నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, జులై 2017, గురువారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 4

అమెరికా ఒక చెత్త దేశం

నిపుణుల లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తానికీ అత్యంత ఎక్కువ చెత్తను పారేసే దేశం అమెరికానే. సగటున అమెరికాలో ఒక్కొక్కడు ఒక రోజుకి రెండు కేజీల (4.4 పౌండ్ల) చెత్తను పోగేస్తున్నాడు. అమెరికా జనాభా 322 మిలియన్స్. అంటే ఏడాదికి 234 మిలియన్ టన్నుల చెత్తను అమెరికా పోగేస్తున్నది.

ఇండియా జనాభా 1.31 బిలియన్స్. అంటే దాదాపు అమెరికా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కానీ ఇండియా పారేసే చెత్త అమెరికా చెత్తలో అరవై శాతం మాత్రమే.

అమెరికాలో కన్సూమరిజం చాలా ఎక్కువ. అనవసరమైన షాపింగులు కూడా ఎక్కువే. క్రెడిట్ కార్డులు చేతిలో ఉండటంతో ఇంపల్సివ్ షాపింగ్ చేస్తూ అవసరం ఉన్నా లేకున్నా ఊరకే వస్తువులు కొని ఇంటినిండా పోగేసుకుంటూ ఉంటారు అమెరికన్స్. మినిమంలో బ్రతకడం అనేది వాళ్ళకు చేతకాదు. ప్రపంచం ఎటు పోతున్నా వాళ్లకు అనవసరం. సాధ్యమైనంతవరకూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడమే వాళ్ళకు తెలిసిన పని. ఈ క్రమంలో చాలా చెత్తను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలాభాగం రీసైక్లింగ్ అవుతుంది గనుక బయటకు కనపడదు.

వస్తువులు కొనడంలో కూడా అమెరికా వాళ్లకు భయమే. ఎప్పుడేమౌతుందో అని భయంతో ముందే అనవసరమైన ఫుడ్డును కొనేసి ఫ్రిజ్ లో దాచి పెడుతూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన చెత్తను పోగేస్తూ ఉంటారు. 

ఫుడ్ మాఫియా

అమెరికాలో ఫుడ్ ఇండస్ట్రీ అంతా పెద్ద మాఫియా. అమెరికా విస్తీర్ణం 9.8 మిలియన్ కి.మీ అయితే ఇండియా విస్తీర్ణం 3.3 మిలియన్ కి.మీ. అంటే ఇండియా కంటే అమెరికా మూడు రెట్లు పెద్దది. కానీ అమెరికాలో ఉన్న ల్యాండ్ అంతా వ్యవసాయంలో లేదు. ఎక్కువభాగం అడవిగా ఉంటుంది. వ్యవసాయం కాబడుతున్న ప్రాంతం 44.6 % మాత్రమే. అదే ఇండియాలో అయితే 60.4 % భూమి వ్యవసాయంలో ఉన్నది.

అమెరికాలో ల్యాండ్ అంతటినీ వాళ్ళు సాగు చెయ్యడం లేదు. చేస్తున్న కొద్ది భూమిలోనే ఎక్కువ ఎరువులు వేసి పంటలు పండిస్తున్నారు. అమెరికాలో పండుతున్న పంటల్లో విషపూరిత రసాయనాలు చాలా ఎక్కువ. ఆ పంటలు తింటున్న ప్రజలు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళలో కేన్సర్ మొదలైన తీవ్రరోగాల బారిన పడటం ఖాయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. కానీ వాళ్ళ మాటను ఫుడ్ మాఫియా వినడం లేదు. అసలు నిజాలు తెలిసిన కొందరు మాత్రం ఆర్గానిక్ ఫుడ్ వాడుతూ గుట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా ఖరీదు కావడంతో అమెరికాలోనైనా సరే సామాన్యుడైనవాడు దానిని రోజూ కొనలేడు తినలేడు.

ఇక అమెరికాలో అమ్మబడే మాంసం కూడా విషపూరితమే. ఎందుకంటే ఆ పశువులకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు విరివిగా ఇచ్చేస్తారు. వాటికి రోగాలు రాకుండా రకరకాల టీకాలు, యాంటీ బయాటిక్స్ ఇంజక్షన్ల రూపంలో ఇస్తారు. వాటి మాంసం తిన్నవారికి ఆ హార్మోన్లు, మందులు సూటిగా సరఫరా అవుతాయి. ఇక వాళ్ళు రాక్షసుల్లా ఊరిపోతూ ఉంటారు.

వెజిటబుల్స్ ని కూడా వదలకుండా వాటినీ జెనెటిక్ గా మార్చి పారేసి కొత్త కొత్త రకాలను సృష్టిస్తూ ఉంటారు. ఒక్క యాపిల్ లోనే పది రకాల రుచులు రప్పించారు. ఉల్లిపాయల్లో కూడా స్వీట్ ఆనియన్స్ తయారు చేశారు. ఈ రకమైన మార్పులకు లోనైన కాయలు చూడటానికి పందుల్లా కన్పిస్తాయి గాని వాటిల్లో బలం ఉండదు. వంకాయలు గాని, టమోటాలు గాని, దోసకాయలు గాని, చివరకు ఉల్లిపాయలు అయినా సరే మనం మామూలుగా ఇండియాలో వండినట్లు వండినా కూడా మన కూరగాయల రుచి అక్కడ చస్తే రాదు. ఏదో చెత్త తిన్నట్లు ఉంటుంది గాని రుచీ పచీ ఉండదు. ఇక ఈ ట్రీటెడ్ వెజిటబుల్స్, వాటిని తిన్నవారిలో ఏయే దుష్పరిణామాలను కలిగిస్తాయో కొన్నేళ్ళ తర్వాత గాని తెలియదు. తెలిసే నాటికి చేయిదాటిపోయి ఏ నయంగాని రోగమో ఒంట్లో ఉన్నట్లు తేలుతుంది. ఇక అప్పుడు చేసేది కూడా ఏమీ ఉండదు.

మెడికల్ మాఫియా

అమెరికాలో చాలా గొప్ప వైద్యం అందుబాటులో ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మన ఇండియాలో దొరికే వైద్యమే అక్కడ కూడా ఉంటుంది. మన ఇండియాలో ఉండే నిర్లక్ష్య డాక్టర్లు అక్కడ కూడా ఉన్నారు. మన ఇండియాలో జరిగే మెడికల్ మోసాలు అక్కడ కూడా జరుగుతున్నాయి.

వైద్యం చెయ్యకుండా దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్ము కాజేసే మాఫియా అమెరికాలో చాలాసార్లు వెలుగు చూసింది. దీనిని చేస్తున్నది కూడా అక్కడ సెటిలైన మన ఇండియా డాక్టర్లే. ఈ మోసం అమెరికాలో నిరంతరం జరుగుతూనే ఉంది. అందుకనే హెల్త్ స్కీమ్స్ తీసి పారెయ్యాలన్నది ట్రంప్ అజెండాలో ఒకటి.

అక్కడ వైద్యం అంతా ఇన్సూరెన్స్ మయం. అందుకని 'నీకేంటి నష్టం? బిల్లు కట్టేది నువ్వు కాదుగా?' అంటూ ఇష్టం వచ్చినట్లు స్టెరాయిడ్లూ, ఇమ్యూనో సప్రెసంట్లూ పేషంట్ల చేత వాడిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి మెడికల్ కంపెనీలు. హోమియోపతి వంటి సైంటిఫిక్ వైద్య విధానాలను 'కల్ట్ మెడిసిన్' అని పేరు పెట్టి అణగదొక్కుతున్నాయి అక్కడి ఫార్మా కంపెనీలు.

నేనక్కడ ఉన్న మూడునెలల్లో బాగా గమనించాను. అక్కడ వైద్యం ఇక్కడ వైద్యం కంటే ఏమీ మెరుగ్గా లేదు. కాకపోతే కొన్ని కొన్ని సర్జరీలు చేసే ఎక్స్ పర్ట్ లు అమెరికాలో ఉన్నారు. వైద్యం మాత్రం ఇక్కడ లాగే ఉంది. తేడా ఏమీ లేదు.