నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -48 (మాషీ మా)

1965 లో భరత్ మహరాజ్
పాతకాలంలో బేలూర్ మఠ్ లో భరత్ మహరాజ్ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. భరత్ అనేది ఆయన సన్యాసం తీసుకోకముందు పేరు. ఆయన సన్యాస నామం స్వామి అభయానంద. భరత్ మహరాజ్ గారు బేలూర్ మఠానికి మేనేజర్ స్వామిగా చాలా ఏళ్ళు ఉన్నారు. రామకృష్ణ మఠానికి పదవ సర్వాధ్యక్షులైన స్వామి వీరేశ్వరానంద గారికి ఈయన సమకాలికులు. నేను వీరిని 1984 లో అనుకుంటా దర్శించాను. అప్పటికే ఆయన దాదాపు 90 ఏళ్ళ పైన వయస్సుతో బాగా వృద్ధునిగా ఉన్నారు.

ప్రజలలో భరత్ మహారాజ్ అంటే ఎంత గౌరవం ఉండేది అంటే, ఈయన్ను దర్శించడం కోసం జవహర్ లాల్ నెహ్రూ కూడా బేలూర్ మఠ్ కు వచ్చి ఈయన ఆశీస్సులు పొందారు. ఆరోజులలోని ప్రముఖులు అందరూ ఈయనను దర్శించి ఆశీస్సులు పొందినవారే. మన దక్షిణాదిన కంచి పరమాచార్య ఎలాగో బెంగాల్లో ఈయన అలాగన్నమాట. రాజకీయ నాయకులు, సినిమా నటులు, గాయకులు, సంఘ సంస్కర్తలు ఇలా ఎందఱో ఈయనకు శిష్యులుగా ఉన్నారు. ఉదాహరణకు, ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రాసేన్ కు ఈయనపట్ల ఉన్న గురుభావం గురించి తెలియాలంటే ఈ క్రింది పోస్ట్లు చదవండి.


ఈయన గురించే మాషీమా ఇప్పుడు మాట్లాడుతున్నారు.

' నేను ఎప్పుడు ఇండియాకు వెళ్ళినా, లేదా లండన్ లో ఉన్న మా అన్నదమ్ములు ఎవరు ఇండియాకు వెళ్ళినా, మేము తప్పకుండా బేలూర్ మఠ్ దర్శించవలసిందే. అలా చెయ్యకుండా మేము వెనక్కు రాము. బేలూర్ మఠ్ మా ఇల్లు లాంటిది. ఇక ఉద్బోధన్ ఆఫీస్ మా సొంతిల్లే. ఈ వయస్సులో కూడా నేను ఇండియా వచ్చానంటే, శ్రీశ్రీమా ఇంటిలో (ఉద్బోధన్ ఆఫీస్ లో ) భోజనం చెయ్యకుండా నేను వెనక్కు రాను. ఎందుకంటే -  అలా చేశానంటే అక్కడ ఇంచార్జ్ స్వామి ఒప్పుకోరు. బెంగాల్లో ప్రసాదం అంటే పప్పన్నం అన్నమాట. గుజరాత్ లో కూడా అంతే. మీ ఆంధ్రాలో కూడా అంతే కదా. మీదీ మాదీ ఆహారం ఒకటే. పెద్ద తేడా ఏమీ లేదు. మా బెంగాలీలు పూర్తిగా శాకాహారులు కారు. ఎందుకంటే వారు చేపలు తింటారు. కానీ కొన్ని ప్రాంతాలలో వాటిని తినరు. పూర్తిగా శాకాహారం పాటిస్తారు. అలాంటి వారు పెద్ద ఉల్లి, చిన్నుల్లి కూడా తాకరు.

సరే అదలా ఉంచండి. నేను ఇండియాకు వచ్చినపుడు ఉద్బోధన్లో ఉన్న స్వామీజీలు ఇలా అంటారు. 'అమ్మా! నువ్వు ఎప్పుడు మళ్ళీ అమెరికాకు వెళుతున్నావో చెప్పు. బయలుదేరే ముందు నీవు తప్పకుండా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి. ఒకవేళ అలా చెయ్యకుండా నీవు వెళ్ళిపోతే, అమ్మ మమ్మల్ని విసుక్కుంటుంది. ' నా మనవరాలు అంత దూరంనుంచి ఇక్కడకు వస్తే, మీరు తనకు భోజనం పెట్టకుండా పంపించారా?' అంటూ అమ్మ మమ్మల్ని చాలా కోప్పడుతుంది'. చూడండి అమ్మ గతించి నూరేళ్ళు దాటింది. కానీ ఈరోజుకీ నన్ను చూస్తూనే ఉన్నది. చూడండి నేనెంత అదృష్టవంతురాలినో? ' అంటూ మాషీమా గొంతు గాద్గదికం అయ్యింది.

ఆమెకు ఏడుపు రాబోయింది. కానీ నిగ్రహించుకుని మళ్ళీ మామూలుగా ఇలా చెప్పసాగింది.

నేను చాలా ధన్యాత్మురాలిని. నా దీక్షాస్వీకారం ఎలా జరిగిందో చెబుతాను వినండి. నేను ఇండియాకు 1977 డిసెంబర్లో వచ్చాను. తిరిగి అమెరికాకు 1978 జనవరిలో వచ్చేశాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎక్కడికీ పోను. ఎందుకంటే అది మా ఇంటి పధ్ధతి. మా ఇంట్లో ఆడవారు ఎంత పెద్ద వయస్సు అయినా, ఎంత చదువుకున్నా కూడా ఒంటరిగా ఎక్కడకూ పోరు. అప్పుడు కూడా నేను గుజరాత్ నుంచి వచ్చిన మా చెల్లి, మా మరిదిలతో కలసి బేలూర్ మఠ్ కు వెళ్లాను. యధావిధిగా మేము భరత్ మహారాజ్ గారిని దర్శించాము.

ఆయన మామూలుగా - ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? అవన్నీ అడిగారు. ఆ తర్వాత ఇలా అన్నారు.

'నువ్వు దీక్ష తీసుకున్నావా?'

నేనిలా అన్నాను.

'లేదు. ఈ దీక్షలూ ఇవన్నీ నేను చెయ్యలేను. నాకు అమెరికాలో చాలా పని ఉంటుంది. పొద్దున్న పనికి వెళితే తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఎప్పుడౌతుందో నాకే తెలీదు. నేను దీక్ష తీసుకుంటే, రోజుకు కనీసం రెండుసార్లు స్థిమితంగా కూర్చుని మంత్రజపం చెయ్యాలి. నేనది చెయ్యలేను. నా వల్ల కాదు.'

అప్పుడాయన ఇలా అన్నారు.

'ఏయ్ పిచ్చిదానా ! మంత్రదీక్ష తీసుకో. నువ్వు చెయ్యలేనని భయపడకు. నువ్వు చెయ్యకపోతే నీకోసం అమ్మ తనే చేస్తుంది.'

ఆయనేమన్నారో చూచారా? 'నువ్వు చెయ్యలేకపోతే అమ్మే నీకోసం అంతా చేస్తుంది' అన్నారు. మామూలు మాటా అది? వారు ఊరకే మనలాగా మాట్లాడరు. వారు ఒకమాట అంటే అది ఎప్పటికీ కమిట్ మెంటే. అలా కట్టుబడి ఉంటారు వాళ్ళు.

'నువ్వు ఎప్పుడు బయలుదేరాలి?' అని ఆయన నన్నడిగారు. 

'వచ్చే శనివారం ఈ సమయానికి నేను ఎయిర్ పోర్ట్ లో ఉండాలి.' అన్నాను.

'ఓ. ఇంకా చాలా సమయం ఉంది. గురువారం నీకు దీక్ష ఇస్తారు వీరేశ్వరానందజీ. నువ్వేం పెద్దగా ఏర్పాట్లు చెయ్యనక్కరలేదు. స్నానం చేసి, మఠానికి వస్తూ వస్తూ కొన్ని పూలు, బజార్లో అమ్మే స్వీట్ కొంచం తీసుకురా. అంతే ! అవి చాలు.' అన్నారాయన.

అలాగే జరిగింది. గురువారం నాడు నేను ఆ విధంగా వీరేశ్వరానందస్వామివారి నుంచి మంత్రాన్ని స్వీకరించాను. అనుకోకుండా ఆ విధంగా నాకు దీక్ష ఇవ్వబడింది.

మీకో విషయం తెలుసా? మా అక్కలు, పిన్నులు, బాబాయిలు చాలామంది కలకత్తాలో ఉన్నారు. వీరందరూ దీక్షకోసం అయిదారేళ్ళుగా వేచి చూస్తున్నారు. కానీ వారికి ఆ భాగ్యం కలుగలేదు. అనుకోకుండా నాకు అది దొరికింది.' అందామె.

'అనుకోకుండా ఇవ్వబడినదే అసలైన దీక్ష' అనుకున్నాను నేను మనసులో.

మాషీమా కొనసాగించింది.

'అంతమాత్రం చేత నేనేదో పెద్ద గొప్పదాన్ని అని ఎప్పుడూ అనుకోను. ఛత్ ! నేను ధూళిలో ధూళిని అంతే. అదంతా అమ్మ అనుగ్రహం.'

గత సంవత్సరం మేలో మా ఆయన ఇక్కడే చనిపోయాడు. ఆయన డాక్టర్ గా ఇక్కడే ఎంతోకాలం పనిచేశాడు. ఇది జరిగిన రెండు నెలలకు నా బాయ్ ఫ్రెండ్ పెళ్ళికి నేను టెన్నెస్సి కి వెళ్ళవలసి వచ్చింది. నా బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా? అతను పుట్టకముందు వాళ్ళమ్మ పొట్ట మీద చెయ్యి ఉంచి నేనిలా అన్నాను. ' ఈసారి నీకు అబ్బాయి పుడతాడు.' ఎందుకంటే ఆ రోజులలో ఇప్పటి స్కానింగ్ లూ అవీ లేవు. ఆమెకు అప్పటికే ఒక అమ్మాయి ఉంది. నేను చెప్పినట్లే అబ్బాయి పుట్టాడు. వాడు నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు.

సరే వాడి పెళ్ళికి లాస్ట్ ఇయర్ నేను వెళ్లాను. ఫంక్షన్ బాగా జరిగింది. గుర్రం మీద ఎక్కి అబ్బాయి వచ్చాడు. అందరూ డాన్స్ మొదలు పెట్టారు. వాళ్ళు ఇక్కడే Charleston లో ఉండేవారు, తర్వాత Florida కు మారారు. అమ్మాయి వాళ్ళు ఉండేది Tennesse లో. అందుకని వాడి పెళ్లి అక్కడ జరిగింది. ఇదంతా మా ఆయన పోయిన రెండు నెలలకు జరిగింది.

సరే అబ్బాయి వైపు వాళ్ళు, అమ్మాయి వైపు వాళ్ళు, అమెరికన్ ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. నేను ఒక పక్కగా నించుని ఉన్నాను. అబ్బాయి తల్లి నా చెయ్యి పట్టుకుని 'మంజూ. పద అందరికంటే ముందు నువ్వుండి డాన్స్ చెయ్యి' అని నన్ను తోసింది. ఇంకేముంది? నేను ప్రపంచాన్ని మరచిపోయాను. రెండు గంటల పాటు ఎలా డాన్స్ చేశానో నాకే తెలీదు. వాళ్ళందరూ ఇలా అన్నారు. ' మంజూ ఆంటీ! మేము పెళ్లి కొడుకునూ చూడలేదు. పెళ్లి కూతుర్నీ చూడలేదు. రాణీ ముఖర్జీని నీలో చూశాం !'

నిన్ననే నాకా అబ్బాయి నుంచి లెటర్ వచ్చింది. ' ఆంటీ ! ఒకసారి మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. మనందరం మళ్ళీ ఒకసారి డాన్స్ పార్టీ పెట్టుకుందాం' అని.

ఇదంతా ఒక పెద్ద హోటల్లో జరిగింది. డాన్స్ అయ్యాక అందరూ డ్రింక్స్ స్నాక్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. నేనూ ఒక డ్రింక్ తీసుకుని ఒక మూలగా నిలబడ్డాను. అందరూ నా దగ్గరకొచ్చి ' ఆంటీ! మీరు ఏం డ్రింక్ తీసుకుంటున్నారు?' అని కుతూహలంగా అడిగారు.'

'అరె భాయ్ ! ఇది ఉత్త ప్లెయిన్ వాటర్ మాత్రమే' అని నేను వాళ్లకు చెప్పాను.

మా ఆయన పోయిన కొత్తలో కొందరు నాతో ఇలా అన్నారు.

'మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీరు మామూలుగా ఏమీ జరగనట్లుగానే ఉన్నారు. మునుపటి లాగానే పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు.'

వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకర్ధమైంది.

'అంటే నేను ఏడుస్తూ ఇంట్లో కూచుని, మీకు ఫోన్లు చేస్తే, మీరు నాకు ఫుడ్ తెచ్చి ఇవ్వడం, నన్ను ఓదార్చడం, మీ సింపతీని నేను కోరుకోవడం, నిరాశలో కూరుకుపోవడం - ఇలాంటివి జరగాలని మీ ఉద్దేశ్యమా?'

'అబ్బే అది కాదు. అందరూ అలాగే ఉంటారు కదా' అని వాళ్ళు నసిగారు.

'ధాంక్స్ ! నేనలాంటి దానిని కాను' అన్నాను నేను.

'మా ఆయన బ్రతికి ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఇంకా గట్టిగా ధైర్యంగా ఉన్నాను నేను. ఎందుకంటే అప్పుడు ఆయన నా కళ్ళెదురుగా ఉండేవాడు. ఇప్పుడో? నాలోనే ఉన్నాడు. ఇంతకు ముందు నేను ఒకరినే. ఇప్పుడు నాలో ఇద్దరున్నారు. అందుకే నేనిప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను.'

రెండు రోజుల క్రితమే నేను లాస్ వెగాస్ నుంచి తిరిగి వచ్చాను. అందరూ ఇలా అన్నారు.' అబ్బో! లాస్ వేగాస్ కు వెళ్లి వచ్చావా? అంటే బాగా ఎంజాయ్ చేశావన్న మాట? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకక్కడ?'

వాళ్ళతో నవ్వుతూ ఇలా చెప్పాను.

'ఎంతమందో నాకే గుర్తులేదు. లెక్కపెట్టుకునే సమయం నాకు లేదు.'

'అయితే బాగా తాగి తందనాలాడావన్న మాట !' అని వారడిగారు.

'బ్రహ్మాండంగా' అని జవాబు చెప్పాను.

కానీ నేను అమెరికాలో ఉన్న ఈ 46 ఏళ్ళలో ఒక్క చుక్క కూడా వైన్ కానీ ఆల్కహాల్ కానీ ముట్టుకోలేదు. మా ఆయన బ్రతికి ఉన్న రోజులలో అన్ని డాక్టర్స్ పార్టీలకూ నేను వెళ్ళేదాన్ని. ఒక విషయం చెప్పనా? ఆ పార్టీలలో, మొగుళ్ళ కంటే పెళ్ళాలే ఎక్కువ తాగేసి పడిపోయేవాళ్ళు.' అంది మాషీమా.

(ఇంకా ఉంది)