నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, మార్చి 2017, సోమవారం

Bollywood actor Raj Kiran Horoscope - Analysis

Hip hip hurray సినిమాలో దీప్తి నావల్, రాజ్ కిరణ్
జగ్జీత్ సింగ్ అభిమానులకు రాజ్ కిరణ్ పేరు తప్పకుండా గుర్తుంటుంది. ఎందుకంటే జగ్జీత్ సింగ్ పాడిన సోలో సినిమా పాటల్లో మరపురాని మధురగీతం 'తుమ్ ఇత్ న జో ముస్కురా రహేహో క్యా గం హై జిస్ కో చుపా రహే హో' లో షబానా అజ్మీతో బాటు నటించినది రాజ్ కిరణే గనుక. ఈ పాట Ardh అనే సినిమాలోది. ఈ పాటను నేను గతంలో పాడి ఉన్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి.

అయితే, ప్రస్తుత విషయం అది కాదు. 1970-80 దశకంలో బాలీవుడ్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన రాజ్ కిరణ్ ప్రస్తుతం ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 1998 ప్రాంతంలో అతను హటాత్తుగా మాయమై పోయాడు. ప్రస్తుతం గత 15 ఏళ్ళుగా అమెరికాలోని అట్లాంటాలో ఒక పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్ గా ఉన్నాడని కొందరూ, లేదు న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకు గడుపుతున్నాడని కొందరూ అంటున్నారు. మొత్తం మీద దాదాపు గత పది ఏళ్ళు పైగా అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.

బాధాకరమైన విషయం అదొక్కటే కాదు.

ఇతను దివంగత సత్య సాయిబాబాకు వీరభక్తుడు. కానీ ఎన్నో అద్భుతాలు చేశానని కట్టుకధలు చెప్పుకునే బాబా ఇతన్ని ఏమీ రక్షించలేకపోయాడు. రాజ్ కిరణ్ 150 పైన సినిమాలలో నటించాడు.బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు.కానీ తన సంసార జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు. ఇతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల భార్యాపిల్లలు ఇతనికి క్రమేణా దూరమయ్యారు.బాబా తనను రక్షిస్తాడన్న పిచ్చి నమ్మకంతో ఇతను 1996 లో బెంగుళూరు వెళ్లి వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఉన్న బాబాను కలిశాడు. కానీ బాబా ఇతన్ని పట్టించుకోకుండా తన అనుచరుల చేత ఆశ్రమం బయటకు నెట్టించాడు.అప్పటికే రాజ్ కిరణ్ కెరీర్ దెబ్బతిని ఉన్నది. బడాబడా వాళ్ళను మాత్రమే తన దగ్గరకు రానిచ్చే బాబాకు సినిమాలు లేని నటుడితో పనేముంటుంది? దాంతో ఇంకా మతి చలించిన రాజ్ కిరణ్ తను గుడ్డిగా నమ్మిన సాయిబాబాను ఎలాగైనా కలవాలన్న పిచ్చి ఉద్రేకంలో ఒక నిచ్చెన వేసుకుని ఆశ్రమం గోడను ఎక్కుతూ సెక్యూరిటీ వాళ్లకు దొరికిపోయాడు. సత్యసాయిబాబా మీద హత్యాయత్నం చేస్తున్నాడన్న అభియోగం ఇతని మీద మోపి ఇతన్ని 11-6-1996 న బెంగుళూరు సెంట్రల్ జైల్లో పెట్టారు.దీనివెనుక కూడా బాబా హస్తం ఉన్నదని తెలిసినవాళ్ళు అంటారు.

మతి స్థిమితం సరిగ్గా లేని స్థితిలో ఒక నెల రోజులు దయనీయమైన పరిస్థితిలో జైల్లో ఉన్న తర్వాత 11-7-1996 న ఇతని తండ్రి బాంబే నుంచి వచ్చి బెయిల్ ఇచ్చి కొడుకును జైలు నుంచి విడిపించుకుని తీసికెళ్ళాడు.

ఆ తర్వాత ఇతనికి కొన్ని నెలలపాటు బాంబేలో ట్రీట్మెంట్ ఇప్పించారు.అక్కడా ఇతని పిచ్చి కుదరక పోవడంతో ఇతని అన్న ఇతన్ని అమెరికా తీసుకుపోయి అక్కడ పిచ్చాసుపత్రిలో చేర్చాడని అంటారు.క్రమేణా పిచ్చి ఎక్కువై పోయి అట్లాంటాలో ఒక మెంటల్ ఎసైలం లో చేర్చబడ్డాడు. అప్పటినుంచీ అక్కడే దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నాడని కొందరి భావన.

ఇతను నమ్మిన సాయిబాబా ఇతన్ని ఏ విధంగానూ ఆదుకోలేదు సరిగదా అబద్దపు నేరం మోపి జైల్లో పెట్టించాడు.విచిత్రం ఏమంటే అదే సాయిబాబా తన చివరి రోజుల్లో తనూ దయనీయమైన పరిస్థితులలో చనిపోయాడు.పైగా తనే పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కనే ఉంచుకుని మరీనూ !! ఆ వివరాలు అందరికీ తెలుసు.నేను మళ్ళీ చెప్పనక్కర లేదు.

తనను గుడ్డిగా నమ్మిన అమాయకభక్తులను గాలికి ఒదిలేసి మోసం చేసిన నేరానికి బాబాకు భగవంతుడు విధించిన శిక్షేమో అది? సరే బాబా సంగతి మనకెందుకు? ఆయన్ను అలా వదిలేసి మన కధలోకి వద్దాం.

దాదాపు పదిహేనేళ్ళ పాటు రాజ్ కిరణ్ ఏమై పోయాడో ఎవరికీ తెలియదు.చనిపోయాడని చాలామంది అనుకున్నారు. బాలీవుడ్ లో ఇతని అభిమానులు అందరూ గగ్గోలు పెట్టారు. స్టార్స్ లో ఇతని సహనటులూ మిత్రులైన దీప్తినావల్, రిషికపూర్ మొదలైన వాళ్ళు ఇతనెక్కడున్నాడా అని వాకబు చెయ్యడం మొదలెట్టారు.చివరకు అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఇతను ఉన్న విషయం నటుడు రిషికపూర్ అమెరికా వెళ్లి వాకబు చేస్తే తెలిసింది. కానీ కొందరు చెబుతున్న ప్రకారం అయితే ప్రస్తుతం న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ గా ఇతను పనిచేస్తున్నాడు. అయితే, ఇతని గురించి ఖచ్చితమైన ఏ వివరమూ చెప్పడానికి ఇతని ఫేమిలీ మెంబర్స్ అయిన భార్యా కూతురూ ఏమాత్రమూ ఇష్టపడటం లేదు. అతనెక్కడున్నాడో మాకూ తెలియదు మేమూ అతని కోసం వెదుకుతున్నాం అని మాత్రమే వారు చెబుతున్నారు. పైగా రిషి కపూర్ కూ, దీప్తి నావల్ కూ వాళ్ళు ఫోన్ చేసి - అనవసరంగా రాజ్ కిరణ్ కోసం వెదకొద్దు, అంతేకాదు మాకు అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వొద్దు. ఇదంతా మాకిష్టం లేదని తేల్చి చెప్పారట.

మనకు లభిస్తున్న కొద్ది వివరాలతో ఇతని జాతకాన్ని పరిశీలిద్దాం.

ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి.సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు.

ఇతని ముఖం తీరును బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి ఇతనిది అశ్వని నక్షత్రం అయ్యే వీలు లేదు. కనుక భరణి -1 పాదమే ఇతని నక్షత్రం అని నా భావన. ఎందుకంటే ఈ నక్షత్రపాద నవాంశాధిపతి అయిన సూర్యుడు వృత్తిని సూచించే దశమంలో శత్రు స్థానంలో ఉంటూ శనితో పరివర్తన చెంది ఉన్నాడు.పైగా, భరణీ నక్షత్రం వారు వృత్తిని మధ్యలో హటాత్తుగా వదిలేసి కనుమరుగు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది అశ్వని వారికి జరగదు. కనుక ఇతనిది భరణి - 1 పాదం అనుకుందాము. అలా అయినప్పుడు ఇతని జనన సమయం మధ్యాన్నం 3.30 నుంచి అర్ధరాత్రిలోపులో ఉండాలి.ఈ సమయంలో ఇతనికి మిథున, కర్కాటక,సింహ, కన్యా లగ్నాలు నడుస్తాయి. వీటిలో ఇతనిది కర్కాటక లగ్నం అవ్వాలి. ఎందుకంటే ఇతని ముఖం బొద్దుగా పూర్ణ చంద్రుడిలాగా మంచి కళగా ఉంటుంది. పైగా దశమంలోని రాహు చంద్రులవల్ల ఇతని వృత్తి అనేక ఒడిదుడుకులకు లోనౌతుంది.అంతేగాక చతుర్ధంలోని కేతువు వల్ల ఇతని మనస్సు డిప్రెషన్ లో పడిపోతుంది. అంటే మెంటల్ గా బేలెన్స్ తప్పుతుంది. ఇన్ని విధాలుగా ఇతని లక్షణాలు సరిపోతున్నందున ఇతని లగ్నం కర్కాటకం అని నేను నిశ్చయిస్తున్నాను.అప్పుడు ఇతని జన్మ సమయం 16.50 - 18.50 మధ్యలో ఉండాలి.

ఇప్పుడు లగ్న డిగ్రీలు రెక్టిఫై చేద్దాం.

కర్కాటక రాశిలో ఉన్న తొమ్మిది నవాంశలలో ఇతనిది సింహ నవాంశ అని నా అభిప్రాయం.అలాంటప్పుడు ఇతని జనన సమయం.సాయంత్రం 5.00 నుంచి 5.16 లోపు అని తెలుస్తున్నది. నవాంశను ఎలా నిర్ణయించాననే విషయం ఇక్కడ చెప్పను. అన్ని రహస్యాలూ బ్లాగులోనే చెప్పేస్తే ఎలా? వాటిని నా క్లోజ్ శిష్యులకు మాత్రమే నేర్పిస్తాను. ఇంకా లోతుగా వెళ్లి ఖచ్చితమైన జనన సమయాన్ని కూడా రాబట్టవచ్చు.కానీ ప్రస్తుతం మన పని అది కాదు గనుక ఇంతటితో జననకాల సంస్కరణ ఆపుదాం.

నక్షత్ర లక్షణాలు క్షుణ్ణంగా తెలిస్తే భారతీయ జ్యోతిష్య శాస్త్రం చాలావరకు ఒంట బట్టినట్లే లెక్క. చాలామంది బేసిక్స్ ని ఒదిలేసి సరాసరి భావ ఫలిత విచారణ లోకి వెళుతూ ఉంటారు.అక్కడే వారు పప్పులో కాలేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకునే విధానం అది కాదు. నిజం చెప్పాలంటే ఏ శాస్త్రమైనా సరే బేసిక్స్ లో మనం గట్టిగా ఉన్నప్పుడే బాగా ఒంటబడుతుంది.

పైగా - జ్యోతిష్య శాస్త్రంలో లోతుపాతులు అర్ధం కావాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అది అర్ధమౌతుంది.

1. మహామంత్ర ఉపాసన
2. దీనివల్ల వచ్చే ఇంట్యూటివ్ ఎబిలిటీ
3. జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం

ఈ మూడూ కలసినప్పుడే ఫలితాలు ఒక ఫ్లాష్ లాగా స్ఫురిస్తాయి గాని, ఊరకే గ్రహాలు రాశులు దశలు అని లెక్కలు వేసుకుంటూ కూచుంటే ఈ శాస్త్రపు లోతులు అంతుబట్టవు. 

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది.దశమంలో ఉన్న చంద్రమంగళ యోగం వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది. కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే.1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో శపితదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

రాహువులో శనితో జరుగుతున్న శపితదశా సమయంలోనే అంటే 1996-1999 మధ్యలోనే ఇతను సత్యసాయిబాబా ఆశ్రమం గోడ ఎక్కబోతూ దొరికిపోయి బెంగుళూర్ సెంట్రల్ జైల్లో నెలరోజులు ఉండి ఆ తర్వాత ఏమై పోయాడో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకూ ఇతని అడ్రస్ కూడా ఎవరికీ తెలియకుండా మాయమై పోయాడు.

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఒక్క నిజమైన దైవజ్ఞులు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్ద వయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

ప్రస్తుతం ఇతని పరిస్థితి ఏమిటో జ్యోతిష్య పరంగా చూద్దాం.

మే 26, 2005 నుంచీ జూలై 16,2007 వరకూ ఇతనికి అర్ధాష్టమ శని నడిచింది. అదే సమయంలో ఇతనికి రాహు మహర్దశలో శుక్ర, సూర్య,చంద్ర అంతర్దశలు నడిచాయి. సూర్య శుక్రులు సప్తమంలో ఉండి దూరదేశంలో పడే బాధలను సూచిస్తున్నారు. చంద్రుడు సరాసరి రాహువుతో కలసి పిశాచగ్రస్తయోగంలో ఉంటూ మతిభ్రమణాన్ని సూచిస్తున్నాడు.కనుక ఆ సమయంలో ఇతను నానా బాధలు పడి ఉండాలి.

తరువాత, 2014-2016 మధ్యలో ఇతనికి అష్టమశని నడిచింది. ఆ సమయంలో గురువులో బుధ అంతర్దశ నడిచింది. కర్కాటక లగ్నానికి గురువు యోగకారకుడే అయినప్పటికీ, ఇతనికి రోగ స్థానంలో ఉన్నాడు కనుక రోగబాధను ఇచ్చాడు.ఈయనకు కోణంలో ఉన్న రాహుచంద్రుల వల్ల మతిస్థిమితం లేకుండా పోయింది.బుధుడు వక్రించి అస్తంగతుడై సప్తమంలో ఉంటూ దూరదేశాన్ని, మతిస్థిమితం లేకపోవడాన్ని సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో ఇతని మానసిక రోగం బాగా ఎక్కువగా ఉండి ఉండాలి.2016-2017 మధ్యలో ఇతనికి గురువులో కేతు అంతర్దశ నడిచింది. నవాంశలో వీరిద్దరూ మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉన్నారు.రాశిలో కేతువు నాలుగులో ఉన్నాడు.కనుక ఆ సమయంలో కూడా ఇతని పరిస్థితి బాగాలేదని చెప్పాలి.ప్రస్తుతం ఇతనికి గురువులో శుక్ర దశ నడుస్తున్నది.శుక్రుడు బాధకుడు గనుక ఇప్పుడు కూడా ఇతనికి కాలం సరిగా ఉండదు.

2025 వరకూ ఇతనికి గురుదశే జరుగుతుంది. ఆ తర్వాత అష్టమాధిపతి అయిన వక్రశని దశ వస్తుంది. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. కనుక ఇతనికి రోగం నయం కాదని చెప్పవచ్చు.

స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం,దేశంకాని దేశంలో మెంటల్ హాస్పిటల్లో దిక్కులేని పేషంట్ గా ఉండవలసిన పరిస్థితి రావడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?