Pages - Menu

Pages

4, సెప్టెంబర్ 2017, సోమవారం

బాబా రాం రహీం సింగ్ ఉదంతం- కొన్ని కొత్త కోణాలు

రాజకీయం వేరు. గురుత్వం వేరు. ఈ రెండూ ఎప్పుడూ కలవకూడదు. ముఖ్యంగా ఈ కలియుగంలో.

సత్యయుగంలో అయితే మనువు వంటి మహారాజులు అందరూ ధర్మాత్ములుగా ఉండేవారు. అప్పుడు రాజరికమూ గురుత్వమూ ఒక్కరిలోనే ఉండటానికి అభ్యంతరం ఏమీ ఉండేది కాదు. త్రేతాయుగంలో కూడా జనకమహారాజు వంటి కొందరు ఈ రెంటినీ తమలో కలిగి ఉండేవారు. కానీ ద్వాపరం వచ్చేసరికి ఈ స్థితి క్షీణించింది. కలియుగంలో అయితే ఇక చెప్పనక్కర లేదు.

కలియుగంలో ఈ రెంటినీ ఒకే మనిషిలో చూడాలంటే మనం మహమ్మద్ ప్రవక్తలోనే చూడగలం. ఎందుకంటే ఆయనకు ఎదురు తిరిగిన వారినందరినీ కత్తికొక కండగా నరుక్కుంటూ పోయాడు గనుక ఆయన మాట చెల్లింది. అదికూడా రాజరికం ఉన్న అరేబియాలో గనుక ఆయనకు ఎదురు తిరగడానికి ఎవడూ సాహసించలేదు. సాహసించిన కొద్దిమందీ దిక్కులేని చావు చచ్చారు.అదే ఇండియాలో నైతే 'దీన్ ఇ ఇలాహి' అంటూ ఒక కొత్త మతాన్ని స్థాపించి దానికి తానే గురువుగా+రాజుగా ఉందామనుకున్న అక్బర్ పాదుషా కూడా సక్సెస్ కాలేకపోయాడు. సిక్కు గురువులు మాత్రమే మళ్ళీ ఈ ప్రక్రియలో సక్సెస్ కాగలిగారు. వారిలో కూడా అందరూ కాలేకపోయారు. కొందరైతే అప్పటి మొఘల్ రాజుల చేతుల్లో నానాకష్టాలు పడ్డారు. గురు తేజ్ బహదూర్ అయితే ఔరంగజేబ్ ఉత్తర్వుల ప్రకారం శిరచ్చేదానికి గురయ్యాడు కూడా.

కానీ, అడుగడుగునా ఎత్తులు పైఎత్తులు జిత్తులతో కూడిన ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలో గురువులే రాజులుగా ఉండాలంటే ఎలా సంభవం అవుతుంది? ఇక్కడే రాం రహీం  కూడా ప్రస్తుతం దెబ్బ తిన్నాడు.

ప్రస్తుతం ఉన్నట్టుండి రాం రహీం సింగ్ కు వ్యతిరేకంగా దేశమంతా మాట్లాడుతోంది. ప్రతి చానలూ ఆయన మీద దుమ్మెత్తి పోస్తోంది. ప్రతి పత్రికా ఆయన్ను 'బలాత్కారీ బాబా' అని తిడుతోంది. యూ ట్యూబులో ప్రతి ప్రైవేట్ న్యూస్ చానలూ, హనీప్రీత్ తో ఆయనున్న ఫోటోలను మాటి మాటికీ చూపిస్తూ బురద చల్లుతున్నాయి. కానీ ఆయన జాతకం అతను మరీ అంత విలన్ అని చూపించడం లేదు. మనుషులు అబద్దాలు చెప్పవచ్చు. కానీ గ్రహాలు అబద్దాలు చెప్పవు. ఎక్కడో ఏదో తేడా ఉంది. ఏంటా ఈ వింత? అని కొంత పరిశోధన చెయ్యగా కొన్ని క్రొత్త వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వాటిని ఈ పోస్ట్ లో పరిశీలిద్దాం.

రాం రహీం సింగ్ కు పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అది ఎంతగా ఉందీ అంటే నిన్నా మొన్నటి దాకా ముఖ్యమంత్రులే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టి ఆశీస్సులు తీసుకునేవారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, సుష్మా స్వరాజ్ వంటి దిగ్గజాలు ఆయన్ను దర్శించి ఆశీస్సులు పొందిన వారే. దీనికి కారణం ఆయన దగ్గర ఉన్న బలమైన ఓటు బ్యాంకు. "ఫలానా పార్టీకి ఓటెయ్యండి" అని పబ్లిక్ గా ఆయన తన అనుచరులకు వేదిక మీద నుంచి చెబుతూ ఉంటాడు. ఆయన భక్తులు దాదాపు కోటిమంది ఉన్నారట. అంటే కోటి ఓట్లు ఆయన చేతిలో ఉన్నట్లే. అందుకే రాజకీయ నాయకులందరూ ఆయన చుట్టూ ఇన్నాళ్ళూ ప్రదక్షిణలు చేశారు. అంతేగాని ఆయనలోని దివ్యత్వాన్ని చూచి కాదు. ఆ మాటకొస్తే ఒక మనిషిలోని దివ్యత్వాన్ని గ్రహించే శక్తి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది? అలా చెయ్యాలంటే వీళ్ళలో ముందు అది ఉండాలిగా??

గత ఇరవై ఏళ్లుగా అతను ఏ పార్టీని సపోర్ట్ చేస్తే అదే అధికారంలోకి వస్తూ వచ్చింది. కానీ కొంత కాలంగా ఇతనికీ రాజకీయ పార్టీలకూ చెడుతూ వచ్చింది. కొన్ని నెలలుగా రాం రహీం సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అదే జరిగితే ఇన్నాళ్ళూ అతను సపోర్ట్ చేస్తూ వస్తున్న పార్టీలు చతికిల బడతాయి.వారికి పోటీగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లలో అతనొక బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతాడు. వీరి చెయ్యి దాటిపోవడమే గాక వీరిని శాసించే స్థితికి చేరిపోతాడు. ఇందులో సందేహం లేదు. అందుకేనా పదిహేను ఏళ్ళ నుంచీ నానుతున్న రేప్ కేసులో ఇప్పటికిప్పుడు హటాత్తుగా తీర్పు వెలువడింది? అతన్ని జైల్లో పెట్టింది?

రాజకీయంలో ఏదీ తప్పు కాదు. కానీ ఆధ్యాత్మికంలో ప్రతిదీ తప్పే. ఒక బాబా ఒకమ్మాయితో దగ్గరగా కూచుంటే అది తప్పు. ఆ అమ్మాయి నెత్తిమీద చెయ్యి పెడితే తప్పు. ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడితే ఇంకా పెద్ద తప్పు. టీ షర్టు వేసుకుంటే ఇంకా ఘోరమైన తప్పు. స్వామీజీ అనేవాడు శవంలాగా చేవచచ్చి ఉండాలి గాని ఈ వేషాలన్నీ ఏమిటి? అంటారు. అతను నవ్వకూడదు. గబగబా నడవకూడదు.యాక్టివ్ గా బలంగా ఉండకూడదు. శవం లాగా మొహం పెట్టి నీరసంగా ఏడుస్తూ ఉండాలి. ఒకవేళ అతను ఏ అమ్మాయి చెయ్యన్నా పట్టుకుంటే, చానళ్ళు ఆ ఫోటోను పదే పదే చూపిస్తూ గోలగోల చేస్తాయి. కానీ అలాంటి పనులనూ అంతకంటే ఇంకా పెద్ద పనులనూ రాజకీయులు ప్రతి రోజూ చేస్తున్నా అది తప్పు కాదు. అసెంబ్లీలో నాయకీమణులు పబ్లిగ్గా లకారమూ ముకారమూ వాడి తిట్టుకున్నా అవి లెక్కలోకీ రావు.

పవర్ లో ఎవడుంటే వాడికి భయపడటమూ, వంగొంగి దణ్ణాలు పెట్టడమూ, వాడికి బాకా ఊదటమూ, పవర్ లేనివాడిని బ్లాక్ మెయిల్ చెయ్యడమూ, మన పత్రికలకూ చానళ్లకూ తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు. అందుకే నిన్నా మొన్నటి దాకా రాం రహీం గొప్ప సాధువు, గురువు అంటూ పొగిడిన వారే ఈనాడు అతనొక కామాంధుడనీ దుర్మార్గుడనీ తెగడుతున్నారు. రేపేమంటారో చూడాలి మరి !!

యోగా గురు రాందేవ్ బాబాను ఒక కమెడియన్ను చేసి ఇమిటేట్ చేస్తూ ఆయన యోగాను ఒక అసభ్యమైన డాన్సుగా చూపిస్తూ 'ఆనందో బ్రహ్మ' అనే ఒక సినిమాలో ఈ మధ్యన చూపించారు. అదే ఒక పోపునో, లేదా ఒక జాకీర్ నాయక్ నో చూపించగలరా అలా? కనీసం అలాంటి ధైర్యం చెయ్యగలరా??

ఇంగ్లీషులో ఒక సామెతుంది. Name the dog and hang it అని. అంటే - ఒక కుక్కను మనం చంపాలి అనుకుంటే ముందు దానిని పిచ్చికుక్కగా ముద్ర వెయ్యాలి. ఆ తర్వాత దానిని చంపడం సులభం అవుతుంది.ముద్ర వెయ్యకపోతే నువ్వొక్కడివే దాని వెంట పడాలి.  అది ఎదురు తిరిగి నిన్ను కరిస్తే అసలుకే మోసం వస్తుంది. కానీ, ఎప్పుడైతే దానిని పిచ్చికుక్క అని ముద్ర వేసి జనం చేత నమ్మించామో, అప్పుడు నీతో పాటు జనమంతా దాన్ని రాళ్ళతో కొడతారు. అప్పుడు నీ పని సులభం అవుతుంది. అది తేలికగా చస్తుంది. ఇదే రాజనీతి !!

అలాగే, ఒక స్వామీజీనో ఇంకో గురువునో పతనం చెయ్యాలి అనుకుంటే వాడి మీద కొన్ని ఎలిగేషన్స్ తేవాలి. ఈ ఆరోపణలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్లాక్ మనీ వ్యవహారాలు. అది ఎక్కువగా ఫోకస్ చెయ్యరు. ఎందుకంటే అప్పుడా స్వామీజీ తనతో నల్ల సంబంధాలున్న నాయకుల జాతకాలన్నీ బయటపెడతాడు. వీరిలో ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు. ఒకరి గుట్టుమట్లు ఒకరి దగ్గర ఉంచుకుంటారు. కనుక ఈ యాంగిల్ ఎక్కువ ఫోకస్ చెయ్యరు. ఇక మిగిలింది అమ్మాయిల వ్యవహారాలు. ఇదైతే స్వామీజీ పరువు తేలికగా పోతుంది. ఇందులో నాయకులను వాడు ఇరికించలేడు. కనుక స్వామీజీ ఎవరైనా అమ్మాయితో కొంచం క్లోజ్ గా మసలుతూ ఉంటే, వాళ్ళిద్దర్నీ ఫ్రేం చేస్తే సరిపోతుంది. దానికి సపోర్టుగా మనుషులను రెడీ చెయ్యడమూ, కేసులు పెట్టించడమూ వగైరా పనులు చెయ్యడానికి మన దేశంలో పది రూపాయలకు పదిమంది దొరుకుతారు.

ఆ స్వామీజీ మన చెప్పు క్రింద తేలులాగా అణిగి మణిగి పడుంటే పరవాలేదు. కానీ వాడు మనల్ని మించి ఎదుగుతూ ఉంటే మాత్రం వాణ్ని తొక్కాల్సిందే. పైగా వాడు ఏదో తన ఉపన్యాసాలూ, తన భక్తులూ, ఇంతవరకూ చూసుకోకుండా, రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నాడూ అంటే తప్పకుండా వాడినొక విలన్ గా ముద్రవేసి పక్కకు తప్పించాల్సిందే. వాడి పరువుతీసి వాడిని శాశ్వతంగా సమాధి చెయ్యాల్సిందే !

ఒకసారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాక దానికి వత్తాసుగా మాట్లాడే వాళ్ళు ఎందఱో వస్తారు. ఈ దేశంలో డబ్బు చెయ్యలేని పని ఏముంది? కొన్నేళ్ళ క్రితం 'జన కళ్యాణ్ జన జాగరణ్' అంటూ ప్రజల్లోకొస్తున్న కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి తననొక గదిలోకి పిలిచి తన చెయ్యి పట్టుకున్నాడంటూ ఒక మధ్య వయస్సు మహిళ టీవీ చానల్స్ లో చాలా అసభ్యంగా మాట్లాడింది. పత్రికలన్నీ ఆమె స్టేట్మెంట్ ను ప్రముఖంగా ప్రచురించి, స్వామీజీ మీద బురద చల్లాయి. మరి ఏమైందో ఏమో ఉన్నట్టుండి తెరమీద నుంచి ఆమె హటాత్తుగా మాయమై పోయింది. ఆ తదుపరి ఆమె మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఆ దెబ్బతో స్వామీజీ పెట్టిన సంస్థా మూగబోయింది.

'రాజకీయంలోకి అడుగు పెడుతున్నా' అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన బ్రదర్ పాల్ సడెన్ గా మాయమై పోయాడు. అప్పటి దాకా పెద్ద సౌండుతో వినిపించిన ఆయన వాయిస్ హటాత్తుగా మూగబోయింది. మంచి ఫాలోయింగ్ తో ఎదుగుతున్న స్వామి నిత్యానంద హటాత్తుగా రంజిత ఉదంతంతో కేసుల్లో ఇరుక్కుని బద్నాం అయిపోయాడు. 'నేనూ రాజకీయ పార్టీ పెడతా' అని ఒకటి రెండు స్టేట్మెంట్లు ఇచ్చిన బాబా రాం దేవ్ ఉన్నట్టుండి ఆ తర్వాత మాట్లాడటం మానేశాడు. ఆయన కూడా ఒక మహిళతో అతుక్కుని కూచున్నట్టు, బాగా లోనెక్ జాకెట్ వేసుకున్న ఒక సినీ నటీమణివైపు తదేకంగా చూస్తున్నట్టు కొన్ని ఫోటోలు హటాత్తుగా నెట్లో ప్రత్యక్షమయ్యాయి. పతంజలి బ్యానర్ క్రింద అతని బిజినెస్ కూడా ప్రశ్నార్ధకమే అంటూ కొందరు హటాత్తుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆ దెబ్బతో ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడు. నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆశారాం బాపూ చూద్దామంటే చైల్డ్ మోలేష్టేషన్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. జగ్గి వాసుదేవ్ ఏమో అడవిని ఆక్రమించాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ విధంగా ప్రజాదరణ ఉన్న అందరు స్వాములూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

ఓషో కూడా ఇలాగే రాజకీయులతో పెట్టుకుని పతనం అయ్యాడు. ఆయన అమెరికాకు పారిపోవడానికి కారణం, మన దేశంలో నాయకులను, రాజకీయ వ్యవస్థను నోటి కొచ్చినట్లు తిట్టడమే. అమెరికాలో ఒరెగాన్ రాష్ట్రంలో ఆయన అడుగు పెట్టినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ కాలక్రమేణా ఆయన అక్కడ నాయకులనూ, రోనాల్డ్ రీగన్నూ విమర్శించడమూ, క్రైస్తవాన్ని విమర్శించడమూ సాగించాడో, ఆయనకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. ఒరెగాన్ ఎన్నికలలో మేయర్ గా తన శిష్యులను ఎప్పుడైతే నిలబెట్టాలని ఆయన ప్లాన్ చేశాడో అమెరికా నాయకత్వం ఆయన్ను డైరెక్ట్ గా ఎటాక్ చెయ్యడం మొదలు పెట్టింది. కేసుల్లో ఇరికించింది. దేశం నుంచి వెళ్ళగొట్టింది. చివరకు మళ్ళీ ఇండియాకు చేరి అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. అమెరికా ప్రభుత్వం ఆయనకు విషప్రయోగం చేసిందని కూడా పుకారుంది. ఆయనే ఈ విషయాన్ని బాహాటంగా చెప్పాడు.

'ఆటో బయాగ్రఫీ ఆఫే యోగి' వ్రాసిన పరమహంస యోగానంద గారి మీద కూడా అభియోగాలున్నాయి. 'లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్' అనే పుస్తకాన్ని వ్రాసిన స్వామి రామా మీద కూడా సెక్స్ అభియోగాలున్నాయి. సిద్ధయోగ పీఠం అధినేత స్వామి ముక్తానంద పరమహంస మీదైతే లెక్కలేనన్ని సెక్సు అభియోగాలున్నాయి. అమెరికాలో ఈయన మీద మిలియన్ల డాలర్ల కేసులు నమోదయ్యాయి. చివరకు వివేకానంద స్వామిని కూడా 'అమెరికాలో శిష్యురాళ్ళతో ఫోటోలు దిగాడని' విమర్శించిన వాళ్ళున్నారు. ఆయన బ్రతికున్న సమయంలో రమణ మహర్షినీ విమర్శించారు. 'ఆ గోచీ ఏమిటి? ఆ అవతారం ఏమిటి? క్యాబరే డాన్సర్ లాగా?' అని చలమే ఆయన్ను విమర్శించాడు.

మామూలుగా విమర్శలనేవాటిని మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది మామూలే. విమర్శలకు గురికాకుండా ఎవడూ లేడు. కానీ కేసులు, కోర్టులు. జైళ్ళు, ఏంటిదంతా? ప్రజాదరణ పొందుతున్న గురువుల పైన హటాత్తుగా కేసులు రావడం, వాళ్ళు బద్నాం కావడం వెనకాల ఉన్న రహస్యం ఏమై ఉండొచ్చు?

ఒక వ్యక్తి మంచి ప్రజాదరణను సంపాదించి ఎదుగుతూ ఉన్నప్పుడు ధనబలాన్ని జనబలాన్ని సమీకరిస్తున్నప్పుడు రాజకీయ నీలినీడలు అతని మీద తప్పకుండా పడతాయి. ఎందుకంటే అతనొక ఓటు బ్యాంకు అవుతాడు గాబట్టి. అతన్ని తమ చెయ్యి దాటి పోకుండా, తమ కంట్రోల్ లో ఉండేట్టు చెయ్యాలంటే మార్గం ఒకటే. ఏదో ఒక కేసులో వాడిని ఇరికించి,ఆ కేసు ఎటూ తేలకుండా చేసి, వాడిని నిత్యభయంలో ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తూ చెప్పు కింద తేలుగా వాడిని తొక్కి ఉంచడమే చాణక్య నీతి.

అయితే పైన చెప్పబడిన వివాదాస్పద గురువులందరూ నీతిమంతులా? వాళ్ళేం తప్పులూ చెయ్యలేదా? అని ప్రశ్నిస్తే, నాకు తెలీదనే నేను చెబుతాను. కోర్టు తీర్పు ఇచ్చాక మనం దానిని గౌరవించాలి. దానికి ఎదురు మాట్లాడరాదు.  కానీ కొంత out of the box thinking మనం చేసుకోవచ్చు. అందులోనూ ఏదీ అసాధ్యం కాని మన దేశంలో, ముఖ్యంగా మీడియా నిజాలు ఎప్పుడూ వ్రాయని, టీవీలు నిజాలను ఎప్పుడూ చూపని మన దేశంలో, అసలు నిజం ఏమై ఉండొచ్చా అని ఊహించడం తప్పు కాదు.

ఇవన్నీ చూచాక నాకొకటి అనిపిస్తోంది.

మన దేశంలో మనం దేనినీ నమ్మలేం. ఇక్కడ ఏదైనా సాధ్యమే. అందుకని, గురువులందరూ రాజకీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటే వారికీ మంచిది దేశానికీ మంచిది. కంచి పరమాచార్యను వీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా సింపుల్ గా వారందరూ బ్రతకాలి. అప్పుడే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఏమాత్రం దారి తప్పి రాజకీయులతో, ప్రముఖ వ్యాపార టైకూన్ లతో సంబంధాలు పెట్టుకున్నారా, వాళ్ళు త్రాచుపాములతో చెలగాటం ఆడుతున్నట్లే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ త్రాచులు ఎప్పుడు కాటు వేస్తాయో ఎవరికీ తెలియదు గనుక.

రాం రహీం సింగ్ ఆశ్రమ స్కూళ్ళు, హాస్టళ్ళ నుంచి అమ్మాయిలను ఖాళీ చేయిస్తున్నప్పుడు ఆ అమ్మాయిలు ఎదురు తిరిగి - 'మమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు? మాకిక్కడ ఏమీ కాలేదు. మేము హాయిగా ఉన్నాం. మేము ఖాళీ చెయ్యం' అని ఎదురు తిరగడమే, మీడియాలో చూపిస్తున్నంత దరిద్రంగా ఆ ఆశ్రమం లేదనడానికి నిదర్శనం. కానీ వారిని బలవంతంగా ఖాళీ చేయించి వారి వారి ఊళ్లకు పంపేశారు.

డేరా సచ్చా సౌదా స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళలో చదువూ, సత్ప్రవర్తనా, క్రమశిక్షణా బ్రహ్మాండంగా ఉంటాయని అక్కడ చదువుతున్న వాళ్ళు, వారి తల్లిదండ్రులూ చాలామంది టీవీలలో చెబుతున్నారు. వీరి అభిప్రాయాలను ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎంతసేపూ హనీ ప్రీత్ సింగ్ ఫోటోలు అవే అవే చూపడం తప్ప !!

పదిహేనేళ్ళ క్రితం రేప్ కేసు హటాత్తుగా ఇప్పుడే ఎలా కళ్ళు తెరిచిందో, అంతే హటాత్తుగా తీర్పు ఎలా వచ్చిందో, అది కూడా, రాం రహీం తన రాజకీయ పార్టీని ప్రకటించబోయే ముందుగా - అనేది కొంచం విభిన్నంగా ఆలోచించే ప్రతివారూ ఆలోచించవలసిన విషయం. నిన్నా మొన్నటిదాకా ఆయన్ను భుజాలకు ఎత్తుకుని తిరిగిన వారందరూ ఉన్నట్టుండి తెగ తిట్టడమూ గమనార్హమే. వాళ్ళ లొసుగులు ఎక్కడ బయటకొస్తాయో అని ఎవడి భయం వాడిది కదా మరి. అందుకే గుంపులో గోవిందా అని అందరూ కలసి రాం రహీం ను తిట్టడం సాగిస్తే అందరూ సేఫ్ కదా !!

అయినా - రాజకీయమూ, డబ్బూ, పవరూ - ఆధ్యాత్మిక గురువులకెందుకు? ఆల్టర్నేట్ పవర్ సెంటర్స్ ఎదగడం ఏ నాయకుడు సహిస్తాడు గనుక? అందులోనూ ఏదైనా సాధ్యమయ్యే మన దేశంలో? కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదు. ఎప్పుడైతే ప్రజా ఫాలోయింగ్ మొదలైందో అక్కడ పవర్ సెంటర్ ఏర్పడుతుంది. ఆటోమేటిగ్గా రాజకీయులూ, వ్యాపారవేత్తలూ అక్కడ అడుగు పెడతారు. ఇంకేముంది? మాఫియా కార్యకలాపాలూ హవాలా కార్యకలాపాలూ మొదలౌతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా?

మన దేశంలో అన్నీ కల్తీనే. ఇక్కడ నల్లనిదంతా తారూ కాదు, తెల్లనిదంతా ఫినాయిలూ కాదు. మనం చూస్తున్న న్యూస్ వెనుక అసలైన నిజానిజాలేంటో ఆ పరమాత్మునికే ఎరుక. తొందరపడి నమ్మామో పప్పులో కాలేసినట్లే.

పీవీ గారు చెప్పినట్లు 'చట్టం తనపని తను చేసుకుపోతుంది' అని నమ్మి బుద్ధిగా ఉండటమే ప్రస్తుతం మనం చెయ్యగలిగిన అతిగొప్ప పని !!