వీరోచితమైన ప్రాణత్యాగాల వల్లనే ప్రాప్తించింది.దీనివల్ల కూడా మనకు ఒరిగింది ఏమీ లేదు. మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రువును తరిమికొట్టి మన ప్రాంతాన్ని మనం కాపాడుకున్నాం అంతే.అంతకు మించి మనకు సరాసరి ఈ యుద్ధం నుంచి ఒరిగింది (సినిమాలు తీసుకోవడం తప్ప) ఏమీ లేదు.

ఈ సమయంలో ఉన్న గ్రహస్థితులను పరిశీలిద్దాం.

శని మేషంలో నీచ స్థితిలో ఉన్నాడు. ఇది పాకిస్తాన్ లగ్నం కనుక మనమీద అనవసరంగా ఈ దేశం కాలు దువ్వింది.రాహువు ఆ దేశానికి సుఖస్తానంలోనూ మన దేశానికి విక్రమ స్థానమూ అయిన కర్కాటకంలో ఉండటం చూడవచ్చు.కనుక జయం మనకే లభించింది.తృతీయ రాహువు విజయకారకుడన్నది మనకు తెలిసిన విషయమే. కుజుడు తులలో ఉంటూ తన అష్టమ దృష్టితో వృషభ రాశిని వీక్షిస్తున్నాడు.శనీశ్వరుని దృష్టి కుజుని మీదా కేతువు మీదా ఏకకాలంలో ఉండటం గమనించండి.

రాశి చక్రంలోనూ నవాంశ చక్రంలోనూ రాహుకేతువుల స్థానాలు "రివర్స్" అయి ఉండటం గమనించండి.కనుక శత్రువు అసలు ఉద్దేశాలూ, పైకి చెబుతున్న మాటలూ పూర్తిగా వేర్వేరని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.వృషభం, కర్కాటకం, సింహం, శనీశ్వరుడు,కుజుడు,రాహువు - ఈ ఖగోళ పారామీటర్స్ మళ్ళీ ఈ యుద్ద సమయంలో కూడా పాత్రను పోషించాయి.

కనుక కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మన సూత్రం అక్షరాలా పనిచేసిందని స్పష్టంగా కన్పిస్తున్నది.

(ఇంకా ఉంది)