నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, ఆగస్టు 2017, గురువారం

నా పాటల అభిమానులకు ఒక సూచన

'ఆలోచనా తరంగాలు' బ్లాగులో నా పాటలు క్లిక్ చేస్తే అవి రావడం లేదని నా అభిమానులు చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు. వారికోసం ఈ పోస్ట్ !!

నా పాటలన్నీ MP3 ఫార్మాట్ లో weebly hosting వెబ్ సైట్ లో ఉంచడం చాలాకాలం నుంచీ జరుగుతున్నది. ఈ మధ్యనే ఈ సైట్ ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ఈ సైట్ ను వాడుకుని చాలామంది ఇస్లామిక్ ముష్కరులు భారతదేశానికి వ్యతిరేకంగా వ్రాతలు వ్రాస్తున్నారట. కనుక ఇండియాలో ఈ సైట్ ఓపన్ కావడం లేదు. అందుకని నా పాత పాటలనూ మీరిప్పుడు నా 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ నుంచి వినలేరు, మీరిప్పటికే వాటిని డౌన్లోడ్ చేసుకుని ఉంటే తప్ప.

ఈ పాటలన్నింటినీ ఇంకొక హోస్టింగ్ వెబ్ సైట్ కు మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కొన్ని రోజులు పట్టవచ్చు. ఎందుకంటే, నేను లెక్కపెట్టలేదుగాని, ఇప్పటికే ఈ పాటలు దాదాపు 200 దాటాయని నా ఊహ. కనుక అవన్నీ మళ్ళీ ఇంకో హోస్టింగ్ సైట్లో అప్లోడ్ చెయ్యడానికి కొంత టైం పడుతుంది. అంతవరకూ కొంచం ఓపిక పట్టండి. ఆ తర్వాత మళ్ళీ నా బ్లాగ్ లో పాటలను మీరు వినవచ్చు.

ఈ పని చెయ్యడంలో ఓపికగా నాకు సూచనలు అందించి సహాయపడిన నా పాటల అభిమాని మాలా రంగనాద్ గారికి నా కృతజ్ఞతలు.
read more " నా పాటల అభిమానులకు ఒక సూచన "

27, ఆగస్టు 2017, ఆదివారం

Baba Ram Rahim Singh Chart Analysis

బాబా రాం రహీం సింగ్
పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు నేడు నిప్పుల కుంపటిలా ఉడకడానికీ, ఆ రాష్ట్రాలలో యుద్ధవాతావరణం రావడానికీ కారకుడు బాబా రాం రహీం సింగ్. ఈయన్ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా వేలాదిమంది అతని అనుచరులు రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఆర్మీతో యుద్దానికి కూడా తలపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అయిదు మిలియన్ల మంది భక్తులూ/ శిష్యులూ ఉన్నారు. ఈయనదొక విలక్షణమైన బహుముఖ వ్యక్తిత్వం. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.


ఈయన 15-8-1967 న (స్వాతంత్ర్య దినోత్సవం రోజున) రాజస్థాన్ లో జన్మించాడు. 1967 లో గురువు ఖగోళంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని మనకు తెలుసు. ఎవరి జాతకంలో అయితే గురువు ఉచ్చస్థితిలో ఉంటాడో వారికి జీవితంలో కనీస అవసరాలకు లోటుపాట్లు ఉండవు. అయితే ఆయా లగ్నాలను బట్టి కొంతమంది జీవితంలో బాగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మరికొందరు అంత ఉన్నత స్థాయికి చేరుకోలేరు. కానీ వారి జీవితాలు కూడా ఉన్నంతలో బాగానే నడుస్తుంటాయి.

ఈయన జనన సమయం తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా పరిశీలిద్దాం. ఆరోజున చంద్రుడు రెండు నక్షత్రాలలో ఉన్నాడు - జ్యేష్ట 4, మూల 1. నక్షత్ర లక్షణాలను బట్టి ఈయన మూలా నక్షత్రంలో పుట్టాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మూలా నక్షత్రం అయితేనే గురువుగారి ప్రభావంలో ఉంటుంది మరియు ఇందులో పుట్టిన వాళ్ళు రాక్ స్టార్స్ లాంటి స్టేజీ గాయకులూ అవుతారు. ఈయన ఒక గురువేగాక పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడమూ, సినిమాలు తియ్యడమూ వాటిల్లో నటించడమూ చేస్తుంటాడు. ఈయనకు "రాక్ స్టార్ బాబా" అనే పేరుంది. 


ధనాధన్ సద్గురు
అంతేగాక ఈ నక్షత్రం ఈ పాదం అయితేనే చంద్రుడు నవాంశలో కుజునితో కలసి మేషంలోకి వస్తాడు. అప్పుడే ఈయనకు రోషమూ, పట్టుదలా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొదలైనవి కలుగుతాయి. అంతేగాక మూలా నక్షత్రానికి గురువు, కేతువుల లక్షణాలు కలగలసి ఉంటాయి. దీనికనుగుణంగానే వీరిలో చాలామంది గురువులై గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గొప్ప ఆశయాలతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కానీ కేతు ప్రభావం వల్ల తమ చర్యలతో తమను తామే నాశనం చేసుకుని తోకచుక్కలా అకస్మాత్తుగా రాలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఈయనలో ఉన్నాయి గనుక ఈయనది మూలానక్షత్రం అని నేను భావిస్తున్నాను. అదే నిజమైతే ఈయన మధ్యాన్నం పదకొండున్నర తర్వాత నుంచి సాయంత్రం అయిదు లోపల జన్మించి ఉండాలి. ప్రస్తుతం ఇంతకంటే జననకాల సంస్కరణ అవసరం లేదుగనుక ఇంతటితో ఆపుదాం.

ఈ విధంగా నక్షత్రమూ నక్షత్ర పాదమూ తెలిస్తే చాలు మనిషి మనస్తత్వాన్నీ అతని జీవిత రహదారినీ తేలికగా చదివెయ్యవచ్చు.

రాక్ స్టార్ బాబా
రవి బుధ, ఉచ్ఛ గురువులతో కూడి కర్కాటకంలో ఉన్న యోగం ఈయన జాతకంలోని బలం. నవాంశలో రాహుకేతువుల ఉచ్ఛస్థితి వల్ల జీవితంలో ఉన్నత స్థితికి సులువుగా చేరుకున్నాడు. పది/ఏడు స్థానాలకు అధిపతి అయిన బుధుడూ, తొమ్మిదో అధిపతి అయిన సూర్యుడూ, లగ్నాధిపతి అయిన ఉచ్ఛగురువుతో కలసి బలమైన మతగురువుగా యోగాన్నిచ్చారు. కానీ ఇది అష్టమంలో ఉండటంతో రహస్య కార్యకలాపాలు కూడా ఆశ్రమంలో జరుగుతాయని సూచన ఉన్నది.

అష్టమంలో నాలుగుగ్రహాల బలమైన సన్యాసయోగం వల్ల సంసారి అయి, భార్యాపిల్లలున్నప్పటికీ ఒక బలమైన మతసంస్థకు గురువయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ను సంపాదించాడు. అయిదింట పంచమంలో రాహువు వల్ల హిందూ, ఇస్లాం, సూఫీ మార్గాల కలగలుపు అయిన సిక్కు మతంలో ఒక శాఖకు గురువయ్యాడు. ఈయనకున్న బలమైన దళితఓటు బ్యాంకు వల్ల కాంగ్రెస్ నుంచి బీజీపీ వరకూ ప్రతి రాజకీయ పార్టీ ఈయన్ను ఇరవై ఐదేళ్లుగా దువ్వి బుజ్జగిస్తూ వస్తున్నాయి.


వరద బాధితులను ఓదారుస్తూ
ఈయనకు ఆరేళ్ళ చిన్న వయసులోనే ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయంటారు. ఈయనను చూచి బాగా ఇష్టపడిన 'డేరా సచ్చా సౌదా' గురువు సంత్ సత్నాంసింగ్ ఏడేళ్ళ వయసులో చిన్నపిల్లగాడిగా ఉన్న ఈయనకు దీక్షనిచ్చాడు. ఆ సమయంలో ఈయనకు కేతు మహాదశ నడిచింది. కేతుదశలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక యోగాలున్న జాతకులకు మంచి అతీతమైన అనుభవాలు కలగడం నిజమే. కనుక చిన్నతనంలో ఈయనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడం నిజమే కావచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 1990 లో ఈయన్ను తన వారసునిగా ప్రకటించాడు. అప్పటికి ఈయనకు 23 ఏళ్ళు.

నవమ దశమ అధిపతుల యోగం ఉచ్ఛగురువుతో కలసి ఈయనకు అద్భుతమైన రాజయోగాన్నిచ్చింది. అయితే మత కార్యకలాపాలకు సూచిక అయిన తొమ్మిదో స్థానంలో వక్ర శుక్రుని వల్లా, పదకొండులో కుజశుక్రుల వల్లా ఈయనలో శ్రీకృష్ణ పరమాత్ముని లక్షణాలు కొన్నున్నాయని అర్ధమౌతున్నది. తులలో ఉన్న కేతువు ఇక్కడ శుక్రుని సూచిస్తున్నాడని గుర్తుంచుకోవాలి.

శుక్రుడు ఈ రాశికి మంచివాడు కాదు గనుక పదకొండో అధిపతి అయిన శుక్రుడు సూచించే ఒక శిష్యురాలి వల్లనే ఈయనకిప్పుడు మూడింది. లాభస్థానం నుంచి ఇరుగూ పొరుగూ, స్నేహితులూ, పనివాళ్ళూ, లాభాలూ, రోగాలూ కూడా సూచితాలౌతాయి.  ఈ విధంగా జాతకంలోని వివిధ అంశాలు జీవితాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవేంటో ముందుగా గమనించి గ్రహించి వాటిని దిద్దుకుంటూ ఆయా దశలలో ఎంతో జాగ్రత్తగా నడవడమే జ్యోతిషం తెలిసినవారి కర్తవ్యం. అయితే ఇంత స్థాయిలో అధికారాన్నీ హోదానూ ఎంజాయ్ చేస్తున్నవారికి అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి ఇవేవీ కనపడవు. కనుకనే పతనం అవుతూ ఉంటారు. 'నేను దైవాంశ సంభూతుడినే' అని ఈయన నమ్ముతూ ఉంటాడు. బహుశా ఈ మితిమీరిన నమ్మకమే ఈయన తాత్కాలిక పతనానికి కారణం అయి ఉండవచ్చు.

చంద్రుడు మూలానక్షత్రంలోకి వచ్చినపుడు మాత్రమే ఈయన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడౌతాడు. లేదంటే చంద్రుడు వృశ్చికరాశి చివరలో ఉంటాడు గనుక చంద్రుడే ఆత్మకారకుడౌతాడు. ఈయనలో చంద్రుని లక్షణాలు లేవు బలంగా ఉన్న సూర్యుని లక్షణాలే ఉన్నాయి గనుక గనుక మనం చేసిన 'బర్త్ టైం రెక్టిఫికేషన్' కరెక్టే అని దీనివల్ల తెలుస్తున్నది. తన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడు గనుకనే ఈయన పొడుగాటి గడ్డం పెంచి సింహంలాగా కనిపిస్తూ ఉంటాడు. ఈయన తీసే సినిమాలలో కూడా ఆయనకు 'లయన్ హార్ట్' అనే పేరు ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మన జాతకంలోని గ్రహాలను బట్టే మన వేషమూ, మనం కనిపించే తీరూ, అంతేగాక మన పేర్లూ, డ్రస్సులూ, వాటి రంగులూ అన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. జీవితానికీ జాతకానికీ ఇదొక సూక్ష్మమైన లింక్.

కారకాంశ లగ్నమైన మీనం నుంచి పంచమంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ఇది ఒక గట్టి ఆధ్యాత్మిక యోగం అయినందువల్ల ఈయన పూర్తిగా మోసగాడని చెప్పలేము. గతంలో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మీద కూడా చండాలమైన అభియోగాలు మోపబడ్డాయి. కానీ అంతమాత్రం చేత ఆయన మహనీయుడు కాకుండా పోలేదుగా? కాకుంటే, అష్టమంలో ఉన్న కుజకేతు యోగం ఈయన జాతకంలో ఉన్న రసికత్వాన్ని చూపిస్తున్నది మరి !!

'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ తో
ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయి. ఈయనకు రావణుని వేషం వేస్తే చాలా బాగా సూటవుతుంది. రావణునిది కూడా మూలా నక్షత్రమే. ఆయన కూడా తనలో ఎన్ని మంచి లక్షణాలున్నప్పటికీ, తానొక దైవాంశ సంభూతుడినన్న గర్వంతో అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి తనకు నచ్చిన స్త్రీలను ఇష్టానుసారం చెరబట్టే కార్యక్రమంలో, సీతాదేవిని కూడా అలాగే చెయ్యబోయి పతనం అయిపోయాడు.

రావణుడు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. రావణుని ప్రజలను అడిగితే ఆయనకంటే మంచి రాజు ఎక్కడా లేడనే చెబుతారు. అలాగే ఈయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఈయన అధిపతిగా ఉన్న 'డేరా సచ్చా సౌదా' అనే సంస్థ చాలా పెద్దది. ఇది ఎన్నో పయనీర్ కార్యక్రమాలు చేసింది. గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుంది. దీనికి వందలాది కోట్ల ఆస్తులున్నాయి. స్వచ్చత, పరిశుభ్రత, గోవధా నిషేధం, మొక్కలు పెంచడం, నిరక్షరాస్యతా నిర్మూలన, స్పోర్ట్స్ ఎంకరేజ్ మెంట్, వరదలు వంటి ప్రకృతి విలయాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చెయ్యడం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఈయన చురుకుగా చేశాడు. అదే గాక ఒక రాక్ స్టార్ లాగా పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడం, సినిమాలు తీసి వాటికి దర్శకత్వం వహించి వాటిల్లో నటించడం వంటి పనులూ చేశాడు. ఈయన 'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ కూడా సినీ దర్శకురాలే. ఆమె ఒకే సినిమాలో 21 వేషాలు వేసి వరల్డ్ రికార్డ్ బద్దలు చేసింది.

ఇన్ని కోణాలు ఈయనలో ఉన్నాయి గనుకనే ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయని నేనంటాను. వీళ్ళిద్దరి నక్షత్రాలు కూడా ఒకటే.

2008 సెప్టెంబర్ లో ఈయన మీద కేసు విచారణ మొదలైంది. తమను చాలాసార్లు రేప్ చేశాడంటూ ఇద్దరు డేరా సన్యాసినులు 'మూడేళ్ళ తర్వాత' ఇచ్చిన స్టేట్ మెంట్ ను సీబీఐ తమ కేసులో ప్రధాన ఆధారంగా తీసుకుంది. ఆ సమయంలో జననకాల చంద్రుడు ఒకవైపు రాహువు (శని) తోనూ, ఇంకో వైపు వక్ర గురువుతోనూ అప్పచ్చి అయ్యాడు. అప్పుడే ఈయనకు కష్టాలు మొదలయ్యాయి.

2002 లో రంజిత్ సింగ్ మరియు రాం చందర్ చత్రపతి అనే ఇద్దరి చావులకు ఈయనే కారకుడని కేసులు బుక్ అయ్యాయి. వీరిద్దరిలో రంజిత్ అనేవాడు డేరా సన్యాసిని ఒకామె అప్పటి ప్రధానమంత్రి వాజపేయికి వ్రాసిన కంప్లెయింట్ కాపీలను విస్తృతంగా అందరికీ పంచడం వల్లనే చంపబడ్డాడని అతని తల్లిదండ్రులు అంటున్నారు. రాం చందర్ అనే జర్నలిస్ట్ కూడా ఆశ్రమంలోని చీకటి కోణాలపైన పరిశోధన చేసినందుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించాడని పుకారుంది. ఆ సమయంలో రాంరహీం జాతకంలో రాహుకేతువులు ఆరు పన్నెండులో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శని సప్తమంలో ఉండి చంద్రలగ్నాన్ని చూస్తున్నాడు. గురువు అష్టమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురు అనుగ్రహంతో కేసుల ప్రభావం ఈయన్ను తాత్కాలికంగా ఏమీ చెయ్యలేదు.

ఈయనకు ప్రస్తుతం ఏలినాటి శని మొదలైంది. వెంటనే కష్టాలూ ప్రారంభమయ్యాయి. ఈయన అనుచరులు ఈయనకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు తీర్పు పైన అప్పీల్ చేస్తున్నారు. ఈయనకున్న రాజకీయ పలుకుబడి వల్లా, ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ వల్లా, అన్నింటినీ మించి ఈయన ఉండేది ఇండియాలో గనుక అంతిమంగా ఈయనకు ఏమీ కాదని నా ఊహ.

ఇది ఈయన మీద మోపబడిన దొంగ కేసనీ, చివరకు ఈయన క్షేమంగా బయటకొస్తాడనీ, జైలుకు పోయినంతమాత్రాన కేసు రుజువైనట్లు కాదనీ ఈయన అనుచరులు వాదిస్తున్నారు. లక్షలాది మంది అనుచరులు ఈయన దైవాంశసంభూతుడే అని నమ్ముతున్నారు. ఇప్పటివరకూ జరిగిన గొడవలలో దాదాపు నలభై మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. సౌత్ నుంచి నార్తిండియాకు వెళ్ళే దాదాపు ౩౦ రైళ్ళు రద్దైపోయాయి. అయినా సరే, రోజుల తరబడి కుటుంబాలతో సహా రోడ్లమీదే ఉంటూ, ఆర్మీకి కూడా ఎదురు తిరిగి పోరాడటానికి ఈయన శిష్యులూ భక్తులూ సిద్ధంగా ఉన్నారు.

సొసైటీకి ఏమీచెయ్యకుండా ఊరకే సెవెన్ స్టార్ ఆశ్రమంలో కూచుని ఎంజాయ్ చేస్తుంటే ఇంత ఫాలోయింగ్ ఈయనకెలా వచ్చిందో తెలియదు.

చూద్దాం ఏం జరుగుతుందో?
read more " Baba Ram Rahim Singh Chart Analysis "

24, ఆగస్టు 2017, గురువారం

ఛిన్నమస్తా సాధన - 5

బౌద్ధంలో పంచ కులములు
తంత్రయానం, మంత్రయానం, వజ్రయానం అనేవి మూడూ దాదాపుగా ఒకటే విషయాన్ని చెబుతాయి. బుద్ధత్రిపిటకాలలో ఉన్న సూత్రాలు బట్టీ పట్టడం, ఉత్త మేధాపరమైన చర్చలలో కాలం గడపడం, అనవసరమైన చాదస్తపు నియమాలు పాటించడం మొదలైన అబ్యాసాలను తంత్రయానం నిరసిస్తుంది.

సరాసరి ఇప్పుడే ఇక్కడే జ్ఞాన/మంత్ర/తంత్రసిద్ధిని అందుకోవడమే తంత్రం యొక్క ముఖ్యోద్దేశ్యం. దానికోసం మనిషికి తెలిసిన అన్ని కట్టుబాట్లనూ, ఆచారాలనూ, బంధాలనూ త్రెంచి అవతల పారెయ్యమని అది చెబుతుంది. బుద్దుడు అదే చేశాడు. నేడు బుద్ధుని పూజించేవాళ్ళందరూ ఇళ్ళల్లో కూచుని కాఫీలు త్రాగుతూ కబుర్లు చెబుతున్నారు. కానీ బుద్ధుడు అలా చెయ్యలేదు. రాజ్యాన్ని గడ్డిపోచలాగా తృణీకరించి బయటకొచ్చాడు. నేడు చాలామంది అంటారు. 'బుద్ధుడు చేసింది పిచ్చిపని. ఆయన రాజుగా ఉండికూడా అది సాధించవచ్చు.' అని. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇళ్ళలో ఉండి అందరూ అన్నీ సాధించగలిగితే పాతకాలంలో ఋషులందరూ అడవులలో ఆశ్రమాలు కట్టుకుని ఎందుకున్నారు? పైగా అప్పుడు క్రూరమృగాల నుండి దొంగల నుండీ రక్షించుకోడానికి వాళ్లకు మనలాగా గన్స్ లేవు. అయినా సరే వాళ్ళు ప్రాణాలకు తెగించి అడవులకూ హిమాలయాలకూ పోయేవారు. తపస్సు చేసేవారు. అదీ అసలైన తెగింపు అంటే. అంతేగాని నేటి కుహనా గురువులలాగా ఏసీ ఆశ్రమాలలో నివసిస్తూ, టీవీలలో ఉపన్యాసాలివ్వడం కాదు.

తానే మానసికంగా ఎన్నోరకాలైన బంధాలలో చిక్కుకుని ఉన్నవాడు బయటకు ఎన్ని ఆచారాలు నియమనిష్టలు పాటించినా ఏమీ ఉపయోగం లేదు. అన్ని బంధాలకూ అతీతుడుగా వెళ్ళడమే బుద్ధత్వం అయినప్పుడు ప్రతి నిముషమూ అనేక బంధాలలో ఇరుక్కుని ఉన్న మనిషి దానిని ఎలా చేరుకోగలడు? అని తంత్రం ప్రశ్నిస్తుంది. ఇది చాలా సరియైన ప్రశ్న.

అయితే 'బంధాలను దాటడం' అంటే విచ్చలవిడి సెక్స్ జీవితాన్ని గడపడం కానే కాదు. చాలామంది తంత్రం అంటే ఇక్కడే తప్పుగా అర్ధం చేసుకుంటారు.తంత్రమంటే సెక్స్ లో పాఠాలు నేర్చుకోవడమనే భావన పాశ్చాత్యదేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఉంది. ఇది పూర్తిగా తప్పు భావన. కామాన్ని జయించడానికి తంత్రం అనేక విధాలైన విప్లవాత్మక మార్గాలను సూచిస్తుంది. వాటినే తంత్ర సాధనలంటారు. అవి indulgences కానేకావు. దానిలోనే ఉంటూ దానినే జయించే మార్గాలవి. అయితే ఈ విధానాలు బయటవాళ్ళకు అస్సలు అర్ధం కావు. ఈ రహస్యాలను అర్ధం చేసుకోలేని సో కాల్డ్ అమెరికన్ తంత్రాటీచర్స్ అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువగా ఓషో శిష్యులు. వీళ్ళు నేర్చుకున్న తంత్రం అంతా ఓషో ఆశ్రమంలో రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగే 'తంత్రా వర్కుషాపు'కే పరిమితం. ఈ వర్కుషాపును నేను 1998 లో దగ్గరనుంచి చూచాను. అదొక sexual orgy. అందులో పాల్గొనే వాళ్ళంతా అమెరికన్లూ యూరోపియన్లూను. అది అసలైన తంత్రం కాదు. ఈ విషయాన్ని నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో 1998 లో ఉన్నప్పుడు గమనించాను. వారికి అసలైన తంత్రం తెలియదు.

'కామాన్ని నువ్వు జయించాలిరా బాబూ' - అని తంత్రం చెబుతుంటే మోడరన్ తంత్రగురువులేమో 'బెటర్ సెక్స్ ఎలా ఎంజాయ్ చెయ్యాలో మేము నేర్పిస్తాం. అదే తంత్రం' అని తప్పుడు భావాలను పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేస్తున్నారు. ఇదే కలిమాయ అంటే !!

అయితే ఈ రహస్యాలను ఎవరు నేర్పిస్తారు? వీటిని అభ్యాసం చెయ్యడం ఎలా? అంటే దానికి సమాధానం ఒక్కటే. ఇది రహస్యమైన మార్గం. నువ్వు ఆ దారిలో నడిస్తేనే నీకు ఆ రహస్యాలు బోధించబడతాయి. అలా నడవాలంటే నీకు కొన్ని అర్హతలుండాలి. అవి లేకపోతే నీకు తంత్రయానం అర్ధం కాదు. ముందసలు అందులోకి ప్రవేశమే నీకు లభించదు. అందుకే తంత్రసాధన నీకు కావాలంటే "నీ అర్హతను నువ్వు ముందు నిరూపించుకో" అని తంత్రం చెబుతుంది. అయితే ఈ అర్హతలు లక్షమందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఉంటాయిగాని అందరికీ ఉండవు. తంత్రం అంటే అందరికీ సరదాగా ఉంటుంది. కానీ ఎవరు బడితే వారు తంత్రసాధనకు అర్హులు కారు. కొన్ని కొన్ని కులాలలో పుట్టినవారే దీనికి అర్హులు.కులం అంటే మనకు తెలిసిన కులం కాదు. కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండటమే 'కులం' అనే పదానికి అర్ధం.

బుద్ధధర్మంలో అయిదు కులాలనేవి ఉన్నాయి. కులం అనే పదం బుద్ధుని కంటే ముందుగా మన సమాజంలో ఉన్నప్పటికీ బుద్ధధర్మంలో కూడా ఈ పదం ప్రవేశించింది. కులం అంటే ఒక గుంపు అనేది అసలు అర్ధం. ఒకే రకమైన ఆచారాలు పద్ధతులూ పాటిస్తూ ఉండే ఒక గుంపుకు 'కులం' అని పేరు.

నిజమైన హిందూమతమంటే ఎలాగైతే హిందువులలో చాలామందికి తెలియదో, నిజమైన బౌద్ధమతం అంటే కూడా బౌద్దులలో చాలామందికి తెలియదు. బుద్దుడు కులవ్యవస్థను నిరసించాడనీ, వేదాలను నిందించాడనీ, సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నించాడనీ చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఈ భావనలేవీ నిజాలు కావు.

బుద్ధుడు సంఘసంస్కర్త కాడు. సంఘాన్ని సంస్కరించాలని ఆయన అనుకుంటే రాజుగానే ఆ పని చేసేవాడు. దానికి భిక్షువు కావాల్సిన పని లేదు. రాజుగా చెయ్యలేని పనిని భిక్షువుగా అస్సలు చెయ్యలేడు. కనుక బుద్ధుని ఉద్దేశ్యాలు ఇవేవీ కావు.

'దుఃఖనాశన మార్గాన్నే' ఆయన వెదికాడు. దానిని సాధించాడు. దానినే బోధించాడు. ఆ మార్గానికి కలిసిరాని అన్నింటినీ, అవి వేదాలైనా సరే, దేవుళ్ళైనా సరే, సమాజపు కట్టుబాట్లైనా సరే, వాటిని త్రోసివెయ్యమన్నాడు. ఆయన ప్రాధమికంగా ఒక అనుభవజ్ఞాని. తను పొందిన జ్ఞానానికి దారిని అర్హులైనవారికి బోధించాడు. ఆ దారిలో వారిని నడిపించాడు. అంతే.

బుద్ధుడు మొదట్లో బోధించినది ఒకటే ధర్మం అయినప్పటికీ కాలక్రమేణా దానిలో అయిదు శాఖలు ఏర్పడ్డాయి. అవే పంచకులాలు. అవి - రత్నకులం, వజ్రకులం, పద్మకులం, కర్మకులం.  తధాగతకులం. వీటిలో అక్ష్యోభ్యుడు, వైరోచనుడు, అమితాభుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి అనేవారు అధిష్టానదేవతలు. వీరినే బౌద్ధంలో కులేశ్వరులంటారు. వీరితో సంభోగంలో (అంటే ఒకటిగా కలసి) ఉండే స్త్రీదేవతా మూర్తులను "కులేశ్వరి" అంటారు.

వీరిలో వజ్రయానానికి అక్షోభ్యుడూ, పద్మయానానికి అమితాభుడూ, రత్నయానానికి రత్నసంభవుడూ, కర్మయానానికి అమోఘసిద్దీ, తధాగతయానానికి వైరోచనుడూ దేవతలు. ఈ కులాల నుంచే కులాచారం, కౌలాచారం, కౌలమార్గం అనేవి పుట్టుకొచ్చాయి. దీనిని హిందూ తంత్రాలు కాపీ కొట్టాయి.  వీటిలో వజ్రకులమే వజ్రయానం లేదా తంత్రయానం అయింది. ఇవి వరుసగా, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశ మార్గాలుగా భావించబడ్డాయి. వీటిలో జలం అనేది స్వాదిష్టానచక్రాధి దేవత గనుకా, అది శుక్రగ్రహం అధీనంలో ఉంటుంది గనుకా, శుక్రుడూ స్వాధిష్టాన చక్రమూ కామాన్ని కంట్రోల్ చేసే శక్తులు గనుకా వజ్రయానంలో సంభోగం అనేది ముఖ్యసాధనగా వచ్చింది. ఎందుకంటే కామాన్ని సబ్లిమేట్ చెయ్యందే (జయించనిదే) ఈ సాధన కుదరదు.    

ఇవి హిందూతంత్రంలో చెప్పబడిన పంచకోశాలకూ పంచభూతాలకూ పంచమార్గాలకూ సూచికలు. శైవంలో ఇవే పరమశివుని అయిదు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలుగా వర్ణింపబడ్డాయి.


కురుకుళ్ళా దేవత
బౌద్ధతంత్రాలలో ఈ అయిదు మార్గాలూ అయిదు తంత్ర యానాలుగా చెప్పబడ్డాయి. అవే క్రియాతంత్రము, చర్యాతంత్రము, యోగతంత్రము, యోగోత్తర తంత్రము, అనుత్తర తంత్రము. ఈ అయిదూ కూడా మన్మధుని పంచ పుష్పబాణాలకు సంకేతాలు. అవిద్య, రాగము, ద్వేషము, గర్వము,అసూయ అనే అయిదు పాశాలకు కూడా ఇవి సంకేతాలు. ఈ పుష్ప బాణాలు అనేవి మన్మధుని చేతిలోనూ లలితాదేవి చేతిలోనూ ఉన్నట్లు మన సాంప్రదాయంలో చూస్తాం. అలాగే బౌద్ధంలో ఉన్న కురుకుళ్ళా దేవతను మనం చూస్తే ఈమె చేతిలో ఒక పుష్పధనుస్సూ, అయిదు పుష్పబాణాలూ ఉంటాయి. మిగతా రెండు చేతులలో పాశమూ అంకుశమూ ఉంటాయి. సరిగ్గా లలితాదేవి చేతిలో కూడా చెరుకుగడ దనుస్సూ, అయిదు పుష్పబాణాలూ, పాశమూ అంకుశమూ ఉంటాయి. కనుక లలితాదేవియే బౌద్ధ తాంత్రికదేవత ఐన కురుకుళ్ళ. దీనికి రుజువుగా, బౌద్ధతంత్రాలలో వాడబడిన అనేక పదాలు యధాతధంగా మనకు లలితా సహస్రనామాలలో దర్శనమిస్తాయి.

"కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా" - అనేది లలితా సహస్ర నామాలలోని ఒక నామం.ఈ నామం అందరికీ తెలుసు. కానీ ఇది దేనిని గురించి చెబుతున్నదో ఎవరికీ తెలియదు. మనవాళ్ళు అర్ధాలు తెలుసుకోకుండా ఊకదంపుడు పారాయణాలు చెయ్యడంలో సిద్ధహస్తులు కదా !

ఈ నామం కులమార్గాన్ని గురించి చెబుతుంది. కౌలమార్గం అనేది కూడా మొదటగా బుద్ధమార్గంలోని అయిదు కులాల నుంచే వచ్చింది. ఈ కులాలలో దేనికో ఒక దానికి చెందిన వారిని కౌలాచారులు లేదా కౌలమార్గావలంబులు అనేవారు. వారిచే పూజించబడే దేవత గనుక లలితాదేవికి "కౌలమార్గ తత్పర సేవితా" అనే నామం వచ్చింది. బౌద్ధంలో ఉన్న తారాదేవియే హిందూమతంలో అనేకరూపాలలో పూజింప బడుతూ ఉంటుంది. అందులో ఒక రూపమే లలితాదేవి. బౌద్ధంలో తారాదేవిని అందరు బుద్ధులకూ తల్లిగా భావిస్తారు.

లలితా సహస్రనామాల అసలైన అర్ధాలు తెలుసుకోవాలని అనుకునేవారు వచ్చే నెలలో రాబోతున్న నా పుస్తకం ' లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' చదవండి.

ప్రాచీనకాలంలో బయట ప్రకృతికీ, లోపలి సాధనా మార్గానికీ సమన్వయం చెయ్యాలని అనేక ప్రయత్నాలు ప్రతి మతంలోనూ జరిగాయి. దాని ప్రభావాలే బౌద్ధతంత్రంలోనైనా హిందూ తంత్రంలోనైనా ఈ శాఖోపశాఖల సృష్టి. ఈ క్రమంలో, హిందూ, బౌద్ధ, జైన మతాలలోని దేవతలందరూ కలసిపోయారు. ఎందుకంటే ప్రాధమికంగా ఇవన్నీ ఒకటే మూలం నుంచి, వేదమూలం నుంచి, పుట్టిన శాఖలు కాబట్టి. అందుకే ఈ మతాలన్నింటిలోనూ, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన అనేకమంది వేదకాలపు దేవతలు మనకు కనిపిస్తారు. వీరే గాక అనేకమంది తాంత్రికదేవతలు కూడా ఈ తంత్ర/పురాణ కాలంలో సృష్టించబడ్డారు. అందుకే హిందూ బౌద్ధ తంత్రాలలో అనేక దేవతలు కామన్ గా మనకు దర్శనమిస్తారు.


21 తారారూపాలు
ఉదాహరణకు - లలితా సహస్రనామాలు చదివే అందరికీ ఈ నామం సుపరిచితమే - "కురుకుళ్ళా కులేశ్వరీ". ఇందులో కురుకుళ్ళ అనే తాంత్రిక దేవత గురించి చెప్పబడింది. ఈమె మనకు హిందూతంత్రాలలో ఎక్కడా కనిపించదు. ఒక్క తంత్రరాజ తంత్రమే ఈమె సాధనను ఉపదేశించింది. కానీ బౌద్ధంలో ఈమె తారాదేవికి ఒక రూపంగా మనకు దర్శనమిస్తుంది. తంత్రసాధనలో తారాదేవికి 21 రూపాలు/ అవతారాలున్నాయి. కురుకుళ్ళా దేవతను 'అరుణతార' అని బౌద్ధంలో పిలుస్తారు. ఈమె రంగు అరుణవర్ణమని అంటే లేత ఎరుపురంగని చెప్పబడింది. లలితాదేవి ధ్యానశ్లోకాలలో కూడా 'అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం...' అని ఉంటుంది.  కురుకుళ్ళా దేవత కూడా నృత్యం చేస్తూ పుష్పబాణాన్ని సంధిస్తున్న భంగిమలో ఉంటుంది. కనుక ఈ ఇద్దరూ ఒక్కరే అనేది నిర్వివాదాంశం.

వజ్రయాన బౌద్ధంలో కురుకుళ్ళా దేవతకు 'ఆర్యతారా కురుకుళ్ళా కల్పం' అనే గ్రంధం ఉన్నది. దీనిని అతిశ దీపాంగారుని శిష్యుడైన మృత్యుంజయుడు టిబెటన్ భాషలోకి అనువదించాడు. ఈమెకు తారోద్భవ కురుకుళ్ళ అని కూడా పేరుంది. ఈమె ప్రాధమికంగా ఒక జ్ఞానదేవత అయినప్పటికీ ఈమె మంత్రాన్ని ఎక్కువగా వశీకరణంలో, సమ్మోహనక్రియలో ప్రయోగిస్తారు. ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవాలంటే ఈమె మంత్రప్రయోగం అత్యుత్తమం. ఈ గ్రంధంలో కామ్యకర్మలకు వాడవలసిన అనేక మంత్రతంత్ర విధానాలు ఇవ్వబడ్డాయి. కల్ప గ్రంధాలన్నీ ఇలాంటివే.

తంత్రాన్ని లౌకిక ప్రయోజనాలకు వాడటం మీద అయిదేళ్ళ క్రితం కొన్ని పోస్టులు వ్రాశాను. నిజానికి ఇలాంటి పనులు నిషిద్ధం అయినప్పటికీ కొన్నికొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఇలా వాడవలసి వస్తుంది. అయితే చెడు పనులకు వాడితే మాత్రం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఇది ప్రతి తాన్త్రికుడూ గుర్తుంచుకోవాలి.

తంత్రాన్ని నిత్యజీవితంలో నాలుగు రకాలుగా వాడవచ్చు.

1. శ్వేతకర్మ. దీనినే శాంతికర్మ లేదా White Magic అని అంటారు. జాతకంలోని మొండిదోషాలను తొలగించడానికి, తగ్గకుండా పీడిస్తున్న రోగాలను తగ్గించడానికి, భూత ప్రేతాలను వదిలించడానికి దీనిని వాడాలి. దీని దేవతలు తెల్లగా ఉంటారు. ఉదాహరణకు శ్వేతతార.

2. కాలకర్మ లేదా రౌద్రకర్మ. దీనిని Black Magic అంటారు. ఇతరులను నాశనం చెయ్యడానికి (మారణం) దీనిని వాడాలి. నిజానికి సాధనలో అడ్డు వస్తున్న మొండి దుష్ట సంస్కారాలను కర్మను నాశనం చెయ్యడానికే దీనిని ఉపయోగించాలి. దీనిలో ఉపాసింపబడే దేవతలు నల్లగా ఉంటారు. ఉదాహరణకు కాలతార, క్రోధకాళి, స్మశానకాళి, చిన్నమస్త, చాముండ.

3. పీతకర్మ లేదా పుష్టికర్మ. దీనిని Yellow Magic అంటారు. ధనధాన్య వృద్ధికి, సంపద వృద్ధికి, కుల వృద్ధికి, అధికార వృద్ధికి, అన్నిరకాలుగా ఔన్నత్యం కలగడానికి దీనిని వాడాలి. ఈ దేవతలు పసుపురంగులో ఉంటారు. ఉదాహరణకు స్వర్ణతార.

4.అరుణకర్మ లేదా వశ్యకర్మ. దీనిని Red Magic అంటారు. మనకు నచ్చిన స్త్రీలను, క్రూరజంతువులను, శత్రువులను వశం చేసుకోవాలంటే దీనిని వాడాలి. ఈ దేవతలు ఎర్రని రంగులో ఉంటారు. లలితాదేవి, కురుకుళ్ళ, అరుణతార మొదలైన దేవతలు ఈ కోవలోకి వస్తారు.

తెలుపురంగు శాంతికీ, నలుపురంగు మరణానికీ, పసుపురంగు వృద్ధికీ, ఎరుపురంగు సంమోహనానికీ సూచికలు. కొద్దిసేపు ఆ రంగుల మీద ధ్యానం చేస్తే వాటి ఆరాలు ఏమిటో బాగా అర్ధం అవుతాయి. చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రకృతిలో ఎర్రగా ఉన్న ప్రతిదీ మనిషిని ఆకర్షిస్తుంది. తెల్లనిది ప్రతిదీ శాంతిని కలిగిస్తుంది. ఈ రంగుల గుణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒకే తారాదేవి అయినా కూడా ఆమె ఉన్న రంగును బట్టి ఆమె మంత్రంలో ఉన్న వైబ్రేషన్ ను బట్టి ఆమె చేసే పని ఉంటుంది.

సరే ఇవన్నీ కామ్యకర్మలు. వీటిని ఇలా ఉంచి మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

పైన చెప్పబడిన అయిదుగురు బుద్ధులకు కులేశ్వరులని పేరుందని చెప్పాను. వీరితో ఉండే స్త్రీదేవతా శక్తులకే 'కులేశ్వరీ' అని పేరు. ఇదే నామం మనకు లలితా సహస్రనామాలలో "కురుకుళ్ళా కులేశ్వరీ" అంటూ కనిపిస్తుంది.

నిజానికి తంత్ర/పురాణకాలంలో (క్రీ.శ. 300 నుంచి 800 వరకూ) కొత్తగా వచ్చిన అనేకమంది బౌద్ధదేవతలనే ఈనాడు మనం హిందూమతంలో పూజిస్తున్నాం. వీరిలో చాలామంది నలందా, విక్రమశిల విహారాలలోని ఆచార్యులు సృష్టి చేసిన వారే. ఈ ఆచార్యులందరూ సంస్కృత, ప్రాకృతాలలోనూ, కొందరు టిబెటన్, చైనీస్ భాషలోనూ మహా పండితులు. వీళ్ళు అనేక తంత్ర గ్రంధాలను వ్రాసి వాటిని ప్రచారంలోకి తెచ్చారు.

ఉదాహరణకు చూస్తే - సరహుడు బుద్ధకపాల తంత్రాన్నీ, చక్రసంవర తంత్రాన్నీ, లూయిపా సిద్ధుడు యోగినీ సంచర్యా తంత్రాన్నీ, కంబలుడూ సరోరుహుడూ హేవజ్రతంత్రాన్నీ, క్రిష్ణాచార్యుడు సంపుటతిలక తంత్రాన్నీ, కుక్కురి మహామాయా తంత్రాన్నీ, పిటాచార్యుడు కాలచక్ర తంత్రాన్నీ సృష్టించారని బౌద్ధ తంత్రాలు చెబుతున్నాయి. ఈ తంత్రాలలో అనేక మంది తాంత్రిక దేవతలు మనకు దర్శనమిస్తారు. వీరిలో చాలామంది ప్రస్తుతం మనకు హిందూమతంలో కూడా వివిధ రకాలైన పేర్లతో పూజింపబడుతూ ఉన్నారు.

ఈ దేవతలను సృష్టించిన బౌద్ధ గురువులందరూ క్రీ.శ. 600-800 మధ్యలో ఒరిస్సా బెంగాల్ ప్రాంతాలలో ఉన్న విహారాలలో బౌద్దాచార్యులు. వీరిలో చాలామంది హిందూకుటుంబాల నుంచి వచ్చిన బ్రాహ్మణులే. నేటి దేవతలూ పూజావిధానాలూ అన్నీ వీరి సృష్టే. వీరిలో సరోరుహ అనే ఆచార్యుడు గుహ్యసిద్ధి అనే తంత్రాన్ని ఆచరించాడు. ఇదే హిందూ తంత్రాలలో గుహ్యసమాజ తంత్రం, గుహ్యాతిగుహ్య తంత్రం అయింది. డోంబి హేరుకాచార్యుడు నైరాత్మ్యతంత్రాన్ని బోధించాడు. ఈయన నైరాత్మ్య యోగినీ సాధన, ఏకవీరా సాధన, గుహ్యవజ్ర తంత్రరాజ తంత్రం అనే గ్రంధాలను వ్రాశాడు. ఈ చివరి గ్రంధమే హిందూ తంత్రాలలో తంత్రరాజతంత్రంగా అవతరించింది. ఇందులోనే మనకు కురుకుళ్ళా దేవత వివరాలూ, చిన్నమస్తా దేవత వివరాలూ లభిస్తున్నాయి.

ఈ 'నైరాత్మ్య' దేవతే వేదాలలో ఉన్న 'నిఱ్ఱుతి' అనే దేవత అని తంత్రపరిశోధకుల అభిప్రాయం. దిక్కులలో నైరుతిదిక్కుకు ఈమె అధిష్టానదేవత. జ్యోతిశ్శాస్త్రంలో రాహువు ఈ దిక్కుకు అధిపతి గనుకా, ఈమె బౌద్ధ తంత్రాలలోని దేవత గనుకా బౌద్ధమతానికి రాహువు అధిదేవత అనే కారకత్వం మనకు జ్యోతిష్య గ్రంధాలలో ఇవ్వబడింది. అంతేగాక, కురుకుళ్ళా దేవత యొక్క కాళ్ళక్రింద రాహువు తొక్కబడుతూ ఉన్నట్లు మనం ఆమె చిత్రంలో చూడవచ్చు.అంటే ఈమె ఉపాసన పూర్వకర్మ యైన రాహువును తొక్కేస్తుందని అర్ధం. ఇలా దేవతల కాళ్ళక్రింద పడి తొక్కబడుతూ ఉన్నట్లు మనకు అనేక చిత్రాలలో అనేకమంది కనిపిస్తారు. అంటే ఆయా క్షుద్ర శక్తులను ఈ దేవతలు అణిచి పారేస్తారని అర్ధం.

ఉదాహరణకు నటరాజు కాళ్ళక్రింద ఒక చిన్నరాక్షసుడు తొక్కబడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఈ రాక్షసుడు బద్ధకానికి, అలసత్వానికి, లేదా శనీశ్వరునికి సూచిక. బద్దకాన్ని జయిస్తేనే కదా నాట్యాన్ని నేర్చుకోగలిగేది?  అలాగే దక్షిణామూర్తి కాళ్ళక్రింద కూడా ఒక రాక్షసుడు తొక్కబడుతూ ఉన్నట్లు మనం చూడవచ్చు. వీడు అజ్ఞానానికి సూచిక. అంటే అజ్ఞానాన్ని తొక్కేసి జ్ఞానాన్ని ఇస్తాడని దక్షిణామూర్తి స్వరూపానికి అర్ధం. అలాగే ఛిన్నమస్తాదేవి కాళ్ళక్రింద రతీమన్మధులు సంభోగంలో ఉన్నారంటే అర్ధం ఈ దేవతోపాసన కామాన్ని అణచిపారేస్తుందని, కామజయాన్ని అందిస్తుందని.

కామాన్ని జయించకుండా తంత్రసిద్ధి ఎన్నటికీ కలగదని ఎన్నోసార్లు ఇంతకు ముందే వ్రాశాను.

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 5 "

23, ఆగస్టు 2017, బుధవారం

సూర్యగ్రహణ ప్రభావం - లేస్తున్న పెద్దతలలు

సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన తర్వాత కొన్ని పెద్ద తలకాయలు లేవడం మామూలే. ఎందుకంటే సూర్యుడు అధికారులకు నాయకులకు సూచకుడు. సామాన్యంగా అయితే రాజకీయ నాయకులో అధికారులో లేచిపోతుంటారు. కానీ ఈ సారి ఈ ఫోకస్ రైల్వే మీదకు వచ్చింది.

అమావాస్యా, సూర్యగ్రహణమూ, రాహుకేతువుల రాశి మార్పూ జరిగిన నాలుగు రోజులలోపే రెండు పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి.

నిన్న రాత్రి, అంటే 23-8-2017 న తెల్లవారు ఝామున 2.55 గంటలకు ఉత్తర ప్రదేశ్ లో ఆచల్డా నుంచి డిల్లీ వెళ్ళే కైఫీయత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. దీనికి కారణం అది ఒక టిప్పర్ ను గుద్దుకోవడమే. ఈ టిప్పర్ రైల్వే ట్రాక్ మీదకు ఎలా వచ్చిందో తెలియదు.ఎంక్వయిరీలో తేలుతుంది అంటున్నారు. యధావిధిగా ఒక 70 మంది బాగా గాయపడ్డారు.

దీనికి బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డ్ చైర్మన్ ఏకే మిట్టల్ రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది టాప్ అఫిషియల్స్ కూడా లీవులో పంపబడ్డారు. ఇది డిసిప్లినరీ యాక్షన్ క్రిందకే వస్తుంది. మధ్య,క్రింది స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు.

ఈ చర్యల వల్ల జరిగిన నష్టం పూడిపోదు. కానీ సిస్టం లో భయం అనేది వస్తుంది. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పనిచెయ్యడం అలవాటౌతుంది. అయితే, ఇప్పుడు ఉద్యోగులు అలా పని చెయ్యడం లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

రైల్వే సిస్టం అనేది మిలిటరీ కంటే గట్టిది. మిలిటరీలో ఎప్పుడో గాని యుద్ధం రాదు. రైల్వేలో ప్రతి రోజూ యుద్ధమే. ప్రతిరోజూ టెన్షనే. ఎందుకంటే తెల్లారితే ఏరోజుకారోజే కొత్త. ప్రతిరోజూ సాయంత్రానికి అమ్మయ్య అనుకోవడం మళ్ళీ మర్నాడు టెన్షన్ తో నిద్ర లేవడమే రైల్వేలో సాధారణంగా జరిగేది.

అయితే ఈ మధ్యన రైల్వేలో పని గాడి తప్పిందనేది నిర్వివాదాంశం. మితిమీరిన, అర్ధంలేని బాసిజమూ, అందరూ నీతులు చెప్పడమే గాని ఆచరించేవారు ఒక్కరూ లేకపోవడమూ, ప్రతిదీ ఎదుటివాడి మీదో క్రిందవాడి మీదో తోసేసి చేతులు దులుపుకునే ధోరణీ, ఒక దారీ తెన్నూ లేని పనితీరూ, ఆచరణాత్మకం కాని టార్గెట్లూ, నిజమైన సమస్యను పై అధికారుల దృష్టికి తెస్తే పట్టించుకోకపోవడమూ, పరిష్కారం చూపకపోవడమూ, మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు ' మాకెందుకు చెప్పలేదు?' అనడమూ -- ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వేలో ఎన్నో ఎన్నెన్నో అవలక్షణాలున్నాయి.

రైల్వేలో ప్రధాన సమస్య ట్రాక్ మెయింటనెన్స్. కొత్తకొత్త లైన్లు వెయ్యకుండా, ఉన్న లైన్ల మీదే ప్రతి ఏడాదీ కొత్త కొత్త రైళ్ళు ప్రవేశపెడుతున్నారు. వాటి వేగాలు కూడా పెంచేస్తున్నారు. రోజుకు పది రైళ్ళు మాత్రమే నడవగలిగిన ట్రాక్ మీద ఇరవై రైళ్ళను కుక్కి కుక్కి నడిపిస్తున్నారు. ఈ మధ్యలో ట్రాక్ మెయింటనెన్స్ చెయ్యడానికి సమయం దొరకడం లేదు. అలా ట్రాక్ మెయింటనెన్స్ రెగ్యులర్ గా చెయ్యకపోతే ఏదో ఒకరోజున పట్టాలు విరిగో, బోల్టులు ఊడో, పెద్ద యాక్సిడెంట్ అవడం ఖాయం. అదే ఇప్పుడు జరుగుతున్నది.

మనిషికైనా మిషన్ కైనా మెయింటనెన్స్ అవసరం. రెస్ట్ ఇవ్వకుండా దానిని అదేపనిగా బాదుతూ ఉంటే ఏదీ ఎక్కువకాలం బ్రతకదు. కొన్నేళ్ళ క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో రైల్వే గూడ్స్ రవాణాలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెడుతున్నామంటూ CC+6+2 మరియు CC+8+2 అంటూ క్యారీయింగ్ కెపాసిటీ కంటే ఒక వ్యాగన్ కు రెండు టన్నులు ఎక్కువ లోడ్ చేసి ఒక్కసారిగా గొప్ప లాభాలు సంపాదించాం అని చంకలు చరుచుకున్నారు. కానీ ఈ చర్య వల్ల ట్రాక్ లైఫ్ స్పాన్ ఘోరంగా తగ్గిపోతుందని ఆనాడే నిపుణులు మొత్తుకున్నారు. ఎవరూ వినలేదు. ట్రాక్ లైఫ్ తగ్గిపోతే ఎక్కడికక్కడ రైల్ బ్రేకేజిలు, వెల్డ్ జాయింట్ బ్రేకేజిలు వస్తాయి. అప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం అదే జరుగుతున్నది.

రైల్వే వ్యవస్థలోని మౌలికమైన లోపం ఏమంటే - అసలైన సమస్యలను పట్టించుకోకుండా ఊరకే మీటింగుల మీద మీటింగులు పెట్టుకుని పేజీలకు పేజీలు JPO లు తయారుచేసి క్రిందవాళ్ళ మీద రుద్దడమే గాని అవి ఎంతవరకు ప్రాక్టికల్ అనే విషయం ఎవ్వరూ పట్టించుకోకపోవడమే. అంతేగాక అందినంత వరకూ ఆవునుంచి పాలు పిండుకుందామని ప్రయత్నమే గాని ఆ ఆవుకు తిండి సరిగ్గా పెడుతున్నామా దాని ఆరోగ్యం ఎలా ఉందో చూస్తున్నామా లేదా అనే విషయాన్ని ఎవ్వరూ గమనించడం లేదు.

ఒక పక్కన పంక్చువాలిటీ తగ్గకూడదు. ప్రతిరోజూ ఉదయం రైల్వే బోర్డు నుంచి మరీ ఈ పాయింట్ ను మానిటర్ చేస్తారు. ఏడాదికేడాది అదే ట్రాక్ మీద కొత్త కొత్త రైళ్ళు ప్రవేశపెడుతూ ఉంటారు. రైళ్ళు ఒకదాని వెంట ఒకటి క్రిక్కిరిసి నడుస్తూ ఉంటాయి. మధ్యలో ట్రాక్ మెయిన్టేనెన్స్ చెయ్యాలంటే వాటిని ఆపి, అంటే రైల్వే భాషలో చెప్పాలంటే ట్రాఫిక్ బ్లాక్ తీసుకుని, రైళ్ళను రెగ్యులేట్ చేసి, ఆ పని చెయ్యాలి. అది కుదరదు ఎందుకంటే అలా చేస్తే పంక్చువాలిటీ దెబ్బతింటుంది. ఎక్కువకాలం ఇలాగే సాగితే ట్రాక్ దెబ్బతింటుంది. అవ్వా కావాలి బువ్వా కావాలి. గిన్నెలో అన్నం గిన్నెలోనే ఉండాలి పిల్లాడి ఆకలి మాత్రం పూర్తిగా తీరాలి. ఒకపక్క పంక్చువాలిటీ, ఇంకో పక్క ట్రాక్ మెయింటేనెన్సూ రెండూ చెడకుండా సాగినంత కాలం సాగిద్దాం అనే ధోరణి టాప్ అధికారులది. విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్యలాగే ఇదీ ఉంటుంది. చివరకు ఏదీ తేలదు. ఈలోపల సిస్టం ఎక్కడో ఒకచోట బ్రేక్ అవుతుంది. ప్రస్తుతం జరిగిన ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ఇలాగే జరిగింది.

మౌలికమైన సమస్యలను పరిష్కారం చెయ్యకుండా పేరబెట్టుకుంటూ ఊరకే administrative jargon తో కాలక్షేపం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఇలాగే అవుతుంది మరి. మన దేశంలో ప్రాణాలకు విలువ ఎలాగూ లేదుకదా ! చూద్దాం మనవాళ్ళు దీన్నుంచైనా ఏవైనా పాఠాలు నేర్చుకుంటారో లేదో??
read more " సూర్యగ్రహణ ప్రభావం - లేస్తున్న పెద్దతలలు "

22, ఆగస్టు 2017, మంగళవారం

నిత్య జీవితం - 4

21-8-2017 నుండి 26-8-2017 వరకూ
----------------------------------------------

మన్మధ ప్రభావానికి లోకం అంతా దాసోహం అంటుంది.

లైంగిక పరమైన నేరాలు సమాజంలో ఎక్కువగా జరుగుతాయి.

వినోదాలు, విలాసాలు,విహార యాత్రలు ఎక్కువౌతాయి.

సక్రమ, అక్రమ సంబంధాలు ఊపందుకుంటాయి.
read more " నిత్య జీవితం - 4 "

21, ఆగస్టు 2017, సోమవారం

రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు

19-8-2017 న రాహుకేతువులు రాశులు మారారు. ఇప్పటిదాకా రాహువు సింహంలో ఉన్నాడు. ఇప్పుడు కర్కాటకంలోకి వచ్చాడు. కేతువు కుంభంలో నుంచి మకరంలోకి వచ్చాడు. ఈ మార్పు జరిగిన మూడు రోజులకే సూర్యగ్రహణం (ఈరోజు) వచ్చింది. సరిగ్గా రాహుకేతువుల మార్పు జరిగిన రోజే ఉత్కల ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగింది. ఇవన్నీ కాకతాళీయాలని తెలియని వాళ్ళు నమ్మితే నమ్మవచ్చు గాక. కానీ నేనలా నమ్మను. మేజర్ గ్రహాలైన శని, గురువు, రాహుకేతువులూ రాశులు మారేటప్పుడు ఖచ్చితమైన మార్పులు మానవ జీవితంలో కనిపిస్తాయి. దీనిని నేను ఎన్నో వందలసార్లు గమనించాను. మీరు కూడా గమనించండి. మొన్న 19 తేదీనుంచి మీమీ జీవితాలలో కూడా మార్పులు వచ్చే ఉంటాయి. లేదా వస్తూ ఉంటాయి. చూచుకోండి.

రాశులు మారిన ఈ రాహుకేతువులు ఈ రాశులలో ఒకటిన్నర ఏడాది పాటు అంటే ఫిబ్రవరి 2019 వరకూ ఉంటాయి. ఈలోపల ఇవి ఏయే ఫలితాలను ఇస్తాయో గమనిద్దాం.

మేషరాశి

ఉన్నట్టుండి మానసికంగా ఎనర్జీ పెరుగుతుంది. కొందరికైతే వారి వారి జాతకాలను బట్టి మనస్సు అల్లకల్లోలం అవుతుంది. కోపం పెరుగుతుంది. క్రూరత్వం పెరుగుతుంది. ఎక్సర్ సైజులు మొదలైనవి చేస్తారు. జిమ్ కు వెళతారు. ఇంకొందరికి కుటుంబాలలో రకరకాల మార్పులు గొడవలు మొదలౌతాయి.

వృషభరాశి

విపరీతమైన ధైర్యం పెరుగుతుంది. మాట దూకుడు ఎక్కువౌతుంది. కమ్యూనికేషన్ పరిధి పెరుగుతుంది. ఎక్కువైన ఎనర్జీతో కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకుంటారు. పూర్వకర్మ వేగంగా తగ్గడం మొదలౌతుంది.

మిధునరాశి

కంటిరోగాలు బాధిస్తాయి. మాట దురుసు పెరుగుతుంది. దానివల్ల గొడవలు వస్తాయి. ఇంటిలో పరిస్థితులు విషమిస్తాయి.

కర్కాటక రాశి

మనస్సు పరిపరివిధాలుగా పోతుంది. కంట్రోల్ ఉండదు. దగ్గరివారితో కూడా పెడసరంగా మాట్లాడతారు. దానివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

సింహరాశి

దీర్ఘరోగాలు తలెత్తుతాయి. ఆస్పత్రి పాలౌతారు. లేదా సందర్శిస్తారు. ఎక్కువమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. లేదా రాంగ్ ట్రీట్మెంట్ కు గురౌతారు.

కన్యారాశి

ఉన్నట్టుండి జీవితంలో వెలుగు కనిపిస్తుంది. అప్పటిదాకా దూరం పెట్టినవారు ప్రేమగా చూడటం మొదలు పెడతారు. అనుకున్న పనులన్నీ చకచకా కదులుతాయి. అనుకోకుండా సహాయాలు అందుతాయి. అయితే ఆరోగ్య సమస్యలు కూడా కొత్తవి తలెత్తి బాధించడం మొదలు పెడతాయి.

తులారాశి

అధికారం దర్పం ఎక్కువౌతాయి. మానవ సంబంధాలు విస్తరిస్తాయి. గర్వంతో ఇతరులకు హాని చేస్తారు. ఆ తరువాత చింతిస్తారు. ఇంటిలో చింతలు, ఆలస్యాలు ఎక్కువౌతాయి. మనస్సు డిప్రెషన్ లో పడుతుంది.

వృశ్చిక రాశి

తన చేతిలో ఏదీ ఉండదు. ఏదో శక్తి నడిపిస్తున్నట్లు అన్నీ తోసుకుని వస్తుంటాయి. మాటలో జంకు పెరుగుతుంది. అయితే మనసులో క్లారిటీ ఎక్కువౌతుంది. దేవాలయాలని, పుణ్యక్షేత్రాలని, గురువులని తిరుగుతారు. పూర్వకర్మ వేగంగా అనుభవానికి వస్తుంది.

ధనూరాశి

కష్టాలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు ఎక్కువౌతాయి. రోగాలు బాధిస్తాయి. మానసిక చింత పెరుగుతుంది. అయితే వృత్తిపరంగా మంచి సపోర్ట్ ఉంటుంది. దానితో అన్నింటినీ సమర్ధించుకోగలుగుతారు.

మకరరాశి

ఎనర్జీ లెవల్స్ ఉన్నట్టుండి పెరుగుతాయి. మానవ సంబంధాలు ఎక్కువౌతాయి. అయితే ఇతరుల నుంచి వత్తిళ్ళు, నష్టాలు కూడా కలుగుతాయి. ఆకస్మాత్తు ఖర్చులు కూడా పెరుగుతాయి.

కుంభరాశి

ఏడాదిన్నరగా బాధపెడుతున్న పరిస్థితులు క్లియర్ అయిపోతాయి. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు అదుపులోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. ఖర్చులు పెరుగుతాయి.

మీనరాశి

ఆధ్యాత్మిక చింతన ఒక్కసారిగా ఊపందుకుంటుంది. స్నేహితులు పెరుగుతారు. అకస్మాత్తు లాభాలు కలుగుతాయి. మంత్ర తంత్ర సాధనలు లాభిస్తాయి. మేధోపరమైన కార్యక్రమాలు ఎక్కువౌతాయి.

ఇవి ప్రస్తుతపు సూచనలు మాత్రమే. వచ్చే నెలలో 12-9-2017 న గురువుగారి రాశిమార్పుతో మళ్ళీ అందరి జీవితాలలో మార్పులు సంభవిస్తాయి. అప్పుడు ఎలాగూ మళ్ళీ వాటిని సూచిస్తాను. అంతవరకూ ఇవి చదువుకోండి.
read more " రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు "

20, ఆగస్టు 2017, ఆదివారం

ఉత్కళ ఎక్స్ ప్రెస్ ప్రమాదం - అమావాస్య ప్రభావానికి మళ్ళీ రుజువు

అమావాస్య ప్రభావం మళ్ళీ నిజమైంది. రేపు అమావాస్య. సరిగ్గా ఒక్కరోజు ముందు, శనివారం రాత్రి 11.55 కి ఉత్తర ప్రదేశ్ లో ఖతౌలి అనే స్టేషన్ దగ్గర పూరీ - హరిద్వార్ ఉత్కళ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. 24 మంది ప్రయాణీకులు చనిపోయారు. 156 మంది గాయపడ్డారు. వీళ్ళలో మళ్ళీ 14 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.

యధావిధిగా అందరూ సోషల్ మీడియాలో పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ నిజంగా తీసుకోవలసిన చర్యలు తీసుకుంటున్నారా? రెండు రోజుల తర్వాత షరా మామూలే అంటూ అన్నీ మర్చిపోయి ఇంకో న్యూస్ మీదకు వెళ్ళిపోతారా? మన ఇండియాలో ఇది మామూలేగా. ప్రతి ఏడాదీ వరదలు వస్తూనే ఉంటాయి. ఊళ్లు మునిగిపోతూనే ఉంటాయి. ప్రతి ఏడాదీ రైళ్ళు పడిపోతూనే ఉంటాయి. జనం చస్తూనే ఉంటారు. మనం మాత్రం ఎవడో ఒక చిరుద్యోగిని బకరాని చేసేసి, జనాల కంటి తుడుపుగా ఏవో నాలుగు స్టేట్మెంట్లు పారేసి ముందుకు సాగిపోతూనే ఉంటాం.

అధికారులు రాజుల్లా ఫీలై పోతూ వారివారి ఈగో కోటలలో కూచుని లెక్చర్లు ఇస్తున్నంత వరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. రియాలిటీని పట్టించుకోకుండా ఊహాలోకాలలో విహరిస్తున్నంతవరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు జనాన్ని మాయమాటలతో మభ్యపెడుతున్నంతవరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం? మన దేశం ఇంతే !! జ్యోతిష్య సూత్రాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రుజువౌతూనే ఉంటాయి.

It 'always' happens only in India. జైహింద్.
read more " ఉత్కళ ఎక్స్ ప్రెస్ ప్రమాదం - అమావాస్య ప్రభావానికి మళ్ళీ రుజువు "

19, ఆగస్టు 2017, శనివారం

ఛిన్నమస్తా సాధన - 3

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో మూడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకూ ఒక విచిత్రమైన యుగం నడిచింది. ఈ కాలవ్యవధిలోనే మన దేశంలో రకరకాల పురాణాలూ తంత్రాలూ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ బౌద్ధం యొక్క ప్రభావాన్ని తట్టుకోడానికి మనవాళ్ళు రచించి వ్యాసునికి ఆధర్ షిప్ తగిలించినవే గాని ఇవన్నీ వ్యాసుడే వ్రాశాడన్నది నిజం కాదు. ఎందుకంటే దాదాపు 1000 సంవత్సరాల కాలవ్యవధిలో వ్రాయబడిన అన్ని రచనలూ ఒకే వ్యక్తి వ్రాయడం ఎలా సంభవం? ఆయనెంత చిరంజీవి అనుకున్నా సరే??

'వశిష్టుడు' అన్నది ఎలాగైతే ఒక వ్యక్తి కాకుండా రఘువంశపు రాజులకందరికీ కులగురువైన ఒక పదవో అలాగే 'వ్యాసుడు' అన్నది కూడా ఒక వ్యక్తి కాదని నా అభిప్రాయం. సాధారణంగా మనం అనుకునేటట్లు పద్దెనిమిది పురాణాలనూ పద్దెనిమిది ఉపపురాణాలనూ వ్రాసినది ఒకే వ్యాసుడనేది నిజం కాదనీ, అవి దాదాపు వెయ్యి సంవత్సరాల కాలవ్యవధిలో వ్రాయబడినవనీ అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. నేనూ ఈ భావనను విశ్వసిస్తాను. ఎందుకంటే మనం మతపిచ్చికి లోనైతే మూఢనమ్మకాల వలలో పడిపోతాం. చాదస్తంగా తయారౌతాం. నాకది ఇష్టం లేదు. అందుకే నేను వాస్తవిక దృక్పధాన్నే అనుసరిస్తానుగాని హిందూత్వంలో ఉన్న అన్ని భావనలూ నిజాలే అని మూర్ఖంగా నమ్మను.

ఇదే వాస్తవిక భావనను కొంచం పొడిగిస్తే మనకు ఒక విషయం అర్ధమౌతుంది. తంత్రములు అన్నవి కాలక్రమేణా ఆ తరువాత వచ్చిన భావనలేగాని వేదాలలో ఉన్న భావనలు కావు. ఎందుకంటే వేదకాలపు దేవతలు వేరు, తాంత్రిక దేవతలు పూర్తిగా వేరు. ఈ రెండు వర్గాలకూ హస్తి మశకాంతరం ఉన్నది. ఒక విధంగా చూస్తే, తంత్రాలనేవి వేదాలమీద ఒక విధమైన తిరుగుబాటుతో వ్రాయబడిన గ్రంధాలని నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయానికి రుజువులను ముందుముందు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో సంచలనాత్మక నిజాన్ని చెబుతాను.

పురాణాలూ తంత్రాలూ కూడా బౌద్ధం యొక్క ప్రభావం నుంచి హిందూ సమాజాన్ని బయటకు లాగడానికి ఉద్దేశించి అనేక రకాలైన కట్టు కధలతో కల్పించి వ్రాయబడినవే తప్ప వాటిలో అంతా నిజం కాదు. అయితే అన్నీ అబద్దాలు కూడా కావు. వీటిల్లో చరిత్రా, వాస్తవమూ, కల్పనా, పిట్టకధలూ, ప్రాంతీయ సంఘటనలూ అన్నీ కలగా పులగంగా మనకు కనిపిస్తాయి. దీనిక్ తోడుగా, సంస్కృతం కొద్దిగా వచ్చిన ప్రతివాడూ వాడికి తోచిన/నచ్చిన కధ వ్రాసేసి ఆయా పురాణాలలో ఎక్కడ బడితే అక్కడ ఇరికించి పారేశాడు. అందుకే మన పురాణాలు అతుకుల బొంతల్లాగా కనిపిస్తాయి గాని వాటిల్లో చారిత్రక వాస్తవాలు కరెక్ట్ గా మనకు ఎక్కడా దొరకవు. అందుకే, పురాణాలను అనుసరించి చరిత్రను తిరగ వ్రాయాలని సంకల్పించిన అనేకమంది పరిశోధకులు బోర్లా పడ్డారు.

అసలు తంత్రం అనేది బుద్ధుని సృష్టి అనేది నా ప్రగాఢ విశ్వాసం.ఆధ్యాత్మిక పరంగా చూస్తే, బుద్దుని జన్మ అనేది మన దేశంలో జరిగిన మహత్తరమైన సంఘటనల్లో ఒకటి. ప్రాచీన కాలంలో ఆయన ప్రభావం ఎంత గట్టిగా లోతుగా ఉందంటే, ఆయనకు అవతారం అన్న స్టేటస్ ను బలవంతంగా (ఇష్టం లేకపోయినా సరే) ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది మనవాళ్ళకి.

బుద్ధుడు తన వద్దకు ఉపదేశం కోసం వచ్చిన వారికి అందరికీ ఒకే విధమైన బోధను ఇవ్వలేదు. ఆయా వ్యక్తుల పరిణతిని బట్టి ఆయన బోధలు రకరకాలుగా ఉండేవి. కానీ వాటిల్లో అంతర్గతంగా ఒకటే ఫ్లేవర్ ఉండేది. ఆయన తరచుగా ఇలా అనేవాడు.

'సముద్రంలో నీటిని ఎక్కడ రుచి చూచినా ఉప్పగానే ఉన్నట్లు, నా బోధలు ఎక్కడ మీరు చూచినా ఒక రకంగానే ఉంటాయి.'

తన వద్దకు వచ్చిన మామూలు మనుషులకు (గృహస్థులకు) ఆయన ఒక విధమైన పైపైని బోధనలు చేసేవాడు. ఇవి కాలక్రమేణా మహాయానంగా రూపుదిద్దుకున్నాయి. అర్హులైన కొందరు సాధకులకు మాత్రం ఆయన తను అనుసరించిన సాధనా మార్గాన్ని బోధించాడు. అది హీనయానం అయింది. ఇంకా తీవ్ర అర్హత ఉన్న అతి తక్కువమందికి మాత్రం ఆయన అసలైన సాధనా విధానాలను బోధించాడు. అది వజ్రయానంగా రూపుదిద్దుకుంది. ఈ వజ్రయానమే తంత్రం. ఈ బోధనలు చాలా విప్లవాత్మకములే గాక అతి తక్కువ కాలంలో సిద్ధిని కలిగించేవిగా ఉండేవి. అయితే వీటిని పాటించడానికి అందరికీ అర్హతలు ఉండేవి కావు.

క్రీస్తు పూర్వమే హీనయానం అనేది శ్రీలంక, బర్మా, థాయిలాండ్ మొదలైన దేశాలకు విస్తరించింది. దీనిని దక్షిణమార్గం అంటారు. అంటే భారతదేశం నుంచి దక్షిణంగా ఇది పయనించింది. దీనికి విభిన్నంగా చైనా, మంగోలియా, జపాన్, కొరియా మొదలైన దేశాలకు మహాయానం విస్తరించింది. ఇది ఉత్తరమార్గం అయింది. మహాయానాన్ని ప్రచారంలోకి తెచ్చినవాడు ఆచార్య నాగార్జునుడు. ఈయన మన తెలుగువాడే. గుంటూరు జిల్లా వాడే. ఈయన్ను కొందరు 'రెండవ బుద్ధుడు' అని గౌరవంగా పిలిస్తే, అసలైన బౌద్దాన్ని నాశనం చేసిన వ్యక్తిగా మరి కొందరు తలుస్తారు. ఈ ఉత్తర దక్షిణ మార్గాలు కాకుండా మూడో మార్గం అయిన తంత్రం క్రీ.శ. ఏడో శతాబ్దంలో నేపాల్, టిబెట్ లకు విస్తరించి బాగా వేళ్ళు పాతుకుంది. దీనిని వాళ్ళు వజ్రయానం అన్నారు. ఈ వజ్రయానంలో అనేక మంది దేవతలు సృష్టింపబడ్డారు. వారిలో ఒక్కరే ఈ చిన్నమస్త/ చిన్నముండ అనే దేవత.

బౌద్ధంలో ఉన్న ఈ దక్షిణ, ఉత్తర, తంత్ర, మార్గాలనే హిందూతంత్రాలు కాపీ కొట్టి దక్షిణాచారం, వామాచారం, సమయాచారం అని పిలిచాయని నా నమ్మకం. ఎందుకంటే దక్షినాచారం శుద్ధమైన మార్గమని నమ్మిక. అలాగే దక్షిణమార్గం అయిన హీనయానం/ ధేరావాదం అనేది బుద్దుడు అనుసరించిన అసలైన పధం. ఇక వామాచారం అనేది భయాన్నీ అసహ్యాన్నీ కలిగించే అనేక తంతులతో నమ్మకాలతో కూడిన విధానం. వజ్రయానం కూడా (సరిగ్గా అర్ధం కాకపోతే) దాదాపు అలాంటిదే. ఇక మహాయానమూ సమయాచారమూ దగ్గర దగ్గరగా ఉంటాయి. కనుక మన తంత్రాల భాషకూ విధానాలకూ బౌద్ధ తంత్రాలకూ దగ్గరి సంబంధం ఉన్నదని నేను నమ్ముతాను. అంతేగాక, ఈ రెంటిలో బౌద్ధ తంత్రాలే ప్రాచీనమైనవని కూడా నా విశ్వాసం.

ఉదాహరణకు - హిందూ తంత్రాలలో ఒకటైన శ్రీవిద్యాతంత్రంలో భాగమైన  శ్రీచక్ర పూజలో నాలుగు ఆవరణలతో కూడిన త్రైలోక్య మోహనచక్రం లోని దేవతలలో బుద్ధుడు కూడా ఒకడు. ఆ ప్రాకార పరిక్రమలో ఒకచోట ఆయన్ను 'ఓం బుం బుద్ధాయ నమ:' అన్న మంత్రంతో పూజిస్తాము. అంటే శ్రీవిద్యకంటే బుద్ధుడు ప్రాచీనుడే అనే కదా అర్ధం !! కాకపోతే మన పండితులు ఈ మంత్రంతో పూజింపబడేది బుద్ధుడు కాదనీ 'బుద్ధి' అనే దేవతనీ వక్రభాష్యాలు చెబుతారు. అది వేరే సంగతి !!

కానీ అదే నిజమైతే ఆ మంత్రం 'ఓం బుద్ధ్యై నమ:" అని ఉండాలిగాని 'ఓం బుద్ధాయ నమ:' అని ఉండకూడదు మరి. కనుక ఈ మంత్రంలో చెప్పబడినది బుద్ధుడే అన్నది నిజం !! శ్రీవిద్యకు కూడా బుద్ధుడే మూలప్రేరణ అనేది కూడా నేడు మన పండితులు ఎవరూ ఒప్పుకోని పచ్చి నిజం !! నేనీ మాట అన్నందుకు చాలామంది సనాతన హిందూవాదులకు కోపాలు రావచ్చు. కానీ ఎవరికో కోపాలు వస్తాయని నేను నిజాలు చెప్పకుండా ఆత్మద్రోహం చేసుకోలేను.

సరే ఆ సంగతి అలా ఉంచుదాం.

ఈ తంత్రాల రచనా కాలమంతా క్రీ.శ.మూడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకూ అని ముందే చెప్పాను. ఈ సమయంలోనే తక్షశిల నలందా విశ్వవిద్యాలయాలు ఒక వెలుగు వెలిగాయి. వాటిల్లో - ఆర్యదేవుడు, అతిశ దీపాంగారుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి, దిన్నాగుడు, నాగార్జునుడు, శైలభద్రుడు మొదలైన బౌద్ధవిజ్ఞానులు ఆచార్యులుగా ఉండేవారు. ఈ కాలంలోనే, ముఖ్యంగా పాల, శైలేంద్ర సామ్రాజ్యాల కాలంలో బీహార్లో అనేక బౌద్ధతంత్రాలు వ్రాయబడ్డాయి. వాటికి పోటీగా హిందూ తంత్రాలు - శైవ, వైష్ణవ, శాక్త సాంప్రదాయాలలో వ్రాయబడ్డాయి.మేమూ తక్కువ తినలేదని అనేక పురాణాలు కూడా ఈ సమయంలోనే వ్రాయబడ్డాయి. దేవతలందరూ ఒక సాంప్రదాయంలోనుంచి ఇంకొక సాంప్రదాయంలోకి తీసుకోబడి, ఆయా మార్గాలకు తగినట్లుగా మార్పులు చేర్పులు చెయ్యబడ్డారు. పనిలో పనిగా శరభసాళువం, గండభేరుండం, మొదలైన కొత్త కొత్త దేవతలూ సృష్టింపబడ్డారు. ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకున్నట్టు ఈ గోల అంతా సాగింది.

నేడు మనం పూజిస్తున్న అనేకమంది దేవీదేవతలు ఈ సమయంలోనే ఆయా ప్రముఖ బౌద్ధ, హిందూ పండితుల చేత సృష్టింపబడ్డారు. అందుకే దీనిని పురాణయుగం అంటారు. అంతకు ముందరి వేదకాలంలో ఈ దేవతలెవ్వరూ నేడు మనం చూస్తున్న రూపాలలో లేరు. ఈ దేవతలలో కొందరి పేర్లు వేదాలలో ఉంటె ఉండవచ్చుగాక కానీ నేడు మనం చూస్తున్న రూపాలలో మాత్రం వారు అప్పటికి లేరు.

చిన్నమస్త అనే తాంత్రిక దేవత చిన్నముండగా బౌద్ధంలో దాదాపు ఏడో శతాబ్దం నుంచే ఉన్నట్లు ఆధారాలున్నాయి. కానీ హిందూతంత్ర గ్రంధాలైన శాక్తమహా భాగవతం, ప్రాణతోషిణి తంత్రం, ముండమాలా తంత్రం, గుహ్యాతిగుహ్య తంత్రం, స్వతంత్ర తంత్రం మొదలైనవన్నీ పదో శతాబ్దం నాటివి లేదా ఆ తరవాతవి కావడంతో ఈ దేవత ముందుగా బౌద్ధంలో ఉన్న దేవతేననీ, అక్కడ నుంచి హిందూమతంలోకి దిగుమతి అయిందనీ ప్రొ. భట్టాచార్య, తారానాధ్ వంటి తంత్ర పరిశోధకులు నిర్ధారించారు. కనుక ఈమె ప్రాధమికంగా ఒక బౌద్ధ తాంత్రిక దేవత అనేది నిర్వివాదాంశం.

బౌద్ధ హిందూ తంత్రాలలో ఆమె వర్ణన ఎలా ఉందో, బౌద్ధంలో నుంచి హిందూ తంత్రంలోకి దిగుమతి అయినప్పుడు ఈమె మంత్రాలూ ఆకారాలూ ఉపాసనా విధానాలూ ఎలా మార్పులకు గురయ్యాయో గమనిద్దాం.

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 3 "

18, ఆగస్టు 2017, శుక్రవారం

ఛిన్నమస్తా సాధన - 2

ఈ పోస్ట్ మొదటి భాగం చదివాక అమెరికా నుంచి ఒక శిష్యురాలు నాతో ఫోన్లో మాట్లాడుతూ 'అదేంటి పాటలూ లైట్ టాపిక్స్ నడుస్తుండగా ఉన్నట్టుండి మళ్ళీ తంత్రం మీద వ్రాస్తున్నారు?' అనడిగింది.

'అవన్నీ  బయటకు కనిపించేవి. లోపల సరస్వతీ నదిలా నిత్యం ప్రవహించేది ఆధ్యాత్మికమే.' అని చెప్పాను.

కానీ ఈ టాపిక్ ఇప్పుడు వ్రాయడానికి ఒక కారణం ఉన్నది. అదేమిటో ఇప్పుడు చెబుతాను.

రెండురోజుల క్రితం నాకు ఒక ఫోనొచ్చింది. యధావిధిగా పరిచయాలయ్యాక ఆయన సరాసరి సబ్జెక్ట్ లోకి వచ్చాడు.

'నేను మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను. మీ ప్రొఫైల్ కూడా చూచాను. మీకు తంత్రం తెలుసని దానివల్ల అర్ధమైంది. మీకు తంత్రంలో ఏ దేవతాసిద్ధి ఉన్నదో తెలుసుకోవచ్చా?'

నేనూ సూటిగానే మాట్లాడుతూ - 'అలా తెలుసుకున్నందువల్ల మీకేంటి ఉపయోగం?' అన్నాను.

'మాకు దానితో పని ఉంది. మీకు ఏ సిద్ధి ఉన్నదో చెబితే మా పని గురించి చెబుతాము' అన్నాడు.

'అది నా పర్సనల్ విషయం. దానిని మీకు చెప్పవలసిన పని నాకు లేదు.మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి.' అన్నాను.

'సరే వినండి. నల్లమల అడవులలో ఒకచోట నిధి ఉన్నదని మాకు కాన్ఫిడెన్షియల్ గా తెలిసింది. చాలా నమ్మకమైన ఇన్ఫర్మేషన్. ఆ నిధిని మీరు తీసి మాకు ఇవ్వాలి. అలా చెయ్యాలంటే ఛిన్నమస్తాన్ అనే దేవత సిద్ధి ఉన్నవారే చెయ్యగలుగుతారని, మామూలు మంత్రగాళ్ళు చెయ్యలేరని మాకు తెలిసింది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఈ సహాయం మాకు చేస్తారా?' అడిగాడు.

'వీడి బొందలా ఉంది. చిన్న మస్తాన్ ఏమిట్రా నీ మొహం. విషయం తెలీదుగాని దురాశ మాత్రం చాలా ఉంది వీడికి' అని మనసులో అనుకుని ' ఆమె చిన్న మస్తాన్ కాదు. ఛిన్నమస్త అనే దేవత' అన్నాను.

'సరే ఏదో ఒకటి. ఏదైతే మాకెందుకు? మాకు నిధి కావాలి. మీరు తీసి ఇవ్వగలరా?' అన్నాడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ.

'చెయ్యగలను. డీల్ చెప్పండి.' అన్నాను.

'నిధిలో 25% మీకు. 75% మాకు.' అన్నాడు.

'మాకు అంటున్నారు. మీ గ్రూపులో ఎంతమంది ఉన్నారు?' అడిగాను.

'అది మీకెందుకు? అయినా అడిగారు గాబట్టి చెబుతున్నాను. మా గ్రూపులో ఆరుగురం ఉన్నాం. ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్.పీ కూడా మాలో ఉన్నారు.' అన్నాడు.

'నాకు మీ ఆఫర్ నచ్చలేదు. ఎందుకంటే నిధి విలువ వందల కోట్లలో ఉంటుంది. వేల కోట్లు కూడా ఉండవచ్చు. చెప్పలేము. ప్రాణాలకు తెగించి దానిని తియ్యాలి. నల్లమల అడవులలో అంటున్నారు. అంటే ఏ విజయనగర రాజుల కాలందో అయి ఉంటుంది. అందులో ఉన్న వజ్ర వైడూర్యాలను బట్టి దాని విలువ ఎంతైనా ఉండవచ్చు. నాకు 50% ఇస్తే ఆలోచిస్తా' అన్నాను.

'అంతా మీకే ఇస్తే ఇక మాకేం మిగుల్తుంది? అయినా మీకొక్కరికే అంతెందుకు? 25% మీకు చాలా ఎక్కువ.' అన్నాడు.

'మీకర్ధం కావడం లేదు. మామూలు మంత్రగాళ్ళు ఈ పనిని చెయ్యలేరని మీరే అన్నారు. అంటే ఆ నిధికి కాపలాగా బలమైన శక్తులు ఉన్నాయని మీకు తెలుసు. అవి ఎన్నో, ఎంత శక్తివంతమైనవో మీకు తెలీదు. వాటిని నేను తట్టుకుని మీకా నిధిని తీసి ఇవ్వాలి. రిస్క్ నాకే ఎక్కువ. ప్రాసెస్ మధ్యలో ఏదైనా అయితే నాకే అవుతుంది గాని మీకేం కాదు. మీరంతా సేఫ్ గా ఉంటారు. కాబట్టి నా డీల్ కు మీరు ఒప్పుకుంటే చేస్తా' అన్నాను.

'కుదరదండి. మీకిష్టమైతే మా డీల్ ఒకే చెయ్యండి. పని మొదలు పెడదాం. లేదంటే మేం వేరే వాళ్ళను వెతుక్కుంటాం. మాకు తెలిసిన ఇంకొక స్వామీజీ ఉన్నాడు. ఆయనా చిన్నమస్తా ఉపాసకుడే. మీకంటే ఎక్కువ శక్తిగలవాడు. ఈ మధ్యనే మావాళ్ళలో ఒకరికి కాన్సర్ వస్తే ఆయన హోమం చేసి తగ్గించాడు. ఆయన్ను పట్టుకుంటాం.' అన్నాడు.

'ఓకే ఆయన దగ్గరికే వెళ్ళండి. నేను చెయ్యను.' అని చెప్పేశాను.

'లైఫ్ టైం చాన్స్ మిస్ అవుతున్నారు మీరు' అన్నాడు.

'పరవాలేదు. నా లైఫ్ లో నేను కొత్తగా మిస్ అయ్యేది ఏమీ లేదు. ఏది పొందాలో అది పొందాను చాలు. నేను మీకు మొదట్లోనే చెబుదామని అనుకున్నాను. తంత్రసిద్ధిని ఇలాంటి పనులకు వాడకూడదు. అది అసలైన సిద్ధికి సంకేతం కాదు. మీరు 100% వాటా ఇచ్చినా నేనిలాంటి పనులు చెయ్యను. కానీ మీనుంచి విషయం మొత్తం తెలుసుకుందామని అలా చెప్పాను. దయ్యాలు వదిలించడం, నిధులు తియ్యడం, రోగాలు తగ్గించడం, పనులు సాధించడం వంటి క్షుద్ర ప్రయోజనాలకు నేను నా సిద్ధిని వాడను. వాడలేను. అలాంటి పనులకు మీరు చెప్పిన లాంటి స్వామీజీలు ఉంటారు. వారి వద్దకు వెళ్ళండి. సారీ.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది ఇదే భ్రమలో ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి కొంత సాధన చేసి సిద్ధిని సంపాదిస్తే ఇక ఆ మనిషి చుట్టూ చేరి వారి గొంతెమ్మ కోరికల చిట్టా విప్పుతూ ఉంటారు. ఇది దురాశకు సంకేతం గాని ఇంకేమీ కాదు. ఇలాంటి వాటికి తంత్రశక్తులను పొరపాటున కూడా వాడకూడదు.

ఇలాంటి మనుషుల లాజిక్ ఏమంటే - ' మీరు కష్టపడి సిద్ధిని సాధించారు. దానిని మీలోనే దాచుకుంటే ఉపయోగం ఏముంది? నలుగురికీ పంచినప్పుడే కదా దాని ఉపయోగం?' అంటారు.

అలాంటి దురాశా పరులకు నేను ఇలా జవాబిస్తూ ఉంటాను.

'నిజమే మీరు చెప్పింది. ముందు మీరు పాటించి తర్వాత నాకు చెప్పండి. ముందు మీ ఆస్తినంతా అందరికీ పంచేసి ఆ తర్వాత నా దగ్గరకు రండి. అప్పుడు నేను కూడా నా సిద్ధిని మీకు పంచుతాను. మీది మీ దగ్గరే ఉండాలా? నేను మాత్రం నా సిద్ధిని అందరికీ తేరగా పంచాలా? మీ లాజిక్ చాలా బాగుంది.'

'తేరగా పంచమని మేము చెప్పడం లేదు. మీకూ ఉపయోగం ఉంటుంది కదా? డబ్బు తీసుకొని పని చేసి పెట్టండి.'

'మీరు ప్రతిదాన్నీ 'డబ్బు' అనే కోణంలో మాత్రమే చూస్తున్నారు గనుక మీకు అలాగే ఉంటుంది. నా కోణం అది కాదు. సాధనా సిద్ధిని వాడి డబ్బు సంపాదించవలసిన ఖర్మ నాకు లేదు. పైగా ప్రతివారి పాపఖర్మలో పాలుపంచుకుని వారికి తేరగా ఆ బాధలు పోగొట్టే అవసరం నాకు లేదు. ఎవరికి నా నిజమైన సహాయం అవసరమో నాకు తెలుసు. వారికి మాత్రమే అది చేస్తాను. మీక్కావలసిన పనులు చేసే చీప్ మంత్రగాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కలవండి. నిజమైన తంత్రం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే మాత్రమే నా దగ్గరకు రండి.' అని వాళ్ళతో చెబుతూ ఉంటాను. ఆ దెబ్బతో వాళ్ళు పత్తా లేకుండా పారిపోతూ ఉంటారు.

దీనిలో ఇంకో కోణం కూడా ఉంటుంది.

సాధారణంగా ఇలాంటి నిధుల వేటగాళ్ళు క్రిమినల్స్ అయి ఉంటారు. వీరికి ఫారెస్ట్ దొంగలతోనూ, మాఫియాలతోనూ సంబంధాలు ఉంటాయి. ఇలాంటి పనులు అడవులలో, పాడుబడిన కోటలలో అర్ధరాత్రి పూట చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి క్రిమినల్స్ చెప్పే మాటలను మంత్రగాళ్ళు నమ్మరాదు. ఎందుకంటే వీరికి నీతీనియమాలు ఉండవు. వాటా ఎగరగొట్టడం కోసం, పని అయ్యాక ఆ మంత్రగాడిని అక్కడే చంపేసి ఆ అడివిలోనే పూడ్చేసిన సంఘటనలు నాకు కొన్ని తెలుసు. వీరికి రాజకీయ అండదండలూ, పోలీస్ పలుకుబడీ ఉంటాయి గనుక ఆ నేరాలు బయటకు రావు. కనుక ఇలాంటి వాళ్ళను నేను త్వరగా నమ్మను.

ఇది ఈ మధ్యనే జరిగిన సంఘటన. ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు చాలా వస్తూ ఉంటాయి.

దశ మహావిద్యలనేవి 'పనులు' కావడం కోసం ఉపయోగించే పొట్టకూటి విద్యలనే పొరపాటు అభిప్రాయాన్ని నేటి చాలామంది గురువులు పెంచి పోషిస్తూ ఉన్నారు. తెలీనివాళ్ళు నమ్ముతున్నారు. ఈ రకంగానే హిందూతంత్రం భ్రష్టు పట్టిపోయింది. తంత్రం యొక్క పరమ ప్రయోజనం అది కాదు.

అసలైన తంత్రం ఏమిటో, అసలైన ఛిన్నమస్తా సాధన ఏమిటో చెప్పాలన్న నా ఊహకు, ఈ మధ్యన జరిగిన ఈ సంఘటనే ఆధారం. అందుకే ఈ సీరీస్. ఇక ముందుకెళదామా మరి?

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 2 "

17, ఆగస్టు 2017, గురువారం

ఛిన్నమస్తా సాధన - 1

ఈరోజుల్లో సూడో తాంత్రిక్ సర్కిల్స్ లో ఎక్కువగా వినబడుతున్న దేవత పేరు ఛిన్నమస్తాదేవి. ఈమె పేరు మీద నేడు చాలా మోసం జరుగుతున్నది. కొంతమంది దొంగస్వాములు తాము ఈ దేవి ఉపాసకులమని చెప్పుకుంటూ యధేచ్చగా పిచ్చిజనాలని మోసం చేస్తున్నారు. అందుకని ఈ దేవత ఉపాసన వెనుక గల నిజానిజాలను వ్రాయాలని అనుకున్నాను.

అసలు తంత్ర ప్రపంచమే పెద్ద మోసం. అసలైన తంత్రం ఏమిటో చాలామంది సోకాల్డ్ తాంత్రిక గురువులకు ఏమాత్రం తెలియదు. పనులు కావడం కోసం హోమాలు చెయ్యడమే తంత్రమని వీరి ఉద్దేశ్యం. కాషాయాలు ధరించి తిరిగే ఇలాంటి దొంగస్వాములను చూస్తుంటే నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తూ ఉంటుంది. వీళ్ళ అజ్ఞానానికి జాలీ కలుగుతూ ఉంటుంది. ఒకపక్కన సర్వసంగ పరిత్యాగులమనీ పరమహంసలమనీ చెప్పుకుంటూ ప్రచారాలు చేయించుకుంటూ ఉంటారు, మళ్ళీనేమో - 'ఫలానా పని తేలికగా కావాలంటే ఫలానా హోమం చెయ్యండి. దానికి ఇంత ఖర్చౌతుంది' అని బేరాలు నడుపుతూ ఉంటారు. ఇదేరకం సన్యాసమో నాకైతే ఎంతకీ అర్ధం కాదు. 

అలాంటి దొంగస్వాములను వారి ఖర్మకు వారిని వదిలేసి మనం విషయం లోకి వద్దాం. ఛిన్నమస్తాదేవి ఉపాసనలో నిజానిజాలు తెలియాలంటే మనం చరిత్రలోకి కొంచం తొంగి చూడాలి.

చరిత్ర పరిశోధకుల ప్రకారం హిందూ తంత్రమూ బౌద్ధ తంత్రమూ కవలల్లాగా పక్కపక్కనే పుట్టినప్పటికీ, వీటిలో బౌద్ధ తంత్రమే ప్రాచీనమైనది మరియు నిజాయితీ కలిగినట్టిది. హిందూతంత్రం చాలా త్వరగా భ్రష్టు పట్టింది. కానీ బౌద్ధ తంత్రం ఇప్పటికీ నిజాయితీగా బ్రతికే ఉన్నది. అయితే మనం బౌద్ధాన్ని మన దేశం నుంచి వెళ్ళగోట్టేశాం గనుక  ప్రస్తుతం అది టిబెటన్స్ లో మాత్రమె జీవించి ఉన్నది. దాన్ని వాళ్ళు వజ్రయానం అని పిలుస్తారు.

ఛిన్నమస్తాదేవికీ బౌద్ధతంత్రానికీ ఏమిటి సంబంధం? అని మీరు నన్ను అడుగవచ్చు. సంబంధం ఉన్నది. దశమహావిద్యలని మనం నేడు పిలుస్తున్న దేవతలందరూ నిజానికి బౌద్ధతంత్రం నుంచి మనకు దిగుమతి అయిన వారే. వీరెవరూ హిందూ దేవతలు కారు. ఎందుకంటే వేదాలలో వీరి ప్రసక్తి లేదు. ఒకవేళ అక్కడక్కడా 'లక్ష్మి' వంటి దేవతలు వేదాలలో ఉన్నప్పటికీ వాళ్ళ ప్రస్తావన సూటిగా లేకుండా ఒక చిన్నపాటి ప్రస్తావనగా మాత్రమె ఉన్నది. అంతేగాక ఈ తాంత్రిక దేవతలే ఆ వేదాలలో ఉన్న దేవతలు, వాళ్ళూ వీళ్ళూ ఒకటే అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా అస్సలు వీలు కాదు. ఎందుకంటే మనం పురాణకాలంలో సృష్టించుకున్న దేవతలను వేదాలలో ఉన్న దేవతల పేర్లతోనూ, వేదసూక్తాలలో ఉన్న దేవతల పేర్లతోనూ అతుకులు పెట్టి రకరకాల బొంతలు కుట్టాం. ఆ బొంతలే నేటి పాపులర్ హిందూ మతమూ దానిలోని దేవతలూను. అంతే తప్ప నేటి దేవతలలో ఎవరూ వేదాలలో లేరు.

అసలు మన హిందూ మతం అనేది పెద్ద కలగూర గంప లాంటిది. ఇందులో తోటకూర, బచ్చలికూరా, కరివేపాకూ, కొత్తిమీరా వంటి ఆకుకూరలేగాక దోసకాయలూ, బెండకాయలూ, దొండకాయలూ వంటి రకరకాల కూరగాయలే గాక చేపలూ, కోళ్ళూ, కొక్కిరాయిలూ మొదలైన మాంసాహారాలు కూడా చక్కగా లభిస్తాయి. ఇవిగాక ఎప్పటికప్పుడు కొత్త కొత్త పంటలు పండించి కొత్తకొత్త కూరగాయలు సృష్టించి మరీ మనం వండుకుని తింటూ ఉంటాం. హిందూమతంలో ఎవరికిష్టమైన తిండి వారు తినవచ్చు. మిగతా మతాలలో అలా కాదు. వాటిల్లో ఒక్క కూరే తినాలి. అదికూడా అమ్మేవాడు అమ్మినదే కొనుక్కోవాలి. దానినే తినాలి. తినేవాడికి చాయిస్ ఉండదు.

'నీకిష్టం వచ్చిన తిండి నువ్వు తినరా బాబూ ఏది తిన్నా నీ ఆకలి తీరుతుంది' - అని మన మతం చెబుతుంది. మిగతా మతాలేమో - 'అలాకాదు. మేము చెప్పిన తిండి తింటేనే నీ ఆకలి తీరుతుంది. నీ ఇష్టం వచ్చిన తిండి నువ్వు తినకూడదు' అని ఆంక్షలు పెడతాయి. ఒకవేళ నువ్వు అలా తినకపోతే ' నువ్వు సైతాన్ అనుచరుడివి' అని ముద్రవేసి నిన్ను చంపి పారేస్తాయి. అదీ వారికీ మనకూ తేడా.

ప్రస్తుతం మనం కొలుస్తున్న వెంకటేశ్వరస్వామి, వినాయకుడు, రకరకాల అమ్మవార్లు,రాముడు, కృష్ణుడు, ఆంజనేయస్వామి, అయ్యప్పస్వామి మొదలైన దేవతలలో ఎవరికీ వేదప్రామాణికత లేదు. అసలు నేటి పాపులర్ దేవతలెవరూ వేదాలలో లేనేలేరు.వీరందరూ పురాణకాలంలో పుట్టుకొచ్చారు. రకరకాల కట్టుకధలూ పిట్టకధలూ అల్లడం ద్వారా వారికి వేదాలతో లింకును తర్వాత తీసుకొచ్చుకున్నాం మనం. నిజం చెప్పాలంటే మన దేవతలలో చాలామంది మనం కల్పించుకున్నవారే. నిజం చెప్పాలంటే, వీరిలో చాలామందికి వెనుక లోకల్ ట్రెడిషన్స్ మాత్రమే ఆధారంగా ఉంటాయి. ఆ ట్రెడిషన్స్ నుంచీ, చారిత్రిక కధలనుంచీ, నమ్మకాల నుంచీ పుట్టి, ఆ తర్వాత వేదప్రామాణికత అద్దబడి, ఒక గుడీ పూజా పునస్కారమూ మొదలైన తంతులు తయారై నేటి స్థితికి ఎదిగివచ్చిన దేవతలే వీరందరూ. అంతేగాని వేదాలలో వీరి పేర్లు కూడా లేవని నేను చెబితే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు.

అయినా నా పిచ్చిగాని, దయానంద సరస్వతి వంటి మహాపండితుడు పచ్చినిజాలను చెబితేనే ఈ పిచ్చి జనం నమ్మలేదు. ఇక నేను చెబితే ఎవడు నమ్ముతాడు గనుక !! 

సరే, ఏది ఏమైనప్పటికీ, వజ్రయానంలో ఛిన్నమస్తాదేవిని ఏ పేరుతో పిలుస్తారో చెబితే సూడో తాంత్రికులకు ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ఆమెను 'ఛిన్నముండ' అని పిలుస్తారు. కంగారు పడకండి. ముండ అనే మాటకు అసలైన అర్ధం తల, పుర్రె అని. భర్త చనిపోయిన బాలవితంతువులకు గుండు చేసి కూచోబెట్టె దురాచారం పాతకాలంలో మన సమాజంలో ఉండేది. అలా గుండు చేసి ఆమెకు 'ముండ' అని పేరు పెట్టేవారు. అది 'ముండమోసింది', 'ముండమోపి' అనేవారు. ఆ పదం క్రమేణా ఒక తిట్టుగా రూపాంతరం చెందింది గాని అసలైన అర్ధంలో అది తిట్టు కాదు. చండాసురుడు, ముండాసురుడు అని రాక్షసులు ఉండేవారని వారిని అమ్మవారు సంహరించింది గనుక ఆమెకు 'చండముండాసుర నిషూదిని' అని పేరు వచ్చిందని దేవీ పురాణాలు చెబుతాయి. కాళికా దేవి మెడలో ఉండే పుర్రెల దండకు 'ముండమాల' అని పేరు. ఆమెకు 'ముండమాలా విభూషిణి' అని పేరుంది. కనుక 'ముండ' అనే పదం తిట్టు కాదు. 'ఛిన్నముండ' అనే పేరు విని గుడ్లు తేలెయ్యనవసరం లేదు. దాని అర్ధం 'తెగిన తల' అని మాత్రమే. 'మస్తిక', 'మస్త' అంటే ఏమిటో 'ముండ' అంటే కూడా అదే అర్ధం.

బహుశా 'ఛిన్నముండ' అని పిలిస్తే బాగుండదన్న ఉద్దేశ్యంతోనేమో ఈ దేవతను బౌద్ధం నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు 'ఛిన్నమస్త' 'ఛిన్నమస్తిక' అని మార్చారు మనవాళ్ళు.

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 1 "