నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, జులై 2017, శుక్రవారం

గుదిబండ శిష్యులు

పాతకాలంలో గుదిబండ అని ఒకటి ఉండేది. ఆకతాయి పశువులను కంట్రోల్ చెయ్యాలంటే దాని మెడలో ఒక బండను కడతారు. ఆ బరువుకు ఆ పశువు పరుగు పూర్తిగా ఆగిపోతుంది. ఆ బండా ముందుకు కదలదు. ఈ పశువునూ కదలనివ్వదు. అదీ గుదిబండ ఉపయోగం.

నవీన కాలంలో గురువుల చుట్టూ చేరే శిష్యులు కూడా చాలామంది గుదిబండలాంటి వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళూ ఇవాల్వ్ కారు. ఈ గురువునూ ముందుకు పోనివ్వరు. అందుకే వీరిని గుదిబండ శిష్యులు అంటే చాలా సరిగ్గా ఉంటుంది.

'శిష్యులను చేర్చుకోకు అదే నీ పతనానికి కారణం అవుతుంది' అని రామతీర్ధస్వామి నూరేళ్ళ క్రితం ఒక మహత్తరమైన మాటను గురువులందరికీ సెలవిచ్చాడు. అది అక్షరాలా నిజం.

తన ఆత్మానుభవంలో తనకు తానుగా నిలిచి ఉండాలని అనుకునే ఏ గురువూ శిష్యులను దగ్గరకు రానివ్వడు. ఎందుకంటే ఈ శిష్యులనే వారిలో ఎక్కువమంది అహంకారులూ,మోసగాళ్ళూ,జెలసీతో లోపల్లోపల కుళ్ళిపోయిన వాళ్ళూ, మానసిక స్థిరత్వం లేకుండా రోజుకొక మాట మార్చేవాళ్ళూ, ఒకటి చెబుతూ ఇంకోటి చేసేవాళ్ళూ ఉంటారన్న పచ్చినిజం వారికి బాగా తెలుసు. కానీ ఇదంతా తెలిసి కూడా శిష్యులకు చెప్పాలనీ బోధించాలనీ కొందరు గురువులు చూస్తారు. దానికి కారణం ఏమంటే చెప్పగా చెప్పగా ఎప్పటికో కొంత కాకపోతే కొంతైనా ఎక్కుతుంది కదా? దానివల్ల వాళ్లకు కూడా నేడు కాకుంటే రేపైనా కొంత మేలు కలగకపోతుందా? అని వీరి ఆశ. అది వారి కరుణకు సంకేతంగాని ఈ శిష్యుల గొప్పదనం కాదు.

ఇలా ప్రయత్నించడం వల్ల ఈ గురువులకు కొత్తగా ఒరిగేది కూడా ఏమీ ఉండదు. తాము చేరిన గమ్యాన్ని వాళ్లకు కూడా చూపిద్దామనీ ఆ దారిలో వారిని కూడా నడిపిద్దామనీ నిస్వార్ధంగా ఈ గురువులైనవాళ్ళు ప్రయత్నిస్తారు గాని ఈ ప్రయత్నంతో వీరికి లాభం ఏమీ ఉండదు. 'పోరాడితే పోయేదేముంది సంకెళ్ళు తప్ప' - అని కమ్యూనిస్టు స్లోగన్ ఒకటుంది. అలాగే 'బోధిస్తే పోయేదేముంది వినేవాళ్ళ అజ్ఞానం తప్ప?' అని గురువులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ సోకాల్డ్ శిష్యులు అనేవారితో ప్రయాణం నరకంతో సమానంగా ఉంటుంది.

'ఎంతోమంది వింటారు కానీ ఎవరూ అర్ధం చేసుకోరు. ఎంతోమంది చూస్తారు కానీ ఎవరూ గుర్తించలేరు.' అని జీసస్ ఊరకే అనలేదు మరి !!

ఈ శిష్యులలో చాలామంది ఎలాంటి వాళ్ళంటే - మనం చెప్పినది అర్ధం చేసుకోరు. ఆచరించరు. కానీ అదే సమయంలో మనల్ని వదలరు. వాళ్ళ చెత్త మైండ్ సెట్ వాళ్ళు చస్తే ఒదులుకోరు. కానీ దానికి మన సపోర్ట్ ను ఆశిస్తారు. ఈలోపల నానా రచ్చా చేసి అందరి మనసులూ పాడుచేస్తుంటారు.

ఇలాంటి వాళ్ళేమనుకుంటారంటే - 'నేనిచ్చే బహుమతులూ, నేను పొగిడే పొగడ్తలూ, నేను చెప్పే మాయమాటలూ, నేను ఆడే నాటకాలకు ఈయన పడిపోతాడు. ఇక మన ఇష్టారాజ్యంగా ఈయన్ని ఆడుకోవచ్చు' అనుకుంటారు. కానీ ఆ గురువైనవాడి దగ్గర పవర్ ఫుల్ స్కానింగ్ మిషన్ ఉందనీ ఆ స్కానింగ్ లో వారికి తెలీని నిజాలు కూడా బయటపడతాయనీ వాళ్ళు గ్రహించలేరు. ఈ నాటకాలను అతను గుర్తించలేడని వీళ్ళు అనుకోడానికి ఎంత అహమూ ఎంత అజ్ఞానమూ వారిలో గూడుకట్టుకుని ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. 

వీళ్ళలో ఇంకొక విచిత్రమైన పోకడను మనం చూడవచ్చు.

ఒకపక్కన - గురువంటే దేవుడితో సమానం, మన తల్లీ తండ్రీ బంధువులూ అందరి కంటే గురువే ఎక్కువ అని ఎదుటివారికి నీతులు చెబుతూ ఉంటారు. కానీ తాము మాత్రం ఈ నీతుల్లో దేనినీ పాటించరు. సామాన్యంగా మిగతావాళ్ళ కంటే ముందుగా జాయిన్ అయిన సీనియర్ శిష్యులలో ఈ పోకడలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరికి లోపల్లోపల అధికారదాహం ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉంటుంది. ఈ రెంటిని తీర్చుకోడానికి ఆధ్యాత్మిక వేషాలు వేస్తూ నటిస్తూ పక్కవాళ్ళకు బోధిస్తూ ఉంటారుగాని వీరికి దేవుడూ అక్కర్లేదు గురువూ అక్కర్లేదు. ఇతరులకు తాము ఏ నీతులైతే చెబుతున్నారో ఆ నీతులన్నీ ముందుగా తాము పాటించాలని మాత్రం వారికి ఏమాత్రమూ అనిపించదు.

'నేను ప్రోమోట్ చెయ్యబట్టి ఈయన గురువయ్యాడు లేకుంటే ఈయన ముఖం ఎవరు చూస్తారు?' అన్న అహంకారం కూడా వీళ్ళలో లోపల్లోపల ఉంటుంది. గురువును నలుగురిలో పొగడటం నిజానికి వారివారి ఈగో ప్రొమోషన్ మాత్రమే గాని ఇంకేమీ కాదు.

గురువులూ మోసగాళ్ళే అయి, డబ్బు మీదా, అధికారం మీదా నాటకాల మీదా ఆశ ఉన్నవాళ్ళే అయినప్పుడు ఇలాంటి శిష్యులకూ అలాంటి గురువులకూ బాగా సరిపోతుంది. అందరూ కలసి చక్కగా నాటకం ఆడి లోకాన్ని మోసం చెయ్యవచ్చు.

కానీ గురువు నిజమైన గురువైనప్పుడు ఈ సోకాల్డ్ శిష్యులు వేసే ఇలాంటి నాటకాలను ఏమాత్రం సమర్ధించక పోగా వాళ్ళను అడుగడుగునా సరిదిద్దాలని చూస్తాడు. అవసరం అయితే కరుకుగా మాట్లాడి అయినా ఈ లోపాలనూ వేషాలనూ దిద్దాలని ప్రయత్నిస్తాడు. ఇది ఆ శిష్యులకు సుతరామూ నచ్చదు. ఎందుకంటే వాళ్ళలో కనపడని దురహంకారం గూడు కట్టుకుని ఉంటుంది. అందుకని ఆ సంస్థనూ ఆ గురువునూ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వదిలేసిన తర్వాత కూడా - 'తప్పు నాది కాదు. అంతా మా గురువుదే, ఆయనే నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఎప్పటినుంచో ఉన్న నన్ను నానారకాల మాటలతో బాధపెట్టి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళను దగ్గరకు తీస్తున్నాడు. వాళ్లకు సంస్థలో మంచి పొజిషన్స్  ఇస్తున్నాడు. మొదటినుంచీ ఉన్న మాకేమో దిక్కూ మొక్కూ లేదు' అని కామెంట్ చేస్తూ ఉంటారు.

ఇలా వెళ్ళిపోయిన ఇంకొందరు - ' అసలు ఆయన దగ్గర ఏ శక్తీ లేదు. ఊరకే జనాన్ని మాయమాటలతో మోసం చేస్తున్నాడు. ఈరోజు నేను బయటకొచ్చాను. రేపు మీకూ నా గతే పడుతుంది.' అని సాటి శిష్యులకు ఎక్కిస్తూ ఉంటారు.

వీరికి - 'నేను చాలా ప్రత్యేకమైన మనిషిని. చాలా తెలివితేటలు నాకున్నాయి. నేను లేకపోతే ప్రపంచం నడవదు' అన్న దురహంకారం ఉంటుంది. ఈ అహంకారంతోనే వాళ్ళ సంసారాన్నీ వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. తమను ఆదరించిన సంస్థనూ పాడుచేస్తారు. ఇలాంటి దురహంకారులతోనూ, మెంటల్ స్టెబిలిటీ లేనివారితోనూ, ఎవరూ సుఖంగా శాంతంగా ఉండలేరు - వారి కుటుంబ సభ్యులతో సహా, కానీ ఈ విషయాన్ని వాళ్ళు చస్తే ఒప్పుకోరు. సామాన్యంగా వీళ్ళంతా వారివారి ఫేమిలీ లైఫ్ లో ఘోరంగా ఫెయిల్ అయి ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ను ఇతరుల మీద రుద్దుతూ ఉంటారు.

ఈ విధంగా - అహంతోనూ, నిలకడ లేకపోవటం తోనూ, జెలసీ తోనూ, కోపంతోనూ, తమ ఊహలు నెరవేర లేదన్న అక్కసుతోనూ ఇలాంటివాళ్ళు నానారకాలుగా అన్ బేలన్స్ అయి ప్రవర్తిస్తూ ఉంటారు గాని, ఆ గురువు ఏం చెబుతున్నాడు? దానిని ఎలా ఆచరించాలి? ఎలా తమ మైండ్ సెట్స్ మార్చుకోవాలి? ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి? ఎలా సాధన చెయ్యాలి? ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి? ' అన్న విషయాలు మాత్రం పొరపాటున కూడా ఆలోచించరు. ఆ గురువును అనుసరించరు.

నిజానికి వీళ్ళంతా మెంటల్ పేషంట్లు. వీళ్ళలో స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్, ADHD మొదలైన రోగాలుంటాయి.  వీళ్ళకు సైకియాట్రీ ట్రీట్మెంట్ చాలా అవసరం. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఇలాంటి వేషాలతో కాలక్షేపం చేస్తూ, తమ చర్యల్ని తెలివిగా సమర్ధించుకుంటూ, చివరికి అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు.

ఇలాంటి వాళ్ళను ముందే కనిపెట్టి మొదట్లోనే వదిలించుకోకపోతే, కొన్నేళ్ళు పోయాక 'నాతో ఆధ్యాత్మికమార్గంలో నడవకుండా, ఊరకే కుళ్ళు రాజకీయాలు చేసే ఇలాంటి గుదిబండలతో ఎందుకిలా ఏళ్ళకేళ్ళు నా విలువైన కాలాన్ని వృధా చేశానా?' అని మనం చింతించవలసి వస్తుంది.

మనం చెప్పే బోధనలను నిజంగా అర్ధం చేసుకుని, ఆచరించే వాళ్ళనే మనం దగ్గరకు తియ్యాలిగాని, ఎవరిని బడితే వారిని దగ్గరకు రానిస్తే చివరకు ఘోరంగా ఆశాభంగం చెంది విచారించవలసి వస్తుందనేది నగ్నసత్యం.

ఇలాంటి దొంగశిష్యుల మాయలో పడితే - 'దగ్గరకు తీసుకుంటే వచ్చేదేముంది? వెన్నుపోట్లు తప్ప?' అని చివరిలో అనుకోవలసి వస్తుంది మరి !!