నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఏప్రిల్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 4 (కాషాయం లోపలుంది)

మొన్న ఒక శిష్యుని ఇంటికి వెళ్లాను. నేను వస్తున్నానని వారి ఫామిలీ ఫ్రెండ్స్ ను కూడా వారు ఆహ్వానించారు.

అందరం కలసి ఒక సాయంత్రం పూట సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసాం.

నేను మామూలుగా జీన్స్ పాంట్, టీ షర్ట్ వేసుకుని, పైన లైట్ వింటర్ జాకెట్ వేసుకుని ఉన్నాను.

ఆ ఫామిలీ ఫ్రెండ్స్ లో ఒకాయన నన్ను చూచి ఇలా అన్నాడు.

'గురువు గారంటే కాషాయ వస్త్రాలు కట్టుకుని గడ్డం పెంచుకుని ఉంటారని అనుకున్నాను. ఇలా ఉంటారని అనుకోలేదు.'

నవ్వుతూ నేనిలా జవాబిచ్చాను.

'నా కాషాయం లోపలుంది. అది బయటకు కనిపించేది కాదు.'

నేను చెప్పినది అతనికి అర్ధం కాలేదు.

నా వింటర్ జాకెట్ లోపల కాషాయ వస్త్రాలు ఉన్నాయని అతను అనుకున్నాడు. నాకు భలే నవ్వొచ్చింది.

చాలామంది ఇంతే. గురువు అంటే ఏదో వేషం వేసుకుని గడ్డం పెంచుకుని ఎక్కడో చూస్తూ ఏదో అర్ధం కానీ భాష మాట్లాడాలని ఊహించుకుంటారు. దానికి విరుద్ధంగా మామూలుగా ఉంటె వారి దృష్టిలో గురువు కాదన్నమాట.

భలే వింత లోకం !! దీని అజ్ఞానానికి అంతు కనిపించడం లేదు.

ఇంట్లో మన సాధనా సమయంలో దానికి అవసరమైన డ్రస్సును వేసుకుంటాం. అది కూడా కొన్ని కొన్ని రోజులలో మాత్రమే. ప్రతిరోజూ ఆ వేషం అవసరం లేదు. మనది అసలు సిసలైన ఆధ్యాత్మికత. దానికి లోకపుమెప్పు యొక్క అవసరం ఎంతమాత్రమూ లేదు.

మొన్న శ్రీ రామనవమి రోజున ఒక శిష్యురాలు నన్నిలా అడిగింది.

' మనకు దగ్గరలోనే భారతీయ టెంపుల్ అని ఉంది. అక్కడ శ్రీరామకళ్యాణం చేస్తున్నారు. మీకు చూడాలని ఉంటే తీసుకెళతాను.'

ఆమెకు ఇలా చెప్పాను.

'నాకు రావాలని లేదు. ఆత్మకళ్యాణం అంటే ఏమిటో తెలియని దేబెలు కొందరక్కడ చేరి దేవుడి విగ్రహాలకు కళ్యాణం చేస్తున్నామని మురిసిపోతూ అజ్ఞానాన్నీ అహంకారాన్నీ పెంచుకోవడం తప్ప అక్కడేముంది సోది? సారీ. నేను రాను.'

ఇలా మాట్లాడినంత మాత్రాన నేను ట్రెడిషనల్ కాదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మనది అసలైన ఆధ్యాత్మికత. ప్రాక్టికల్ ఆధ్యాత్మికత. ఇందులో మనం గుడికెళ్ళము. దేవుడే మన దగ్గరకొస్తాడు. అదీ నా విధానం. 

నేను ట్రెడిషనల్ డ్రస్సులో ఉన్న ఫోటో ఒకటి కావాలనీ దానిని పూజా మందిరంలో ఉంచుకుంటామనీ నా శిష్యులు చాలామంది చాలాసార్లు అడిగారు. అందుకే ఈ ఫోటోను ఇస్తున్నాను. 

మొన్న గురుగ్రహం భూమికి దగ్గరగా, సూర్యునితో ఒకే సరళరేఖలోకి వచ్చిన రోజున చేసిన ప్రత్యేక సాధనా సందర్భంలో అమెరికాలో తీసిన ఫోటో ఇది.

అమెరికా అయితేనేమి? మన అంతరంగంలో కాషాయం జ్వలిస్తూ ఉన్నంతవరకూ మనకేం అవుతుంది? బాహ్యసన్యాసం, అంత:సంసారం కంటే బాహ్యసంసారం అంత:సన్యాసం ఉత్తమోత్తమం కదూ !