నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, ఏప్రిల్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 1 (డెట్రాయిట్ చేరుకున్నాం )

Rest house at Hyderabad

Rest House at Hyderabad

Hyderabad Airport

Hyderrabad Airport

Send off At Hyderabad Airport

At Chicago Airport

At Chicago Airport with Srinivas and Shakuntala

Welcome flowers From Srinivas at Chicago Airport

Detroit Airport

Detroit Airport

Detroit Airport

Detroit Airport

Detroit Airport

అనుకున్నట్లుగానే రెండో తేదీ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నాం. స్టేషన్ కు రాజు, తేజా, బాబ్జీ, జనార్దన్, వంశీ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. రెస్ట్ హౌస్ కు చేరి కొంచం రిలాక్స్ అయ్యేసరికి మిగతా అందరు శిష్యులూ రావడం మొదలైంది. నాకు సెండాఫ్ ఇవ్వడానికి బెంగుళూర్ నుంచి గణేష్, సునీల్ క్రితంరోజే హైదరాబాద్ వచ్చి ఉన్నారు.

పొద్దెక్కే సరికి దాదాపు 35 మంది వచ్చి నా రూంలో సమావేశమయ్యారు. శంకర్ తన శ్రీమతితో కరీంనగర్ నుంచి వచ్చి చేరుకున్నాడు. యోగేశ్వర్ కూడా తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి చాలా గంటలు ప్రయాణం చేసి వచ్చాడు. వెంకట రాజుగారు విశాఖపట్నం నుంచి ఒకరోజు ముందే వచ్చి చేరుకున్నారు.

రోజంతా చక్కని ఆధ్యాత్మిక సంభాషణలతో గడిచింది. వాళ్లంతా ఆడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వాళ్ళ సందేహాలను నివృత్తి చేశాను.మధ్యాన్నం అందరం అక్కడే భోజనాలు కానిచ్చాం. ఇంట్లో భోజనాలు తయారు చేయించి అందరికీ తెచ్చి ఇచ్చాడు జనార్దన్.

సాయంత్రం ఐదుకు రెస్ట్ హౌస్ నుంచి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాం. అందరూ మళ్ళీ నాలుగు కార్లలో ఎయిర్ పోర్ట్ కు వచ్చి వదల్లేక వదల్లేక నాకు సెండాఫ్ ఇచ్చారు. ఇంతమంది ద్వారా ఇంత ప్రేమను నాకు ఇస్తున్న భగవంతుడిని మనస్సులోనే స్మరించి ప్రణామాలు అర్పించాను. 

రెండో తారీఖున రాత్రి 9.45 కి హైదరాబాద్ లో బయలుదేరి మూడున్నర గంటల్లో అబుదాబి చేరుకున్నాం.అక్కడ మూడు గంటల లై ఓవర్ తర్వాత ఇంకో విమానమెక్కి పద్నాలుగు గంటల ప్రయాణం తర్వాత చికాగోలో దిగాము.

విమాన ప్రయాణంలో ఒక మంచి చైనీస్ సినిమా చూచాను. దాని పేరు Xuan Zang (2016). ఆరో శతాబ్దంలో చైనా నుంచి మన దేశానికి ఎన్నో కష్ట నష్టాలు పడి వచ్చి బౌద్ధమతాన్ని అభ్యసించిన హ్యూయన్ త్సాంగ్ జీవితం అది. ఇదొక అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమాలను మన తెలుగువాళ్లు ఇంకొక నూరేళ్ళ తర్వాత కూడా తియ్యలేరని నేను గట్టిగా చెప్పగలను. ఒకవేళ ఎవరైనా తీసినా ఎంతసేపూ హింసా, చెత్త డాన్సులూ,స్కిన్ షో,ఎచ్చులూ, పనికిమాలిన డైలాగులూ మాత్రమే ఉండే మన సినిమాలను ఇష్టపడే "టేస్ట్ లెస్ టెల్గూస్" ఛస్తే ఇలాంటి సినిమాలను చూడరు గాక చూడరు.

ఉదయం 9.30 కి చికాగోలో దిగేసరికి శ్రీనివాస్, శకుంతల గార్లు ఎదురుగా మాకోసం వేచి ఉన్నారు. వీరు చికాగోకు మూడు గంటల దూరంలో ఉన్న 'షాంపేన్' అనే ఊళ్ళో ఉంటారు. ఉదయాన్నే లేచి అంతదూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ నాకోసం ఎయిర్ పోర్ట్ కు వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళింటికి వచ్చి కనీసం రెండురోజులైనా ఉండమని అడిగారు. తప్పకుండా డెట్రాయిట్ నుంచి ఒక వ్యానేసుకుని అందరం కలసి షాంపేన్ కు వస్తామని చెప్పాను.

ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ కూడా శ్రద్ధగా ప్రతిరోజూ సంధ్యావందనమూ, గాయత్రీ ఉపాసనా చేస్తున్న ఉత్తములలో శ్రీనివాస్ ఒకరు.మా మధ్యన ఒకగంట సేపు ఆధ్యాత్మిక సంభాషణ నడిచింది. మన విధానానికీ గాయత్రీ ఉపాసనకూ ఏమీ భేదం లేదని, ఎంతో అదృష్టం ఉంటె తప్ప నా మార్గంలో అడుగు పెట్టలేరనీ శ్రీనివాస్ కు చెప్పాను.నా పరిచయం తర్వాత తనకు కలుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాలను తను నాకు వివరించాడు.ఊరకే ఏళ్లకేళ్లు జపతపాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదనీ, ఒక నిజమైన గురువుతో ట్యూన్ అయినప్పుడే అసలైన అనుభవాలు మొదలౌతాయనీ తనకు వివరించాను.అలా తన డౌట్స్ కొన్ని క్లియర్ చేసుకున్న తర్వాత వారి ఇంటినుంచి మాకోసం ప్యాక్ చేసి తెచ్చిన చపాతీలు, చిక్కుడుకాయ కూర, పెరుగన్నం,బెల్లం ఆవకాయ మాకక్కడే వడ్డించి తినిపించారు శ్రీనివాస్ దంపతులు. దేశం కాని దేశంలో ఆ ఎయిర్ పోర్టులో అలాంటి ఆంధ్రా భోజనం వారు తీసుకొచ్చి తినిపిస్తుంటే ఆ ప్రేమకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.

పన్నెండు గంటలకు వారి వద్ద సెలవు తీసుకుని డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రైలెక్కి అయిదు నిముషాలలో అక్కడకు చేరాము. అక్కడ ఇంకొక ఆశ్చర్యం మాకోసం ఎదురుచూస్తోందని ఊహించలేదు.

డెట్రాయిట్ నుంచి చికాగోకు మాకోసం ఎదురొచ్చిన ఒక శిష్యురాలు ఉదయం నుంచీ మాకోసం అక్కడ కూచుని ఎదురుచూస్తూ దర్శనమిచ్చింది. ఎనిమిది కల్లా అక్కడ ఫ్లయిట్ దిగి మాకోసం అక్కడే కూచోని ఉంది. తను కూడా మాకోసం చపాతీలు, అన్నం వండుకుని డెట్రాయిట్ నుంచే తనవెంట తీసుకుని చికాగోకు వచ్చింది. శ్రీనివాస్ దంపతులు పెట్టినవి అప్పుడే తిని ఉండటం వల్ల ఆకలి కాలేదు. అందుకే తను తెచ్చినవి తినలేక పోయాను. ఒక రెండున్నర గంటలు మళ్ళీ  చికాగో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లో కూచుని కబుర్లు చెప్పుకుని సాయంత్రం మూడింటికి అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ ఎక్కి ఐదుకు డెట్రాయిట్ లో దిగాము. నా పక్క సీటే బుక్ చేసుకుని మరీ మాతో కలసి చికాగో నుంచి డెట్రాయిట్ దాకా ప్రయాణం చేసింది తను.

డెట్రాయిట్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద స్వాగతం మళ్ళీ మాకోసం ఎదురు చూస్తున్నది.

ముందుగా వాతావరణం గురించి చెప్పాలి.ఇక్కడ వాతావరణం మబ్బులు పట్టి జల్లు పడుతూ చాలా చలిగా గ్లూమీగా ఉన్నది. పోయినేడాది ఈ పాటికి మంచు పడుతూ ఉన్నదట. ఈసారి లేదు. కానీ గుంటూరు 43 డిగ్రీల నుంచి రెండే రెండు రోజుల్లో ఇక్కడ మంచులోకి రావడం విచిత్రం అనిపించింది. ఇలాంటి వాతావరణంలో నాకు ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూనే జాకెట్ తీసేశాను.

'బాగా చలిగా ఉన్నది కదా? జాకెట్ వేసుకోండి.' అని గణేష్ అన్నాడు.

'ఈ చలి వాతావరణం నాకు చాలా బాగుంది.' అని చెప్పాను.

మేం దిగి బయటకు రాగానే, పద్మజ, నా అబ్బాయి మాధవ్, ఆనంద్, సుమతి, గణేష్, శ్రీలలిత, అన్నపూర్ణ గార్లు తమ పిల్లలతో సహా అక్కడ వెయిట్ చేస్తూ కన్పించారు. అందరం కలసి ఫోటోలు దిగుతుంటే ఒక అమెరికన్ ముందుకొచ్చి "మీరు నిలబడండి నేను ఫోటో తీస్తాను" అని అడక్కుండానే సాయం చెయ్యడం చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

'43 సెల్సియస్ నుంచి 43 ఫారెన్ హీట్ లోకి వచ్చారు మీరు' అని మా అబ్బాయి నవ్వుతూ అన్నాడు. 

'ఫారెన్ హీట్ ఇంత చల్లగా ఉంటుందని ఊహించలేదు' అన్నాను నవ్వుతూ.

అందరం కార్లెక్కి ఆబర్న్ హిల్స్ లోకి ఇంటికి బయలుదేరాము.

సొంత మనుషులని మనం అనుకునేవారే  పట్టించుకోని ఈ రోజులలో ఇంత దూరంలో ఇంత ప్రేమనూ ఆప్యాయతనూ ఇంతమంది మంచి మనుషుల ద్వారా అందిస్తున్నందుకు దైవాన్ని మళ్ళీ స్మరిస్తూ ఇంటికి చేరాము.

నావాళ్ళ కోసం  అమెరికా వెళుతున్నానని ముందే వ్రాసాను కదా ! అదే నిజమైంది.